• facebook
  • twitter
  • whatsapp
  • telegram

యూనిట్ - V, అధ్యాయం - 9, కణం - జీవ ప్రమాణం

   జీవులన్నీ కణాలు లేదా కణ సంకలితాలతో ఏర్పడతాయి. కణం జీవ ప్రమాణం, జీవక్రియలకు కేంద్రం. ఏకకణ జీవుల్లోని ఒకే కణం అన్ని జీవకార్యకలాపాలను నిర్వహిస్తే, బహు కణజీవుల్లో పనివిభజన జరిగి వివిధ జీవన క్రియల నిర్వహణ కోసం సరళ, శాశ్వత, ప్రత్యేక కణజాలాలుగా ఏర్పడ్డాయి. కణం వివిధ కణాంగాల ద్వారా జీవక్రియలను నిర్వహిస్తుంది. ఇలా కణం జీవులన్నింటిలో మౌలికమైన నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రమాణంగా ఉంది.
 ఈ అధ్యాయంలో కణం అంటే ఏమిటి? కణ సిద్ధాంతం, కణం - సమగ్ర భావన; కేంద్రకపూర్వ, నిజకేంద్రక కణాలు; కణాంగాల నిర్మాణం, వాటి విధులను గురించి తెలుసుకుంటారు.

 

కణం అంటే ఏమిటి?
* కణం అనేది జీవులన్నింటిలో మౌలికమైన నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రమాణం.
* కణ జీవ శాస్త్రవేత్త రాబర్ట్ హుక్ (1665) ప్రప్రథమంగా, క్యుర్కస్ సుబర్ (ఓక్ వృక్షం)లోని బెండు కణాలను పరిశీలించి, దానిలోని చిన్న గదుల్లాంటి నిర్మాణాలకు 'కణాలు' అని పేరు పెట్టారు.
* ఆంటన్‌వాన్ లీవెక్ హాక్ (1675 లో) మొదటగా జీవకణాన్ని చూసి దాని గురించి తెలియజేశాడు. తర్వాత రాబర్ట్ బ్రౌన్ (1831) కేంద్రకాన్ని కనుక్కున్నారు.
* ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని అందుబాటులోకి వచ్చాక కణ నిర్మాణాత్మక అంశాలన్నీ తెలిశాయి.

కణ సిద్ధాంతం 
* 1838లో మథయాస్ ష్లీడన్ (జర్మన్ వృక్షశాస్త్రజ్ఞుడు) మొక్కలన్నీ వివిధ రకాల కణాలతో నిర్మితమై ఉంటాయని గుర్తించారు. 1839లో థియోడార్ ష్వాన్ (బ్రిటిష్ జంతు శాస్త్రజ్ఞుడు) జంతుకణాలను అధ్యయనం చేసి, కణాలు పలుచని పొరతో (ప్లాస్మాపొర) కప్పబడి ఉంటాయని కనుక్కున్నాడు. అలాగే కణకవచం ఉండటం వృక్షకణాల ప్రత్యేక లక్షణంగా నిర్ధరించాడు. ఈ పరిజ్ఞానం ఆధారంగా ష్వాన్ వృక్షాలు, జంతు శరీరాల కణాలు, కణ ఉత్పత్తులతో ఏర్పడి ఉంటాయనే పరికల్పన చేశారు.
* 1855 లో విర్షా అనే శాస్త్రవేత్త కొత్త కణాలు అంతకు ముందున్న కణాలు విభజన చెందడం వల్ల  ఏర్పడతాయని వివరించారు.
* ప్రస్తుతం కణసిద్ధాంతాన్ని ఇలా వివరిస్తారు.
i) జీవులన్నీ కణాలు, కణ ఉత్పత్తులతో ఏర్పడతాయి.
ii) అన్ని కణాలు అంతకు ముందున్న కణాల నుంచే పుడతాయి.

                                   
జి.ఎన్. రామచంద్రన్ (1922 - 2001): ఈయన 1922, అక్టోబరు 8న కోచి సమీపంలోని చిన్న పట్టణంలో జన్మించారు. ప్రొటీన్ల నిర్మాణానికి సంబంధించిన పరిశోధనాక్షేత్రంలో రామచంద్రన్ జీవ, భౌతిక శాస్త్రాల్లో పరిశోధనలు చేశారు.
     బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో డిగ్రీ, పీజీలను అభ్యసించారు. ఆ తర్వాత సి.వి. రామన్ గైడ్‌గా డాక్టోరల్ థీసిస్‌ను పూర్తిచేశారు. 1942లో మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి బి.ఎస్‌సి. (ఆనర్స్) భౌతికశాస్త్రంలో ఉత్తమ విద్యార్థిగా పట్టభద్రులయ్యారు. 1949లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ పట్టా పొందారు. 'జీవపాలిమర్ల'పై అనురూపకమైన విశ్లేషణలు జరుపుతున్న ప్రముఖ సంస్థ, మద్రాస్ స్కూల్ వ్యవస్థాపకులు రామచంద్రన్.
    నేచర్ పత్రికలో 1954లో ప్రచురితమైన 'కొలాజన్ అణువు త్రయసర్పిల నిర్మాణంపై ఆయన పరిశోధన చేశారు. 'రామచంద్రన్ పటం' పద్ధతిని ఉపయోగించి ప్రొటీన్లలో సాధ్యమయ్యే అనురూపకాలను విశ్లేషించారు. ఈ అంశాలు నిర్మాణాత్మక జీవశాస్త్రంలో అత్యుత్తమమైనవిగా గుర్తింపు పొందాయి.
      రామచంద్రన్ 1961లో శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డును, 1999లో ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీ ఆఫ్ లండన్ గౌరవాన్ని అందుకున్నారు. 'క్రిస్టలోగ్రఫీ' లో ఆయన చేసిన కృషికి ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ క్రిస్టల్లోగ్రఫీ 'ఇవాల్డ్ ప్రైజ్‌'తో సత్కరించింది. ఆయన ఏప్రిల్ 7, 2001లో మరణించారు.

   

కణం - ఒక సమగ్ర భావన
* వృక్షకణంలో వెలుపలి అంచు సృష్టమైన కణకవచాన్ని చూపుతూ దాని కింద కణపొరను కలిగి ఉంటుంది. కణపొర అనేది కణం బాహ్యహద్దు.
* ప్రతి కణం లోపల త్వచ వ్యవస్థతో ఆవరించిన దట్టమైన కేంద్రకం, దానిలో క్రోమోసోములు ఉంటాయి. వాటిలో డీఎన్ఏ (జన్యుపదార్ధం) ఉంటుంది.
* కేంద్రకం చుట్టూ త్వచంతో ఆవరించి ఉన్న కణాలను నిజకేంద్రక కణాలని అంటారు. త్వచంతో ఆవరించి కేంద్రకాలు లేని కణాలను 'కేంద్రక పూర్వకణాలు' అంటారు.
* ఈ రెండింటి లోపలి ప్రదేశం అర్ధ ద్రవ్యస్థితిలోని కణ ద్రవ్యం ఉన్న మాత్రికతో నిండి ఉంటుంది. కణద్రవ్యమే కణక్రియలన్నింటికి వేదిక. కణాన్ని సజీవస్థితిలో ఉంచడానికి కావాల్సిన వివిధ రసాయన చర్యలన్నీ కణద్రవ్యంలోనే జరుగుతాయి.
* నిజకేంద్రక కణాల్లో అంతర్జీవ ద్రవ్యజాలం, గాల్జీ సంక్లిష్టం, లైసోసోమ్‌లు, మైటోకాండ్రియా, ప్లాస్టిడ్లు (వృక్షాల్లో), సూక్ష్మదేహాలు, రిక్తికలు లాంటి త్వచ ఆచ్ఛాదన కలిగిన కణాంగాలు ఉంటాయి. కేంద్రక పూర్వ కణాల్లో ఇవి లోపిస్తాయి.
* నిజకేంద్రక, కేంద్రక పూర్వ కణాలన్నింటిల్లో త్వచ ఆచ్ఛాదన లేని రైబోసోమ్‌లు ఉంటాయి. కణం లోపల రైజోసోమ్‌లు కణద్రవ్యంతోపాటు హరితరేణువులు (వృక్షాల్లో), మైట్రోకాండ్రియాలు, గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం మీద కనిపిస్తాయి.
* జంతు కణాల్లో త్వచ ఆచ్ఛాదన లేని మరొక కణాంగం సెంట్రియోల్. ఇది కణవిభజనలో తోడ్పడుతుంది.
* కణాలు ఆకారం, పరిమాణం, క్రియల్లో చాలా వైవిధ్యాన్ని చూపుతాయి.

ఉదా: మైకోప్లాస్మాలనే అతి చిన్న కణాలు కేవలం 0.3 µm పొడవులో ఉండగా, కొన్ని
బ్యాక్టీరియమ్‌లు 3 నుంచి 5 µm కొలతలను చూపుతాయి. నిప్పుకోడి అండాన్ని అతిపెద్ద విడి కణంగా చెప్పవచ్చు. మానవ ఎర్ర రక్తకణాలు 7.0 µm వ్యాసంతో ఉంటాయి.


              

కేంద్రక పూర్వకణాలు
* బ్యాక్టీరియమ్‌లు, నీలి ఆకుపచ్చ శైవలాలు, మైకోప్లాస్మా, PPLO (ప్లూరో నిమోనియో లాంటి జీవులు) కేంద్రక పూర్వ నిర్మాణం చూపుతాయి.
* ఇవి సూక్ష్మ పరిమాణంలో ఉండే నిజకేంద్రక కణాల కంటే ఎక్కువ వేగంగా అభివృద్ధి చెందుతాయి.
* ఆకారం, పరిమాణంలో చాలా వైవిధ్యం ఉంటుంది. బాసిల్లస్ (దండాకారం), కోకస్ (గోళాకారం), విబ్రియో (కామా ఆకారం), స్పైరిల్లమ్ (సర్పిలం) రూపాల్లో ఉంటాయి.
* కేంద్రక పూర్వజీవుల కణ సంవిధానం మౌలికంగా ఒకేలా ఉంటుంది. కణపొరను ఆవరించి కణకవచం ఉంటుంది. కణం కణద్రవ్య మాత్రికతో నిండి ఉంటుంది. నిర్ధిష్టమైన నిజకేంద్రకం ఉండదు. జన్యుపదార్థం నగ్నంగా ఉంటుంది.
* చాలా బ్యాక్టీరియమ్‌లలో జీనోమిక్ డీఎన్ఏ (ఏక క్రోమోసోమ్/వృత్తాకార డీఎన్ఏ)తోపాటు చిన్న డీఎన్ఏ వలయాలు (ప్లాస్మిడ్లు) ఉంటాయి. ప్లాస్మిడ్ డీఎన్ఏలు బ్యాక్టీరియమ్‌లకు కొన్ని ప్రత్యేక దృశ్యరూప లక్షణాలను ఆపాదిస్తాయి. అవి సూక్ష్మజీవనాశకాలకు నిరోధకత, జన్యు పరివర్తనలో తోడ్పాటును అందిస్తాయి.
* ఒక్క రైబోసోమ్‌లు తప్ప నిజకేంద్రక జీవుల్లో ఉన్న కణాంగాలేవీ కేంద్రక పూర్వజీవుల్లో ఉండవు. కేంద్రక పూర్వజీవులు కొన్ని కణ అంతర్వేశాలతో ఉండి ప్రత్యేకతను చూపుతాయి. కణపొర మీసోసోమ్‌లనే కణత్వచ అంతర్వలనాలను చూపుతుంది.     

కణాచ్ఛాదన, దాని భిన్నరూపాలు: 
* కేంద్రక పూర్వజీవుల్లో ప్రత్యేకించి బ్యాక్టీరియమ్‌ల కణాల్లో, సంక్లిష్ట రసాయనిక నిర్మాణం ఉన్న కణ ఆచ్ఛాదన ఉంటుంది. దీనిలో 3 పొరలు ఉంటాయి. గ్లైకోకేలిక్స్‌పొర, దాని కింద కణకవచం, తర్వాత ప్లాస్మా పొర రక్షణ ప్రమాణంగా పనిచేస్తాయి.
* గ్రామ్ అభిరంజన పద్ధతి ప్రకారం అభిరంజనాన్ని స్వీకరించే బ్యాక్టీరియమ్‌లను 'గ్రామ్ పాజిటివ్', స్వీకరించని వాటిని 'గ్రామ్ నెగెటివ్' రకాలుగా వర్గీకరిస్తారు.
* గ్లైకోకేలిక్స్‌పొర కొన్నిసార్లు వదులై జిగురుపొర (స్టైమ్‌పొర) లేదా దృఢమైన, మందమైన తొడుగులా ఉంటుంది. కణకవచం బ్యాక్టీరియమ్ కణానికి ఒక నిర్ధిష్ట రూపాన్ని ఇవ్వడానికి, కణం పగిలిపోకుండా లేదా చిధ్రమైపోకుండా తోడ్పడుతుంది. ప్లాస్మాపొర అర్ధ పారగమ్యతగా బాహ్య ప్రపంచంతో ప్రతిస్పందిస్తూ ఉంటుంది.
* ప్లాస్మాపొర ప్రత్యేకంగా కనిపించే త్వచయుత ఆకారాలను (మీసోసోమ్‌లు) కలిగి ఉంటుంది. ఇవి కోశికలు, నాళికలు, పటలికల మాదిరి కనిపిస్తాయి. కణకవచం ఏర్పడటానికి, డీఎన్ఏ ప్రతికృతి చెందడానికి, పిల్లకణాలకు డీఎన్ఏ వితరణ చెందడానికి ఇవి తోడ్పడతాయి. అంతేకాకుండా శ్వాస, స్రావ, శోషణక్రియలు; ఎంజైమ్‌ల పరిమాణం పెంచడంలో కూడా తోడ్పడతాయి. సయనో బ్యాక్టీరియాలో వర్ణద్రవ్యాలతో నిండిన క్రొమాటోఫోర్‌లనే త్వచనిర్మాణాలు కణద్రవ్యంలోకి వ్యాపించి ఉంటాయి.
* బ్యాక్టీరియమ్‌లు చలనసహితం (కశాభాలు) లేదా చలన రహితంగా ఉండొచ్చు.

* తంతువు, కొక్కెం, ఆధారకణిక అనే మూడుభాగాలతో కశాభాలు నిర్మితమవుతాయి.
* కశాభాలతోపాటు, నీటిలోని రాళ్లు లేదా ఆతిథేయి కణజాలాలకు అంటిపెట్టుకుని ఉండటానికి తోడ్పడే పిలి, ఫింబ్రియేలను కలిగి ఉంటాయి.

 

రైబోసోమ్‌లు, అంతర్వేశాలు
* రైబోజోమ్‌లు 5 nm 20 nm పరిమాణం కలిగి 50 S, 30 S అనే రెండు ఉపప్రమాణాలతో ఏర్పడతాయి. ఇవి ప్రోటీన్ల నిర్మాణ ప్రదేశాలు. అనేక రైబోసోమ్‌లు రాయబారి RNA పోచకు అతుక్కుని గొలుసులా కనిపిస్తాయి (పాలీరైబోసోమ్‌లు లేదా పాలీసోమ్‌లు).
* నిల్వ పదార్థాలు కణద్రవ్యంలో చేరి ఉంటాయి. (కణ అంతర్వేశాలు). ఇవి స్వేచ్ఛగా ఉండి, ఏ విధమైన ఆచ్ఛాదన పొరలను చూపవు. ఉదా: ఫాస్ఫేట్, సయనోఫైసియన్, గ్లైకోజన్ రేణువులు.

 

నిజకేంద్రక కణాలు
* ప్రోటిస్టాలు, మొక్కలు, జంతువులు, శిలీంద్రాలు నిజకేంద్రక జీవులు. వీటిలో కణద్రవ్యం విభిన్న కణాంగాలతో ఉంటుంది. త్వచయుత కేంద్రకంతోపాటు జన్యుపదార్థం క్రోమోసోమ్‌లరూపంలో ఉంటుంది.
* వృక్ష, జంతు కణాలు విభిన్నంగా ఉంటాయి. వృక్షకణాల్లో కనిపించే కణ కవచాలు, ప్లాస్టిడ్లు, మధ్యలో ఉండే అతిపెద్ద రిక్తిక జంతు కణాల్లో ఉండవు. పైగా జంతుకణాల్లో కనిపించే సెంట్రియోల్స్ దాదాపుగా అన్ని వృక్షకణాల్లో ఉండవు.

                

కణాంగాలు 

కణత్వచం
* కణం పొర రెండు వరుసల లిపిడ్ అణువులతో ఏర్పడుతుంది. లిపిడ్ అణువుల ధ్రువ (జలాకర్షక) శీర్షాలు వెలుపలి వైపునకు, అధ్రువ (జలవికర్షక) తోకలు లోపలివైపునకు అమరి ఉంటాయి. పొరలోని లిపిడ్ పదార్థం ముఖ్యంగా ఫాస్ఫో గ్లిసరైడ్‌లను కలిగి ఉంటుంది.
* కణపొరలో ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు కూడా ఉంటాయి. వీటి నిష్పత్తిలో వైవిధ్యం కనిపిస్తుంది. మానవుల ఎర్రరక్త కణాల త్వచంలో 52 శాతం ప్రొటీన్, 40 శాతం లిపిడ్ ఉంటుంది. త్వచప్రొటీన్లు రెండు రకాలు. అవి అంతర్గత, పరిధీయ ప్రొటీన్లు.
* 1972లో సింగర్, నికల్‌సన్ అభివృద్ది చేసిన కణపొర నిర్మాణ నమూనాను ప్రతిపాదించారు. (ఫ్లూయిడ్ మొజాయిక్ నమూనా). దీని ప్రకారం అర్ధ - ద్రవస్థితిలోని లిపిడ్ పొర ప్రొటీన్ అణువుల పార్శ్వ కదలికలకు వీలు కల్పిస్తుంది. (ప్రవాహత్వం).
* త్వచం అర్ధ - ద్రవ స్వభావం కణ పెరుగుదల, కణాంతర అనుసంధానాలు ఏర్పడటం, స్రావక్రియలు, ఎండోసైటోసిస్, కణవిభజన తదితర కణవిధులకు చాలా అవసరం.

 

కణం లోపలికి, వెలుపలికి జరిగే అణువుల రవాణా:
నిష్క్రియా రవాణా:
శక్తి వినియోగం చెందకుండా త్వచం ద్వారా జరిగే రవాణా, అంటే గాఢతా ప్రవణతను అనుసరించి జరిగే చర్య.

ద్రవాభిసరణ: విసరణ పద్ధతి లో ప్లాస్మా పొర ద్వారా జరిగే నీటి అణువుల చలనం.
సక్రియా రవాణా: ATP రూపంలోని శక్తి ఉపయోగంతో త్వచం ద్వారా జరిగే రవాణా.


కణకవచం 

* కణం చుట్టూ కణకవచం ఉండటం వృక్షకణం అతిముఖ్య లక్షణం. దీని ఆధారంగా వృక్ష కణాన్ని జంతు కణం నుంచి వేరుచేయవచ్చు.
* మొదటిసారిగా కణకవచాన్ని రాబర్జ్‌హుక్ (1665) 'ఓక్ వృక్షం' బెండు కణజాలంలో కనుక్కున్నారు.
* కణకవచం శిలీంద్రాలు, వృక్షకణాల్లో ప్లాస్మాపొరను కప్పుతూ ఏర్పడి ఉండే దృఢమైన నిర్జీవ భాగం. ఇది కణానికి రూపాన్ని, వ్యాధి కారకాల నుంచి రక్షణను ఇస్తుంది.
* కణకవచం సెల్యులోజ్, గలక్టన్‌లు, మానన్‌లు, కాల్షియం కార్బోనేట్ లాంటి ఖనిజాలతో (శైవలాలు); ఇతర మొక్కల్లో సెల్యులోజ్, హెమీసెల్యులోజ్, పెక్టిన్, ప్రొటీన్లతో ఏర్పడుతుంది.
* ఇది లేతకణాల్లో పెరుగుదల చూపదు. ముదిరిన కొద్దీ 'ప్రాథమిక కవచం' లోపలి తలంపై 'ద్వితీయ కవచం' (లిగ్నిన్, సూబరిన్, పెక్టిన్, క్యూటిన్ వల్ల) ఏర్పడుతుంది. దీనిలో కొన్ని పలుచని ప్రదేశాలు (గర్తాలు) ఉంటాయి. వీటి ద్వారా కణాల మధ్య పదార్థాల రవాణా జరుగుతుంది.
* కణకవచం, మధ్య పటలిక ద్వారా కణద్రవ్య బంధాలు ప్రతి కణానికీ వ్యాపించి పక్కన ఉన్న కణాల కణద్రవ్య పదార్థాలతో సంబంధాన్ని ఏర్పరుస్తాయి.

 

అంతర త్వచ వ్యవస్థ
     కణంలో కనిపించే వివిధ త్వచయుత కణాంగాలు వేటికవే నిర్మాణం, విధుల్లో విస్పష్టంగా ఉన్నప్పటికీ వాటిలో జరిగే క్రియల మధ్య అనుసంధానం కనిపిస్తుంది (అంతర త్వచ వ్యవస్థ). అంతర్జీవ ద్రవ్యజాలం (ER), గాల్జీ సంక్లిష్టం, లైసోసోమ్‌లు, రిక్తికలు దీనిలో భాగాలు.

అంతర్జీవ ద్రవ్యజాలం
* 1953 లో మొదటిసారిగా కె.ఆర్. పోర్టర్ అంతర్జీవ ద్రవ్యజాలం (endoplasmic reticulum) పదాన్ని ఉపయోగించారు. కణద్రవ్యంలో అనేక సన్నని సూక్ష్మనాళికలు విస్తరించి వల ఆకారంలో ఏర్పడిన నిర్మాణమే అంతర్జీవ ద్రవ్యజాలం.
* ఇది రెండు రకాలు. ఉపరితలంపై రైబోసోమ్‌లున్న ER (గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం - RER). రైబోసోమ్‌లు లేని నునుపైన ER (నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం - SER).
* ప్రొటీన్ల నిర్మాణం, స్రావక్రియలు చురుకుగా జరుగుతున్న కణాల్లో RER ఎక్కువ. SER కణంలో లిపిడ్ సంశ్లేషణకు ప్రధాన కేంద్రం. జంతుకణాల్లో SERలో లిపిడ్ లాంటి స్టెరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తి జరుగుతుంది.


                       
 అంతర్జీవ ద్రవ్యజాలం                                              

గాల్జీ పరికరం
* 1898లో కెమిల్లో గాల్జీ ఈ నిర్మాణాలను గుర్తించారు. వీటిని తర్వాత కాలంలో ఆయన పేరు మీదుగా 'గాల్జీ దేహాలు' అని పిలిచారు.
* వీటిలో 0.5 µm - 1.0 µm వ్యాసార్ధం ఉన్న అనేక చదునైన, పళ్లెం ఆకారంలోని కోశాలు లేదా సిస్టర్న్‌లు ఒకదానిపై మరొకటి సమాంతర దొంతరల మాదిరి అమరి ఉంటాయి.
* కణ పదార్థాలను గమ్యస్థానాలకు చేర్చడానికి, ప్యాకేజింగ్ లేదా కణం వెలుపలికి స్రవించడం గాల్జీ పరికరం విధి. ఇది గ్లైకోప్రొటీన్లు, గ్లైకోలిపిడ్ల ఉత్పత్తికి ముఖ్యకేంద్రం. కణకవచ పదార్థాల నిర్మాణం, కణఫలకం ఏర్పాటులో పాల్గొంటుంది.


                   
 గాల్జీ పరికరం

లైసోసోమ్‌లు
* వీటిని క్రిస్టియన్ డి. దూవె 1955లో కనుక్కుని, లైసోసోమ్‌లనే పేరు పెట్టారు.
* సాధారణంగా ఇవి వృక్షాల విభాజ్య కణజాలాల్లో ఉంటాయి.
* త్వచ ఆచ్ఛాదన ఉన్న గోళాకార కోశాలను లైసోసోమ్‌లు అంటారు.
* వీటిలో హైడ్రోలైటిక్ ఎంజైమ్‌లు (హైడ్రోలేజ్‌లు) సమృద్ధిగా ఉంటాయి.
* ఈ ఎంజైమ్‌లు కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, లిపిడ్లు, కేంద్రకామ్లాల జీర్ణక్రియల్లో పనిచేస్తాయి.
* ఆహారం లభించని పరిస్థితుల్లో (కరవు) లైసోసోమ్‌లు కణంలోని అంశాలను హైడ్రలైజ్ ఎంజైమ్‌ల ద్వారా జీర్ణింపజేసి కణం మృతికి కారణం అవుతాయి. (స్వయం విచ్ఛిత్తి)

 

స్వయం విచ్ఛిత్తి కోశాలు
కణంలో ఆహార కొరత ఏర్పడినప్పుడు, లైసోసోమ్‌ల చుట్టూ ఉండే త్వచం స్వయం

విచ్ఛిత్తికి గురై, అందులోని జీర్ణక్రియ ఎంజైమ్‌లను కణద్రవ్యంలోకి విడుదల 
చేస్తుంది. కణంలోని అంశాలను విచ్ఛిత్తికి గురిచేసి కణ మరణానికి దారి
తీస్తుంది. అందుకే లైసోసోమ్‌లను 'స్వయం విచ్ఛిత్తి కోశాలు' అంటారు.

రిక్తికలు
* మొదట వీటిని స్పెలాంజని కనుక్కున్నారు.
* వృక్షకణాల కణద్రవ్యంలో సాధారణంగా కనిపించే త్వచయుత ఆచ్ఛాదన ఉన్న ప్రదేశమే రిక్తిక.
* దీనిలో ప్రధానంగా నీరు, జీవక్రియా ఉత్పన్నాలు, విసర్జక వ్యర్థ పదార్థాల్లోని రసం నిండి ఉంటుంది (రిక్తిక రసం). కొన్ని మొక్కల కణాల్లో మొక్క భాగాలకు రంగులనిచ్చే 'ఆంథోసయనిన్' లాంటి వర్ణద్రవ్యాలు ఉంటాయి.
* రిక్తిక చుట్టూ ఏకపొర త్వచం (రిక్తిక పొర) ఉంటుంది.
* వృక్షకణాల్లో కణ వైశాల్యంలో దాదాపు 90% దాకా రిక్తికలు ఆక్రమించి కణద్రవాభిసరణ చర్యల నియంత్రణలో ముఖ్యపాత్ర వహిస్తాయి.
* రిక్తికలో అయాన్ గాఢత కణద్రవ్యంలో కంటే ఎక్కువగా ఉంటుంది.
* అమీబాలో 'సంకోచ రిక్తిక' విసర్జన క్రియలో ముఖ్యమైంది. ప్రోటిస్టా కణాల్లో ఆహార కణికలను లోపలికి తీసుకోవడం వల్ల వాటి చుట్టూ ఆహార రిక్తికలు ఏర్పడతాయి.

 

మైటోకాండ్రియా
* వీటిని మొదట కొల్లికర్ కనుక్కున్నారు. ఆల్టమన్ 'బయోప్లాస్ట్‌లు' అని పేరు పెట్టారు. 1897లో బెండ వీటికి మైటోకాండ్రియా అని నామకరణం చేశాడు.
* మైటోక్రాండియాలు (ఏకవచనం: మైటోకాండ్రియన్) ప్రత్యేక అభిరంజకాన్ని ఉపయోగిస్తే తప్ప సూక్ష్మదర్శినిలో కనిపించవు. క్రియాశీలచర్యలను బట్టి కణంలో వీటి సంఖ్య మారుతూ ఉంటుంది.

* ఆకారం, పరిమాణంలో వైవిధ్యం కనిపిస్తుంది. 0.2 - 1.0 µm (సగటు 0.5 µm) వ్యాసం, 1.0-4.1 µm  పొడవున్న చిన్న గొట్టాలు లేదా స్తూపాలుగా కనిపిస్తాయి. చుట్టూ రెండు పొరలు ఉంటాయి. అంతర పొర అవకాశికను రెండు ప్రదేశాలుగా విభజిస్తుంది. అవి వెలుపలి గది, లోపలి గది (మాత్రిక). బాహ్యపొర కణాంగానికి హద్దుగా ఉండి, అసంఖ్యాక ముడతలను (క్రిస్టే) ఏర్పరుస్తుంది. రెండు పొరల్లో విధుల నిర్వహణకు తోడ్పడే విశిష్ట ఎంజైమ్‌లు ఉంటాయి. వాయు సహిత శ్వాసక్రియ జరిగే ప్రదేశాలు. వీటిలో ATP రూపంలో కణశక్తి ఉత్పత్తి అవుతుంది. అందువల్ల వీటిని 'కణ శక్త్యాగారాలు' (Power houses of cell) అంటారు.
* మాత్రికలో ఒక వృత్తాకార DNA అణువు, కొన్ని RNA అణువులు, 70 S రకం రైబోసోమ్‌లు, ప్రొటీన్ల సంశ్లేషణకు కావాల్సిన అంశాలు ఉంటాయి.
* ఇవి విచ్ఛిత్తి పద్ధతి ద్వారా విభజన చెందుతాయి.


               
  మైటోకాండ్రియన్ నిర్మాణం (నిలువుకోత)

ప్లాస్టిడ్లు (బహురూపకత్వ కణాంగాలు)
* వీటిని లీవెన్ హాక్ 1698లో కనుక్కున్నారు. షింపర్ (1883) వీటికి 'ప్లాస్టిడ్లు' అని పేరు పెట్టాడు.
* ప్లాస్టిడ్లు అన్ని వృక్షజాతులు, యూగ్లినాయిడ్ జీవుల్లో ఉంటాయి. స్థూల పరిమాణం కారణంగా సూక్ష్మదర్శినిలో సులభంగా చూడొచ్చు.
* వీటిలోని విశిష్ట వర్ణద్రవ్యాలు, వృక్షభాగాలకు విశిష్ట రంగులను ఇస్తాయి. వర్ణద్రవ్య రకాల ఆధారంగా వీటిని వర్ణ, శ్వేత రేణువులుగా వర్గీకరిస్తారు.
* హరితరేణువుల్లో కిరణజన్య సంయోగక్రియకు సంబంధించి, కాంతి వికిరణ శక్తిని గ్రహించడానికి పత్రహరితం, కెరోటినాయిడ్ వర్ణద్రవ్యాలు, వర్ణరేణువుల్లో కెరోటిన్, జాంథోఫిల్స్, కొవ్వులో కరిగే కెరోటినాయిడ్ వర్ణద్రవ్యాలు ఉంటాయి. ఇవి పసుపు, నారింజ లేదా ఎరుపు వర్ణాన్ని కలగజేస్తాయి. శ్వేత రేణువులు వర్ణరహిత ప్లాస్టిడ్లు. ఇవి పోషకాలను నిల్వ చేస్తాయి. అమైలోప్లాస్ట్‌లు కార్బోహైడ్రేట్‌లను (పిండి పదార్థం) ఉదా: బంగాళాదుంప; ఇలియోప్లాస్ట్‌లు నూనెలు, కొవ్వులను; అల్యురోప్లాస్ట్‌లు ప్రొటీన్లను నిల్వ చేస్తాయి.

హరితరేణువులు
* ఇవి ఎక్కువగా పత్రం యొక్క పత్రాంతర కణజాలంలో ఉంటాయి. కటకం, అండం, గోళం, చక్రాభం లేదా రిబ్బన్ ఆకారంలో ఉంటాయి. పరిమాణం 5 - 10 µm పొడవు, 2 - 4 µm వెడల్పు ఉంటుంది. క్లామిడోమోనాస్ కణానికి ఒకటి మొదలుకుని, పత్రాంతరంలో కణానికి 20 - 40 వరకు ఉండవచ్చు.
 

బహురూపకత్వ కణాంగాలు

వివిధ అభివృద్ధి దశల్లో, ప్లాస్టిడ్లు ఒక వర్ణం నుంచి మరొక వర్ణానికి రూపాంతరం చెందుతూ ఉంటాయి. అందులోని శ్వేత రేణువులు హరితరేణువులుగా రూపాంతరం చెందుతాయి. ఇదేవిధంగా టమాటో, మిరపలోని అండాశయం దశలోని కణాల్లో శ్వేత రేణువులుండి, ఫలాలు ఏర్పడే సమయానికి శ్వేతరేణువులు, హరితరేణువులుగా, ఫలాలు పక్వదశకు చేరే సమయానికి, హరితరేణువులు, హరితరహిత వర్ణ రేణువులుగా రూపాంతరం చెందుతాయి.

* ఇవి రెండు పొరలతో ఆవృతమై ఉంటాయి. తక్కువ పారగమ్యత గల లోపలి పొరచే ఆవరింపబడిన అంతర ప్రదేశాన్ని 'ఆవర్ణిక' అంటారు. చదునైన త్వచయుత కోశాలు (థైలకాయిడ్లు) నాణాల రూపంలో ఒకదానిపై మరొకటి దొంతరల మాదిరి అమరి ఉంటాయి. (పటలికారాశులు లేదా గ్రానాంతర థైలకాయిడ్లు). వీటితోపాటు అనేక చదునైన త్వచయుత నాళికలు ఆవర్ణికలోని పటలికారాశులను కలుపుతూ ఉంటాయి. (ఆవర్ణిక పటలికలు). థైలకాయిడ్ల లోపలి ప్రదేశాన్ని అవకాశిక అంటారు.

* ఆవర్ణికలో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్ల సంశ్లేషణకు కావాల్సిన ఎంజైమ్‌లు ఉంటాయి.
* ద్వంద్వ పోచల, వృత్తాకార, చిన్న DNA అణువులు; రైబోసోమ్‌లు కూడా ఉంటాయి.


       
 హరితరేణువు అంతర్నిర్మాణం
* థైలకాయిడ్లలో కిరణజన్య సంశ్లేషక వర్ణద్రవ్యాలు ఉంటాయి.
* హరితరేణువులోని రైబోసోమ్‌లు (కేంద్రక పూర్వరకం 70 S), కణద్రవ్యంలోని రైబోసోమ్‌ల
(నిజకేంద్రక రకం 80 S) కంటే చిన్నవి.

రైబోసోమ్‌లు

* జార్జ్ పెలేడ్ (1953) మొదటిసారి రైబోసోమ్‌లను ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శినితో గాఢమైన రేణువులుగా గుర్తించారు.
* ఇవి రైబో కేంద్రకామ్లం (RNA) ప్రొటీన్లతో నిర్మితమవుతాయి. వీటిని ఆవరించి పొర ఉండదు.
* నిజకేంద్రక రైబోసోమ్‌లు 80 S రకానికి, కేంద్రక పూర్వ జీవుల రైబోసోమ్‌లు 70 S రకానికి చెందినవి.
* 'S' అంటే స్వెడ్‌బర్గ్ ప్రమాణాలతో చెప్పే అవసాధన గుణకం (Sediments in coefficient). ఇది పరోక్షంగా సాంద్రత, పరిమాణాన్ని తెలిపే అంశం.
* రైబోసోమ్‌ల నిర్మాణంలో రెండు ఉప ప్రమాణాలు (పెద్ద ఉపప్రమాణం, చిన్న ఉపప్రమాణం) ఉంటాయి. మెగ్నీషియం అయాన్‌ల సమక్షంలో ఉపప్రమాణాలు ఉంటాయి.
* రైబోసోమ్‌లు ప్రోటీన్ల సంశ్లేషణకు సంబంధించిన ఎంజైమ్‌లను కలిగి ఉండి ప్రొటీన్ నిర్మాణ వేదికగా పనిచేస్తాయి.                       
                                               

కణ అస్థిపంజరం
* కణద్రవ్యంలో ప్రొటీన్లతో నిర్మితమైన తంతురూప, విస్తారమైన వలలాంటి ఆకారాలను 'కణ అస్థిపంజరం' అంటారు.
* నిజకేంద్రక కణాల్లో ఇది సూక్ష్మ తంతువులు, మధ్యస్థ తంతువులు, సూక్ష్మనాళికలు అనే మూడు ప్రధాన అంశాలను చూపుతుంది.
* ఇది యాంత్రిక ఆధారం. కణ రూపాన్ని నిలపడం, కణచలనం, కణాంతర్గత రవాణా, కణం వెలుపలికి సంకేతాలు పంపడం, కేంద్రక విభజన (కణ విభజన సందర్భంలో క్రోమోసోమ్‌ల చలనం) తదితర విధుల్లో పాల్గొంటుంది.

 

శైలికలు, కశాభాలు
* శైలికలు, కశాభాలు కణ పొర నుంచి వెలుపలికి పెరిగే కేశాల లాంటి నిర్మాణాలు. శైలికలు పొట్టిగా ఉండి తెడ్డు (Dar) లా పనిచేసి కణచలనాన్ని లేదా చుట్టూ ఉన్న ద్రవాన్ని కదలిస్తాయి.
* కశాభాలు బాగా పొడవుగా ఉండి కణచలనాన్ని కలిగిస్తాయి.
* కేంద్రక పూర్వజీవులైన బ్యాక్టీరియమ్‌లలో కూడా కశాభాలుంటాయి. కానీ నిజకేంద్రక జీవుల కశాభాల నిర్మాణంతో విభేదిస్తాయి.

* కశాభాలు లేదా శైలికలను ప్లాస్మాపొర కప్పి ఉంచుతుంది. వీటి కేంద్రభాగాన్ని 'ఆక్సోనీమ్' అంటారు.
* ఆక్సోనీమ్‌లో తొమ్మిది జతల పరిధీయ సూక్ష్మనాళికలు వ్యాసార్ధంగా , ఒక జత సూక్ష్మనాళికలు కేంద్రస్థంగా అమరి ఉంటాయి. (9 + 2 వ్యూహం).
* శైలికలు, కశాభాలు రెండూ సెంట్రియోల్ లాంటి నిర్మాణాల నుంచి పుడతాయి. వీటిని ఆధార కణికలు (basal bodies) అంటారు.

 

సెంట్రోసోమ్, సెంట్రియోల్స్
* సెంట్రోసోమ్ సాధారణంగా సెంట్రియోల్స్ అనే రెండు స్తూపాకార నిర్మాణాలను చూపుతుంది.
* సెంట్రోసోమ్‌లోని సెంట్రియోల్స్ ఒకదానికి మరొకటి లంబంగా అమరి ఉండి ప్రతిదానిలో బండిచక్రం లాంటి నిర్మాణం ఉంటుంది.
* సెంట్రియోల్స్‌లో ట్యూబ్యులిన్‌తో నిర్మితమైన తొమ్మిది పరిధీయ పోచలు సమదూరంలో ఉంటాయి. ప్రతి పరిధీయ పోచలో మూడు సూక్ష్మనాళికలు (త్రికం) ఉంటాయి.
* సెంట్రియోల్ కేంద్రభాగం ప్రొటీన్ పదార్థంతో నిర్మితమవుతుంది. (హబ్)
* ఇవి శైలికలు లేదా కశాభాలు, కండెపోగులను ఉత్పత్తి చేసే ఆధార కణికలుగా పనిచేస్తాయి.
* కణవిభజన సమయంలో జంతు కణాలు కండె పోగుల నుంచి కండె పరికరాన్ని ఉత్పత్తి చేస్తాయి.

కేంద్రకం

యూనిట్ - V, అధ్యాయం - 9, కణం - జీవ ప్రమాణం. (కొత్త సిలబస్)  >> Page - 29

     

* కేంద్రకం గురించి మొదట వర్ణించింది రాబర్ట్‌బ్రౌన్ (1831లోనే).
* క్షార అభిరంజకాలతో చర్య జరిపిన కేంద్రక పదార్థాన్ని ఫ్లెమింగ్ 'క్రొమాటిన్' అని పిలిచాడు.
* అంతర్ధశ కేంద్రకంలో విస్తారంగా వ్యాపించి ఉన్న క్రొమాటిన్ న్యూక్లియోప్రొటీన్లు, కేంద్రక మాత్రిక, ఒకటి లేదా ఎక్కువ సంఖ్యలో గోళాకారంలో ఉన్న కేంద్రకాంశాలు ఉంటాయి.
* కేంద్రకంలోని పదార్థాలను కణద్రవ్యం నుంచి వేరు చేస్తూ రెండు సమాంతర పొరలు, కేంద్రకం చుట్టూ ఆచ్ఛాదనగా ఉంటాయి. ఈ పొరల మధ్య 10 - 50 nm వైశాల్యం ఉన్న పెరిన్యూక్లియర్ అంతరాళం ఉంటుంది.
* వెలుపలిపొర అంతర్జీవ ద్రవ్యజాలంతో అనుసంధానం చెంది ఉపరితలంపై రైబోసోమ్‌లను కలిగి ఉంటుంది.
* కేంద్రక తొడుగులోని అనేక ప్రదేశాల్లో సూక్ష్మరంధ్రాలుంటాయి. సూక్ష్మరంధ్రాల ద్వారా ఆర్ఎన్ఏ ప్రొటీన్ అణువులు కేంద్రకం, కణద్రవ్యాల మధ్య ద్విదిశాపథంలో చలిస్తాయి.
* సాధారణంగా ఒక కణంలో ఒకే కేంద్రకం ఉంటుంది (ఏక కేంద్రకయుత కణాలు- స్పైరోగైరా), కేంద్రకాల సంఖ్య భిన్నంగానూ ఉండొచ్చు. (ద్వికేంద్రకయుత కణాలు - ఆస్కోమైకోటినా, బెసీడియో మైకోటీనా శిలీంద్రజాలం), (బహుకేంద్రకయుత కణాలు - వాచీరియా)
* కేంద్రకంలోని ద్రవ పదార్థం లేదా న్యూక్లియోప్లాజంలో కేంద్రకాంశం, క్రొమాటిన్ ఉంటాయి.
* కేంద్రకాంశాలు కేంద్రక ద్రవ్యంలోని గోళాకార నిర్మాణాలు. వీటి చుట్టూ పొర ఉండదు. వీటిలో రైబోజోమల్ ఆర్ఎన్ఏ చురుకుగా సంశ్లేషణ జరుగుతుంది. ప్రొటీన్ల సంశ్లేషణ చురుకుగా జరుపుతున్న కణాల్లో అధిక సంఖ్యలో, పెద్ద పరిమాణంలో ఉండే కేంద్రకాంశాలు కనిపిస్తాయి.

* అంతర్ధశ కేంద్రకంలో క్రొమాటిన్ అస్పష్టంగా కనిపిస్తుంది. కణవిభజన వివిధ దశల్లో కేంద్రకం బదులుగా, క్రోమోసోమ్‌లను చూడొచ్చు. క్రొమాటిన్‌లో డీఎన్ఏ, హిస్టోన్లు (క్షార ప్రొటీన్లు), కొన్ని నాన్ - హిస్టోన్ ప్రొటీన్లు, ఆర్ఎన్ఏ ఉంటాయి.
* ఒక మానవ కణంలో దాదాపుగా రెండు మీటర్ల పొడవున్న డీఎన్ఏ పోగు మొత్తంగా 46 క్రోమోజోమ్‌ల్లో (23 జతలు) ఇమిడి ఉంటుంది.
* ప్రతి క్రోమోసోమ్‌లో ఒక ప్రాథమిక కుంఛనం లేదా సెంట్రోమియర్ ఉంటుంది. దీనికి ఇరువైపులా రెండు బిళ్లల లాంటి నిర్మాణాలు (కైనెటోకోర్‌లు) ఉంటాయి.
* సెంట్రోమియర్ స్థానాన్ని బట్టి క్రోమోసోమ్‌లు నాలుగు రకాలు. మెటాసెంట్రిక్ క్రోమోసోమ్‌లో సెంట్రోమియర్ మధ్యభాగంలో ఉండటం వల్ల రెండు సమాన బాహువులు ఉంటాయి. సబ్‌మెటాసెంట్రిక్ క్రోమోసోమ్‌లో సెంట్రోమియర్ కొంచెం ఒక కొనవైపుగా ఉండటం వల్ల ఒక బాహువు పొట్టిగా, మరొకటి పొడవుగా ఉంటాయి. ఏక్రోసెంట్రిక్ క్రోమోసోమ్‌లో సెంట్రోమియర్ ఒక కొనకు దగ్గరగా ఉండటం వల్ల ఒక బాహువు అతి పొట్టిగా మరొకటి అతిపొడవుగా కనిపిస్తాయి. టీలోసెంట్రిక్ క్రోమోసోమ్‌లో సెంట్రోమియర్ బాహువు చివరన కనిపిస్తుంది.
* కొన్ని సందర్భాల్లో కొన్ని క్రోమోసోమ్‌లు అభిరంజకాన్ని గ్రహించని ద్వితీయ కుంఛనాలను సుస్థిర స్థానాల్లో చూపిస్తాయి. దీనివల్ల క్రోమోసోమ్‌లో ఒక చిన్న ఖండిక లాంటి భాగం (శాటిలైట్) కనిపిస్తుంది.
* ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శినిలో క్రొమాటిన్ పూసలు గుచ్చిన దారం పోగులా కనిపిస్తుంది. ఈ పూసల్లాంటి భాగాలను ఇప్పుడు 'న్యూక్లియోసోమ్‌లు' అంటున్నారు. న్యూక్లియోసోమ్‌లో 200 క్షార జతల పొడవున్న ద్విసర్పిల డీఎన్ఏ అణువు కోర్‌ను చుట్టి (2 చుట్లు) ఉంటుంది.

* కోర్ భాగం ఎనిమిది హిస్టోన్ అణువులతో ఏర్పడుతుంది. అవి H2A, H2B, H3, H4. ఇవి ఒక్కొక్కటి రెండు నకళ్లుగా ఉంటాయి. H1 హిస్టోన్ అణువు న్యూక్లియోసోమ్ కోర్ వెలుపలిగా ఉండే డీఎన్ఏ కోర్‌లోకి ప్రవేశించడం, నిష్క్రమించే చోటు డీఎన్ఏ రెండు చుట్లను గోడకు అతికిస్తుంది.
* రెండు అనుక్రామిక (Successive) న్యూక్లియోసోమ్‌ల మధ్య కొనసాగిన డీఎన్ఏను లింకర్ డీఎన్ఏ అంటారు. రుణాత్మక ఆవేశంలో ఉన్న డీఎన్ఏ ధనాత్మక ఆవేశంలో ఉన్న హిస్టోన్‌ల మధ్యగల సహవాసం కేంద్రకం లోపల DNA అర్థవంతంగా ఇమిడేలా చేస్తుంది. దారం పోగులపై పూసల్లా ఉన్న క్రొమాటిన్ సన్నటి క్రొమాటిన్ పోగులుగా మారి కుదించబడి లేదా సంగ్రహం చెంది క్రోమోసోమ్‌లుగా ఏర్పడుతుంది.
* కేంద్రకం కణ డైనమిక్ కేంద్రం/ కణం మాస్టర్ కంట్రోలర్/ కణ మేధస్సుగా పేరొందింది. ఇది వంశపారంపర్యక్రియలో పాత్ర వహిస్తుంది. ఏకకణ జీవుల్లో ప్రత్యుత్పత్తిలో సైతం ఇది పాల్గొంటుంది.
సూక్ష్మదేహాలు (పెరాక్సీసోమ్‌లు, గ్లైఆక్సీసోమ్‌లు)
* సాధారణంగా వృక్ష కణాల్లో కనిపించే గోళాకార త్వచయుత, సూక్ష్మ పరిమాణం ఉన్న కణాంగాలు.
* పెరాక్సీసోమ్‌లు దీర్ఘ శృంఖల ఫాటీ ఆమ్లాల విచ్ఛిన్నక్రియలో పాల్గొంటూ, ఫాస్ఫోలిపిడ్ల సంశ్లేషణలో ముఖ్యపాత్ర వహిస్తాయి. వీటిని రోడిన్ (1954) కనుక్కున్నారు.
* మొక్కల పత్రాల్లో కాంతి శ్వాసక్రియలో పాల్గొనడం, హైడ్రోజన్ పెరాక్సైడ్ వల్ల కలిగే విష ప్రభావాల నుంచి కణాలను కాపాడం ఇవి(పెరాక్సీజోములు) చేసే ఇతర పనులు.
* గ్లైఆక్సీసోమ్‌లను బ్రెడెన్‌బాక్ 1967లో కనుక్కున్నారు. కొవ్వు సమృద్ధిగా ఉండే అంకురించే విత్తనాల్లో (ఆముదం) ఉంటాయి. వీటిలో నిల్వ ఉన్న లిపిడ్లను కార్బోహైడ్రేట్లుగా మార్చే గ్లైఆక్సిలేట్ వలయానికి చెందిన ఎంజైమ్‌లు ఉంటాయి.

Posted Date : 29-07-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని

విద్యా ఉద్యోగ సమాచారం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌