• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఆవరణ సంబంధ అనుకూలనాలు, అనుక్రమం,  సేవలు

 ప్రశ్న‌లు - జ‌వాబులు 

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు
1. బ్రయోఫైట్‌లు, లైకెన్‌లు, ఫెర్న్ మొక్కల్లో వేటిని జలాభావ క్రమకంలో ప్రారంభపు మొక్కలుగా పేర్కొంటారు?
జ: జలాభావ క్రమకంలో లైకెన్‌లను ప్రారంభపు మొక్కలు అంటారు.

 

2. సముద్ర లవణీయత అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఏ రకం మొక్కలు పెరుగుతాయి?
జ: రైజోఫొరా లాంటి ఉప్పునీటి మొక్కలు (Halophytes) ఉప్పు అధికంగా ఉండే సముద్రతీర ప్రాంతాల్లో పెరుగుతాయి.

 

3. ఎండమొక్కలు (Heliophytes), నీడమొక్కల (Sciophytes) ను నిర్వచించండి. మీ ప్రాంతంలోని మొక్కల్లో ఒకదాన్ని ఎండమొక్కకు లేదా నీడమొక్కకు ఉదాహరణగా పేర్కొనండి.
జ: ఎండమొక్కలు: ప్రత్యక్షంగా ఎండలో పెరిగే మొక్కలు.
ఉదా: గడ్డి చామంతి, సూర్యముఖి.
నీడమొక్కలు: నీడలో ఉన్న ప్రాంతాల్లో పెరిగే మొక్కలు. ఉదా: మాస్, ఫెర్న్.

 

4. నీటి మొక్కల్లో కృశించిన దారువు ఉంటుంది. ఎందుకు?
జ: నీటిమొక్కలు తమ అన్ని భాగాలు, అన్ని తలాలద్వారా నీరు, ఖనిజ లవణాలను శోషిస్తాయి. కాబట్టి వాటిలో దారువు కృశించి ఉంటుంది.

 

5. ప్రాథమిక అనుక్రమంలో కంటే ద్వితీయ అనుక్రమంలో చరమదశ త్వరగా ఏర్పడుతుంది. ఎందువల్ల?
జ: * ఒక ప్రదేశంలో మొదట ఉన్న జీవసముదాయాలు నాశనమైన తర్వాత ద్వితీయ అనుక్రమం మొదలవుతుంది. ఉదా: పాడుబడిన వ్యవసాయ భూములు.
    * ఇలాంటి ప్రదేశాల్లో కొంత మృత్తిక ఉండటం వల్ల ద్వితీయ అనుక్రమం, ప్రాథమిక అనుక్రమం కంటే వేగవంతంగా జరుగుతుంది.

 

6. జనాభా, సముదాయాలను నిర్వచించండి.
జ: జనాభా: ఒక ప్రాంతంలో నివసించే ఒకే జాతికి చెందిన జీవుల సమూహాన్ని జనాభా అంటారు.
సముదాయం: ఒక ప్రాంతంలో నివసించే వివిధ జాతులకు చెందిన అనేక జనాభాల సమూహాన్ని సముదాయం అంటారు.

 

స్వల్ప సమాధాన ప్రశ్నలు 

1. నీటి మొక్కలు అంటే ఏమిటి? వివిధ రకాల నీటిమొక్కలను ఉదాహరణలతో చర్చించండి.
జ: పూర్తిగా నీటిలో లేదా బాగా తడిగా ఉండే నేలలో పెరిగే మొక్కలను నీటి మొక్కలు అంటారు. నీటిలో పెరిగే విధానాన్ని బట్టి వీటిని 5 రకాలుగా విభజించారు.
 నీటిపై స్వేచ్ఛగా తేలే మొక్కలు: ఇవి మృత్తికతో సంబంధం లేకుండా, నీటి ఉపరితలంపై స్వేచ్ఛగా తేలుతూ ఉంటాయి. ఉదా: పిస్టియా, లెమ్నా, సాల్వీనియా.
* లగ్నీకరణ చెంది, నీటిపై తేలే పత్రాలున్న మొక్కలు: ఈ మొక్కలు వేరు వ్యవస్థ సహాయంతో మృత్తికలో స్థాపితమై, పొడవైన పత్ర వృంతాలు ఉండటం వల్ల పత్రదళాలు నీటి ఉపరితలంపై తేలుతూ ఉంటాయి. ఉదా: నింఫియా, విక్టోరియా రీజియా.
పూర్తిగా నీటిలో మునిగి అవలంబితంగా ఉండే మొక్కలు: ఈ మొక్కలు నీటితో మాత్రమే సంబంధం కలిగి, పూర్తిగా నీటిలో మునిగి మృత్తికలో నాటుకుని ఉండకుండా అవలంబితంగా ఉంటాయి. ఉదా: హైడ్రిల్లా, యుట్రిక్యులేరియా.
* నీటిలో మునిగి ఉండి, లగ్నీకరణ చెందిన మొక్కలు: ఈ మొక్కలు పూర్తిగా నీటిలో మునిగి ఉండి వేరు వ్యవవ్థ సహాయంతో కొలను అడుగున మృత్తికలో నాటుకొని ఉంటాయి.
ఉదా: వాలిస్‌నేరియా
ఉభయచర మొక్కలు: ఈ రకం మొక్కలు పాక్షికంగా నీటిలో, పాక్షికంగా వాయుగతంగా పెరుగుతాయి.
ఉదా: సాజిటేరియా, టైఫా, లిమ్నోఫిలా.

 

2. ఎడారి మొక్కల వర్గీకరణ గురించి క్లుప్తంగా రాయండి.
జ: నీరు లోపించిన జలాభావ పరిస్థితుల్లో పెరిగే మొక్కలనే ఎడారి మొక్కలు అంటారు. బాహ్యస్వరూపం, శరీరధర్మ లక్షణాలు, జీవితచక్ర విధానాన్ని బట్టి ఎడారి మొక్కలను మూడు రకాలుగా వర్గీకరించారు.
అల్పకాలిక మొక్కలు: ఈ మొక్కలు ఏకవార్షికాలు. ఇవి శుష్కప్రాంతాల్లో పెరుగుతాయి. ఈ మొక్కలు అతి తక్కువ కాలంలో తమ జీవిత చరిత్రను ముగించుకుంటాయి.
ఉదా: ట్రిబ్యులస్
రసభరితమైన మొక్కలు: ఈ మొక్కలు వర్షాకాలంలో చాలా నీటిని శోషించి, ఆ నీటిని వివిధ భాగాల్లో జిగురు (మ్యూసిలేజ్) రూపంలో నిల్వచేస్తాయి. దీని ఫలితంగా కాండం (ఉదా: ఒపన్షియా) ,పత్రం (ఉదా: అలో) లేదా వేరు (ఉదా: ఆస్పరాగస్) లాంటి మొక్కల భాగాలు కండతో లేదా రసభరితంగా ఉంటాయి. ఈ విధంగా నిల్వ చేసిన నీటిని నీరు దొరకని సమయంలో చాలా పొదుపుగా వినియోగిస్తాయి.
రసభరితం కాని మొక్కలు: ఇవి దీర్ఘకాలిక జలాభావ పరిస్థితుల్ని తట్టుకోగల బహువార్షిక మొక్కలు. 
ఉదా: కాజురైనా

 

3. ఎడారి మొక్కల అంతర్నిర్మాణ సంబంధ అనుకూలనాలను తెలపండి.
జ: * బాష్పోత్సేక వేగాన్ని తగ్గించడం కోసం బాహ్యచర్మంపై మందమైన అవభాసిని ఉంటుంది.
* బాహ్యచర్మం కణాల్లో సిలికా స్ఫటికాలు ఉండవచ్చు.
* బహుళ రసయుత బాహ్యచర్మం (బహుళ బాహ్యచర్మం) ఉంటుంది.
* పత్రరంధ్రాలు సాధారణంగా పత్రాల అథోబాహ్యచర్మంలో ఉంటాయి (అథో పత్ర రంధ్రయుతం). కొన్ని మొక్కల్లో దిగబడిన పత్రరంధ్రాలు ఉంటాయి.
* యాంత్రిక, నాళికా కణజాలాలు బాగా అభివృద్ధి చెంది ఉంటాయి.


 

ప్ర: ఆవరణ వ్యవస్థ లేదా ఆవరణ సంబంధ సేవలను నిర్వచించండి. ఆవరణ సంబంధ సేవలు, పరాగ సంపర్కాన్ని గురించి క్లుప్తంగా వివరించండి.
జ: * సహజ ఆవరణ వ్యవస్థలు జీవానికి ఆధారంగా ఉండే మౌలికమైన పనులు చేస్తాయి. ఉదాహరణకు మొక్కలు సూర్యుడి నుంచి సౌరశక్తిని, నేల నుంచి నీరు, ఖనిజ లవణాలను; వాతావరణం నుంచి కార్బన్‌డైఆక్సైడ్‌ను గ్రహించి ఆహార పదార్థాలను తయారు చేసుకుంటాయి. వీటిని ఇతర జీవులు వినియోగించుకుంటాయి. ఈసేవలనే ఆవరణ సంబంధ (ఆవరణ వ్యవస్థ సబంధిత) సేవలు అంటారు.
* పుష్పాల్లోని అండాశయాల ఫలదీకరణకు అవసరమైన పరాగరేణువుల మార్పిడినే పరాగసంపర్కం అంటారు. ఇది ఆరోగ్యవంతమైన ఆవరణ వ్యవస్థలో అతి ముఖ్యమైన భాగం.
* చాలా పుష్పించే మొక్కల్లో ఫలాలు, విత్తనాల ఉత్పత్తి, వ్యవసాయ సంబంధ ఉత్పత్తుల్లో ప్రధాన పాత్ర పోషించేవి తేనెటీగల్లాంటి పరాగ సంపర్క సహకారకాలు.
* అమెరికాలోని 15 - 30% ఆహారోత్పత్తికి పంట మొక్కల్లో తేనెటీగల వల్ల జరిగే పరాగ సంపర్కమే కారణం.
* పరాగసంపర్క సహకారకాల క్రియాశీలత తగ్గితే, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం సంభవిస్తుంది.
* విస్తృతస్థాయిలో జరుగుతున్న వ్యవసాయ సాగువల్ల పరాగసంపర్క సంబంధ సేవలు వేగంగా, క్రమంగా నశించిపోతున్నాయి. ఎందుకంటే కొన్ని జాతుల సహకారకాలు క్షీణిస్తున్నాయి. మిగిలిన సహ కారకాలు ఆ వ్యత్యాసాన్ని పూడ్చలేకపోతున్నాయి. దీనివల్ల పండ్లు, విత్తనాల ఖరీదు పెరిగిపోతోంది.
* ప్రపంచ వ్యాప్తంగా తేనెటీగలు, మాత్‌లు, సీతాకోకచిలుకలు, బీటిల్స్, ఈగలు లాంటి లక్షకు పైగా అకశేరుక జాతులు పరాగ సంపర్క సహకారకాలుగా సేవ చేస్తున్నాయి. కనీసం 1,035 జాతులకు చెందిన పక్షులు, క్షీరదాలు, సరీసృపాల లాంటి వెన్నెముకగల జీవులు కూడా చాలా మొక్కల జాతుల్లో పరాగసంపర్కానికి సహకరిస్తున్నాయి.
* సహజ ఆవాసాలు నాశనమవడం, కీటక నాశక పదార్థాల వినియోగం వల్ల పరాగ సంపర్క సహకారకాలు నశించిపోతున్నాయి. యునైటెడ్ స్టేట్స్ మత్స్య, అటవీ జీవసేవల జాబితా ప్రకారం 50కి పైగా పరాగ సంపర్క సహకారకాలు ప్రమాదపుటంచుల్లో ఉన్నాయి.

 

ప్ర: పరాగ సంపర్క సహకారకాలను రక్షించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి?
జ: పరాగసంపర్క సహకారకాల రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
* పరాగ సంపర్కానికి దోహదపడేలా స్థానికంగా పెరిగే వివిధ పుష్పించే మొక్కలతో సొంతంగా పూదోటలను ఏర్పరచుకోవడం. ఖాళీప్రదేశాలు, పెద్ద భవంతుల బయట స్థానికంగా పెరిగే పుష్పించే మొక్కలను నాటడం.
* ఇళ్లలో, పరిసరాల్లో వాడే కీటకనాశక పదార్థాల స్థాయిని తగ్గించడం.
* స్థానిక సంస్థల్లో, పాఠశాలల్లో సీతాకోకచిలుకల తోటలను, తేనెటీగల పెంపకం కోసం ఉపయోగించే ఫలకాలు, పెట్టెల వాడకాన్ని ప్రోత్సహించడం.
* కీటక నాశక పదార్థాలు వినియోగించని లేదా తక్కువ వినియోగించే, పరాగ సంపర్క సహకారకాల సహాయక పద్ధతులను వాడే వ్యవసాయ సంస్థలను బలపరచడం.
* భూమిని సాగుకు అనువుగా మార్చే ప్రభుత్వ ప్రణాళికల్లో సహజ పరాగ సంపర్క సహకారకాల వల్ల లభించే ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకునేలా ప్రోత్సహించడం.
* వ్యవసాయ పంటల పరాగ సంపర్క విషయాల్లో స్థానికంగా ఉండే పరాగ సంపర్క సహకారకాలను ఉపయోగించుకునే పద్ధతుల అవసరాన్ని తెలియజేయడం.

 

దీర్ఘ సమాధాన ప్రశ్న

ప్ర: ఆవరణ వ్యవస్థ సంబంధ సేవలు - కర్బన స్థాపన, ఆక్సిజన్ విడుదల గురించి వివరించండి.
జ: ఆవరణ సంబంధ (ఆవరణ వ్యవస్థ సంబంధిత) సేవలు - కర్బన స్థాపన:
* ఎక్కువ కర్బనం వాతావరణంలోకి చేరకుండా కర్బన స్థాపన చేయడానికి వృక్షాలు అవసరం.
* కిరణజన్య సంయోగక్రియ పద్ధతిలో జరిగే CO2, O2 ల వినిమయమే అడవులకు, వాతావరణానికి మధ్య జరిగే ప్రధాన రసాయన ప్రవాహం.
* అడవులు CO2 యొక్క ప్రధాన బ్యాంకులు. కొయ్య రూపంలో చాలా పెద్ద పరిమాణంలో CO2 ను దాస్తాయి. ఇవి వాతావరణంలోని CO2 గాఢతను తగ్గించి, CO2, Oలను సమతౌల్యంగా ఉంచుతాయి.
* కాబట్టి, ఈ పద్ధతిలో కర్బన స్థాపన ద్వారా వచ్చే పరోక్ష ఆదాయపు విలువలను మిగిలిన కర్బన స్థాపన పద్ధతులతో పోల్చి గణించవచ్చు.
* ఒక గ్రాము పొడి కర్బన పదార్థం ఉత్పత్తికి కావలసిన CO2 మోతాదును కిరణజన్య సంయోగక్రియ సమీకరణం ద్వారా కనుక్కోవచ్చు.
* కిరణజన్య సంయోగక్రియ సమీకరణం ప్రకారం 180 గ్రాముల గ్లూకోజ్, 193 గ్రాముల O2 ఉత్పత్తికి, 264 గ్రాముల CO2, 108 గ్రాముల నీటిని మొక్క వినియోగించుకుని 677.2 కిలో కేలరీల సౌరశక్తిని గ్రహిస్తుంది. ఈ 180 గ్రాముల గ్లూకోజ్ క్రమంగా 162 గ్రాముల పాలీశాఖరైడ్‌గా మొక్కలో మార్పు చెందుతుంది. అందువల్ల మొక్క 162 గ్రాముల పొడి కర్బన/ సేంద్రీయ పదార్థాన్ని ఉత్పత్తి చేయడానికి 264 గ్రాముల CO2 ను స్థాపిస్తుంది. అంటే, ప్రతిగ్రాము పొడి సేంద్రీయ పదార్థం కోసం 1.63 గ్రాముల CO2 స్థాపన అవసరం.
* అభయారణ్యాలు ఉత్పత్తి చేసే వార్షిక పొడి సేంద్రీయ పదార్థాల మొత్తాన్ని వివిధ నిర్ణీత ఎత్తులో ఉన్న అడవుల వార్షిక నికర ఉత్పత్తి ఆధారంగా విలువ కడతారు.
* CO2 స్థాపన యొక్క ఆర్థిక విలువ వెలగట్టడానికి మొత్తం CO2 స్థాపన మోతాదును నిర్దిష్టంగా ప్రతి యూనిట్ CO2 స్థాపనకు కావలసిన ఖర్చుతో గుణిస్తారు.
* సహజ సిద్ధంగా ఆవరణ వ్యవస్థలు శీతోష్ణస్థితి పరిస్థితులను స్థిరంగా ఉంచడానికి, భూమి అధిక ఉష్ణతకు లోనుకాకుండా ఎక్కువ గ్రీన్ హౌస్ (హరితగృహ) వాయువు (CO2) ను వాతావరణం నుంచి తొలగించడానికి ఉపయోగపడతాయి.
* చాలా దేశాలు కార్బన్ పన్ను విధానాన్ని ప్రవేశపెట్టాయి. కొన్ని ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతున్నాయి. ఈ విధానం వల్ల గ్రీన్ హౌస్ (హరితగృహ) వాయువులు, ముఖ్యంగా CO2, CO లు వాతావరణంలోకి విడుదల కావడాన్ని తగ్గించవచ్చు.
* గ్లోబల్ వార్మింగ్‌ను నిరోధించే ముఖ్యమైన పద్ధతి 'అటవీ వర్థకం' (afforestation)పై విధానానికి చాలా ఉపయోగపడుతుంది.

 

ఆవరణ వ్యవస్థ సంబంధ సేవలు - ఆక్సిజన్ విడుదల
* భూమిపై ఉన్న వాతావరణంలో వివిధ రకాల వాయువులు మిశ్రమంగా ఉంటాయి. ఈ వాయువులన్నీ భూమిపై ఉండే జీవుల వివిధ జీవరసాయన చర్యల వల్ల విడుదలవుతాయి.
* మొక్కలు, వృక్ష ప్లవకాలను కొన్నిసార్లు 'ప్రపంచం యొక్క ఊపిరితిత్తులు' అని పేర్కొంటారు. ఇవి కొన్ని బిలియన్ టన్నుల CO2 ను వాతావరణం నుంచి తీసుకుని, కిరణజన్య సంయోగక్రియ ద్వారా మనం శ్వాసించడానికి అవసరమయ్యే బిలియన్ టన్నుల ఆక్సిజన్‌ను వాతావరణంలోకి విడుదల చేస్తాయి.
* పూర్తిగా నీటిలో మునిగి ఉన్న స్థూల మొక్కలు, ఆక్సిజన్ విడుదల చేయడం ద్వారా నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్‌ను పెంచుతాయి.
* ఒక మొక్క నుంచి విడుదలయ్యే ఆక్సిజన్ మోతాదు ఆ మొక్క జాతి రకం, దాని వయసు, ఆ పరిసరాలపై ఆధారపడి ఉంటుంది.
* ఇటీవలి కాలంలోని పరిశోధనల ప్రకారం ఒక సంవత్సర కాలంలో 10 మంది వ్యక్తులు పీల్చుకునే ఆక్సిజన్‌ను ఒక పత్రయుత ప్రౌఢమొక్క ఒక రుతువులో విడుదల చేస్తుంది.
* పూర్తిగా ఎదిగిన ఒక మొక్క 48 lbs CO2 ను ఒక సంవత్సర కాలంలో శోషించి, విడుదల చేసే ఆక్సిజన్ ఇద్దరు మనుషులకు సరిపోతుంది.
* ఒక కారు సగటు 26,000 మైళ్ల ప్రయాణంలో విడుదల చేసే CO2 ఒక ఎకరం భూమిలోని వృక్షాలు సంవత్సర కాలంలో వినియోగించుకునే CO2 విలువకు సమానం. ఒక ఎకరం భూమిలోని వృక్షాలు 18 మంది సంవత్సరం పాటు శ్వాసించడానికి కావలసిన ఆక్సిజన్‌ను అందిస్తాయి.
* సూక్ష్మజీవులు కూడా ఆక్సిజన్ విడుదలలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పాల్గొంటాయి. కొన్ని సూక్ష్మజీవులు, ప్రధానంగా సయనోబ్యాక్టీరియాలు ఆక్సిజన్‌ను ప్రత్యక్షంగా విడుదల చేస్తాయి.
* కొన్ని బ్యాక్టీరియాలు పరోక్షంగా ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయి. ఉదాహరణకు సేంద్రీయ పదార్థాల (ఉదా: సెల్యులోజ్) విచ్ఛిన్నకర ప్రక్రియవల్ల విడుదలయ్యే పదార్థాలు ఇతర జీవులకు ఆహారంగా ఉపయోగపడతాయి. ఈ క్రమబద్ధమైన జీర్ణప్రక్రియ ద్వారా వివిధ దశల్లో ఆక్సిజన్ విడుదల, వినియోగం జరుగుతుంది.

Posted Date : 29-07-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని

విద్యా ఉద్యోగ సమాచారం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌