• facebook
  • twitter
  • whatsapp
  • telegram

యూనిట్ - VII, అధ్యాయం - 13, ఆవరణ సంబంధ అనుకూలనాలు, అనుక్రమం, ఆవరణ సంబంధ సేవలు

     జీవ ప్రపంచం అపురూపమైన వైవిధ్యాన్ని, అద్భుతమైన సంక్లిష్టతను చూపుతుంది. జీవులు, వాటి దేహ నిర్మాణం, జీవన విధానం, జీవావరణాలకు సంబంధించిన ప్రక్రియలను శోధించడం ద్వారా ఈ సంక్లిష్టత అర్థమవుతుంది. స్థూలంగా చూస్తే జీవులకు - పరిసరాలకు మధ్య ఉన్న సంబంధం అంతుపట్టదు. జీవులు - పరిసరాల సూక్ష్మ అధ్యయనం భూమిపై జీవజాతుల మనుగడ పోరాటానికి అద్ధం పడుతుంది. ఈ ప్రకృతిని శాస్త్రీయ దృక్పథంతో పరిశీలిస్తే మనలో ఎన్నో ప్రశ్నలు ఉదయిస్తాయి. మనుగడ పోరాటంలో జీవులు వాటి పరిసరాలతో ఎన్నో అనుకూలనాలు చూపిస్తాయి. అందుకే అవి జీవన పోరాటంలో గెలిచి ముందుకు సాగుతున్నాయి.
   'వృక్ష ఆవరణ శాస్త్రం' ప్రథమ సంవత్సరం సిలబస్‌లోని ఆఖరి పాఠ్యాంశంగా ఉంది. ఈ యూనిట్‌లో మొక్కల సముదాయాలు, వాటి ఆవరణ సంబంధ అనుకూలనాలు, అనుక్రమం, మానవహితమైన ఆవరణ సంబంధిత సేవల గురించి సంక్షిప్తంగా తెలిపారు. 'వైవిధ్యం' జీవులకు సంబంధించిన ముఖ్యలక్షణం. ఆవరణ శాస్త్రం జీవశాస్త్రానికి సంబంధించిన ఒక భావాన్ని తెలియజేస్తుంది. జీవులు, వాటి మధ్య సంబంధాన్ని; జీవులకు, ఆవరణకు మధ్య ఉన్న సంబంధాన్ని తెలిపే జీవశాస్త్ర విభాగమే 'ఆవరణ శాస్త్రం'. ఆవరణ శాస్త్రం (Ecology = oekologie) అనే పదాన్ని మొదట 1885లో రీటర్, తర్వాత 1886లో ఎర్నెస్ట్ హెకెల్ ఉపయోగించారు. గ్రీకు పదాలైన ఒయికాస్ అంటే నివాసం, లాగాస్ అంటే అధ్యయనం అని అర్థం.

 
ఆవరణ శాస్త్రం

మొక్కలు, జంతువులకు, వాటి పరిసరాలకు మధ్య ఉన్న పరస్పర సంబంధాలను

అధ్యయనం చేయడాన్ని 'ఆవరణ శాస్త్రం' అని నిర్వచిస్తారు.

 వార్మింగ్ (1895, 1905) ఈ శాస్త్రాన్ని మొదటిసారిగా మొక్కలకు అన్వయించాడు.
   అధ్యయన అంశాలను బట్టి ఆవరణ శాస్త్రాన్ని వృక్ష ఆవరణ శాస్త్రం, జంతు ఆవరణ శాస్త్రం అనే రెండు విభాగాలుగా ఏర్పరచినప్పటికీ, వాటిని ఒక దాన్నుంచి మరోదాన్ని విడదీయలేం. ఆవరణ శాస్త్రం జీవ సంబంధ వ్యవస్థలోని నాలుగు ప్రధాన స్థాయులతో కూడుకుని ఉంది. అవి జీవులు, జనాభా, సముదాయాలు, బయోమ్‌లు.
        జీవులు వాటి పరిసరాలతో అనేక అనుకూలనాలు చూపిస్తాయి. ఈ అనుకూలనాలు వాటి మనుగడతో పాటు ప్రత్యుత్పత్తికీ తోడ్పడతాయి. సూర్యుడి చుట్టూ భూమి భ్రమణం, దాని కక్ష్యలో తిరగడం ద్వారా నిర్దిష్టమైన రుతువులు ఏర్పడతాయి. వీటి ప్రభావం వల్ల వాతావరణంలో ఉష్ణోగ్రతల తీవ్రత, కాలావధులు ఏర్పడతాయి. వీటితోపాటు ఒక సంవత్సరంలో  కురిసే వర్షపాతం (వర్షం, మంచు) వల్ల కొన్ని మార్పులు జరుగుతాయి. ఈ ప్రభావాలతో ప్రధానమైన బయోమ్‌లు (ఎడారులు, వర్షారణ్యాలు, టండ్రాలు) ఏర్పడ్డాయి.

 

 భారత ఆవరణ శాస్త్రపిత

         ఆధునిక వైజ్ఞానిక ప్రపంచంలో వృక్ష ఆవరణ శాస్త్ర విద్య, అధ్యయనం, పరిశోధన ఎనలేని ప్రాముఖ్యం సంతరించుకున్నాయి. పర్యావరణం భూగోళంపై జీవజాతుల మనుగడను నియంత్రించగలదని తేలిపోవడంతో పర్యావరణ శాస్త్రవేత్తలు పర్యావరణం - జీవుల మధ్య ఉండే సహజ సంబంధాల అధ్యయనం, పరిశోధనలకు పెద్దపీట వేశారు. ప్రపంచవ్యాప్తంగా వృక్ష ఆవరణ శాస్త్రం ఎంతగానో పురోగమించింది. ప్రత్యేకించి భారతదేశ వృక్ష ఆవరణ శాస్త్ర అధ్యయనం, పరిశోధనలకు డాక్టర్ రామ్‌దేవ్ మిశ్రా గొప్ప కృషిచేశారు. అందువల్ల ఆయనను ఆవరణ శాస్త్ర పితగా పరిగణిస్తారు.     
           డాక్టర్ రామ్‌దేవ్ మిశ్రా 1908, ఆగస్టు 26న జన్మించారు. మిశ్రా యునైటెడ్ కింగ్‌డమ్‌కి చెందిన లీడ్స్ విశ్వవిద్యాలయంలోని ఆచార్య డబ్ల్యు.హెచ్. పియర్‌సెల్, ఎఫ్.ఆర్.ఎస్. నుంచి పీహెచ్.డి. పట్టా పొందారు. ఆ తరువాత వారణాసిలోని బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలోని వృక్షశాస్త్ర విభాగంలో ఆవరణ శాస్త్రానికి సంబంధించిన బోధన, పరిశోధనలు చేశారు. ఆయన పరిశోధనలు ప్రధానంగా ఉష్ణమండల సముదాయాలు, అనుక్రమం, ఆవరణ సంబంధ చర్యలు, ఉత్పాదకత, ఉష్ణ మండల అరణ్యాలు, గడ్డినేలల్లోని ఖనిజ పదార్థాల వలయాలు, ఆవరణ వ్యవస్థకు సంబంధించిన విషయాల అవగాహనకు పునాది వేశాయి. డాక్టర్ మిశ్రా భారతదేశంలో ఆవరణ శాస్త్రానికి సంబంధించి మొదటిసారిగా పోస్టుగ్రాడ్యుయేట్ కోర్సును సూత్రీకరించారు. ఆయన పర్యవేక్షణలో దాదాపు 50 మందికి పైగా పరిశోధకులు పీహెచ్.డి. డిగ్రీలు పొంది, వివిధ పరిశోధనశాలలు, విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్నారు.

     వృక్ష ఆవరణ శాస్త్రంలో డాక్టర్ రామ్‌దేవ్ మిశ్రా ఎంతో కృషి చేశారు. ఆయన గౌరవార్థం ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ, ప్రపంచ ఆర్ట్స్ - సైన్స్ అకాడమీలు ప్రోత్సాహకాలనిచ్చి సత్కరించాయి. ఆవరణ శాస్త్రంలో చాలా ఉన్నతమైన 'సంజయ్‌గాంధీ అవార్డు'ను పొందారు. ఆయన ప్రోత్సాహం వల్ల భారత ప్రభుత్వం 1972లో నేషనల్ కమిటీ ఫర్ ఎన్విరాన్‌మెంటల్ ప్లానింగ్, కోఆర్డినేషన్‌ను స్థాపించింది. ఈ సంస్థే తరువాత సంవత్సరాల్లో ఆవరణ, అరణ్యాలకు సంబంధించిన మంత్రివర్గ శాఖను 1984లో స్థాపించడానికి దోహదపడింది.
మొక్కల సముదాయాలు, ఆవరణ సంబంధ అనుకూలనాలు
       జీవులు విభిన్న వాతావరణ పరిస్థితుల్లో జీవించడానికి తగిన స్వాభావిక పొందికలు కలిగి ఉంటాయి. కొన్ని జీవులు స్వరూప, శరీర ధర్మ సంబంధ, మరికొన్ని ప్రవర్తన సంబంధ సర్దుబాటును (తాత్కాలిక వలసలు) చూపుతాయి. ఇవన్నీ 'అనుకూలనాలే'. చాలా అనుకూలనాలు దీర్ఘకాలిక పరిణామ క్రమంలో ఏర్పడి, జన్యుపరంగా స్థిరత్వాన్ని చూపిస్తాయి.
* జలాభావ పరిస్థితుల ఒపన్షియా (బ్రహ్మజెముడు) తన నీటి అవసరాన్ని మొత్తంగా రసభరిత అంగాల నుంచి తీసుకుంటుంది (రసభరిత ప్రాంతాల్లో నీరు మ్యూసిలేజ్ రూపంలో నిల్వ ఉంటుంది).
* అనేక ఎడారి మొక్కల్లో పత్రాల బాహ్యచర్మంపై మందమైన అవభాసిని, బాష్పోత్సేక వేగాన్ని తగ్గించడం కోసం దిగబడిన పత్రరంధ్రాలు ఉంటాయి. ఈ మొక్కల్లో ప్రత్యేకమైన కిరణజన్య సంయోగక్రియాపథం జరగడం ద్వారా పత్రరంధ్రాలు పగటిపూట మూసుకుని ఉంటాయి. కొన్ని ఎడారి మొక్కల్లో (ఒపన్షియా) పత్రాలు ఉండవు. అవి కంటకాలుగా క్షీణించి ఉంటాయి. వీటిలో కిరణజన్య సంయోగక్రియను బల్లపరుపుగా ఉండే పత్రాభకాండం నిర్వహిస్తుంది.

* కొన్ని నేల మొక్కలు (ఉదాహరణకు రైజోఫొరా) ఉప్పు అధికంగా ఉన్న సముద్రతీర ప్రాంతాల్లో పెరుగుతాయి. వీటిని ఉప్పునీటి మొక్కలు (హాలోఫైట్స్) అంటారు.
* ప్రత్యక్షంగా ఎండలో పెరిగే మొక్కలను హీలియోఫైట్‌లు, నీడ ప్రాంతాల్లో పెరిగే మొక్కలను సీయోఫైట్‌లు అని పిలుస్తారు.
        యూజెన్ వార్మింగ్ (1909) అనే డానిష్ వృక్ష శాస్త్రవేత్త మొక్కల సమూహాలకు, మొక్కలు, నీటికి ఉన్న సంబంధాలను అనుసరించి మూడు ప్రధాన ఆవరణ సమూహాలుగా వర్గీకరించాడు.
అవి: నీటిమొక్కలు, మధ్యరకం మొక్కలు లేదా సమోద్బీజాలు, ఎడారి మొక్కలు.

నీటిమొక్కలు (Hydrophytes)
         పూర్తిగా నీటిలో లేదా బాగా తడిగా ఉండే నేలలో పెరిగే మొక్కలను నీటిమొక్కలు అంటారు. నీటిలో పెరిగే విధానాన్ని బట్టి వీటిని 5 రకాలుగా విభజించారు.

నీటిపై స్వేచ్ఛగా తేలే మొక్కలు (Free floating hydrophytes): మృత్తికతో సంబంధం లేకుండా, నీటి ఉపరితలంపై స్వేచ్ఛగా తేలుతూ ఉంటాయి.
ఉదా: పిస్టియా, లెమ్నా, ఐకార్నియా (గుర్రపుడెక్క), ఉల్ఫియా, సాల్వీనియా      
లగ్నీకరణ చెంది, నీటిపై తేలే పత్రాలున్న మొక్కలు (Rooted hydrophytes with floating leaves): వేరు వ్యవస్థ సహాయంతో మృత్తికలో స్థాపితమై, పొడవైన పత్రవృంతాలు ఉండటం వల్ల పత్రదళాలు నీటి ఉపరితలంపై తేలుతూ ఉంటాయి.
ఉదా: నిలంబో (తామర), నింఫియా (కలువ), విక్టోరియా రీజియా.

పూర్తిగా నీటిలో మునిగి, అవలంబితంగా ఉండే మొక్కలు (Submerged suspended hydrophytes): ఇవి నీటితో మాత్రమే సంబంధం కలిగి పూర్తిగా నీటిలో మునిగి మృత్తికలో నాటుకొని ఉండకుండా అవలంబితంగా ఉంటాయి.
ఉదా: హైడ్రిల్లా, సెరటో ఫిల్లమ్, యుట్రిక్యులేరియా      
     నీటిలో మునిగి ఉండి, లగ్నీకరణ చెందిన మొక్కలు (submerged rooted hydrophytes): పూర్తిగా నీటిలో మునిగి ఉండి, వేరు వ్యవస్థ సహాయంతో కొలను అడుగున మృత్తికలో నాటుకొని ఉంటాయి. ఉదా: వాలిస్‌నేరియా, పాటమోజిటాన్.
ఉభయచర మొక్కలు (Amphibious plants): ఇవి పాక్షికంగా నీటిలో, పాక్షికంగా వాయుగతంగా పెరుగుతాయి.
ఉదా: సాజిటేరియా, రానన్‌కులస్, లిమ్నోఫిలా.      

జలాశయాల చుట్టూపెరిగే మొక్కలను కెరటాలు అప్పుడప్పుడూ తాకుతాయి
ఉదా: సైపరస్, టైఫా.      
నీటిమొక్కల ఆవరణ సంబంధ అనుకూలనాలు
(Ecological adaptation in Hydrophytes)

స్వరూపాత్మకమైనవి (morphological)
          నీరు సమృద్ధిగా లభించడం వల్ల నీటిమొక్కల్లో వేళ్ల ప్రాముఖ్యం తక్కువ. దాంతో అవి తక్కువగా అభివృద్ధి చెంది ఉంటాయి.
* వేళ్లు ఉండవు (ఉల్ఫియా, సెరటోఫిల్లమ్) లేదా కృశించి ఉంటాయి (హైడ్రిల్లా).
నీటిలో మునిగి ఉండే పత్రాలు వేళ్లలాగా పనిచేస్తాయి (సాల్వీనియా).
* వేరుతొడుగులు సాధారణంగా ఉండవు. అయితే బురదలో పెరిగే కొన్ని ఉభయచర మొక్కల్లో వేళ్లు బాగా అభివృద్ధి చెంది ఉంటాయి. మరికొన్ని మొక్కల్లో వేరు తొడుగులకు బదులుగా వేరుఒరలు(Root Pockets) ఉంటాయి (పిస్టియా).

* వేళ్లు ఉంటే అవి పీచులాగే పొడవులో కృశించి, శాఖారహితంగా లేదా తక్కువ శాఖలను కలిగి, అబ్బురపు వేళ్లుగా ఉంటాయి. పిస్టియా, ఐకార్నియా (గుర్రపుడెక్క)లో సంతులనం జరిపే వేళ్లుంటాయి.
* కాండం పొడవుగా, సున్నితంగా సాగి ఉంటుంది (హైడ్రిల్లా, పాటమోజిటాన్). నీటిపై స్వేచ్ఛగా తేలే ఐకార్నియాలో స్పాంజిలాంటి కాండం మందంగా, పొట్టిగా ఉంటుంది. లగ్నీకరణం చెంది, నీటిపై తేలే పత్రాలున్న నింఫియా (కలువ), నిలంబోలలో (తామర) కొమ్ములాంటి కాండం ఉంటుంది.
* పత్రాలు పలచగా, పొడవుగా, రిబ్బన్ ఆకృతిలో (వాలిస్‌నేరియా) లేదా సన్నగా, పొడవుగా (పాటమోజిటాన్) లేదా చీలిపోయి (సెరటోఫిల్లమ్) ఉంటాయి. నీటిపై తేలే పత్రాలు పెద్దవిగా బల్లపరుపుగా, ఊర్థ్వతలంపై మైనంతో కప్పబడి ఉంటాయి (నింఫియా, నిలంబో, విక్టోరియా రీజియా). కొన్నిపత్రాలు నీటిలో మునిగి, కొన్ని తేలియాడుతూ, మరికొన్ని వాయుగతంగా ఉండి, భిన్న పత్రోత్పత్తిని చూపిస్తాయి (లిమ్నోఫిలా, రానన్‌కులస్, సాజిటేరియా).


అంతర్నిర్మాణ సంబంధమైనవి (Anatomical)
* నీటిలో మునిగి ఉండే మొక్క భాగాల్లో అవభాసిని ఉండదు. కానీ, అది వాయుగత భాగాల ఉపరితలాలపై అతి పలుచని పొరలా ఉండవచ్చు.
* బాహ్యచర్మకణాలు పలుచని కణకవచంతో ఉండి, 'శోషణ'ను నిర్వర్తిస్తాయి. అవి హరితరేణువులను కూడా కలిగి ఉండటం వల్ల కిరణజన్య సంయోగక్రియ జరుపుతాయి.

* పూర్తిగా నీటిలో మునిగి ఉండే మొక్కల్లో పత్రరంధ్రాలు ఉండవు. వాయుమార్పిడి నేరుగా విసరణ పద్ధతిలో పలుచని కణ కవచాల ద్వారా జరుగుతుంది. నీటిపై తేలే పత్రాలున్న మొక్కల్లో పత్రాలు ఊర్థ్వ పత్రరంధ్రయుతాలు.
* అన్ని నీటి మొక్కల్లో వాయుపూరిత హరిత మృదు కణజాలం (arenchyma) ఉంటుంది. అది వాయు మార్పిడికి, మొక్క నీటిపై తేలడానికి ఉపయోగపడుతుంది. దృఢ కణజాలాలు, దారువు తక్కువగా ఉంటాయి.

 

మధ్యరకం మొక్కలు లేదా సమోద్బీజాలు (Mesophytes)
           మధ్యరకం మొక్కలు సాధారణంగా జలాభావ పరిస్థితులు లేదా నీరు అధికంగా లేని పరిస్థితుల్లో ఉండే ఆవాసాల్లో పెరుగుతూ ఉంటాయి. ఈ ఆవాసాల మృత్తికలోని రంధ్రాల్లో నీరు, వాయువులు దాదాపు సమానంగా ఉంటాయి. నీరు, వాయువుల సమతౌల్య పరిస్థితి మొక్కల పెరుగుదలకు బాగా అనుకూలంగా ఉంటుంది. అందువల్ల మధ్యరకం పరిస్థితుల్లో అడవులు లేదా పంట మొక్కలు బాగా పెరుగుదలను చూపిస్తాయి.
* మధ్యరకం మొక్కలకు కొన్ని ప్రత్యేక పరిస్థితులున్న ఆవాసాల్లో తప్ప అనుకూలనాల అవసరం లేదు.
* భూమిపై మధ్యరకం మొక్కలు బాగా విస్తరించి ఉన్నాయి. గోధుమ, మొక్కజొన్న, బార్లీ, బఠాణి లేదా చెరకు; గడ్డి మైదాన జాతులు, ఉష్ణమండల, సమశీతోష్ణమండల అడవుల్లో పెరిగే మొక్కలు సమోద్బీజాలు.

 

ఎడారి మొక్కలు (Xerophytes) 
         నీరు లోపించిన జలాభావ పరిస్థితులు లేదా క్రియాత్మకంగా పొడిగా ఉండే మృత్తికలో పెరిగే మొక్కలను 'ఎడారి మొక్కలు' అంటారు. వీటిని మూడు రకాలుగా వర్గీకరించారు.

అవి:
i) అల్పకాలిక మొక్కలు (Ephemerals):
ఇవి ఏకవార్షిక మొక్కలు. శుష్క ప్రాంతాల్లో పెరుగుతాయి. అతి తక్కువ కాలంలో (6 - 8 వారాల్లో) జీవితచరిత్రను ముగించుకుంటాయి. ఉదా: ట్రిబ్యులస్ (పల్లేరు)      
ii) రసభరితమైన మొక్కలు (Succlents): ఈ మొక్కలు వర్షాకాలంలో చాలా నీటిని శోషించి, ఆ నీటిని వివిధ భాగాల్లో జిగురు (మ్యూసిలేజ్) రూపంలో నిల్వ చేస్తాయి.
    దీని ఫలితంగా మొక్క భాగాలైన కాండం (ఒపన్షియా - బ్రహ్మజెముడు), పత్రం (అలో - కలబంద), వేరు (ఆస్పరాగస్ - పిల్లితీగలు) రసభరితంగా ఉంటాయి.
నిల్వ చేసిన నీటిని నీరు దొరకని సమయంలో చాలా పొదుపుగా వినియోగిస్తాయి.

iii) రసభరితం కాని మొక్కలు (Non-Succelents): ఇవి దీర్ఘకాలిక జలాభావ పరిస్థితులను తట్టుకోగల, బహువార్షిక మొక్కలు.
ఉదా: కాజురైనా (సరుగుడు), నీరియమ్ (గన్నేరు), జిజిఫస్ (రేగు), కెలోట్రోపిస్ (జిల్లేడు).      
 ఎడారి మొక్కల్లో ఆవరణ సంబంధ అనుకూలనాలు

స్వరూప సంబంధమైన..
        ఎడారి మొక్కలు జలాభావ పరిస్థితుల్లో పెరుగుతాయి. కాబట్టి, వీటిలో వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెంది ఉండటం వల్ల నేల నుంచి నీటిని సమర్థంగా శోషించగలుగుతాయి. బాష్పోత్సేక వేగాన్ని తగ్గించడానికి వాయుగత భాగాలు ప్రత్యేకంగా రూపాంతరం చెంది ఉంటాయి.
ఇంకా వీటిలో..
* వేళ్లు బాగా విస్తరించి, అనేక శాఖలతో విశాలంగా ఉంటాయి. మూలకేశాలు, వేరు తొడుగులు బాగా అభివృద్ధి చెంది ఉంటాయి.

* కాండాలు చాలా వరకు పొట్టిగా, దృఢంగా, చేవదేరి, మందమైన బెరడుతో కప్పబడి ఉంటాయి. కొన్నింటిలో కాండం భూగర్భంగా ఉంటుంది. ఒపన్షియాలో కాండంపై కంటకాలుంటాయి. హరితయుత, రసభరితంగా ఉండే పత్రాభకాండం కనిపిస్తుంది. ఇది సాధారణంగా కేశాలు, మైనం పొరతో కప్పబడి ఉంటుంది.
* బాష్పోత్సేక వేగాన్ని తగ్గించడానికి పత్రాలు బాగా క్షీణించి, పరిమాణంలో చిన్నవిగా, పొలుసాకుల్లా ఉండి, కొన్నిసార్లు కంటకాలుగా రూపాంతరం చెందుతాయి. పత్రదళం సన్నగా, పొడవుగా, సూదుల్లా లేదా అకేషియా (తుమ్మ)లో ఉన్నట్లు అనేక పత్రకాలుగా చీలి ఉంటుంది. సాధారణ పత్రాలుంటే అవి మందంగా, రసభరితంగా లేదా గట్టిగా చర్మిలంగా ఉంటాయి (అలో - కలబంద). పత్రదళం మెరుస్తూ ఉండి, కాంతిని, వేడిని పరావర్తనం చెందిస్తాయి (కెలోట్రాపిస్ - జిల్లేడు).

 

అంతర్నిర్మాణ సంబంధమైన.. 
* బాష్పోత్సేక వేగాన్ని తగ్గించడానికి బాహ్యచర్మంపై మందమైన అవభాసిని ఉంటుంది. బాహ్య చర్మకణాల్లో సిలికా స్ఫటికాలు ఉండవచ్చు. బహువరసయుత బాహ్య చర్మం (బహుళ బాహ్య చర్మం) ఉంటుంది (నీరియం - గన్నేరు). పత్రరంధ్రాలు అథోబాహ్యచర్మంలో ఉంటాయి (అథో బాహ్య చర్మం పత్రరంధ్రయుతం). కొన్ని మొక్కల్లో దిగబడిన పత్రరంధ్రాలు ఉంటాయి. పత్రరంధ్రాలను ఆవరించి పత్రరంధ్ర కేశాలుంటాయి (నీరియం). పత్రాంతరం స్తంభ, స్పంజి కణజాలంగా విభేదనం చెంది ఉంటుంది.
* యాంత్రిక, నాళికా కణజాలాలు బాగా అభివృద్ధి చెంది ఉంటాయి.

మొక్కల అనుక్రమం
పరిసరాలకు అనుగుణంగా వాటి నిర్మాణంలో మార్పులు చెందుతూ ఉండటం సముదాయాలకు ఒక ముఖ్యలక్షణం. ఈ మార్పులన్నీ చివరకు ఒక స్థిరమైన, పక్వమైన సమతాస్థితికి దగ్గరగా ఉన్న మొక్కల సంఘాన్ని ఏర్పరుస్తాయి. ఈ విధంగా ఒక ప్రదేశంలో క్రమానుగతంగా జాతుల సంఘటనంలో ఊహించగల మార్పులు జరగడాన్ని 'ఆవరణ సంబంధ అనుక్రమం' అంటారు.
* అనుక్రమం జరుగుతున్నప్పుడు కొన్ని జాతులు స్థిరపడి వాటి జనాభాను అధికం చేసుకుంటాయి. అలాగే మరికొన్ని జాతులు క్షీణించి క్రమంగా అదృశ్యమవుతాయి.
* ఒకే ప్రదేశంలో వివిధ సముదాయాలు నిశ్చితమైన క్రమంలో వరుసగా మారే విధానాన్ని 'క్రమకం' అంటారు.
* ప్రపంచంలో ఇప్పుడు ఉన్న సముదాయాలన్నీ భూమిపై జీవం పుట్టినప్పటి నుంచి కొన్ని మిలియన్ల సంవత్సరాల 'అనుక్రమం' ద్వారా ఏర్పడినవే. యధార్థంగా అప్పట్లో అనుక్రమం, పరిణామం సమాంతరంగా జరిగిన ప్రక్రియలే అయి ఉండవచ్చు.
* అనుక్రమం అనేది ముందుగా ఎలాంటి జీవజాతులు లేనిచోట మొదలయ్యే ప్రక్రియ.
* లావా చల్లారిన ప్రదేశాలు, రాతినేలలు, కొత్తగా ఏర్పడిన సరస్సులు లేదా రిజర్వాయర్లు 'ప్రాథమిక అనుక్రమం' జరిగే ప్రదేశాలు. ఈ అనుక్రమంలో కొత్త జీవజాతుల స్థాపన చాలా నెమ్మదిగా జరుగుతుంది (కొన్ని వేల సంవత్సరాలు).
* ద్వితీయ అనుక్రమం ఒక ప్రదేశంలో మొదట ఉన్న జీవ సముదాయాలు నాశనమైన తర్వాత మొదలవుతుంది.
ఉదా: పాడుబడిన వ్యవసాయ భూములు, నిప్పు వల్ల, చెట్లు నరకడం వల్ల నాశనమైన అరణ్యాలు, వరదలకు గురైన నేలలు. ఆ ప్రదేశాల్లో కొంత మృత్తిక ఉండటం వల్ల ఈ అనుక్రమం ప్రాథమిక అనుక్రమం కంటే వేగంగా జరుగుతుంది.
* నీరు లేదా నీటి పరిసరాల్లో ప్రారంభమయ్యే మొక్కల అనుక్రమాన్ని 'జలక్రమకం' అంటారు. జలాభావ లేదా శుష్క ప్రాంతాల్లో ప్రారంభమయ్యే మొక్కల అనుక్రమాన్ని 'జలాభావక్రమకం' అంటారు.
* జల క్రమకం, జలాభావ క్రమకం రెండూ చివరకు అధిక శుష్కత, అధిక తేమలేని మధ్యస్థ స్థితికి మారతాయి.
* బంజరు భూమిలో మొదటగా ఆవాసం ఏర్పరచుకునే మొక్కలను 'మార్గదర్శక మొక్కలు' లేదా 'ప్రారంభపు మొక్కలు' అంటారు.

 

ప్రాథమిక అనుక్రమం 
వృక్ష ప్లవకాలు  నీటిపై తేలే ఆవృత బీజ మొక్కలు  లగ్నీకరణ చెందే మొక్కలు  గడ్డిజాతులు  వృక్ష జాతులు (అరణ్యాలు).
ఆవరణ సంబంధ లేదా ఆవరణ వ్యవస్థ సంబంధిత సేవలు 
* సహజ ఆవరణ వ్యవస్థలు జీవానికి ఆధారంగా ఉండే మౌలికమైన పనులు చేస్తాయి. వీటిని ఆవరణ సంబంధ సేవలు అంటారు. ఇవి లేకపోతే మానవ నాగరికతే కాదు, జీవం ఉనికి కూడా ఆగిపోతుంది.
* ఆర్థిక సంబంధ విలువల్లో చెప్పాలంటే ఆవరణ వ్యవస్థ సంబంధ సేవల విలువ ప్రపంచ (గ్లోబల్) ఆర్థిక వ్యవస్థ కంటే అధికం (ఉదా: ఓజోన్‌పొర, నిర్దిష్ట శీతోష్ణస్థితి పరిస్థితులు).
* రాబర్ట్ కాన్‌స్టాంజా, అతడి సహచరుల ప్రకారం ప్రధానమైన ఆవరణ వ్యవస్థ సేవలు సంవత్సరానికి సుమారు 33 ట్రిలియన్ డాలర్ల విలువ ఉన్నవి. ఈ విలువ దాదాపు భౌగోళిక స్థూల జాతీయ ఉత్పాదక (జీఎన్‌పీ) విలువ 18 ట్రిలియన్ డాలర్లకు రెట్టింపు. మిలీనియం ఆవరణ వ్యవస్థ అసెస్‌మెంట్, ఆవరణ వ్యవస్థ సంబంధ సేవలను నాలుగు ప్రధాన విభాగాలుగా విభజించింది.
ఆధార పూర్వక సేవలు: ఖనిజ లవణాల వలయం, ఆక్సిజన్ ఉత్పాదకత, మృత్తిక ఏర్పడటం, మొక్కల పరాగ సంపర్కం.
సరకుల రూప సేవలు: ఆహారం, నారలు, ఇంధనం, నీరు.
నియంత్రణాత్మక సేవలు: శీతోష్ణస్థితి పరిస్థితుల నియంత్రణ, నీటి శుభ్రత, వరదల నివారణ.
సంస్కృతి సంబంధ సేవలు: విద్య, ఆటవిడుపు, సౌందర్య విలువలు.
మొత్తం ఆవరణ వ్యవస్థ, సంబంధిత సేవల విలువల్లో మృత్తిక ఏర్పడటం 50 శాతం ఉంటుంది. ఇతర సేవలైన ఆటవిడుపు సేవలు, ఖనిజ లవణాల వలయం ఒక్కొక్కటి పదిశాతం కంటే తక్కువ. శీతోష్ణస్థితి పరిస్థితుల నియంత్రణ, వన్యప్రాణుల ఆవాసం విలువ ఒక్కొక్కటి సుమారు ఆరు శాతం.

 

ఆవరణ వ్యవస్థ సేవలు - పరాగసంపర్కం
* పరాగసంపర్కం 'పుష్పాల్లోని అండాశయాల ఫలదీకరణకు అవసరమైన పరాగరేణువుల మార్పిడి' అనేది అతి ముఖ్యమైన, ఆరోగ్యవంతమైన ఆవరణ వ్యవస్థలోని భాగం.
* పరాగ సంపర్క సహకారకాలు ప్రపంచంలో ఆహారధాన్యాల ఉత్పత్తిలో ప్రధానపాత్ర పోషిస్తాయి.
* వ్యవసాయ సంబంధ ఉత్పత్తుల్లో ప్రధాన పాత్ర పోషించే పరాగ సంపర్క సహకారకం తేనెటీగ.
* పరాగసంపర్క సహకారకాల క్రియాశీలత తగ్గితే ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది.
* అమెరికాలోని 15 నుంచి 30 శాతం ఆహారోత్పత్తికి పంట మొక్కల్లో తేనెటీగల వల్ల జరిగే పరాగసంపర్కమే కారణం. ఆటవికమైన తేనెటీగలు పాక్షిక లేదా సంపూర్ణ పరాగసంపర్క సంబంధ సేవలను ఇవ్వగలవు.
* విస్తృత సాగువల్ల పరాగ సంపర్క సేవలు త్వరితగతిన క్రమంగా నశిస్తున్నాయి. ఎందుకంటే కొన్ని జాతుల సహకారకాలు నశించిపోతున్నాయి. మిగిలిన సహకారకాలు ఆ వ్యత్యాసాన్ని పూడ్చలేకపోతున్నాయి.
* పరాగ సంపర్క కారకాలు అన్ని రకాల ఆకారాల్లో, పరిమాణాల్లో ఉంటాయి. ప్రపంచ వ్యాప్తంగా తేనెటీగలు, మాత్‌లు, సీతాకోకచిలుకలు, బీటిల్స్, ఈగలు లాంటి లక్షకు పైగా అకశేరుక జాతులు పరాగసంపర్క సహకారులుగా సేవచేస్తున్నాయి.
* కనీసం 1,035 జాతులకు చెందిన పక్షులు, క్షీరదాలు, సరీసృపాలు లాంటి వెన్నెముక ఉన్న జీవులు కూడా చాలా మొక్కల జాతులతో పరాగ సంపర్కం జరుపుతాయి.
* పరాగసంపర్క కారకాలపై ఆధారపడిన పండ్లు, విత్తనాల ఖరీదు ఎక్కువవుతోందంటే ఆవరణ సంబంధ వ్యవస్థలు నశించిపోతున్నాయని అర్థం.
* నేలను ఉపయోగించడంలో వచ్చిన మార్పుల వల్ల పరాగసంపర్క సహకారకాలకు వచ్చిన గొప్ప ప్రమాదం ఏమిటంటే వాటి ఆవాసాలు నాశనమవడం.
* మానవుడు అటవీ భూములను గృహోపయోగాల కోసం మార్పిడి చేసినప్పుడు, చాలా పరాగ సంపర్క కారకాలు నశించిపోతున్నాయి.
* కీటక నాశక పదార్థాలు కూడా కీటక పరాగసంపర్క కారకాలకు పెద్ద ప్రమాదంగా మారుతున్నాయి.

 

పరాగసంపర్క కారకాల రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు 
ఆహారోత్పత్తిలో పరాగసంపర్కం ప్రాముఖ్యం దృష్ట్యా...
* పరాగ సంపర్కానికి దోహదపడేలా స్థానికంగా పెరిగే వివిధ పుష్పించే మొక్కలతో సొంతంగా పూదోటలను పెంచడం, ఖాళీ ప్రదేశాలు, పెద్ద భవంతుల బయట స్థానికంగా పెరిగే మొక్కలను నాటడం.
* ఇళ్లలో, పరిసరాల్లో వాడే కీటకనాశక పదార్థాల స్థాయిని తగ్గించడం.
* స్థానిక సంస్థల్లో, పాఠశాలల్లో సీతాకోకచిలుకల తోటలను, తేనెటీగల పెంపకాన్ని ప్రోత్సహించడం.
* కీటక నాశక పదార్థాలను వినియోగించని లేదా తక్కువగా వినియోగించే పరాగ సంపర్క సహకారకసహాయక పద్ధతులను అనుసరించే వ్యవసాయ సంస్థలను బలపరచడం.

 

ఆవరణ వ్యవస్థ సేవలు - కర్బన స్థాపన
* ఎక్కువ కర్బనం వాతావరణంలోకి చేరకుండా కర్బన స్థాపన చేయడానికి వృక్షాలు అవసరం.
* కిరణజన్య సంయోగ క్రియలో జరిగే CO2, O2 ల వినిమయమే అడవులకు, వాతావరణానికి మధ్య జరిగే ప్రధాన రసాయన ప్రవాహం.
* అడవులు CO2 యొక్క ప్రధాన బ్యాంకులు. కొయ్యరూపంలో చాలా పెద్ద పరిమాణంలో CO2 ను దాచి ఉంచుతాయి. అడవులు వాతావరణంలోని CO2 గాఢతను తగ్గించి, CO2 - O2 లను సమతుల్యంగా ఉంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. కాబట్టి, ఈ పద్ధతిలో కర్బన స్థాపన ద్వారా వచ్చే పరోక్ష ఆదాయపు విలువను మిగిలిన కర్బన స్థాపన పద్ధతులతో పోల్చి గణించవచ్చు.
* ఒక గ్రాము పొడికర్బన పదార్థం ఉత్పత్తికి కావలసిన CO2 మోతాదును కిరణజన్య సంయోగక్రియ సమీకరణం ద్వారా కనుక్కోవచ్చు.
 కిరణజన్య సంయోగక్రియ సమీకరణం ప్రకారం 180. గ్రా. గ్లూకోజ్, 193 గ్రా. O2 ఉత్పత్తికి, 264 గ్రా. CO2, 108 గ్రా. నీటిని మొక్క వినియోగించుకొని 677.2 కిలోకేలరీల సౌరశక్తిని గ్రహిస్తుంది.
* ఈ 180 గ్రా. గ్లూకోజ్ క్రమంగా 162 గ్రా. పాలీశాఖరైడ్‌గా మొక్కలో మార్పు చెందుతుంది. అందువల్ల, మొక్క 162 గ్రా. పొడికర్బన/ సేంద్రీయ పదార్థాన్ని ఉత్పత్తి చేయడానికి 264 గ్రా. CO2 ను స్థాపిస్తుంది. అంటే, ప్రతి 1 గ్రా. పొడి సేంద్రీయ పదార్థంకోసం 1.63 గ్రా. CO2 స్థాపన అవసరం.
* అభయారణ్యాలు ఉత్పత్తి చేసే వార్షిక పొడి సేంద్రీయ పదార్థాల మొత్తాన్ని వివిధ నిర్ణీత ఎత్తులో ఉన్న అడవుల వార్షిక నికర ఉత్పత్తి ఆధారంగా విలువ కడతారు.
* CO2 స్థాపన యొక్క ఆర్థిక విలువను వెలగట్టడానికి మొత్తం CO2 స్థాపన మోతాదును నిర్దిష్టంగా ప్రతి యూనిట్ CO2 స్థాపనకు కావలసిన ఖర్చుతో గుణిస్తారు.
* సహజసిద్ధంగా ఆవరణ వ్యవస్థలు శీతోష్ణస్థితి పరిస్థితులను స్థిరంగా ఉంచడానికి, భూమి అధిక ఉష్ణతకు లోనుకాకుండా, ఎక్కువైన గ్రీన్ హౌస్ వాయువు (CO2)ను వాతావరణం నుంచి తొలగించడానికి ఉపయోగపడతాయి.
* చాలా దేశాలు కార్బన్ పన్ను విధానాన్ని ప్రవేశపెట్టాయి మరికొన్ని ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతున్నాయి. ఈ విధానం వల్ల గ్రీన్‌హౌస్ (హరితగృహ) వాయువులు, ముఖ్యంగా CO2, CO లు వాతావరణంలోకి విడుదల కావడాన్ని తగ్గించవచ్చు.
* గ్లోబల్ వార్మింగ్‌ను నిరోధించే ముఖ్యమైన పద్ధతి అటవీ వర్థకం (Afforestation) పై విధానానికి చాలా ఉపయోగపడుతుంది.

 

ఆవరణ వ్యవస్థ సంబంధ సేవలు - ఆక్సిజన్ విడుదల
* భూమిపై ఉన్న వాతావరణంలో వివిధ రకాల వాయువులు మిశ్రమంగా ఉంటాయి. ఈ వాయువులన్నీ భూమిపై ఉండే జీవుల వివిధ రసాయన చర్యల వల్ల విడుదలవుతాయి.
* మొక్కలు, వృక్ష ప్లవకాలను కొన్నిసార్లు 'ప్రపంచం యొక్క ఊపిరితిత్తులు' అని పేర్కొంటారు. అవి కొన్ని బిలియన్ టన్నుల CO2 ను వాతావరణం నుంచి తీసుకుని కిరణజన్య సంయోగక్రియ ద్వారా మనం శ్వాసించడానికి కావలసిన బిలియన్ టన్నుల O2 ను వాతావరణంలోకి విడుదల చేస్తాయి.
* పూర్తిగా నీటిలో మునిగి ఉన్న స్థూలమొక్కలు, ఆక్సిజన్‌ను విడుదల చేయడం ద్వారా నీటిలో కరిగి ఉన్న O2 మోతాదును పెంచుతాయి.
* ఒక మొక్క నుంచి విడుదలయ్యే O2 మోతాదు ఆ మొక్క జాతిరకం, దాని వయసు, అది నివసించే పరిసరాలపై ఆధారపడి ఉంటుంది.
* ఇటీవల కాలంలోని పరిశోధనల ప్రకారం 'ఒక సంవత్సర కాలంలో 10 మంది వ్యక్తులకు కావలసిన O2 ను ఒక పత్రయుత ప్రౌఢ మొక్క ఒక రుతువులో విడుదల చేస్తుంది' అని తేలింది.
* పూర్తిగా ఎదిగిన ఒక మొక్క 48 lbs CO2 ను ఒక సంవత్సర కాలంలో శోషించి, విడుదల చేసే ఆక్సిజన్ ఇద్దరు మనుషులకు సరిపోతుంది.
* ఒక కారు సగటున 26,000 మైళ్ల ప్రయాణంలో విడుదల చేసే CO2 ఒక ఎకరం భూమిలోని వృక్షాలు సంవత్సర కాలంలో వినియోగించుకునే CO2 విలువకు సమానం. అదేవిధంగా ఒక ఎకరం భూమిలోని వృక్షాలు 18 మంది సంవత్సరం పాటు శ్వాసించడానికి కావలసిన O2 ను అందిస్తుంది.
* సూక్ష్మజీవులు కూడా ఆక్సిజన్ విడుదలలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పాల్గొంటాయి. కొన్ని సూక్ష్మజీవులు, ప్రధానంగా సయనోబ్యాక్టీరియాలు ఆక్సిజన్‌ను ప్రత్యక్షంగా విడుదల చేస్తాయి.
* కొన్ని బ్యాక్టీరియాలు పరోక్షంగా O2 ను విడుదల చేస్తాయి. ఉదా: బ్యాక్టీరియాల సేంద్రీయ పదార్థాల (సెల్యులోజ్) విచ్ఛిన్నకర ప్రక్రియవల్ల విడుదలయ్యే పదార్థాలు ఇతర జీవులకు ఆహారంగా ఉపయోగపడతాయి. ఈ క్రమబద్ధమైన జీర్ణ ప్రక్రియ ద్వారా వివిధ దశల్లో ఆక్సిజన్ విడుదల, వినియోగం జరుగుతుంది.

 

ఇతర ఆధారిత సేవలు: 
అడవుల్లో పడిపోయిన మానుల విచ్ఛిన్నం వల్ల జరిగే ఖనిజ లవణాల వలయాలు, బ్యాక్టీరియాలు, లైకెన్‌ల ద్వారా మృత్తిక ఏర్పడుతుంది. ఇలాంటివాటినే ఇతర ఆధారిత సేవలుగా పేర్కొనవచ్చు.
సరకుల రూప సేవలు : ఆహార ధాన్యాలు (వరి, జొన్న), నారలు (పత్తి, జనుము), ఇంధనం (శిలాజాల ఇంధనం, పెట్రో మొక్కలు) .
నియంత్రణాత్మక సేవల్లో, అటవీ వర్థకం ద్వారా ఉష్ణోగ్రతలను క్రమబద్ధీకరించడం, సూక్ష్మజీవుల ఉపయోగం ద్వారా నీటి శుద్ధత, మాంగ్రూవ్ లాంటి మొక్కలను ఉపయోగించి వరదల నుంచి రక్షణ కలిగించడం (ఉదా: పశ్చిమ బెంగాల్‌లోని సుందర్‌బన్ అడవులు) మొదలైనవి చేర్చవచ్చు.
సంస్కృతి సంబంధ సేవల్లో స్థానిక ఉద్యానవనాల పెంపకం ద్వారా జీవవైవిధ్యాన్ని రక్షించడం, సౌందర్య విలువలను పెంపొందించడం చేర్చవచ్చు.

 

ఆవరణ సంబంధ విధులు కొనసాగించడం ఎలా?
* వాతావరణానికి ఎలాంటి నష్టం కలిగించకుండా, వ్యర్థ పదార్థాల విడుదలను తగ్గించే, వనరుల సంరక్షణను దృష్టిలో పెట్టుకుని తయారయ్యే ఉత్పత్తులను ఎంచుకోవాలి.
* కృత్రిమ ఎరువులు, కీటక నాశకాల వినియోగంలేని పద్ధతుల్లో తయారైన ఉత్పత్తులను ఎంచుకోవాలి.
* వినియోగాన్ని, వ్యర్థపదార్థాల ఉత్పత్తిని తగ్గించాలి.
* పునర్వినియోగానికి సంబంధించిన ఇంధన వనరుల ఉపయోగాన్ని బలపరచాలి.
* సైకిల్ లేదా నడక, ప్రజారవాణా వ్యవస్థను వాడటం ద్వారా సహజ వనరులను రక్షించడం, కాలుష్యాన్ని తగ్గించడం, ఆరోగ్య సంబంధ లాభాలను ఆస్వాదించడం.
* సామూహిక ఉద్యానవనాల ఏర్పాటు, మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనడం.
* కీటక నాశకాల ఉపయోగం తగ్గించి, సహజ కీటక నాశకాలను వాడటం.
* ఉద్యానవనాల్లో స్థానిక మొక్కలను పెంచడం, వన్యప్రాణులకు ఆవాసాన్ని ఏర్పరచడం.

                                                                                                     

Posted Date : 13-11-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని

విద్యా ఉద్యోగ సమాచారం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌