• facebook
  • twitter
  • whatsapp
  • telegram

యూనిట్ - VI, మానవ సంక్షేమంలో జీవశాస్త్రం

పరాన్న జీవనం 

నిర్వచనం: రెండు వేర్వేరు జాతులకు చెందిన జీవుల మధ్య ఉన్న సన్నిహిత సహవాసంలో ఒక జీవి రెండోదానికి హాని కలిగిస్తూ, తాను లాభం పొందుతూ జీవిస్తే, ఆ సహవాసాన్ని పరాన్నజీవనం అంటారు.
* ఈ సహవాసంలో లాభం పొందే జీవిని పరాన్నజీవి అంటారు
* పరాన్నజీవికి ఆశ్రయం ఇచ్చి, హాని పొందే జీవిని ఆతిథేయి అంటారు.
* ఆతిథేయి నుంచి పరాన్నజీవులు ఆశ్రయాన్ని, పోషణను పొందుతాయి.
* పరాన్నజీవి వల్ల ఆతిథేయి వ్యాధి బారిన పడుతుంది.

 

పరాన్నజీవుల్లో రకాలు:
1. బాహ్య పరాన్నజీవి:
ఆతిథేయి దేహ ఉపరితలంపై పరాన్నజీవనం గడిపే జీవిని బాహ్య పరాన్నజీవి అంటారు.
ఉదా: మానవుడి తలలో పేను, గజ్జి పురుగు, కుక్కలపై గోమార్లు, సముద్ర ముత్యాలపై ఉండే కోపిపాడ్లు.
2. అంతర పరాన్నజీవి: ఆతిథేయి దేహం లోపల నివసించే పరాన్నజీవిని అంతర పరాన్నజీవి అంటారు. ఇవి మూడు రకాలు

(i) కణాంతర్గత పరాన్నజీవి: ఇది ఆతిథేయి దేహం లోపల నివసిస్తుంది. 
ఉదా: మానవుడి కాలేయ కణాలు, ఎర్రరక్త కణాల్లో నివసించే ప్లాస్మోడియం స్ఫీరోస్పోరాలో నివసించే నాసీమా.
(ii) కణాంతర లేదా కణజాల పరాన్నజీవి: ఇది ఆతిథేయి అవయవాలు, కణజాలాల మధ్య ఉన్న కణాంతర ప్రదేశాల్లో నివసిస్తుంది.
ఉదా: మానవుడి పేగులోని శ్లేష్మ, అథః శ్లేష్మస్తరాల్లో నివసించే ఎంటమీబా హిస్టోలైటికా;
మానవుడి శోషరసంలో ఉండే ఉకరేరియా.
(iii) కుహర పరాన్న జీవి: ఇది ఆతిథేయి దేహంలోని లోపలి కుహరాల్లో నివసిస్తుంది (పరాన్నజీవి ఆతిథేయి ఆహార నాళ కుహరంలో నివసిస్తే దాన్ని ఆంత్రనాళ పరాన్నజీవి అంటారు).
ఉదా: మానవుడి పేగులో నివసించే ఆస్కారిస్.
3. అధి పరాన్నజీవి: పరాన్నజీవి దేహంలో పరాన్నజీవనం గడిపే జీవిని అధి పరాన్నజీవి అంటారు.
ఉదా: టోడ్ చేప మూత్రాశయంలో స్ఫీరోస్పోరా పరాన్నజీవనం గడుపుతూ ఉంటుంది. స్ఫీరోస్పోరాలో నాసిమా నోటాబిలిస్ అధి పరాన్నజీవిగా నివసిస్తుంది.
4. ఏకాతిథేయి పరాన్నజీవి: ఒకే ఆతిథేయిలో జీవిత చక్రాన్ని పూర్తి చేసుకునే పరాన్నజీవి.
ఉదా: ఎంటమీబా హిస్టోలైటికా, ఆస్కారిస్ లుంబ్రికాయిడిస్.

5. ద్వంద్వాతిథేయ పరాన్నజీవి: రెండు లేదా అంతకంటే ఎక్కువ ఆతిథేయిల్లో జీవిత చక్రాన్ని పూర్తి చేసుకునే పరాన్నజీవి.
ఉదా: ప్లాస్మోడియం, ఉకరేరియా.

 

ఆతిథేయిల్లో రకాలు 
1. ప్రాథమిక లేదా నిర్దిష్ట ఆతిథేయి:
పరాన్నజీవి ప్రౌఢ దశలకు లేదా లైంగికంగా పరిణతి చెందిన దశలకు ఆశ్రయం ఇచ్చే ఆతిథేయి. దీనిలో పరాన్నజీవి లైంగికంగా ప్రత్యుత్పత్తి జరుపుకుంటుంది.
ఉదా: ప్లాస్మోడియానికి ఆడ ఎనాఫిలస్, ఉకరేరియాకు మానవుడు.
2. ద్వితీయ లేదా మాథ్యమిక ఆతిథేయి: పరాన్నజీవి అభివృద్ధి దశలు (బాల్య దశలు/ లార్వాలు) లేదా అలైంగిక దశలకు ఆశ్రయం ఇచ్చే ఆతిథేయి. దీనిలో పరాన్నజీవి అలైంగికంగా ప్రత్యుత్పత్తి జరుపుకుంటుంది.
ఉదా: ప్లాస్మోడియానికి మానవుడు, ఉకరేరియాకు ఆడ క్యూలెక్స్.
3. ఆశయ ఆతిథేయి: ఆతిథేయి లభించనప్పుడు పరాన్నజీవుల సంక్రమణ దశలకు ఆశ్రయం కల్పించే ఆతిథేయిలను ఆశయ ఆతిథేయిలు అంటారు.
ఉదా: ప్లాస్మోడియమ్‌కు కోతి; ట్రిపనోసోమా గాంబియన్స్‌కు దుప్పి.
4. వాహకం: పరాన్నజీవులు లేదా వాటి సాంక్రమిక దశలను ఒక ఆతిథేయి నుంచి మరోదానికి చేరవేసే జీవిని వాహక జీవి అంటారు. ఇది సాధారణంగా ఆర్థ్రోపొడ్ అయి ఉంటుంది.

ఉదా: ఆడ ఎనాఫిలస్ (దోమ).
యాంత్రిక వాహకం: ఈ వాహకం కేవలం పరాన్నజీవులను లేదా వాటి సాంక్రమిక దశలను యాంత్రికంగా రవాణా చేస్తుంది. దీనిలో పరాన్నజీవి ఎలాంటి మార్పు చెందదు.
ఉదా: ఎంటమీబాకు ఈగలు.
జీవవాహకం: ఈ వాహకంలో పరాన్నజీవి సాంక్రమిక దశలు మనుగడ సాగించగలిగి మరో జీవికి సంక్రమించేలోపు కొంతవరకు అభివృద్ధి చెందుతాయి.
ఉదా: ప్లాస్మోడియమ్‌కు ఆడ ఎనాఫిలస్ (దోమ)
ఆతిథేయి పై పరాన్నజీవుల ప్రభావం 
         పరాన్నజీవులు ఆతిథేయిల్లో వ్యాధులు కలిగించడమే కాకుండా వాటి శరీరంలో కొన్ని ప్రత్యేక ప్రభావాలను చూపుతాయి. అవి:
i. హైపర్‌ట్రోపీ: పరాన్నజీవి వల్ల ఆతిథేయి కణాల పరిమాణం పెద్దదవడం.
ఉదా: ప్లాస్మోడియం వల్ల మానవ ఎర్రరక్తకణాల పరిమాణం పెరగడం.
 పరాన్నజీవి వల్ల ఆతిథేయి కణజాలాల్లో కణాల సంఖ్య అధికమవుతుంది.
ఉదా: ఫాసియోలా హెపాటికా వల్ల గొర్రె పైత్యరసనాళంలో కణాల సంఖ్య పెరుగుతుంది.
iii. నియోప్లాసియా: పరాన్నజీవి వల్ల ఆతిథేయి కణజాలంలో కణాలు అధికంగా పెరిగి కొత్త నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. (ఇది క్యాన్సర్‌కు దారి తీయవచ్చు.) ఉదా: కొన్ని రకాల వైరస్‌లు.

iv. పరాన్నజీవన కాస్ట్రేషన్: కొన్ని పరాన్నజీవులు ఆతిథేయిలో బీజకోశాలను నాశనం చేస్తాయి. ఇలా జరగడాన్నే పరాన్నజీవన కాస్ట్రేషన్ అంటారు.
ఉదా: సాక్యులైనా (పరాన్నజీవి) వల్ల పీత (ఆతిథేయి)లో స్త్రీ బీజకోశాలు క్షీణిస్తాయి.
v. అతికాయత: పరాన్నజీవి వల్ల ఆతిథేయి శరీర పరిమాణం బాగా పెరుగుతుంది.
ఉదా: ఫాసియోలా హెపాటికా లార్వాల వల్ల దాని మాథ్యమిక ఆతిథేయి అయిన నత్త పరిమాణం పెరుగుతుంది.

పరాన్నజీవనానికి అనుకూలనాలు 
      ఆతిథేయి శరీరంలోని ప్రత్యేక, ప్రతికూలమైన వాతావరణంలో విజయవంతంగా బతకడానికి పరాన్నజీవులకు ప్రత్యేక అనుకూలనాల అభివృద్ధి అవసరం.

అనుకూలనాలు:
i. ఆతిథేయి కణజాలాలకు దృఢంగా అంటిపెట్టుకోవడానికి ఎక్కువగా పరాన్నజీవులు చూషకాలు, కొక్కేలు లాంటి నిర్మాణాలను అభివృద్ధి చేసుకుంటాయి.
ఉదా: టీనియా సోలియం
ii. ఆంత్రనాళంలో నివసించే పరాన్నజీవుల దేహాన్ని ఆవరించి అవభాసిని ఉంటుంది. దీనికి ఆతిథేయి జీర్ణరసాల ప్రభావాన్ని తట్టుకోగలిగే శక్తి ఉంటుంది.
ఉదా: ఆస్కారిస్ లుంబ్రికాయిడిస్
iii. ఆతిథేయి పేగుల్లో నివసించే కొన్ని పరాన్నజీవులు ఆతిథేయి స్రవించే ఎంజైములను తటస్థీకరించే యాంటీ ఎంజైములను ఉత్పత్తి చేస్తాయి.
ఉదా: టీనియా సోలియం
iv. పరాన్నజీవులకు ఆమ్లజని అందుబాటులో ఉండని కారణంగా అవి అవాయు శ్వాసక్రియ ద్వారా శక్తిని పొందుతాయి. (ఆస్కారిస్ లాంటి కొన్ని పరాన్నజీవులు ఆమ్లజని లభిస్తే వాయు సహిత శ్వాసక్రియ కూడా జరుపుకుంటాయి)
v. పరాన్నజీవులకు అత్యధిక ప్రత్యుత్పత్తి శక్తి ఉంటుంది.
ఉదా: ఆస్కారిస్ రోజుకు సుమారు రెండు లక్షల గుడ్లు పెడుతుంది.
vi. ఎంటామీబా హిస్టోలైటికా లాంటి కొన్ని పరాన్నజీవులు ప్రతికూల పరిస్థితుల్లో జీవించడానికి కోశస్థ దశలను (cysts) ఉత్పత్తి చేస్తాయి.

ఆరోగ్యం 

          ఏ వ్యాధి లేకుండా సంపూర్ణంగా - శారీరకంగా, మానసికంగా, సాంఘిక పరంగా ఉల్లాసంగా ఉండే స్థితిని ఆరోగ్యం అంటారు. ఇది మూడు కారణాల వల్ల ప్రభావితం అవుతుంది.
 1) జన్యులోపాలు        2) సంక్రమణలు         3) జీవన విధానం

 

ఎంటమీబా హిస్టోలైటికా

నిర్మాణం: ప్రోటోజోవన్ పరాన్నజీవుల్లో ఎంటమీబా హిస్టోలైటికా ఒకటి. పూర్తిగా ఎదిగిన ఎంటమీబా హిస్టోలైటికాను పోషక దశ (ట్రోఫోజైట్) గా పేర్కొంటారు. ఇది ఆతిథేయి పేగు గోడ యొక్క శ్లేష్మ, అథః శ్లేష్మస్తరాల్లో నివసిస్తుంది. ఇది రోగకారక దశ. (అమీబియాసిస్‌ను కలిగిస్తుంది.) ఈ పోషక దశ దాదాపు అండాకారంగా ప్లాస్మా పొరతో ఆవృతమై ఉంటుంది. కణపదార్థం బాహ్య జీవద్రవ్యం (వెలుపలి, స్వచ్ఛమైంది), అంతర జీవద్రవ్యం (లోపలి, రేణువులతో కూడింది)గా విభజన చెందుతుంది. అంతర జీవద్రవ్యంలో బండి చక్రాన్ని పోలి ఉండే కేంద్రకంతోపాటు రైబోజోములు, ఆహార రిక్తికలు ఉంటాయి. సంకోచరిక్తిక, అంతరజీవద్రవ్య జాలకం, గాల్జీదేహం, మైటోకాండ్రియాలు ఉండవు. మైటోకాండ్రియాలు ఉండవు కాబట్టి ఇది తప్పనిసరిగా అవాయుశ్వాసక్రియపైనే ఆధారపడుతుంది. దీనిలో పోషణ జాంతర భక్షణ రకం. ఇది ఎర్ర రక్తకణాలు, ఉపకళా కణాలను, బ్యాక్టీరియాను ఆహారంగా తీసుకుంటుంది. పోషక దశ ఒకే మిథ్యాపాదంతో ఉంటుంది.

జీవితచక్రం: ఎంటమీబా హిస్టోలైటికా పోషక దశ అలైంగికంగా ద్విధావిచ్ఛిత్తి ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకుంటుంది. అనేక ద్విధావిచ్ఛిత్తుల అనంతరం కొన్ని పిల్లకణాలు పేగు కుహరంలో పడి కోశస్థ పూర్వదశలుగా మారతాయి. వీటి జీవద్రవ్యంలో గ్లైకోజన్ రేణువులు, క్రొమటాయిడ్ దేహాల (రైబోన్యూక్లియో ప్రొటీన్‌లు)ను నిల్వ చేసుకుంటాయి.   

  
ఇప్పుడు పరాన్నజీవి కోశస్థ పూర్వదశలు ఒక రక్షణ కోశాన్ని (cyst) అభివృద్ధి చేసుకుని కోశీభవనం చెంది కోశస్థ దశలుగా మారతాయి. ఒక్కో కోశస్థ దశలోని కేంద్రకం రెండుసార్లు విభజన చెంది చతుష్కేంద్రక కోశాలు ఏర్పడతాయి.
      చతుష్కేంద్రక కోశాలు మలం ద్వారా బయటకు వస్తాయి. ఇవి చాలా సూక్ష్మంగా ఉండటంతో గాలి, ఈగల లాంటి కీటకాల ద్వారా మానవుడు తీసుకునే ఆహారం, పానీయాలను చేరతాయి. కలుషిత ఆహారం, నీరు ద్వారా చతుష్కేంద్రక కోశాలు కొత్త ఆతిథేయి (మానవుడు) పేగును చేరతాయి. అక్కడ ట్రిప్సిన్ అనే ఎంజైమ్ చర్య వల్ల కోశం పగిలి చతుష్కేంద్రక దశ విడుదలవుతుంది. దీన్ని మెటాసిస్టిక్ దశ అంటారు.

           మెటాసిస్టిక్ దశలోని ఒక్కో కేంద్రకం ఒకసారి విభజన చెందడంతో ఎనిమిది కేంద్రకాలు ఏర్పడతాయి. ప్రతి కేంద్రకం చుట్టూ కొంత జీవ పదార్థం చేరి ఎనిమిది పిల్లకణాలు ఏర్పడతాయి. ఇవి క్రమంగా ఎదిగి పోషక జీవులుగా మారతాయి.
 

వ్యాధి కారకత
ఎంటమీబా హిస్టోలైటికా వల్ల మానవుడిలో అమీబియాసిస్ అనే వ్యాధి వస్తుంది.
i. ఎంటమీబా హిస్టోలైటికా పోషక దశలు పేగు గోడ శ్లేష్మ స్తరాన్ని హిస్టోలైసిస్ అనే ఎంజైమ్ సహాయంతో కరిగించి అథ:శ్లేష్మ స్తరాన్ని చేరతాయి. ఫలితంగా ఏర్పడే అల్సర్ల వల్ల కణ అవశేషాలు, లింఫోసైట్లతో కూడిన రక్తస్రావం జరుగుతుంది. అందువల్ల మలంలో రక్తం, శ్లేష్మం కనిపిస్తాయి. ఈ స్థితిని ఆంత్రనాళ అమీబియాసిస్ లేదా అమీబిక్ డిసెంట్రీ అంటారు. కడుపు నొప్పి, క్రమరహిత విరేచనాలు మొదలైనవి ఈ వ్యాధి లక్షణాలు.
ii. సంక్రమణ తీవ్రంగా ఉన్నప్పుడు కొన్ని పోషక దశలు రక్తంలోకి చేరి రక్తం ద్వారా కాలేయాన్ని చేరి అక్కడ చీము గడ్డలను ఏర్పరుస్తాయి. కొన్నిసార్లు ఇవి ఊపిరితిత్తులు, గుండె, మెదడు, మూత్రపిండాలు, బీజకోశాలు మొదలైన భాగాలకు వ్యాపించి చీము గడ్డలను ఏర్పరచి విపరీత పరిణామాలకు దారి తీస్తాయి. ఈ స్థితిని బాహ్యాంత్ర అమీబియాసిస్ అంటారు.
నియంత్రణ:
* మరుగు దొడ్లను వాడాలి.
* భోజనానికి ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.

* పళ్లు, కూరగాయలను కడిగిన తర్వాతే వాడాలి.
* ఈగలు, ఇతర కీటకాలు వాలకుండా ఆహార పదార్థాలకు రక్షణ కల్పించాలి.

 

ప్లాస్మోడియం
పరిచయం:
* ప్లాస్మోడియంను సాధారణంగా మలేరియా పరాన్నజీవి అంటారు. ఇది మానవుడిలో మలేరియాను కలిగిస్తుంది.
* మానవుడి కాలేయ కణాలు, ఎర్రరక్త కణాల్లో నివసించే కణాంతర్గత పరాన్నజీవి.
* ప్లాస్మోడియంను మలేరియా రోగి రక్తంలో ఛార్లెస్ లావెరన్ ప్రథమంగా గుర్తించాడు.
* ఆడ ఎనాఫిలస్ (దోమ) అన్నాశయ కుడ్యంలో ప్లాస్మోడియం కోశాలను రోనాల్డ్ రాస్ కనుక్కున్నాడు.  ఈ పరిశోధన ఆయనకు నోబెల్ బహుమానాన్ని తెచ్చి పెట్టింది.
* ఆగస్టు 20ని ప్రపంచ మలేరియా దినోత్సవంగా నిర్వహిస్తారు.
* ఎర్రరక్తకణాల్లో ప్లాస్మోడియం జీవితచక్రాన్ని గాల్జీ; ఆడ ఎనాఫిలస్‌లో గ్రాసీ, ఆయన సహచరులు కనుక్కున్నారు.

 

ప్లాస్మోడియం జాతులు: 


స్పోరోజాయిట్ నిర్మాణం: ప్లాస్మోడియం మానవుడి కాలేయ కణాలు, ఎర్రరక్తకణాల్లో నివసించే కణాంతర్గత పరాన్నజీవి. దీనివల్ల మలేరియా వ్యాధి వస్తుంది. ప్లాస్మోడియం సంక్రమణ దశలను స్పోరోజైట్లు అంటారు. స్పోరోజైట్ కొడవలి ఆకారంలో ఇరువైపులా మొనదేలి ఉంటుంది. సాగే గుణం ఉన్న పెల్లికిల్ దీన్ని ఆవరించి ఉంటుంది. దీనికి మధ్య భాగంలో కేంద్రకం ఉంటుంది. జీవపదార్థంలో గాల్జీ దేహం, అంతర్జీవ ద్రవ్యజాలకం, మైటోకాండ్రియా లాంటి కణాంగాలు ఉంటాయి. స్పోరోజాయిట్ పూర్వభాగంలో అగ్ర చూషకం అనే కప్పు లాంటి నిర్మాణం ఉంటుంది. దీనిలో రెండు స్రావకాంగాలు తెరుచుకుని ఉంటాయి. ఇవి స్రవించే సైటోలైటిక్ ఎంజైమ్ సహాయంతో స్పోరోజాయిట్ మానవ కాలేయ కణంలోకి చొచ్చుకుపోతుంది.
జీవిత చరిత్ర: ప్లాస్మోడియం తన జీవిత చరిత్రను రెండు ఆతిథేయిల్లో పూర్తి చేసుకుంటుంది. అవి: దోమ, మానవుడు. దోమ (ఆడ ఎనాఫిలస్) ప్రాథమిక ఆతిథేయి, మానవుడు ద్వితీయ ఆతిథేయి. కోతి ఆశయ ఆతిథేయి. ప్లాస్మోడియం మానవుడిలో అలైంగికంగా, దోమలో లైంగికంగా ప్రత్యుత్పత్తి జరుపుతుంది.
1. మానవుడిలో ప్లాస్మోడియం జీవిత చరిత్ర (అలైంగిక చక్రం లేదా షైజోగనీ):
ఎ. కాలేయ షైజోగనీ:
ప్లాస్మోడియం సాంక్రమిక దశలు (స్పోరోజాయిట్స్) ఉన్న ఆడ ఎనాఫిలస్ (దోమ) మానవుడిని కుట్టినప్పుడు అవి మానవ రక్తంలోకి విడుదలవుతాయి. సుమారు అరగంటలో రక్తం ద్వారా కాలేయాన్ని చేరి కాలేయ కణాల్లోకి ప్రవేశిస్తాయి. కాలేయ కణంలోకి ప్రవేశించిన స్పోరోజాయిట్ గోళాకారంగా మారి పెద్దదవుతుంది. దీన్ని షైజాంట్ అంటారు. దీని కేంద్రకం అనేక సమ విభజనలు చెంది చాలా కేంద్రకాలు ఏర్పడతాయి. ప్రతీ కేంద్రకం చుట్టూ కొంత జీవ పదార్థం చేరి కదురు ఆకార క్రిప్టోజాయిట్స్ ఏర్పడతాయి. కాలేయ కణం పగలడంతో ఇవి కాలేయ రక్త కోటరాల్లోకి విడుదలవుతాయి. పైన వివరించిన జీవిత చక్రాన్ని రక్తకణ పూర్వజీవితచక్రం అంటారు.

         క్రిప్టోజాయిట్స్ నేరుగా ఎర్రరక్త కణాల్లోకి చేరతాయి లేదా తిరిగి కాలేయ కణాల్లోకి ప్రవేశించి రక్తకణ బాహ్య జీవితచక్రాన్ని ప్రారంభిస్తాయి. కాలేయ కణంలో క్రిప్టోజాయిట్ గోళాకారంగా మారి పెద్దదై షైజాంట్‌గా మారుతుంది. దీని కేంద్రకం అనేక విభజనలు చెంది చాలా కేంద్రకాలు ఏర్పడతాయి. ప్రతీ కేంద్రకం చుట్టూ కొంత జీవ పదార్థం చేరి రెండు రకాల మెటాక్రిప్టోజాయిట్స్ ఏర్పడతాయి. అవి: మైక్రోమెటాక్రిప్టోజాయిట్స్, మాక్రోమెటాక్రిప్టోజాయిట్స్. కాలేయ కణం పగలడంతో ఇవి బయటకు విడుదలవుతాయి. మాక్రోమెటాక్రిప్టోజాయిట్స్ తిరిగి ఆరోగ్యంగా ఉన్న కాలేయ కణాలను చేరి ఇదే చక్రాన్ని కొనసాగిస్తాయి. మైక్రోమెటాక్రిప్టోజాయిట్స్ రక్తంలోకి చేరి ఎర్రరక్త కణాల్లోకి ప్రవేశిస్తాయి.
బి. రక్తకణ షైజోగనీ లేదా గాల్జీచక్రం: ప్లాస్మోడియం రక్తకణ బాహ్య చక్రంలో విడుదలైన మైక్రోమెటా క్రిప్టోజాయిట్స్ రక్తంలోకి చేరి, ఎర్రరక్త కణాల్లోకి ప్రవేశిస్తాయి.
i. ఎర్రరక్త కణంలో మైక్రోమెటాక్రిప్టోజాయిట్ గోళాకారంగా మారి పోషక జీవి (ట్రోఫాజాయిట్)గా మారుతుంది.
ii. దీని జీవ పదార్థంలో ఒక రిక్తిక ఏర్పడి, క్రమంగా పెద్దదై కేంద్రకాన్ని ఒక పక్కకు నెట్టి వేస్తుంది. అందువల్ల ట్రోఫోజాయిట్ ఉంగరంలా కనిపిస్తుంది. (అంగుళ్య దశ)
iii. క్రమంగా రిక్తిక అదృశ్యమవుతుంది. ట్రోఫోజాయిట్ మిథ్యాపాదాలను అభివృద్ధి చేసుకుని అమీబాయిడ్ దశగా మారుతుంది. ఇది హీమోగ్లోబిన్‌ను ఆహారంగా తీసుకుని దానిలోని గ్లోబిన్‌ను జీర్ణం చేసుకుంటుంది. హీమ్‌ను స్ఫటిక రూప హీమోజోయిన్ (మలేరియా వర్ణకం)గా మారుస్తుంది.
iv. ఇదే సమయంలో ఎర్రరక్త కణ జీవపదార్థంలో ఎర్రటి చుక్కలు ఏర్పడతాయి. వీటిని షఫ్నర్ రేణువులు అంటారు. ప్లాస్మోడియం విడుదల చేసే ప్రతిజనకాలుగా వీటిని భావిస్తున్నారు.

v. ఈ సమయానికి మిథ్యాపాదాలు అదృశ్యమై ట్రోఫోజాయిట్ పెద్దగా ఉండే షైజాంట్‌గా మారుతుంది.

vi. షైజాంట్ విభజన చెందడంతో (షైజోగనీ) 12 - 24 ఎరిత్రోసైటిక్ మీరోజాయిట్స్ ఏర్పడతాయి. ఇవి గులాబీ రేకుల్లా అమరి ఉండటం వల్ల ఈ దశను రోజెట్ దశ అంటారు.

vii. ఈ క్రియలన్నీ జరిగేసరికి ఎర్రరక్తకణం ఉబ్బి పగిలిపోతుంది. ఫలితంగా ఎరిత్రోసైటిక్ మీరోజాయిట్స్, హీమోజోయిన్ రక్తంలోకి విడుదలవుతాయి. ఎరిత్రోసైటిక్ మీరోజాయిట్స్ తిరిగి ఆరోగ్యవంతమైన ఎర్రరక్త కణాలను చేరి ఇదే జీవితచక్రాన్ని పునరావృతం చేస్తాయి.
viii. సంయోగ బీజ మాతృకలు ఏర్పడటం: అనేక రక్తకణ జీవిత చక్రాల వల్ల రక్తంలో ఎర్రరక్త కణాల సంఖ్య బాగా తగ్గుతుంది. ఆ సమయంలో కొన్ని ఎరిత్రోసైటిక్ మీరోజాయిట్స్ ఆరోగ్యంగా ఉన్న ఎర్రరక్త కణాల్లోకి చేరి రెండు రకాల సంయోగ బీజ మాతృకలుగా మారతాయి. అవి సూక్ష్మ సంయోగ బీజ మాతృక, స్థూల సంయోగ బీజ మాతృక. వీటి తర్వాతి అభివృద్ధి ఆడ ఎనాఫిలస్ (దోమ)లో కొనసాగుతుంది.
i. సూక్ష్మ సంయోగ బీజ మాతృకలు చిన్న పరిమాణంలో పెద్ద కేంద్రకాన్ని, స్వచ్ఛమైన జీవ పదార్థాన్ని కలిగి ఉంటాయి.
ii. స్థూల సంయోగ బీజ మాతృకలు పెద్ద పరిమాణంలో చిన్న కేంద్రకాన్ని, రేణువులతో కూడిన జీవ పదార్థాన్ని కలిగి ఉంటాయి.

 

దోమలో జీవిత చక్రం లేదా లైంగిక చక్రం
      ఆడ ఎనాఫిలస్ (దోమ) మలేరియా రోగి రక్తాన్ని పీల్చుకున్నప్పుడు ప్లాస్మోడియం అన్ని దశలూ దోమ అన్నాశయాన్ని చేరతాయి. బీజ కణ మాతృకలు తప్ప అన్ని దశలూ జీర్ణమైపోతాయి. దోమ అన్నాశయంలోని pH, ఉష్ణోగ్రత సిద్ధబీజ మాతృకల అభివృద్ధికి అనుకూలంగా ఉంటుంది.
A. గామిటోగనీ: సూక్ష్మ సిద్ధ బీజ మాతృక నుంచి, సూక్ష్మ సంయోగ బీజాలు (పురుష బీజాలు); స్థూల సిద్ధ బీజ మాతృక నుంచి స్థూల సంయోగ బీజాలు (స్త్రీ బీజ కణాలు) ఏర్పడే ప్రక్రియను గామిటోగనీ అంటారు.

ఎ. సూక్ష్మ సిద్ధ బీజ మాతృక కేంద్రకం 2-3 సార్లు విభజన చెంది 4-8 ప్రాక్కేంద్రకాలు ఏర్పడతాయి. ఇవి బీజ కణ మాతృక నుంచి కొంత జీవ పదార్థంతోపాటు దారాల్లా వెలుపలకు విస్తరిస్తాయి. ఇవి కొరడా మాదిరి కదలికలు చూపి, బీజ కణ మాతృక నుంచి వేరవుతాయి. ఈ ప్రక్రియను కశాభ నిర్మోచనం అంటారు.
బి. స్థూల సిద్ధ బీజ మాతృక ఒకసారి విభజన చెంది ఒక పెద్ద కణాన్ని, ధ్రువదేహం అనే చిన్న కణాన్ని ఏర్పస్తుంది. ధ్రువదేహం నశించిపోతుంది. పెద్దకణం స్థూల సంయోగబీజంగా మారుతుంది. దీనికి ఫలదీకరణ శంకు అనే ఉబ్బెత్తు నిర్మాణం ఏర్పడుతుంది.
B. ఫలదీకరణం/ సింగమీ: రెండు సంయోగ బీజాల కలయికను సింగమీ అంటారు. ఈ బీజాలు అసమానంగా ఉంటే ఆ సింగమీని అసమ సంయోగం (ఎనైసోగమీ) అంటారు. (ప్లాస్మోడియంలో ఎనైసోగమీ జరుగుతుంది.) ఒక సూక్ష్మ సంయోగ బీజం స్థూల సంయోగ బీజాన్ని ఫలదీకరిస్తుంది. ఫలితంగా సంయుక్త బీజం ఏర్పడుతుంది.
C. ఊకైనెట్, ఊసిస్ట్: సంయుక్తబీజం కదురు ఆకారం పొంది దోమ అన్నాశయం గోడవైపు కదలడం ప్రారంభిస్తుంది. చలన శక్తి ఉన్న ఈ సంయుక్త బీజాన్ని ఊకైనెట్ లేదా వెర్మిక్యూల్ అంటారు. ఇది దోమ అన్నాశయం గోడను చొచ్చుకొని వెలుపలి పొర కిందకు చేరుతుంది. అక్కడ గుండ్రంగా మారి, పరిమాణంలో పెద్దదై కోశీభవనం చెందుతుంది. దీన్నే ఊసిస్ట్ అంటారు.

D. స్పోరోగనీ లేదా రాస్ చక్రం: ఊసిస్ట్ నుంచి స్పోరోజాయిట్స్ ఏర్పడే ప్రక్రియనే స్పోరోగనీ అంటారు. ఊసిస్ట్‌లోని కేంద్రకం అనేకసార్లు విభజన చెంది (మొదటివిభజన క్షయకరణ విభజన) అధిక సంఖ్యలో కేంద్రకాలు ఏర్పతాయి. ప్రతి కేంద్రకం చుట్టూ కొంత జీవ పదార్థం చేరి స్పోరోబ్లాస్ట్‌లు ఏర్పడతాయి. ఇవి స్పోరోజాయిట్స్‌గా మారతాయి. ఊసిస్ట్ పగలడం వల్ల స్పోరోజాయిట్స్ దోమ రక్తంలోకి విడుదలవుతాయి. ఇవి దోమ లాలాజల గ్రంథుల్లోకి చేరి కొత్త ఆతిథేయిలోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉంటాయి.

ప్రిపేటెంట్ కాలం: ప్లాస్మోడియం ప్రప్రథమంగా స్పోరోజాయిట్ రూపంలో మానవుడి రక్తంలోకి ప్రవేశించి, అదృశ్యమైనప్పటి నుంచి తిరిగి మొదటిసారి క్రిప్టోజాయిట్స్ రక్తంలో కనిపించే వరకు ఉన్న కాలాన్ని ప్రిపేటెంట్ కాలం అంటారు. ప్లాస్మోడియం వైవాక్స్‌లో ఇది 8 రోజులు.
పొదిగే కాలం: స్పోరోజాయిట్స్ మానవ దేహంలో ప్రవేశించిన నాటినుంచి మొదటగా మలేరియా లక్షణాలు కనిపించే వరకు పట్టేకాలాన్ని పొదిగే కాలం అంటారు. ప్లాస్మోడియం వైవాక్స్‌కు ఇది సుమారు 10 నుంచి 14 రోజులు.

 

రోగకారకత:
1. ప్లాస్మోడియం వైవాక్స్ వల్ల బినైన్ టెర్షియన్ మలేరియా వస్తుంది.
2. జ్వరం మళ్లీ మళ్లీ రావడం మలేరియా ముఖ్య లక్షణం. దీన్ని మూడు దశలుగా విభజించవచ్చు.
ఎ) శీతల దశ: చలి, వణుకు, తలనొప్పి, మగత.
బి) ఉష్ణ దశ: ఎక్కువ జర్వం, శ్వాసవేగంగా తీసుకోవడం, పల్స్‌వేగం ఎక్కువ అవడం.
సి) స్వేద దశ: విపరీతంగా చెమట, ఉష్ణోగ్రత సాధారణ స్థితికి చేరడం.

3. ప్లీహం వాపు (స్పీనోమెగాలీ), రక్తహీనత ఇతర లక్షణాలు.
4. కొన్నిసార్లు మాక్రోమెటాక్రిప్టోజాయిట్స్ కాలేయ కణాల్లో నిద్రావస్థలో ఉంటాయి. వీటిని హిప్నోజాయిట్స్ అంటారు. ఇవి పునరుత్తేజం చెందినప్పుడు మెటాక్రిప్టోజాయిట్స్ ఏర్పడి మలేరియా తిరగబడుతుంది. దీన్నే రిలాప్స్ ఆఫ్ మలేరియా అంటారు.
చికిత్స: ప్రాచీన కాలం నుంచి మలేరియాకు ఔషధం క్వినైన్. ఇది సింకోనా అఫిసినాలిస్ అనే చెట్టు బెరడు నుంచి తీసే ఆల్కలాయిడ్.
నియంత్రణ: మలేరియాను నియంత్రించడానికి దోమల పెరుగుదలను అరికట్టాలి. దీనికోసం -
* మురుగు కాలువల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలి.
* నిల్వ ఉన్న మురుగు నీటిపై కిరోసిన్ చల్లాలి. ఇది నీటిపై పొరలా ఏర్పడి దోమ లార్వాలు, ప్యూపాల శ్వాసక్రియకు ఆటంకం కలిగించడం వల్ల అవి చనిపోతాయి.
* దోమలు పెరిగే చోట డి.డి.టి., బి.హెచ్.సి. లాంటి కీటక నాశనులు చల్లాలి.
జీవ నియంత్రణ:
     ఎ. మురుగు కాలువల్లో దోమ లార్వాలను తినే గాంబూసియా చేపలను పెంచడం.
     బి. కీటకాహర మొక్కలైన యుట్రిక్యులేరియా లాంటి మొక్కలను పెంచడం.

ఆస్కారిస్ లుంబ్రికాయిడిస్

పరిచయం:
* ఆస్కారిస్ నెమటోడాకు చెందిన పరాన్న జీవి. దీన్ని సాధారణంగా ఏలిక పాము అంటారు.
* మానవుడి పేగులో (ముఖ్యంగా పిల్లల్లో) నివసించే ఆంత్రనాళ పరాన్నజీవి.
* దీనివల్ల మానవుడిలో ఆస్కారియాసిస్ అనే వ్యాధి వస్తుంది.      
నిర్మాణం/ బాహ్య లక్షణాలు:
* ఆస్కారిస్‌ను ఏలిక పాము అంటారు. ఇది మానవుడి పేగుల్లో నివసించే పరాన్నజీవి.
* ఏకలింగ జీవి. లైంగిక ద్విరూపకతను చూపుతుంది.
* దీని దేహం పొడవుగా, గుండ్రంగా, స్థూపాకారంగా ఇరువైపులా మొనదేలి ఉంటుంది.
* పూర్వాంతంలో నోరు, దాన్ని చుట్టి మూడు పెదవులు ఉంటాయి.
* పూర్వభాగంలో ఏంఫిడ్‌లు (రసాయన జ్ఞానాంగాలు), పరభాగంలో ఫాస్మిడ్‌లు (స్రావక, జ్ఞానాంగాలు) ఉంటాయి.
* ఉదర తలాన పూర్వభాగంలో విసర్జక రంధ్రం ఉంటుంది.

జీవిత చరిత్ర:
* ఆస్కారిస్ తన జీవితచరిత్రను ఒకే ఆతిథేయిలో పూర్తి చేసుకుంటుంది (మానవుడు).
* సంపర్కానంతరం స్త్రీ జీవి రోజుకు రెండు లక్షల వరకు గుడ్లు పెడుతుంది. గుడ్డును ఆవరించి ఉబ్బెత్తులతో కూడిన కర్పరం ఉంటుంది. అందువల్ల వీటిని మామిల్లేటెడ్ గుడ్లు అంటారు.
* గుడ్డులోని సంయుక్తబీజం రాబ్డిటి ఫార్మ్ డింభకం (మొదటి దశ లార్వా)గా మారుతుంది. అందువల్ల వీటిని ఎంబ్రియోనేటెడ్ గుడ్లు అంటారు.

* ఈ గుడ్లు మలం ద్వారా బయటకు వెళతాయి. మట్టిలో గుడ్డులోని లార్వా మొదటి నిర్మోచనం చెంది రెండో దశ లార్వాగా మారుతుంది.
* సాంక్రమిక ఆహారం, నీరు ద్వారా ఈ గుడ్లు మానవుడి పేగును చేరతాయి. అక్కడ గుడ్డు కర్పరం కరిగి లార్వా విడుదలవుతుంది.
* ఈ లార్వా మానవ దేహంలోని వివిధ అంగాల ద్వారా ప్రయాణించి తిరిగి పేగును చేరుతుంది. ఈ ప్రయాణాన్ని బాహ్యాంత్ర ప్రవాసం అంటారు.


 

బాహ్యాంత్ర ప్రవాస మార్గం:
      పేగు - రెండో దశ రాబ్డిటి ఫార్మ్ లార్వా - కాలేయ నిర్వాహక సిర - కాలేయం - కాలేయ సిరలు - పర మహాసిర - గుండె - పుపుస ధమనులు - ఊపిరితిత్తుల్లోని వాయుగోణులు - రెండో నిర్మోచనం - మూడోదశ లార్వా - మూడో నిర్మోచనం - నాల్గోదశ లార్వా - శ్వాసనాళాలు - వాయునాళం - కంఠబిలం - గొంతు - ఆహారవాహిక - జీర్ణాశయం - పేగు.
* పేగులో నాల్గో దశ లార్వా నాల్గో నిర్మోచనం చెంది స్త్రీ లేదా పురుష ఆస్కారిస్‌గా ఎదుగుతుంది.

 

రోగకారకత:
* ఆస్కారిస్ వల్ల ఆస్కారియాసిస్ వస్తుంది.
* సంక్రమణ తక్కువగా ఉంటే (తక్కువ ఏలిక పాములు) ఏ విధమైన రోగ లక్షణాలూ వ్యక్తం కావు.
* సంక్రమణ తీవ్రంగా ఉన్నప్పుడు (ఎక్కువ ఏలిక పాములు) కడుపు నొప్పి, బలహీనత; పిల్లల్లో పెరుగుదల లోపం కనిపిస్తుంది.

 

నియంత్రణ:
* మరుగుదొడ్ల వాడకం.
* తినే ముందు చేతులను శుభ్రంగా కడగడం.
* పండ్లు, కూరగాయలను కడిగిన తర్వాతే వాడుకోవడం.
* ఈగలు, ఇతర కీటకాలు వాలకుండా ఆహార పదార్థాలకు రక్షణ కల్పించడం.

ఉకరేరియా బాంక్రాఫ్టీ 

పరిచయం:
* ఉకరేరియా బాంక్రాఫ్టీని సాధారణంగా బోదపురుగు అంటారు.
* ఇది మానవుడిలో ఫైలేరియాసిస్ వ్యాధిని కలిగిస్తుంది.
* ఇది ఆడ క్యూలెక్స్ (దోమ) ద్వారా వ్యాప్తి చెందుతుందని సర్ పాట్రిక్ మాన్సన్ పేర్కొన్నాడు.      

 

నిర్మాణం/ బాహ్య లక్షణాలు:
* ఉకరేరియా బాంక్రాఫ్టీని సాధారణంగా బోద పురుగు అంటారు. ఇది మానవుడి శోషరస నాళాలు, శోషరస గ్రంథుల్లో పరాన్నజీవనం గడుపుతుంది.
* ఉకరేరియా ఏకలింగ జీవి. లైంగిక ద్విరూపకత చూపుతుంది.

* స్త్రీ, పురుష జీవుల పూర్వాంతంలో నోరు ఉంటుంది. పెదవులు ఉండవు. పూర్వాంతానికి దగ్గరగా విసర్జక రంధ్రం ఉంటుంది.
 

జీవిత చరిత్ర:
* ఉకరేరియాను సాధారణంగా బోద పురుగు అంటారు. ఇది మానవుడి శోషరస నాళాలు, శోషరస గ్రంథుల్లో పరాన్నజీవనం గడుపుతుంది.
* ఉకరేరియా ఏకలింగ జీవి. లైంగిక ద్విరూపకతను చూపుతుంది. జీవిత చరిత్రను పూర్తి చేసుకోవడానికి దీనికి రెండు ఆతిథేయిలు అవసరం. అవి: మానవుడు (ప్రాథమిక ఆతిథేయి), ఆడ క్యూలెక్స్ (మాథ్యమిక ఆతిథేయి)
* సంపర్కానంతరం స్త్రీ జీవి మైక్రోఫైలేరియాలను విడుదల చేస్తుంది. మైక్రోఫైలేరియాను ఆవరించి వదులైన తొడుగు ఉంటుంది. (ఉకరేరియాను అండ శిశూత్పాదక (ovoviviparous) జీవిగా పేర్కొంటారు).


 

* మైక్రోఫైలేరియాలు మానవుడి రక్తంలోకి ప్రవేశించి నిశాకాల ఆవర్తనాన్ని చూపుతాయి. (లార్వాలు రాత్రిపూట ఉపరితల రక్తనాళాల్లో సంచరిస్తూ, పగలు లోపలి రక్తనాళాల్లో ఉండటాన్ని నిశాకాల ఆవర్తనం అంటారు.)
* బోదవ్యాధి (ఫైలేరియాసిస్)తో బాధపడుతున్న వ్యక్తి రక్తాన్ని ఆడ క్యూలెక్స్ దోమ పీల్చుకున్నప్పుడు మైక్రోఫైలేరియాలు దోమ అన్నాశయాన్ని చేరతాయి. అక్కడ దాని తొడుగు కరిగిపోతుంది.
* లార్వా, దోమ అన్నాశయం గోడను చీల్చుకుని దాని వక్ష కండరాలను చేరి అక్కడ సాసేజ్ ఆకారాన్ని పొందుతుంది. (మొదటి దశ లార్వా). రెండు నిర్మోచనాల తర్వాత ఇది మూడో దశ లార్వాగా మారుతుంది. ఇప్పుడు లార్వా దోమ అధరాన్ని చేరుతుంది.
* ఈ దోమ మానవుడిని కుట్టినప్పుడు మూడోదశ లార్వా మానవ రక్తంలోకి ప్రవేశిస్తుంది. రక్తం నుంచి శోషరసంలోకి చేరి, మూడు, నాలుగు నిర్మోచనాలు చెంది ప్రౌఢజీవిగా మారుతుంది.
రోగ కారకత: ఉకరేరియా వల్ల మానవుడిలో బోదవ్యాధి వస్తుంది.
* సంక్రమణ తక్కువగా ఉన్నప్పుడు తలనొప్పి, మానసిక ఆందోళన లాంటి లక్షణాలతో ఫైలేరియల్ జ్వరం వస్తుంది.
* బోద పురుగు వల్ల శోషరస నాళాలు, శోషరస గ్రంథుల్లో నొప్పి, వాపు కలుగుతాయి. శోషరస నాళాల్లో ఈ లక్షణాలను లింఫాంజైటిస్ అనీ, శోషరస గ్రంథుల్లో లింఫాడెంటిస్ అని అంటారు.
* సంక్రమణ తీవ్రంగా ఉన్నప్పుడు చనిపోయిన బోద పురుగులు శోష రస ప్రవాహానికి అడ్డుపడటంతో అది కణజాలాల్లోకి చేరి వాపు వస్తుంది. దీన్ని లింఫెడిమా అంటారు. ఇది సాధారణంగా కాళ్లు, చేతుల చివరి భాగాలు, పురుషుల్లో ముష్కగోణులు, స్త్రీల్లో స్తనాల వద్ద కనిపిస్తుంది.

* ఈ కణజాలాల్లో ఫైబ్రోబ్లాస్ట్‌లు చేరి నార కణజాలాన్ని అభివృద్ధి చేస్తాయి. స్వేద గ్రంథులు క్షీణించిపోవడంతో చర్మం పొడిగా, గరుకుగా, పొలుసులు రేగినట్లు అవుతుంది. ఈ దశనే ఎలిఫెంటియాసిస్ అంటారు.
నియంత్రణ: ఫైలేరియాను నియంత్రించడానికి దోమల పెరుగుదలను అరికట్టాలి. దీనికోసం 
* మురుగు కాలువల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలి.
* నిల్వ ఉన్న మురుగు నీటిపై కిరోసిన్ చల్లితే అది నీటిపై పొరలా ఏర్పడుతుంది. దాంతో దోమ లార్వాలు, ప్యూపాల శ్వాసక్రియకు ఆటంకం కలిగి అవి చనిపోతాయి.
* దోమలు పెరిగే చోట డి.డి.టి., బి.హెచ్.సి. లాంటి కీటక నాశనులు చల్లాలి.

 

జీవ నియంత్రణ
* మురుగు కాలువల్లో దోమ లార్వాలను తినే గాంబూసియా చేపలను పెంచడం.
* యుట్రిక్యులేరియా లాంటి కీటకాహార మొక్కలను పెంచడం.

వైరల్ వ్యాధి

జలుబు:
* రైనో సమూహపు వైరస్ వల్ల జలుబు వస్తుంది. ఇవి శ్వాస మార్గానికి (ఊపిరితిత్తులకు కాదు) సంక్రమిస్తాయి.
* సాంక్రమిక వ్యక్తి విడుదల చేసే తుంపరులు పీల్చడం, అతడి వస్తువులు, దుస్తులు ఉపయోగించడం వల్ల ఈ వ్యాధి వస్తుంది.
* ముక్కు దిబ్బడ, ముక్కు నుంచి నీరు కారడం, అలసట, గొంతు గర గర లాంటివి ఈ వ్యాధి లక్షణాలు.
* సాధారణంగా జలుబు 3 - 7 రోజులు బాధిస్తుంది.
 

శిలీంధ్ర వ్యాధి

తామర (రింగ్ వర్మ్ వ్యాధి):
* మైక్రోస్పోరమ్, ట్రైకోఫైటాన్, ఎపిడెర్మోఫైటాన్ ప్రజాతులకు చెందిన చాలా రకాల శిలీంద్రాలు మానవుడిలో తామరను కలిగిస్తాయి. ఇది వెచ్చగా, తేమగా ఉండే చర్మ భాగాలపై పెరుగుతుంది.
* రోగి వాడిన తువ్వాళ్లు, దుస్తులు, దువ్వెనలు లాంటి వాటిని ఉపయోగించడం వల్ల ఇతరులకు సంక్రమిస్తుంది.
* చర్మం పై గుండ్రంగా, పొడిగా, పొలుసులు రేగుతూ ఉండే చర్మ ప్రాంతం, విపరీతమైన దురద ఈ వ్యాధి లక్షణాలు. చర్మం, గోళ్లు, తలలోని చర్మం మొదలైన భాగాలకు సోకుతుంది.

సూక్ష్మజీవుల వల్ల కలిగే వ్యాధుల నియంత్రణా విధానాలు:
1. బ్యాక్టీరియల్, వైరల్ వ్యాధులకు: సకాలంలో టీకాలు వేయించడం/ వేయించుకోవడం వల్ల ఈ వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు.
2. జీవ సాంకేతిక శాస్త్ర అభివృద్ధి వల్ల ప్రస్తుతం సురక్షితమైన కొత్తరకం టీకాలు అందుబాటులో ఉన్నాయి. ఇవి వ్యాధుల నియంత్రణలో ప్రముఖ పాత్ర వహిస్తాయి.
3. వైద్యుల పర్యవేక్షణలో యాంటీ బయోటిక్స్ వాడకం.

 

పొగాకు, మందులు (drugs), ఆల్కహాల్ వ్యసనం (TDA abuse)
పొగాకు: పొగాకును సిగరెట్లు, చుట్టలు, గుట్కాలు, ముక్కుపొడుం రూపాల్లో వినియోగిస్తారు. పొగ తాగడం వల్ల రక్తంలో కార్బన్‌మోనాక్సైడ్ స్థాయి పెరిగి ఆక్సిజన్ స్థాయి తగ్గుతుంది. అంతేకాకుండా పొగాకులోని నికోటిన్ అధివృక్క గ్రంథిని ఉత్తేజితం చేసి ఎడ్రినలిన్, నార్ఎడ్రినలిన్ ఉత్పత్తిని అధికం చేస్తుంది. ఫలితంగా హృదయ స్పందన వేగం పెరుగుతుంది. పొగతాగడం వల్ల బ్రాంకైటిస్, ఎంఫసీమా, హృదయ సంబంధ వ్యాధులు, జీర్ణాశయంలో అల్సర్లు ఏర్పడతాయి. గొంతు, ఊపిరితిత్తులు, మూత్రాశయాల్లో క్యాన్సర్ వచ్చే అవకాశాలు అధికమవుతాయి. పొగాకు నమలడం వల్ల నోటి క్యాన్సర్  వచ్చే ప్రమాదముంది.
మందులు (Drugs): ఒక వ్యక్తికి సోకిన వ్యాధికి చేసే చికిత్స, నియంత్రణల కోసం వినియోగించే రసాయ పదార్థాలను మందులు (ఔషధాలు - drugs) అంటారు. ఫలితంగా రోగికి వ్యాధి నయమై శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉంటూ మామూలు జీవితాన్ని గడపగలుగుతాడు. భ్రాంతిని కలిగించే కొన్ని రసాయనాలను కొన్ని రకాల మొక్కలు, పూలు, ఫలాల నుండి ఉత్పత్తిచేస్తారు.

      ఈ మందులను వైద్యుల ప్రమేయం లేకుండా అధిక పరిమాణాల్లో తీసుకోవడం వల్ల శారీరకంగా, మానసికంగా ఇబ్బందులు ఉత్పన్నమవుతాయి. ఈ మందుల దుర్వినియోగాన్నే డ్రగ్ ఎబ్యూజ్ అంటారు. ఈ మందులు చాలావరకు పుష్పించే మొక్కలు, కొద్ది రకాల శిలీంధ్రాల నుంచి ఉత్పత్తి అవుతాయి.
1. ఒపియాయిడ్‌లు: ఇవి నల్లమందు మొక్కగా పేర్కొనే పపావర్ సోమ్నిఫెరమ్ అనే మొక్క నుంచి లభిస్తాయి. ఇవి కేంద్ర నాడీవ్యవస్థ, జఠరాంత్రనాళంలోని ఓపియాయిడ్ గ్రాహకాలతో అనుసంధానం చెంది ప్రభావాన్ని చూపుతాయి. ఒపియాయిడ్‌లలో ముఖ్యమైనవి మార్ఫిన్, హెరాయిన్.
మార్ఫిన్: నల్లమందు మొక్క యొక్క పరిపక్వం చెందని గింజ గుళిక పాలను (లేటెక్స్) ఎండబెట్టి తయారు చేస్తారు. ఇది వర్ణరహితమైన స్ఫటికాలు లేదా తెల్లటి స్ఫటిక పొడి రూపంలో ఉంటుంది. ఇది అధిక ప్రభావం ఉండే మత్తు మందుగా, నొప్పి నివారిణిగా పనిచేస్తుంది. శస్త్ర చికిత్స చేసే రోగులకు ఇది బాగా ఉపయోగపడుతుంది.
హెరాయిన్: మార్ఫిన్‌ను ఎసిటైలేషన్ జరిపి దీన్ని తయారు చేస్తారు. రసాయనికంగా ఇది డైఎసిటైల్ మార్ఫిన్. సాధారణంగా స్మాక్ అంటారు. ఇది డిప్రెసెంట్‌గా పనిచేస్తూ, దేహ క్రియలను నెమ్మదింపజేస్తుంది. దీన్ని బలంగా పీల్చడం ద్వారా, లేదా ఇంజక్షన్ గా తీసుకుంటారు.

2. కన్నాబినాయిడ్స్: గంజాయి మొక్క కన్నాబిస్ సెటైవా నుంచి లభించే రసాయన పదార్థాలు. ఇవి మానవుడి మెదడులోని కన్నాబినాయిడ్ గ్రాహకాలతో అనుసంధానం చెందుతాయి. ఈ మొక్క పూలకొనలు, ఆకులు, జిగురు నుంచి మార్జువానా, హాషిస్, చరస్, గంజా లాంటి పదార్థాలను ఉత్పత్తి చేస్తారు. ప్రస్తుత కాలంలో కొందరు క్రీడాకారులు కన్నాబినాయిడ్‌లను దుర్వినియోగం చేయడం చూస్తూనే ఉన్నాం (డోపింగ్). ఇవి గుండె, రక్త ప్రసరణపై ప్రభావాన్ని చూపుతాయి. వీటిని పీల్చడం ద్వారా లేదా నోటి ద్వారా తీసుకుంటారు.

3. కోకా ఆల్కలాయిడ్ లేదా కొకైన్: ఇది దక్షిణ అమెరికాకు చెందిన కోకాగా పిలిచే ఎరిత్రోజైలమ్ కోకా అనే మొక్క ఆకుల నుంచి లభించే తెల్లటి, స్ఫటిక రూప ఆల్కలాయిడ్. దీన్ని సాధారణంగా కోక్ అనీ, క్రాక్ అనీ అంటారు. ఇది మానవ నాడీ వ్యవస్థలోని ప్రసారక పదార్థం అయిన డోపమైన్ రవాణాలో ఆటంకం కలిగిస్తుంది. అందువల్ల ఉల్లాసంగా, శక్తిమంతంగా ఉన్నట్లు అనిపిస్తుంది. అధికంగా వాడితే భ్రాంతికి దారితీస్తుంది. దీన్ని సాధారణంగా ముక్కు ద్వారా పీలుస్తారు.
ఇతర మొక్కలు: కొన్ని రకాల మొక్కలు భ్రాంతిని కలిగించే లక్షణాలున్న పదార్థాలను ఉత్పత్తి చేస్తాయి.
ఉదా: ఏట్రోపా బెల్లడోనా, దతురా
4. ఇతర ఔషధాలు:
    ఎ. బార్బిట్యురైట్‌లు  -  నిద్రమాత్రలు
   బి. ఏంఫీటమైన్‌లు  -  నిద్రపట్టకుండా చేసే మందులు
   సి. బెంజోడైజీపైన్‌లు   -  ట్రాంక్విలైజర్లు
   డి. లైసర్జిక్ యాసిడ్ డై ఇథైల్ ఎమైడ్   -  LSD
       పైన పేర్కొన్న ఔషధాలు కుంగుబాటు (depression), నిద్రలేమి (insomnia) లాంటి వ్యాధులతో బాధపడే వ్యక్తులకు వైద్యులు వినియోగిస్తారు.
ఆల్కహాల్: ఇథైల్ ఆల్కహాల్‌ను వివిధ పరిమాణాల్లో వివిధ రకాల పదార్థాలతో కలిపి తీసుకుంటారు. దీన్ని ద్రాక్ష, బార్లీ లాంటి వాటిని పులియబెట్టడం ద్వారా తయారు చేస్తారు.

వ్యసనం, ఆధారపడటం:
TDA దుర్వినియోగం వ్యసనం, ఆధారపడటానికి దారితీస్తుంది.
వ్యసనం: ఇది మానసిక ఉల్లాస స్థితిని కలిగిస్తుంది. తనలోని వ్యసన ప్రవృత్తే TDA వినియోగానికి కారణమని ఎవరూ గుర్తించలేరు. వీటిని వినియోగించడం ప్రారంభం కాగానే క్రమంగా వ్యసనంగా మారుతుంది. అందువల్ల ఈ విష వలయంలోకి ప్రవేశించిన వారు బయటకు రాలేరు.
ఆధారపడటం: రోజు వారీ సేవించే TDAని మానివేస్తే శారీరకంగా, మానసికంగా కలిగే అసంతృప్తి లక్షణాలే ఆధారపడటం లేదా ఉపసంహరణ సిండ్రోమ్.ఆందోళన, వణుకు, వికారం, చెమట పట్టడం మొదలైనవి ఉపసంహరణ సిండ్రోమ్ లక్షణాలు. రోజువారీ వినియోగించే TDA తీసుకుంటే ఆ లక్షణాలు మాయమవుతాయి. ఆధారపడటం వల్ల వ్యసనపరులు సామాజిక కట్టుబాట్లకు లోనై ఉండరు.

Posted Date : 30-07-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని

విద్యా ఉద్యోగ సమాచారం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌