• facebook
  • twitter
  • whatsapp
  • telegram

జీవ అణువులు  

 ప్రశ్న‌లు - జ‌వాబులు

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు
1. ఔషధాలను కృత్రిమంగా లేదా మొక్కలు, బ్యాక్టీరియా జంతువులు మొదలైన వాటి నుంచి (సహజసిద్ధమైన ఉత్పన్నాలు) తయారు చేస్తారు. కొన్ని సమయాల్లో సహజ ఉత్పన్నాల విష ప్రభావాన్ని (Side Effects) తగ్గించడానికి రసాయనికంగా మార్పులు జరుపుతారు.

* కిందివాటిలో ఏవి సహజమైనవో, ఏవి కృత్రిమంగా తయారు చేసినవో తెలపండి.
 ఎ) పెన్సిలిన్   బి) సల్ఫోనమైడ్    సి) విటమిన్ - సి   డి) పెరుగుదల హార్మోన్లు
జ: ఎ) పెన్సిలిన్ - సహజసిద్ధమైన ఉత్పన్నం
    బి) సల్ఫోనమైడ్ - కృత్రిమ ఉత్పన్నం
    సి) విటమిన్ - సి - సహజసిద్ధమైన ఉత్పన్నం
    డి) పెరుగుదల హార్మోన్లు - సహజసిద్ధమైన ఉత్పన్నాలు

 

2. కింద ఇచ్చిన పదార్థాల్లో ఎస్టర్, గ్లైకోసైడిక్, పెప్టైడ్, హైడ్రోజన్ బంధాలను గుర్తించండి.
    ఎ) పాలీశాఖరైడు    బి) ప్రొటీను    సి) కొవ్వులు    డి) నీరు
జ: ఎ) పాలీశాఖరైడ్: గ్లైకోసైడిక్ బంధం   బి) ప్రొటీను: పెప్టైడ్ బంధం
     సి) కొవ్వులు: ఎస్టర్ బంధం           డి) నీరు: హైడ్రోజన్ బంధం

 

3. అమైనో ఆమ్లాలు, చక్కెరలు, న్యూక్లియోటైడ్లు, కొవ్వు ఆమ్లాలకు ఒక్కో ఉదాహరణ ఇవ్వండి.
జ: ఎ) అమైనో ఆమ్లాలు: గ్లైసిన్, అలనిన్     బి) చక్కెరలు: గ్లూకోజ్, రైబోజ్
     సి) న్యూక్లియోటైడ్లు: అడినిలిక్ ఆమ్లం    డి) కొవ్వు ఆమ్లాలు: గ్లిసరాల్, లెసిథిన్

 

4. స్టార్చ్ (పిండిపదార్థం), సెల్యులోజ్, గ్లైకోజన్, కైటిన్ అనే పాలీశాఖరైడ్లను కిందివాటితో జతపరచండి.
   ఎ) నూలుపోగు      బి) బొద్దింక ఎక్సోస్కెలిటన్
   సి) కాలేయం         డి) తొక్కతీసిన బంగాళదుంప
జ: ఎ) నూలుపోగు - సెల్యులోజ్ 
    బి) బొద్దింక ఎక్సోస్కెలిటన్ - కైటిన్
    సి) కాలేయం- గ్లైకోజన్
    డి) తొక్కతీసిన బంగాళాదుంప - స్టార్చ్ (పిండిపదార్థం)

 

స్వల్ప సమాధాన ప్రశ్నలు

1. ప్రొటీన్‌ను ఉదాహరణ చేసుకుని దాని పరికల్పనాత్మక (Hypothetical) ప్రాథమిక, ద్వితీయ, తృతీయ నిర్మాణాలను పటాల ద్వారా సూచించండి.
జ: ప్రొటీన్లు సన్నని దారం రూపంలో అమరిన అమైనో ఆమ్లాలున్న విషమ పాలిమర్లు. ప్రొటీన్లలో ఏ అమైనో ఆమ్లం మొదటిది, ఏది రెండోది అనే సమాచారాన్ని 'ప్రొటీను ప్రాథమిక నిర్మాణం' అంటారు.  ఒక ప్రొటీనును ఒక గీతగా ఊహిస్తే దాని ఎడమ కొనను మొదటి అమైనో ఆమ్లాన్ని కలిగిందిగా, కుడి కొనను అంత్య అమైనో ఆమ్లాన్ని కలిగింది గానూ సూచిస్తారు. మొదటి అమైనో ఆమ్లాన్ని N-కొన అని, ఆఖరి అమైనో ఆమ్లాన్నిC - కొన అంటారు. ప్రొటీన్లలో కుడివైపు సర్పిలాలనే గమనించారు. ప్రొటీను పోగులోని మిగిలిన ప్రాంతాల్లో వేర్వేరు విధాలుగా ముడతలు పడి ఉంటుంది. దీన్ని ద్వితీయ నిర్మాణం అంటారు. పొడవైన ప్రొటీను గొలుసు దానిపై అదే ముడతలు పడి ఒక డొల్లగా ఉన్న ఊలు బంతిలా ఉంటే, దాన్ని తృతీయ నిర్మాణం అంటారు. దీని వల్ల ప్రొటీన్లకు ఒక త్రిమితీయ రూపం వస్తుంది.

   


 

2. కేంద్రకామ్లాలు ద్వితీయ నిర్మాణాన్ని ప్రదర్శిస్తాయి. వాట్సన్, క్రిక్ నమూనా ద్వారా వివరించండి.
జ: * కేంద్రకామ్లాలు అనేక విభిన్న ద్వితీయ నిర్మాణాలను ప్రదర్శిస్తాయి.
      ఉదా: ప్రఖ్యాత వాట్సన్-క్రిక్ నమూనా DNA ప్రదర్శించే ఒక ద్వితీయ నిర్మాణం.
   * ఈ నమూనా ప్రకారం DNA ద్విసర్పిలాకారంలో ఉంటుంది. దీంట్లో పాలీ న్యూక్లియోటైడ్లు ఉన్న రెండు పోచలు వ్యతిరేక దిశల్లో సమాంతరంగా ఉంటాయి.
   * చక్కెర-ఫాస్పేట్-చక్కెర గొలుసు కేంద్రకామ్లాల్లో వెన్నెముకలా ఏర్పడుతుంది.
   * నత్రజని క్షారాలపై వెన్నెముకకు లంబంగా, లోపలివైపు ప్రతిక్షేపించి ఉంటాయి.
   * ఒక పోచలోని ఎడినీన్ (A), గ్వానిన్ (G) వరుసగా రెండో పోచలోని థైమిన్ (T), సైటోసిన్ (C)లతోనే బంధాలను కలిగి ఉంటాయి.
   * G, Cల మధ్య 3 హైడ్రోజన్ బంధాలు; A, Tల మధ్య రెండు హైడ్రోజన్ బంధాలుంటాయి.
  * ప్రతి పోచ సర్పిలాకార మేడ మెట్లను పోలి ఉంటుంది. ప్రతి ఆరోహణ మెట్టు ఒక జత నత్రజని క్షారాలను కలిగి ఉంటుంది. ఇది 36º కోణాన్ని చూపుతుంది.
  * ద్వి సర్పిలంలోని ఒక పూర్తి మెలికలో 10 మెట్లు లేదా 10 జతల నత్రజని క్షారాలుంటాయి
  * ఒక మెలిక నిడివి 34 Aº, నత్రజని క్షార జతల మధ్య దూరం 3.4 Aº. ఈ లక్షణాలున్న DNAను B-DNA అంటారు.

 

దీర్ఘ స‌మాధాన ప్ర‌శ్న‌

1. ద్వితీయ జీవక్రియోత్పన్నాలంటే ఏమిటి? అవి మానవుడికి ఏవిధంగా ఉపయోగపడతాయో తెలపండి.
జ: మొక్కలు, శిలీంద్రాలు, సూక్ష్మ జీవకణాల్లో జీవక్రియలు జరిగేటప్పుడు ఏర్పడి, చెప్పుకోదగ్గ విధులులేని జీవక్రియ ఉత్పన్నాలను ద్వితీయ జీవక్రియోత్పన్నాలు అంటారు.
ఉదా: ఆల్కలాయిడ్లు, ఫ్లావనాయిడ్లు, రబ్బరు, ఆవశ్యక నూనెలు, యాంటీబయోటిక్స్, వర్ణద్రవ్యాలు, అత్తర్లు, జిగురులు, సుగంధ ద్రవ్యాలు.

 


ఆల్కలాయిడ్లు: ఇవి సేంద్రియ నత్రజని సంయోగ పదార్థాలు. జీవక్రియల ఫలితంగా అమైనో ఆమ్లాల నుంచి ద్వితీయ పదార్థాలుగా ఏర్పడతాయి. వీటిని ద్రవరూప ఔషధాల తయారీలోనూ, విష పదార్థాల తయారీలోనూ వాడతారు. పురాతన కాలంలో మొక్కల నుంచి లభించే ఆల్కలాయిడ్లను పాముకాటుకు విరుగుడుగా, జ్వరం నివారణకు కూడా వాడేవారు.

ఫ్లావనాయిడ్లు: రెండు బెంజీన్ వలయాలు, పైరేన్ వలయాలతో కలిపి ఉన్న ఫీనాలిక్ గ్లైకోసైడ్లను ఫ్లావనాయిడ్లు అంటారు. ఇవి మొక్కల ఆకులు, పుష్పాలు, ఫలాల్లో ఉంటాయి. వీటిని క్యాన్సర్ నివారణలో, వైరస్ వ్యాధుల నివారణకు, వాపుల నివారణకు వాడతారు. వీటిని మానవ రక్త ఫలకికల సమూహం ఏర్పడకుండా వాడతారు.

రబ్బరు: శుద్ధిచేయని రబ్బరును సిమెంట్ పరిశ్రమలోనూ, ఇన్సులేటింగ్ టేపుల తయరీలోనూ వాడతారు. రబ్బరుకు సాగే గుణం, నమ్యత ఉండటం వల్ల వీటిని రబ్బరు పైపులు, టైర్ల తయారీలో వాడతారు. వివిధ ఘాత శోషకాల ద్వారా దీనికి సాగే గుణాన్ని ఆపాదిస్తారు. ఇది వాయువులకు అపారగమ్యంగా ఉంటుంది. దీన్ని రబ్బరు పైపులు, బెలూన్లు, బంతులు, కుషన్ల తయారీలో వాడతారు.

సుగంధ తైలాలు: జలవిరోధి ద్రావణీయత ఉన్న ఆవిరయ్యే నూనెలు. 
వీటిలో ముఖ్యమైనవి:
     ఎ) కొత్తిమీర నుంచి తీసిన తైలాన్ని నొప్పుల నివారణకు, అజీర్ణం నివారణకు వాడతారు.
     బి) మందారిన్ తైలాన్ని కాలి పగుళ్ల నివారణకు, మచ్చల నివారణకు వాడతారు.
     సి) లావెండర్ తైలాన్ని ఆస్త్మా, తలనొప్పి, చెవినొప్పి నివారణలో వాడతారు.

సూక్ష్మజీవ నాశకాలు: వ్యాధిజనక జీవులను నాశనం చేసే సహజ రసాయనాలు ఆతిథేయిపై ఏవిధమైన ప్రభావం చూపకుండా వ్యాధిని కలగజేసే బ్యాక్టీరియా లాంటి క్రిములను నాశనం చేస్తాయి.
ఉదా: స్ట్రెప్టోమైసిన్ - ఇది స్ట్రెప్టోమైసిన్ గ్రీనియస్ నుంచి లభిస్తుంది.

సుగంధ ద్రవ్యాలు: ఇంగువ, యాలకులు, దాల్చిన చెక్క లాంటివి వీటికి ఉదాహరణ. ఇంగువను దగ్గు, కడుపునొప్పి నివారణలో వాడతారు. నోటి దుర్వాసన పోగొట్టడానికి, చక్కెరవ్యాధి నివారణలో యాలకులను వాడతారు. లవంగాలను పంటినొప్పి, జలుబు, దగ్గు, నివారణకు వాడతారు.
 

ప్ర: కేంద్రకామ్లాలు ద్వితీయ నిర్మాణాన్ని ప్రదర్శిస్తాయి. వాట్సన్, క్రిక్ నమూనా ద్వారా వివరించండి.
జ: * కేంద్రకామ్లాలు అనేక విభిన్న ద్వితీయ నిర్మాణాలను ప్రదర్శిస్తాయి.
ఉదా: ప్రఖ్యాత వాట్సన్-క్రిక్ నమూనా DNA ప్రదర్శించే ఒక ద్వితీయ నిర్మాణం.
* ఈ నమూనా ప్రకారం DNA ద్విసర్పిలాకారంలో ఉంటుంది. దీంట్లో పాలీ న్యూక్లియోటైడ్లు ఉన్న రెండు పోచలు వ్యతిరేక దిశల్లో సమాంతరంగా ఉంటాయి.
* చక్కెర-ఫాస్పేట్-చక్కెర గొలుసు కేంద్రకామ్లాల్లో వెన్నెముకలా ఏర్పడుతుంది.
* నత్రజని క్షారాలపై వెన్నెముకకు లంబంగా, లోపలివైపు ప్రతిక్షేపించి ఉంటాయి.
* ఒక పోచలోని ఎడినీన్ (A), గ్వానిన్ (G) వరుసగా రెండో పోచలోని థైమిన్ (T), సైటోసిన్ (C)లతోనే బంధాలను కలిగి ఉంటాయి.
* G, Cల మధ్య 3 హైడ్రోజన్ బంధాలు; A, Tల మధ్య రెండు హైడ్రోజన్ బంధాలుంటాయి.
* ప్రతి పోచ సర్పిలాకార మేడ మెట్లను పోలి ఉంటుంది. ప్రతి ఆరోహణ మెట్టు ఒక జత నత్రజని క్షారాలను కలిగి ఉంటుంది. ఇది 36º కోణాన్ని చూపుతుంది.
* ద్వి సర్పిలంలోని ఒక పూర్తి మెలికలో 10 మెట్లు లేదా 10 జతల నత్రజని క్షారాలుంటాయి
* ఒక మెలిక నిడివి 34 Aº, నత్రజని క్షార జతల మధ్య దూరం 3.4 Aº. ఈ లక్షణాలున్న DNAను B-DNA అంటారు.

Posted Date : 29-07-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని

విద్యా ఉద్యోగ సమాచారం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌