• facebook
  • twitter
  • whatsapp
  • telegram

కణచక్రం - కణ విభజన

ప్రశ్నలు - జవాబులు

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు
1. కేంద్రకపూర్వ, నిజకేంద్రక కణాల్లో ఏ కణం తక్కువ వ్యవధిలో కణవిభజన చెందుతుంది?
జ: కేంద్రకపూర్వ కణం. ఈ కణం కణచక్రం వ్యవధి తక్కువ కాబట్టి.

2. ఎక్కువ వ్యవధి ఉండే కణచక్ర దశ ఏది?
జ: అంతర్దశ. కణచక్రంలో 95 % వ్యవధి కంటే ఎక్కువగా ఉంటుంది.

 

3. ఈ.కొలై (E.coli) సగటున 20 నిమిషాల్లో కణ విభజన చెంది రెట్టింపైతే, రెండు కణాల నుంచి 32 ఈ.కొలై కణాలు ఏర్పడటానికి ఎంత సమయం పడుతుంది?
జ: 100 నిమిషాలు. ఈ సమయంలో ఒక కణం నుంచి 5 కణచక్రాలు జరిగి 32 కణాలు ఏర్పడతాయి.

 

4. క్షయకరణ విభజన ప్రథమదశ-I లో బైవలెంట్‌లోని నాలుగు క్రొమాటిడ్లలో ఏవి జన్యుమార్పిడి (పారగతి)లో పాల్గొంటాయి?
జ: సమజాతీయ క్రోమోజోముల సోదరేతర క్రొమాటిడ్ల మధ్య పారగతి జరుగుతుంది.

 

5. ఒక పరాగకోశంలో 1200 పరాగరేణువులున్నాయి. అయితే అవి ఎన్ని సూక్ష్మ సిద్ధబీజ మాతృకలతో ఏర్పడి ఉండవచ్చు?
జ: 300 సూక్ష్మ సిద్ధబీజ మాతృకల్లో క్షయకరణ విభజనలు జరిగితే 1200 పరాగరేణువులు ఏర్పడతాయి. 

 

6. ఒక కణజాలంలో 1024 కణాలున్నాయి. ప్రథమ జనక కణం ఎన్ని పర్యాయాలు సమవిభజన చెంది ఉంటుంది?
జ: ఒక ప్రథమ జనక కణం 10 పర్యాయాలు సమవిభజన చెందడం వల్ల 1024 కణాలు ఏర్పడతాయి.

 

7. ఒక కణంలో 32 క్రోమోజోములున్నాయి. ఇవి సమవిభజన జరుపుకుంటాయి. మధ్యస్థదశ (Metaphase) లో క్రోమోజోముల సంఖ్య ఎంత? చలనదశ (Anaphase) లో DNA పరిమాణం (C) ఎంత?
జ: * ఆ కణంలో క్రోమోజోముల సంఖ్య మధ్యస్థదశలో 32 గానే ఉంటుంది.
    * చలనదశలో DNA పరిమాణం 2Cగా ఉంటుంది.

 

8. ఒక కణజాలంలో సమవిభజన దశలను పరిశీలించినప్పుడు కొన్ని కణాల్లో 16 క్రోమోజోములు, మరికొన్ని కణాల్లో 32 క్రోమోజోములు ఉన్నాయి. ఈ క్రోమోజోముల సంఖ్య తేడాకు కారణాలను తెలపండి. 16 క్రోమోజోములున్న కణాలు 32 క్రోమోజోములున్న కణాల నుంచి ఏర్పడి ఉండవచ్చా?. లేదా 32 క్రోమోజోములున్న కణాలు 16 క్రోమోజోములున్న కణాల నుంచి ఏర్పడి ఉండవచ్చా?
జ: * 16 క్రోమోజోములున్న కణాల్లో సమవిభజన పూర్తయింది.
    * 32 క్రోమోజోములున్న కణాల్లో సమవిభజన ప్రారంభం కాలేదు.
    * 16 క్రోమోజోములున్న కణాలు 32 క్రోమోజోములున్న కణాల నుంచి ఏర్పడి ఉండవచ్చు.

 

9. డిప్లోటీన్ దశలో నెలలు, సంవత్సరాలు నిలిచి ఉండే కణాన్ని తెలపండి. ఈ కణం కణచక్రాన్ని ఎలా పూర్తిచేసుకుంటుందో తెలపండి.
జ: కొన్ని సకశేరుకాల స్త్రీ బీజ మాతృకణాల్లో (oocytes) డిప్లోటిన్ దశ నెలలు లేదా సంవత్సరాలు ఉంటుంది.
కణచక్రం పూర్తిచేసుకునే విధానం:
* ప్రత్యుత్పత్తి కాలంలో ప్రాథమిక స్త్రీ బీజమాతృకణం క్షయకరణ విభజన -I పూర్తి చేసుకొని ద్వితీయ స్త్రీ బీజ మాతృకణం ఏర్పడుతుంది.
* ద్వితీయ స్త్రీ బీజ మాతృకణంలో క్షయకరణ విభజన-II ప్రారంభమై మధ్యస్థ దశ-II దగ్గర ఆగుతుంది.
* స్త్రీ బీజకోశంలోని ద్వితీయ స్త్రీ బీజ మాతృకణం విడుదలై ఫలదీకరణకు సిద్ధమవుతుంది.

 

ఖాళీలను పూరించండి:
10.
హృదయ కణాలు కణవిభజన చెందవు. కణచక్రంలో ఈ కణాలు విభజన చెందకుండా ........ దశ నుంచి నిష్క్రమించి, ......... అనే నిష్క్రియ దశలోకి ప్రవేశిస్తాయి.
జ: G1 దశ, శాంతదశ.

 

11. కణచక్రంలో కింద పేర్కొన్న దశలు సంభవిస్తాయి.
ఎ) కేంద్రకత్వచం కరిగిపోయే దశ .....
బి) కేంద్రకాంశం కనిపించే దశ .....
సి) సెంట్రోమియర్ విభజన చెందే దశ .....
డి) DNA ప్రతికృతి చెందే దశ .....
జ: ఎ) ప్రథమదశ బి) అంత్యదశ సి) చలనదశ డి) S ఉపదశ

 

స్వల్ప సమాధాన ప్రశ్నలు
1. క్షయకరణ విభజనలోని ఏ దశలో కింద పేర్కొన్నవి ఏర్పడతాయో ఇచ్చిన సూచనల నుంచి ఎన్నుకోండి.
ఎ) సినాప్టోనీమల్ సంక్లిష్టం ....
బి) పునఃసంయోజన బొడిపెలు ....
సి) ..... లో రికాంబినేస్ ఎంజైములు కనిపిస్తాయి/ క్రియాశీలత వహిస్తాయి.
డి) కయాస్మేటా అంతిమ స్థితీకరణ .....
ఇ) విభజన మధ్యస్థ దశ .....
ఎఫ్) కణజతలు ఏర్పడటం .....
సూచనలు: 1. జైగోటీన్, 2. పాకీటీన్, 3. పాకీటీన్, 4. డయాకైనెసిస్, 5. అంత్యదశ-I తర్వాత/ క్షయకరణ విభజన-IIకు ముందు, 6. అంత్యదశ-I తర్వాత/ క్షయకరణ విభజన-I తర్వాత
జ: ఎ) సినాప్టోనీమర్ సంక్లిష్టం: జైగోటీన్
బి) పునఃసంయోజన బొడిపెలు: పాకీటీన్
సి) పాకీటీన్‌లో రీకాంబినేస్ ఎంజైములు కనిపిస్తాయి/ క్రియాశీలత వహిస్తాయి.
డి) కయాస్మేటా అంతిమ స్థితీకరణ: డయాకైనెసిస్
ఇ) విభజన మధ్యస్థ దశ: అంత్యదశ-I తర్వాత/ క్షయకరణ విభజన-IIకు ముందు
ఎఫ్) కణజాతులు ఏర్పడటం: అంత్యదశ-I తర్వాత/ క్షయకరణ విభజన-I తర్వాత

2. విరామంలో లేకపోయినా అంతర్దశను విరామదశ అంటారు. వ్యాఖ్యానించండి.
జ: ప్రతి రెండు విభజనలకు మధ్య ఉండే దశ లేదా కణచక్రంలో కేంద్రక విభజన జరగని దశనే 'అంతర్దశ' అంటారు. దీన్నే 'విరామదశ' అని కూడా అంటారు. కేంద్రకంలో అనేక మార్పులు జరుగుతాయి. ఈ దశలో కణవిభజన అభివృద్ధికి అవసరమయ్యే వివిధ పదార్థాల ఉత్పత్తి, డీఎన్ఏ ప్రతికృతి ఒక వరుసక్రమంలో జరుగుతాయి. అంతర్దశను మూడు ఉపదశలుగా వర్గీకరించారు.
అవి: 1) G1 దశ (గ్యాప్1)
2) S దశ (ఉత్పత్తి దశ)
3) G2 దశ (గ్యాప్2)
G1 దశ: ఇది సమవిభజన, DNA ప్రతికృతి మధ్య ఉండే దశ. G1 దశ జీవక్రియాపరంగా అధిక క్రియాశీలత దశగా ఉండి, కణం అభివృద్ధిని కొనసాగిస్తుంది. కానీ, డీఎన్ఏ ప్రతికృతి జరుగదు.
* కణం వైశాల్యం పెరుగుతుంది.
* RNA ప్రోటీన్ల సంశ్లేషణ జరుపుతుంది.
S దశ: ఈ దశలో DNA ప్రతికృతి చెందుతుంది. 2C గా ఉండే డీఎన్ఏ 4Cగా మారుతుంది. కానీ, క్రోమోజోముల సంఖ్య రెట్టింపు కాదు. ఉదాహరణకు కణచక్రంలోని G1 దశలో ద్వయస్థితిక (2n) క్రోమోజోములు ఉంటే S దశ అనంతరం కూడా ఈ ద్వయస్థితిక క్రోమోజోములుంటాయి.
G2 దశ: ఈ దశలోనూ ఆర్ఎన్ఏ ప్రోటీన్ల సంశ్లేషణ కొనసాగుతుంది. వీటితోపాటు కొత్తగా కణాంగాలు ఏర్పడతాయి. క్రోమోజోముల చలనానికి ఉపయోగపడే కండె పరికరం ఉత్పత్తికి అవసరమయ్యే ATP అనే శక్తి అణువుల సంశ్లేషణ కూడా ఈ దశలోనే జరుగుతుంది. ఈ మార్పులన్నీ అంతర్దశలో జరుగుతాయి. కాబట్టి అంతర్దశ నిజంగా విరామ దశ కాదు.

 

దీర్ఘ సమాధాన ప్రశ్నలు
1. సమవిభజన, క్షయకరణ విభజనలకు చెందిన వివిధ దశల్లోని తేడాలను వివరించండి.

జ: 


 

2. బహుకణయుత జీవుల్లో సమవిభజన, క్షయకరణ విభజనల ప్రాముఖ్యాన్ని తెలపండి.
జ: సమవిభజన:
* సాధారణంగా సమవిభజన ద్వయస్థితిక (2n) కణాల్లో జరుగుతుంది. కానీ, కొన్ని నిమ్న జాతి మొక్కలు, సంఘజీవ కీటకాల్లో ఏకస్థితిక కణాల్లోనూ జరుగుతుంది.
* ఈ విభజనలో ఒక తల్లికణం (2n) నుంచి జన్యుపరంగా పోలికలున్న రెండు ద్వయస్థితిక పిల్ల కణాలు ఏర్పడతాయి. కాబట్టి ఇవి జన్యుపరంగా ఒకదానికొకటి సమానంగా ఉంటాయి.
* సమవిభజన ద్వారా బహుకణజీవులు పెరుగుతాయి.
* కణ పెరుగుదల వల్ల కేంద్రక - కణద్రవ్యపరిమాణ నిష్పత్తి మారుతుంది. ఈ కేంద్రక - కణద్రవ్య నిష్పత్తికి సంబంధించిన పూర్వస్థితిని తీసుకురావడానికి కణవిభజన అవసరం.
* నాశనమైన కణాల స్థానంలో కొత్త కణాలు ఏర్పడటంలో సమవిభజన ప్రధాన పాత్ర పోషిస్తుంది.
  ఉదా: బాహ్యచర్మం పైపొర కణాలు, గొంతుపొరలోని పైపూత కణాలు, రక్తకణాల్లో నశించిన పాతకణాల స్థానంలో ఎప్పటికప్పుడూ కొత్తకణాలు సమవిభజన ద్వారానే ఏర్పడతాయి.
* తెగిన గాయాలు మానడానికి, పెరుగుదలకు, శాఖీయ ప్రత్యుత్పత్తికి సమవిభజన అవసరం.


క్షయకరణ విభజన: 
* లైంగిక ప్రత్యుత్పత్తి జరిపే జీవుల్లో సంయోగబీజాలు ఏర్పడేటప్పుడు క్షయకరణ విభజన వల్ల క్రోమోజోముల సంఖ్య సగానికి తగ్గుతుంది. దీని వల్ల ఏకస్థితిక క్రోమోజోముల సమితి ఉన్న సంయోగబీజాలు ఏర్పడతాయి.
* ఒక జీవజాతిలో నిర్దిష్ట క్రోమోజోముల సంఖ్య తరతరాలకు మారకుండా ఈ విభజన తోడ్పడుతుంది.
* క్షయకరణ విభజనలో జరిగే పారగతి వల్ల జనాభాలో ఒక తరం నుంచి మరో తరానికి జన్యువైవిధ్యం ఏర్పడుతుంది. ఈ వైవిధ్యాలు జీవపరిణామంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి.

Posted Date : 29-07-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని

విద్యా ఉద్యోగ సమాచారం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌