• facebook
  • twitter
  • whatsapp
  • telegram

జంతు వైవిధ్యం - I 

రెండు మార్కుల ప్రశ్నలు

1. స్పంజికల కుల్యా వ్యవస్థ విధులేవి?

జ: ఆహార సముపార్జనలో, శ్వాసక్రియలో, విసర్జనలో తోడ్పడుతుంది.

2. నిడేరియన్లలోని రెండు ముఖ్యమైన దేహరూపాలు ఏవి? వాటి ప్రధాన విధులు తెలపండి.

జ: పాలిప్‌ - పాలిప్‌ రూపం అలైంగిక పద్ధతిలో మెడ్యుసాను ఏర్పరుస్తాయి.

మెడ్యుసా - మెడ్యుసాలు లైంగిక పద్ధతిలో పాలిప్‌ను ఏర్పరుస్తాయి.

3. మెటాజెనిసిస్‌ అంటే ఏమిటి? ఏ వర్గానికి చెందిన జంతువులు దీన్ని ప్రదర్శిస్తాయి?

జ: నిడేరియా జీవుల్లో పాలిప్‌ రూపం అలైంగిక పద్ధతిలో మెడ్యుసాలను, మెడ్యుసాలు లైంగిక పద్ధతిలో పాలిప్‌ రూపాలను ఏర్పరిచే దృగ్విషయం.

4. ఆంఫిడ్‌లు, ఫాస్మిడ్‌ల మధ్య భేదాన్ని తెలపండి.

జ: నిమటోడ్‌ ముఖ భాగంలో ఉండే రసాయనిక గ్రాహకాలు - ఆంఫిడ్‌లు

నిమటోడ్‌ పరాంతంలో ఉండే గ్రంథి జ్ఞాన నిర్మాణాలు - ఫాస్మిడ్‌లు

5. బొట్రాయిడల్‌ కణజాలం అంటే ఏమిటి?

జ: హైరుడినేరియా జీవుల శరీర కుహరం ద్రాక్ష గుత్తులను పోలి ఉండే కణజాలాన్ని కలిగి ఉంటుంది.

    ఇది విసర్జన, రక్తనాళాల పునర్నిర్మాణంలో తోడ్పడుతుంది.

6. తేళ్లలోని మొదటి, రెండో జత శిరోః ఉపాంగాలను ఏమంటారు?

జ: ఒక జత పెడిపాల్ప్‌లు, ఒక జత కెలిసెరాలు.

7. లిమ్యులస్, పేలామ్నియస్‌లలో వాటి శ్వాస నిర్మాణాలను పేర్కొనండి.

జ: లిమ్యులస్‌ శ్వాసాంగాలు - పుస్తకాకార మొప్పలు 

    పేలామ్నియస్‌ శ్వాసాంగాలు - పుస్తకాకార ఊపిరితిత్తులు (తేలు)

8. మీరు చదివిన ఏ ఆర్థ్రోపోడ్‌ను సజీవ శిలాజం అంటారు? దాని శ్వాసాంగాలను పేర్కొనండి.

జ: లిమ్యులస్‌ను (రాచపీత) సజీవ శిలాజం అంటారు. వీటి శ్వాసాంగాలు పుస్తకాకార మొప్పలు.

9. రాడ్యులా విధి ఏమిటి? రాడ్యులా లేని మలస్కా జీవుల సముదాయం పేరు తెలపండి.

జ: మలస్కా జీవుల అస్యకుహరంలో ఉండే ఆకురాయి లాంటి నిర్మాణమే రాడ్యులా. నమలడం దీని విధి. పెలిసిపోడా జీవుల్లో ఉండదు.

10. మలస్కా జీవుల మొప్పకు వేరొక పేరేమిటి? ఓస్ప్రేడియం విధి ఏమిటి?

జ: టినిడియా (లేదా) కంకాభాగాలు అంటారు. ఓస్ప్రేడియం - నీటి స్వచ్ఛతను పరీక్షిస్తుంది.

11. అరిస్టాటిల్‌ లాంతరు అంటే ఏమిటి? దీన్ని కలిగి ఉండే ఒక జంతువును పేర్కొనండి.

జ: సీ అర్చిన్‌ జీవి నోటిలో ఉండే అయిదు దవడల నమిలే నిర్మాణం. ఉదా: ఎఖైనస్‌

12. సౌష్టవపరంగా ఇకైనోడర్మ్‌ జువెనైల్, ప్రౌఢ జీవుల మధ్య ప్రధాన భేదం ఏమిటి?

జ: ప్రౌఢ జీవుల్లో పంచ వికిరణ వలయ సౌష్టవం ఉంటుంది.

   డింభకాల్లో ద్విపార్శ్వ సౌష్టవం ఉంటుంది.

13. ఫెరిటిమాలో రక్త గ్రంథులు అంటే ఏమిటి?

జ: ఫెరిటిమా 4, 5, 6 ఖండితాల్లో రక్త గ్రంథులు ఉంటాయి. ఇది రక్త కణాలను, ప్లాస్మాలో కరిగి ఉండే హీమోగ్లోబిన్‌ను ఉత్పత్తి చేస్తాయి.

నాలుగు మార్కుల ప్రశ్నలు

1. ఆంథోజోవన్‌ల ముఖ్య లక్షణాలపై లఘుటీక రాయండి.

జ: వీటిని సీఅనిమోన్‌లు అంటారు. ఇవి స్థానబద్ధ జీవులు. పాలిప్‌ రూపం మాత్రమే ఉంటుంది. సీలెంటరాన్‌ అనేక గదులతో ఆయుత విభాజకాలుగా విభక్తమై ఉంటుంది. వీటిని మీసెంటరీలు అంటారు. మధ్య శ్లేష్మ స్తరం సంయోజక కణజాలాన్ని కలిగి ఉంటుంది. దంశ కణాలు బాహ్య చర్మం, అంతఃచర్మంలో ఉంటాయి. బీజకణాలు అంతఃచర్మం నుంచి ఏర్పడతాయి.

ఉదా: ఎడామ్సియా (సీఎనిమోన్‌)

పెన్నాట్యూలా (స‌ముద్ర‌క‌లం)

గార్గోనియా (స‌ముద్ర‌పు విస‌న‌క‌ర్ర‌)

2. పాలికీట్‌లు ప్రదర్శించే ముఖ్య లక్షణాలు ఏమిటి?

జ: * పాలికీటా జీవులు సముద్ర జీవులు. వీటిని బ్రిసిల్‌ పురుగులు అంటారు. ఇవి బొరియల్లో లేదా నాళాల్లో జీవిస్తాయి. వీటి తల నిర్దిష్టంగా ఉంటుంది. పార్శ్వ పాదాలు అనేక శూకాలను కలిగి ఉంటాయి. వీటికి క్లైటెల్లం ఉండదు. ఇవి ఏక లైంగికాలు. అభివృద్ధిలో ట్రోకోఫోర్‌ డింభకం ఉంటుంది. బీజ‌వాహిక‌లుండ‌వు

ఉదా: నీరిస్‌ (ఇసుక‌పురుగు\రాగ్‌వార్మ్‌)

ఎప్రోడైట్ (స‌ముద్ర చుంచెలుక‌)

ఆరెనికోల (ల‌గ్‌వార్మ్‌)

3. క్రస్టేషియన్ల ప్రధాన లక్షణాలు ఏమిటి?

జ: * క్రస్టేషియన్లు జలచర జీవులు. 

* వీటిలో తల, ఉరం కలిసి శిరోవక్షం ఏర్పడుతుంది. 

* వీటి బాహ్య కవచం CaCO3 తో  నిర్మితమై ఉంటుంది.

* శిరోభాగం రెండు జతల స్పర్శ శృంగాలు, ఒక జత హనువులు, రెండు జతల జంభికలు కలిగి ఉంటుంది. 

* శ్వాసాంగాలు మొప్పలు, విసర్జకాంగాలు హరిత గ్రంథులు.                                                               

 * పరోక్ష పిండాభివృద్ధి జరిగి వివిధ రకాల డింభకాలు ఏర్పడతాయి.                                                        

  * స్ప‌ర్షశృంగాలు, సంయుక్త నేత్రాలు, సంతుల‌న కోశాలు అనే జ్ఞానాంగాలు ఉంటాయి. 

ఉదా: పాలిమాన్ (మంచినీటి రొయ్య‌)

కాన్స‌ర్ (పీత‌)

ఆస్టాక‌స్ (క్రే చేప).

4. అరాక్నిడా సాధారణ లక్షణాలు రాయండి. 

జ: * ఇవి భూచరాలు. 

* ప్రోసోమాలో ఒక జత కెలిసెరాలు, ఒక జత పెడిపాల్ప్‌లు, నాలుగు జతల కాళ్లు ఉంటాయి. 

* పుస్తకాకార ఊపిరితిత్తులు శ్వాసాంగాలు                                                       

* మీసోసోమాలోని ఉపాంగాలు పుస్త‌కాకార ఊపిరితిత్తులుగా రూపాంత‌రం చెంది ఉంటాయి.

* హీమోసయనిన్‌ శ్వాసవర్ణకం 

* కోక్సల్‌ గ్రంథులు విసర్జకాంగాలు 

* ప్రత్యక్ష పిండాభివృద్ధి జరుగుతుంది 

* తేళ్లు శిశూత్పాదకాలు  

ఉదా: పేలామ్నియ‌స్- తేలు 

ఎరానియా- సాలీడు

సార్కొప్టెస్- దుర‌దమైట్‌.

5. ఎకినాయిడ్‌ల ప్రధాన లక్షణాలు పేర్కొనండి.

జ: * వీటిలో సీ అర్చిన్‌లు, హార్ట్‌ అర్చిన్‌లు మొదలైనవాటిని చేర్చారు.                                                     

* దేహాన్ని క‌ప్పి క‌దిలే కంట‌కాలుంటాయి.

* బాహువులు ఉండవు. 

* నాళికా పాదాలకు చూషకాలు ఉంటాయి. 

* రంధ్ర ఫలకం, పాయువు ప్రతి ముఖతలంలో ఉంటాయి. 

* అంబులేక్రల్‌ గాడులు మూసుకుని ఉంటాయి. 

* పెడిసిల్లేరియాలకు మూడు దవడలుంటాయి. 

* హార్ట్ ఆర్బిన్‌లో ఉండ‌దు. అభివృద్ధిలో ఎకైనోప్లూటియ‌స్ డింభ‌కం ఉంటుంది. 

* అరిస్టాటిల్‌ లాంతరు అనే ప్రత్యేక నిర్మాణం ఉంటుంది.

ఉదా: ఎకైన‌స్‌- సీ ఆర్చిన్‌

ఎకైనోకార్డియం- హార్ట్ ఆర్చిన్‌ 

ఎకైనోడిస్క‌స్- సాండ్ డాల‌ర్‌.

6. ఫెరిటిమాలో ఎన్ని రకాల వృక్కాలు ఉన్నాయి? వాటిని వివరించండి.

జ: మూడు రకాల వృక్కాలు ఉంటాయి. అవి: 

1) విభాజకాయుత వృక్కాలు    

 2) త్వచ వృక్కాలు

3) గ్రసనీ వృక్కాలు.

విభాజకాయుత వృక్కాలు: ఇది ఖండితాంతర విభాజకాపటలానికి ఇరువైపులా 15/16 ఖండితాల నుంచి చివరి వరకు ఉంటాయి. ఇవి పేగులోకి తెరుచుకుంటాయి.                                                                               

త్వచ వృక్కాలు: ఇవి మూడో ఖండితం నుంచి చివరి ఖండితం వరకు శరీర కుడ్యం లోపలి తలంలో అతుక్కొని ఉంటాయి. ఇవి వృక్క రంధ్రాల ద్వారా శరీర ఉపరితలం మీద వెలుపలికి తెరుచుకుంటాయి.

గ్రసనీ వృక్కాలు: ఇవి 4, 5, 6వ ఖండితాల్లో మూడు జతల గుచ్చాల మాదిరి ఉంటాయి. ఆంత్రంలోకి తెరుచుకుంటాయి.          

* వృక్క‌ముఖాలు క‌లిగిన వాటిని వివృత (విభాజ‌క‌) వృక్కాల‌ని, వృక్క‌ముఖాలు లేనివి సంవృత (గ్ర‌స‌నీ, త్వ‌చ‌) వృక్కాల‌ని అంటారు.

* వృక్క రంధ్రాలు దేహం బ‌య‌టికి  తెరుచుకుంటే బాహ్యవృక్కాల‌ని, పేగులోకి తెరుచుకుంటే ఆంత్ర వృక్కాలని అంటారు.

                                 వాన‌పాము- వృక్క వ్య‌వ‌స్థ‌

Posted Date : 06-04-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని

విద్యా ఉద్యోగ సమాచారం

మరిన్ని
 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌