• facebook
  • twitter
  • whatsapp
  • telegram

కణం - జీవ ప్రమాణం

ప్రశ్న‌లు - జ‌వాబులు

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు

1. హైడ్రోలైటిక్ (జలవిశ్లేషణ) ఎంజైమ్‌లతో నిండి ఉన్న త్వచయుత కణాంగాన్ని తెలపండి.

జ: లైసోజోమ్. దీంట్లోని హైడ్రోలేజ్‌లు, కార్బోహైడ్రేట్‌లు, ప్రొటీన్లు, లిపిడ్లు, కేంద్రకామ్లాల జీర్ణక్రియల్లో పనిచేస్తాయి.

2. పాలీజోమ్‌ల విధులు ఏమిటి?

జ: ఒక రాయబారి RNA పోచకు అతుక్కుని గొలుసులా కనిపించే అనేక రైబోజోమ్‌లనే 'పాలీజోమ్‌లు' (పాలీ రైబోజోమ్‌లు) అంటారు. వీటిలోని రైబోజోమ్‌లు రాయబారి RNA లోని సమాచారాన్ని ప్రొటీన్లుగా మారుస్తాయి.

3. శాటిలైట్ క్రోమోజోమ్ అంటే ఏమిటి?

జ: కొన్ని క్రోమోజోమ్‌లు అభిరంజకాన్ని గ్రహించని ద్వితీయ కుంచనాలను సుస్థిర స్థానాల్లో చూపిస్తాయి. దీని వల్ల క్రోమోజోమ్‌లో ఒక చిన్న ఖండిక లాంటి భాగం కనిపిస్తుంది. దీన్ని శాటిలైట్ అంటారు. శాటిలైట్ ఉన్న క్రోమోజోమ్‌ను 'శాటిలైట్ క్రోమోజోమ్' అంటారు.

4. మధ్యపటలిక దేంతో ఏర్పడుతుంది? దాని విధులు ఏవిధంగా ముఖ్యమైనవి?

జ: మధ్యపటలిక కాల్షియం పెక్టేట్‌తో ఏర్పడుతుంది. ఇది పక్కపక్కనున్న కణాలను బంధించి ఉంచుతుంది. కణకవచం, మధ్యపటలిక ద్వారా కణద్రవ్య బంధాలు కణం నుంచి కణానికి వ్యాపించి ఉంటాయి. ఈవిధంగా కణద్రవ్య పదార్థాల మధ్య సంబంధాన్ని ఏర్పరుస్తాయి.

5. ద్రవాభిసరణ అంటే ఏమిటి?

జ: విసరణ పద్ధతిలో ప్లాస్మా పొర ద్వారా జరిగే నీటి అణువుల చలనాన్ని 'ద్రవాభిసరణ' అంటారు. ప్లాస్మా పొర ద్వారా నీటి అణువులు అధిక గాఢత ఉన్న ప్రదేశం నుంచి అల్ప గాఢత వైపు చలిస్తాయి.

స్వల్ప సమాధాన ప్రశ్నలు  

1. ప్రొటీన్ల సంశ్లేషణ చర్యల్లో చురుగ్గా పాల్గొనే కణాల్లోని కేంద్రకాంశం పాత్రను సంగ్రహంగా చర్చించండి.

జ: * కేంద్రక ద్రవ్యంలో ఉండే గోళాకార నిర్మాణాన్ని కేంద్రకాంశం అంటారు.

 * కేంద్రకాంశం చుట్టూ పొర ఉండదు. కాబట్టి దానిలోని పదార్థం కేంద్రకరసంతో కలిసిపోయి ఉంటుంది.

 * కేంద్రకాంశాలు రైబోజోమల్ RNA సంశ్లేషణలో చురుగ్గా పాల్గొనే ప్రదేశాలు.

 * ప్రొటీన్ల సంశ్లేషణ చురుగ్గా జరుగుతున్న కణాల్లో అధిక సంఖ్యలో, పెద్ద పరిమాణం ఉన్న కేంద్రకాంశాలు కనిపిస్తాయి.

2. కణ సిద్ధాంతాన్ని సంగ్రహంగా వర్ణించండి.

జ: M.J. ష్లీడన్ అనే జర్మన్ వృక్ష శాస్త్రవేత్త, T. ష్వాన్ అనే బ్రిటిష్ జంతు శాస్త్రవేత్త 'కణ సిద్ధాంతాన్ని' (1838-39) ప్రతిపాదించారు. దీంట్లో రెండు ప్రధానాంశాలు ఉంటాయి.

ఎ) జీవులన్నీ కణాలు, కణ ఉత్పత్తులతో ఏర్పడతాయి (కణాలు జీవుల నిర్మాణాత్మక ప్రమాణాలు.)

బి) కణాలు జీవుల క్రియాత్మక ప్రమాణాలు.

రుడాల్ఫ్ విర్షా (1855) కొత్త కణాలు అంతకు ముందున్న కణాల విభజన వల్ల ఏర్పడతాయని వివరించారు.

3. గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం (RER), నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం (SER)ల మధ్య భేదాలను తెలపండి.

జ:

 

4. ప్లాస్మిడ్‌లు అంటే ఏమిటి? బ్యాక్టీరియమ్‌లలో వాటి పాత్ర ఎలాంటిది?

జ:  * చాలా బ్యాక్టీరియమ్‌ల కణాల్లో జీనోమిక్ DNA కు వెలుపల ఉండే చిన్న DNA వలయాలను ప్లాస్మిడ్‌లు అంటారు.

 * ఇవి బ్యాక్టీరియమ్‌లలో సూక్ష్మజీవనాశకాలకు నిరోధకత లాంటి ప్రత్యేక దృశ్యరూప లక్షణాలను ఆపాదిస్తాయి.

 * ప్లాస్మిడ్‌లు బాక్టీరియమ్‌లలో బయటి నుంచి వచ్చే DNAతో జన్యుపరివర్తన చర్యను కలగజేయడంలో తోడ్పడతాయి.

5. సక్రియా, నిష్క్రియా రవాణాల మధ్య తేడాలను తెలపండి.

జ: 

6. కేంద్రకపూర్వ కణం లక్షణాలను తెలపండి.

జ:  * బ్యాక్టీరియమ్‌లు, నీలి ఆకుపచ్చ శైవలాలు, మైకోప్లాస్మా, PPLO (ప్లూరోనియో - నియో లాంటి జీవులు)లు కేంద్రకపూర్వ కణ నిర్మాణాన్ని చూపుతాయి.

 * అన్ని కేంద్రకపూర్వ జీవుల కణాల్లో కణ పొరను ఆవరించి కణకవచం ఏర్పడి ఉంటుంది.

 * కణం కణద్రవ్యమాత్రికతో నిండి ఉంటుంది.

 * స్పష్టమైన కేంద్రకం ఉండదు. జన్యుపదార్థం కేంద్రకత్వచంతో ఆవరించి కాకుండా, నగ్నంగా ఉంటుంది.

 * ఒక్క రైబోజోమ్‌లు (70 S రకం) తప్ప నిజకేంద్రక జీవుల్లో ఉండే కణాంగాలేవీ ఈ కణాల్లో ఉండవు.

 * చాలా బ్యాక్టీరియమ్‌లలో జీనోమిక్ DNA (ఏక క్రోమోజోమ్/ వృత్తాకార DNA), ప్లాస్మిడ్లతోపాటు (చిన్న DNA వలయాలు) కేంద్రకపూర్వ కణాలు కణద్రవ్యంలో ఉంటాయి. ఇవి సూక్ష్మజీవనాశకాలకు నిరోధకత లాంటి ప్రత్యేక దృశ్యరూప లక్షణాలను ఆపాదిస్తాయి.
 * కేంద్రకపూర్వ జీవుల్లో కణత్వచం అంతర్వలనం (లోపలికి ముడతలు పడటం) వల్ల మీసోజోమ్‌లు అనే నిర్మాణాలు ఏర్పడతాయి. ఇవి శ్వాసక్రియ, స్రావకక్రియల్లో ఉపరితల వైశాల్యం పెంచి పోషకాల శోషణలో తోడ్పడతాయి.

 * సయనో బ్యాక్టీరియా లాంటి కేంద్రకపూర్వ జీవుల్లో వర్ణద్రవ్యాలతో నిండిన క్రొమాటోఫోర్‌లు అనే త్వచ నిర్మాణాలు కణద్రవ్యంలోకి వ్యాపించి ఉంటాయి.

 * బ్యాక్టీరియమ్‌లు చలన సహితం లేదా రహితంగా ఉంటాయి. చలన సహిత బ్యాక్టీరియమ్‌లలో కణకవచం నుంచి కశాభాలు ఏర్పడతాయి.

7. 'జీవానికి మౌలిక ప్రమాణం కణం' - సంగ్రహంగా వివరించండి.

జ:  * జీవుల్లో అంగాలు, కణజాలాలు లాంటివి నిర్మాణాత్మక ప్రమాణాలైన కణాలతో ఏర్పడతాయి.

 * ప్రతి జీవి తన జీవితచక్రాన్ని ఒకే కణంతో ప్రారంభిస్తుంది.

 * జీవుల్లో జరిగే జీవక్రియలన్నీ ప్రాథమికంగా వాటి కణాల్లోనే జరుగుతాయి.

 * ఏకకణ జీవుల్లో జీవితచక్రం కణంతో ప్రారంభమై అన్ని జీవక్రియలు (ప్రత్యుత్పత్తి సహా) ఒకే కణంలో జరుగుతాయి.

 * బహుకణయుత జీవుల్లో కణాల ఆకృతి వాటిలో జరిగే విధుల ఆధారంగా వేర్వేరుగా ఉంటుంది.

 * బహుకణయుత జీవుల్లో అలైంగిక లేదా లైంగిక కణాలు ప్రత్యుత్పత్తిలో ఏర్పడి, జీవితచక్రాన్ని కొనసాగిస్తాయి.

8. జీనోమేతర DNA (Extra Genomic DNA) కేంద్రకపూర్వ, నిజకేంద్రక జీవులు రెండింటిలో ఉంటుందా? ఉంటే ఈ రెండు రకాల జీవుల్లో వాటి స్థానాలను తెలియజేయండి.

జ:  * జీనోమేతర DNA కేంద్రకపూర్వ, నిజకేంద్రక జీవులు రెండింటిలోనూ ఉంటుంది.

 * కేంద్రకపూర్వ జీవుల (అనేక బ్యాక్టీరియమ్‌లు) కణాల్లో జీనోమిక్ DNA (ఏక క్రోమోజోమ్/ వృత్తాకార DNA)తోపాటు కణద్రవ్యంలో ప్లాస్మిడ్‌లు అనే చిన్న DNA వలయాలు ఉంటాయి.

 * నిజకేంద్రక కణాల్లో (ఉదా: మొక్కలు) మైటోకాండ్రియా, హరితరేణువుల్లో జీనోమేతర DNA ఉంటుంది. కేంద్రకాంశంలోనూ కొంత DNA ఉంటుంది. వీటిని 'పాక్షిక స్వయం ప్రతిపత్తి ఉన్న కణాంగాలు' అంటారు.

దీర్ఘ సమాధాన ప్రశ్నలు

1. 'మైటోకాండ్రియాలు కణశక్త్యాగారాలు' - సమర్థించండి.

జ:  * మైటోకాండ్రియా (ఏకవచనం - మైటోకాండ్రియన్) అన్ని నిజకేంద్రక కణాల్లోనూ ఉండే కణాంగాలు.

 * కణాల్లో జరిగే క్రియాశీల చర్యల ఆధారంగా మైటోకాండ్రియా సంఖ్య కణానికి కణానికీ మారుతూ ఉంటుంది.

 * మైటోకాండ్రియా ఆకారం, పరిమాణంలో కూడా చాలా వైవిధ్యం కనిపిస్తుంది. ఇవి 0.2 - 1.0  వ్యాసం, 1.0 - 4.1  పొడవు ఉండే చిన్న గొట్టాలుగా లేదా స్తూపాలుగా కనిపిస్తాయి.

 * ప్రతి మైటోకాండ్రియన్ చుట్టూ రెండు పొరలు ఉంటాయి. బాహ్య పొర అవిచ్ఛిన్నంగా ఈ కణాంగానికి హద్దుగా ఉంటుంది.

 * మైటోకాండ్రియన్ లోపలి అవకాశికను అంతరపొర రెండు స్పష్టమైన ద్రావణీయ ప్రదేశాలు (వెలుపలి గది, లోపలి గది)గా విభజిస్తుంది. లోపలి గదిని 'మాత్రిక' అంటారు.

 * లోపలి పొర మాత్రికలోకి క్రిస్టే అనే అసంఖ్యాక ముడుతలను ఏర్పరుస్తుంది. 

* క్రిస్టే వల్ల ఉపరితల వైశాల్యం పెరుగుతుంది. క్రిస్టే ఉపరితలంపై అనేక F0 - F2 రేణువులు ఉంటాయి.

 * మాత్రికలో 70 S రైబోజోమ్‌లు, చిన్న వలయాకార DNA అణువు, కొన్ని RNA అణువులు,ప్రొటీన్ల సంశ్లేషణకు కావాల్సిన అంశాలుంటాయి.

 * మైటోకాండ్రియాలో వాయుసహిత శ్వాసక్రియ జరుగుతుంది. మాత్రికలో క్రెబ్స్ వలయం, క్రిస్టేలో ఎలక్ట్రాన్ రవాణా జరుగుతాయి.

 * మైటోకాండ్రియా కణశ్వాసక్రియలో ఆహార పదార్థాలను ఆక్సీకరణం చేస్తాయి. దీనివల్ల ఆ పదార్ధాల్లోని స్థితిజశక్తి ATP (కణశక్తి) రూపంలోని గతిజశక్తిగా మారుతుంది. కాబట్టి మైటోకాండ్రియాను 'కణ శక్త్యాగారాలు' (Power Houses of Cell) అంటారు.

 * మైటోకాండ్రియా 'విచ్ఛిత్తి పద్ధతి'లో విభజన చెందుతాయి. కాబట్టి వీటిని 'పాక్షిక స్వయం ప్రతిపత్తి ఉన్న కణాంగాలు' అంటారు.

2. కిందివాటి విధులను వివరించండి.

ఎ) సెంట్రోమియర్  బి) కణకవచం  సి) నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం  డి) గాల్జీ పరికరం  ఇ) సెంట్రియోల్స్

జ: ఎ) సెంట్రోమియర్

 * క్రోమోజోమ్‌లో ఉండే వర్ణరహిత ప్రాథమిక కుంచనాన్నే 'సెంట్రోమియర్' అంటారు.

 * దీనికి రెండు వైపులా కైనిటోకైర్‌లు అనే రెండు బిళ్లల లాంటి నిర్మాణాలు ఉంటాయి.

 * కణవిభజన సమయంలో కండె పోగులు సెంట్రోమియర్‌కు అతుక్కుంటాయి.

 * క్రోమోజోమ్‌ల విభజనకు అవసరమవుతాయి.

బి) కణకవచం

 * వృక్షకణాల్లోనే ఉండే కణకవచం జీవపదార్థాన్ని (ప్రోటోప్లాస్ట్) సంరక్షిస్తుంది.

 * ఇది వృక్ష కణాలకు నిర్దిష్ట ఆకారం, యాంత్రిక ఆధారాన్ని ఇస్తుంది.

 * ఇది కణానికి, కణానికి మధ్య జరిగే ప్రతి చర్యలో పాల్గొంటూ అవాంఛనీయ అణువులకు అడ్డుగోడలా పని చేస్తుంది.

 * ఇది అనేక అయానులు, అణువులు, ద్రావితాలకు పారగమ్యంగా ఉంటుంది. దీని ద్వారా అవి విసరణ పద్ధతిలో రవాణా చెందుతాయి.

సి) నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం

 * ఇది కణంలో లిపిడ్ల సంశ్లేషణకు ప్రధాన కేంద్రంగా ఉంటుంది.

 * కార్బోహైడ్రేట్ల జీవక్రియలో, కాల్షియం గాఢతను సమతౌల్యం చేయడంలో పాల్గొంటుంది.

 * జంతు కణాల్లోని నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం (SER) లో లిపిడ్ లాంటి స్టెరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తి జరుగుతుంది.

డి) గాల్జీ పరికరం

 * కణ పదార్థాలను కణంలోని విభిన్న గమ్యస్థానాలకు చేర్చడానికి ప్యాకేజింగ్ లేదా కణం వెలుపలికి స్రవించడం గాల్జీ పరికరం ప్రధాన విధి.

 * అంతర్జీవ ద్రవ్యజాలంపై ఉన్న రైబోజోమ్‌ల నుంచి సంశ్లేషణ చెందే అనేక ప్రొటీన్లు, గాల్జీ పరికరం సిస్టర్నేలలో రూపాంతరం చెంది చివరకు ట్రాన్స్ ముఖం నుంచి విడుదలవుతాయి.

 * ఇది గ్లైకో ప్రొటీన్లు, గ్లైకో లిపిడ్‌లను ఉత్పత్తి చేసే ప్రధాన కేంద్రం.

 * వృక్ష కణాల్లో ఇది కణకవచ పదార్థాల నిర్మాణానికి, కణవిభజన సమయంలో కణ ఫలకం ఏర్పరచడంలోనూ పాల్గొంటుంది.

ఇ) సెంట్రియోల్స్

 * శైలికలు లేదా కశాభాలు, కండెపోగులను ఉత్పత్తి చేసే ఆధార కణికలుగా పనిచేస్తాయి.

 * కణవిభజన సమయంలో జంతుకణాల కండెపోగుల నుంచి కండె పరికరాలను ఉత్పత్తి చేస్తాయి.

Posted Date : 29-07-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని

విద్యా ఉద్యోగ సమాచారం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌