• facebook
  • twitter
  • whatsapp
  • telegram

మానవ సంక్షేమంలో జీవశాస్త్రం

ప్రశ్న‌లు - జ‌వాబులు

2 మార్కుల ప్రశ్నలు
1. పరాన్నజీవ కాస్ట్రేషన్‌ అంటే ఏమిటి? ఉదాహరణ రాయండి.
జ: కొన్ని పరాన్నజీవులు, వాటి ఆతిథేయి బీజకోశాలను నాశనం చేసి వంధ్య జీవులుగా మారుస్తాయి. దీన్నే పరాన్నజీవ కాస్ట్రేషన్‌ అంటారు.
ఉదా: సాక్యులైనా తన ఆతిథేయి కార్సినస్‌ అనే పీతలో బీజకోశాలను నాశనం చేస్తుంది.

 

2. నియోప్లాసియాను నిర్వచించి ఒక ఉదాహరణ రాయండి.
జ: కొన్ని పరాన్నజీవులు ఆతిథేయి కణజాలంలో కణాల సంఖ్యను పెంచి కొత్త నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. దీన్నే నియోప్లాసియా అంటారు.
ఉదా: కొన్ని వైరస్‌లు

 

3. ఎంటమీబా హిస్టోలిటికా అవికల్పిక అవాయు పరాన్నజీవి అని ఎలా చెప్పగలరు?
జ: ఎంటమీబా హిస్టోలిటికా ఆతిథేయి దేహంలో అవాయు శ్వాసక్రియ ద్వారా జీవనం సాగిస్తుంది.

 

4. అధిపరాన్నజీవి అంటే ఏమిటి? ఒక ఉదాహరణ రాయండి.
జ: ఒక పరాన్నజీవి లోపల లేదా పైన జీవించే మరొక పరాన్నజీవిని అధిపరాన్నజీవి అంటారు.
ఉదా: స్ఫీరోస్పొరా పాలిమార్ఫా అనే పరాన్నజీవి దేహంలో నొసిమా నోటాబిలిస్‌ అనే పరాన్నజీవి అధిపరాన్నజీవిగా జీవిస్తుంది.

5. ఒక వ్యక్తి పేగులో క్రమరహితం, ఉదర నొప్పి, మలంలో రక్తం, శ్లేష్మం ఉన్నాయి. ఈ లక్షణాల ఆధారంగా జీవి పేరు, వ్యాధిని తెలపండి.
జ: వ్యాధి - అమీబిక్‌ డీసెంట్రీ లేదా అమీబియాసిస్, వ్యాధి జనక జీవి - ఎంటమీబా హిస్టోలైటికా.

 

6. ప్రీపేటెంట్‌ కాలాన్ని నిర్వచించండి. దీనికి ప్లాస్మోడియం వైవాక్స్‌ జీవితచక్రంలో ఎంతకాలం ఉంటుంది?
జ: ప్లాస్మోడియం మొదట స్పోరోజాయిట్‌ రూపంలో మానవుడి రక్తంలో ప్రవేశించినప్పటి నుంచి రెండోసారి క్రిప్టోజాయిట్లు రక్తంలో చేరే వరకు పట్టిన కాలాన్ని ప్రీపేటెంట్‌ కాలం అంటారు. దీనికి ఎనిమిది రోజులు పడుతుంది.

 

7. పొదిగే కాలాన్ని నిర్వచించండి. ప్లాస్మోడియం వైవాక్స్‌ జీవితచక్రంలో ఇది ఎంతకాలం ఉంటుంది?
జ: స్ఫోరోజాయిట్లు దేహంలో ప్రవేశించినప్పటి నుంచి మొదట, మలేరియా లక్షణాలు జ్వరం వచ్చే వరకు పట్టే కాలాన్ని పొదిగే కాలం అంటారు. ఇది దాదాపు 10 నుంచి 14 రోజుల్లో పూర్తవుతుంది.

 

8. హీమోజాయిన్‌ రేణువులు అంటే ఏమిటి? వాటి ప్రాముఖ్యతను తెలపండి.
జ: మలేరియా పరాన్నజీవి RBC లోని హీమోగ్లోబిన్‌ యొక్క హీమ్‌ భాగాన్ని వదిలి, గ్లోబిన్‌ను ఆహారంగా తీసుకుంటుంది. ఈ హీమ్‌ హీమోజాయిన్‌ రేణువులుగా మారతాయి.

 

9. కశాభ నిర్మోచనం అంటే ఏమిటి? దీనివల్ల ఏర్పడేవి ఏవి?
జ: ప్లాస్మోడియం బీజ కణోత్పత్తిలో పురుష సంయోగ బీజాలు విసిరిన కొరడా మాదిరి కదలికలను చూపుతూ జీవపదార్థం నుంచి విడుదలవుతాయి. ఈ విధంగా పురుష సంయోగ బీజాలు విడుదల కావడాన్ని కశాభ నిర్మోచనం అంటారు.

10. ఆస్కారిస్‌ గుడ్లను ‘మామ్మిల్లేటెడ్‌ గుడ్లు’ అని ఎందుకు అంటారు?
జ:  ప్రతి గుడ్డుకు ఉపరితలంలో బుడిపెలుగా ఏర్పడిన ప్రొటీన్‌ పొర ఉంటుంది. అందువల్ల ఆస్కారిస్‌ గుడ్లను మామ్మిల్లేటెడ్‌ గుడ్లు అంటారు.

 

11. మీరు చదివిన నిమటోడా పరాన్నజీవి జీవితచక్రంలో ‘నిశా కాలగమనం’ అంటే ఏమిటి?
జ: ఉకరేరియా బ్రాంకాఫ్టి డింభకం మైక్రో ఫైలేరియా మానవుడి పరిధీయ రక్త ప్రవాహంలో రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజాము 4 గంటల వరకు చలించడాన్ని నిశా కాలగమనం అంటారు.

 

12. లింఫాడినైటిస్, లింఫాంజైటిస్‌ మధ్య భేదాన్ని తెలపండి.
జ: ఉకరేరియా వల్ల మానవుడి శోషరస నాళాల్లో కలిగే వాపును లింఫాంజైటిస్‌ అంటారు. శోషరస గ్రంథుల్లో కలిగే వాపును లింఫాడినైటిస్‌ అంటారు.

 

13. పొగాకు ఏవిధంగా శ్వాసక్రియను ప్రభావితం చేస్తుంది. దీనిలోని ఆల్కలాయిడ్‌ ఏది?
జ: పొగాకు వల్ల శ్వాసకోశ, నోటి సంబంధిత వ్యాధులు వస్తాయి. పొగలో ఉండే కార్బన్‌ మోనాక్సైడ్‌ హీమోగ్లోబిన్‌ యొక్క ఆక్సిజన్‌ రవాణా సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. దీనిలో ఉండే ఆల్కలాయిడ్‌ నికోటిన్‌.

 

14. కోక్, స్మాక్‌ దేని నుంచి లభిస్తాయి.
జ: ఎరిత్రోజైలం కోకా ఆకుల నుంచి వెలువడే తెల్లటి ఆల్కలాయిడ్‌ ను కోక్‌ అంటారు. మార్ఫిన్‌ను ఎసిటైలేషన్‌ చేయడం ద్వారా ఏర్పడే హెరాయిన్‌ను స్మాక్‌ అంటారు.

 

4 మార్కుల ప్రశ్నలు
1. పరాన్నజీవుల్లో ప్రత్యేక అనుకూలనాల అభివృద్ధి అవసరం ఏమిటి? లేదా పరాన్నజీవుల్లో ఏర్పడిన కొన్ని ప్రత్యేక అనుకూలనాలను తెలపండి.
జ: * ఆతిథేయిలో విజయవంతమైన జీవనం కొనసాగించడానికి అనువుగా పరాన్నజీవులు ప్రత్యేక అనుకూలనాలను ఏర్పరచుకుంటాయి.
* ఆతిథేయి పేగు గోడలను అంటిపెట్టుకొని ఉండేందుకు చూషకాలు, కొక్కేలు, లఘుత్రోటి కలిగి వుంటాయి. ఉదా: టీనియా సొలియమ్‌.
* జీర్ణక్రియ ఎంజైమ్‌ల ప్రభావం నుంచి రక్షించుకోవడానికి అవభాసినిని కలిగి ఉంటాయి.
ఉదా: ఆస్కారిస్‌ లుంబ్రికాయిడిస్‌ 
* ఆతిథేయి దేహంలో తగినంత ఆక్సిజన్‌ లభ్యం కానప్పుడు అవాయు శ్వాసక్రియను జరుపుకొని జీవనం సాగిస్తాయి.
ఉదా: ఎంటమీబా
* ఆతిథేయి స్రవించే జీర్ణక్రియ ఎంజైమ్‌లను తటస్థీకరించడానికి యాంటీ ఎంజైమ్‌లను ఉత్పత్తి చేస్తాయి.
ఉదా: టీనియా సొలియమ్‌
* ప్రత్యుత్పత్తి వ్యవస్థ బాగా అభివృద్ధి చెంది ఉంటుంది.
ఉదా: ఆస్కారిస్‌- 2,00,000 గుడ్డు/రోజుకు
* క్లిష్ట‌మైన జీవిత చ‌క్రం ఉంటుంది.
ఉదా: ఫాసియోలా.
* ప్ర‌తికూల ప‌రిస్థి‌తుల్లో కోశీభ‌వ‌నం చెందుతాయి.
* ప్ర‌తిజ‌న‌కాలను త‌ర‌చూ మారుస్తాయి.
ఉదా: ప‌్లాస్మోడియం.

2. పొగాకు వల్ల జరిగే దుష్పరిణామాలను తెలపండి.
జ:  పొగ‌లోని CO, RBC లోని H6 తో క‌లిసి H6 యొక్క O2 ర‌వాణా సామ‌ర్థ్యాన్ని త‌గ్గించును. పొగాకును గుట్కా రూపంలో తాగడం, నమలడం, నశ్యం రూపంలో పీల్చడం వల్ల అనేక దుష్పరిణామాలు కలుగుతాయి. పొగాకులో నికోటిన్‌ అనే ఆల్కలాయిడ్‌ ఉంటుంది. ఇది హీమోగ్లోబిన్‌ యొక్క ఆక్సిజన్‌ రవాణా సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. నికోటిన్‌ ఎడ్రినల్‌ గ్రంథిని ప్రేరేపించి ఎడ్రినలిన్, నార్‌ ఎడ్రినలిన్‌ను రక్తంలోకి విడుదల చేస్తుంది. ఈ హార్మోన్లు రక్తపీడనాన్ని, గుండె కొట్టుకునే వేగాన్ని పెంచుతాయి. పొగ తాగడం వల్ల బ్రాంకైటిస్, ఎంపైసీమా, కరోనరీ గుండె వ్యాధి, జఠరంలో పుండ్లు, గొంతు, ఊపిరితిత్తులు, మూత్రాశయం క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఎక్కువ.

3. వ్యసనం, ఆధారం మధ్య భేదాలను తెలపండి.

జ: వ్యసనం: TDAల‌ను ఒక్క‌సారి తీసుకున్నా అది వ్య‌స‌నానికి దారి తీయ‌వ‌చ్చు.ఇది మానసిక ఉల్లాసస్థితితో కూడిన బంధం. TDA లను తరచూ వినియోగించడం వల్ల శరీరంలో గ్రాహకాల సహనస్థాయి పెరుగుతుంది. దీనివల్ల గ్రాహకాలు ఎక్కువ మోతాదుకు స్పందిస్తాయి. దీనితో TDA లను ఎక్కువ తీసుకోవడం వల్ల వ్యసనపరులు అవుతారు.
ఆధారపడటం: ఇది క్రమం తప్పని మోతాదులో మత్తుమందులు లేదా ఆల్కహాల్‌ వినియోగాన్ని ఒకేసారి మానివేయడం వల్ల శరీరంలో కనిపించే అసంతృప్తి లక్షణం లేదా ఉపసంహరణ సిండ్రోమ్‌. ఈ సిండ్రోమ్‌లో ఆందోళన, వణకడం, వికారం, చెమట పట్టడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. TDA లను మళ్లీ వాడటం మొదలుపెడితే ఇవి కనిపించవు.

4. TDA దుర్వినియోగాన్ని దృష్టిలో ఉంచుకొని ‘వ్యాధి చికిత్స కంటే నివారణ మంచిది’ అని నిరూపించండి.
జ: కింది అంశాలు యువతను TDA దుర్వినియోగం నుంచి కాపాడతాయి. 
* తల్లిదండ్రులు యువతను అనవసర ఒత్తిడికి గురి చేయవద్దు.
* తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు బాధ్యతగా వ్యవహరించాలి. 
* వ్యసనాల బారిన పడకుండా తోటివారు సహాయం చేయాలి.
* విద్యను అందించడంతో పాటు హితబోధ చేయాలి.
* తగిన వైద్య సహాయాన్ని అందించాలి.

Posted Date : 30-07-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని

విద్యా ఉద్యోగ సమాచారం

మరిన్ని
 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌