• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ధ‌ర్మ‌ప‌రీక్ష‌

8 మార్కుల ప్రశ్నలు    

శా. తోడంబుట్టవులందఱుం బడిన యా దుఃఖంబు చిత్తంబు సం

    పీడం బెట్టెడు సౌకుమార్యవతి డప్పిం గూలెఁ బాంచాలి వా

    ర్దోడై వచ్చిరి వారు లేక యిట మీతో రాను వారెల్లా నా

    తోడం గూడఁగ వచ్చునట్లుగఁ గృపాధుర్యాత్మ కావింపవే

భావం: దయతో బరువెక్కిన మనసు గల ఓ మహేంద్రా! నా తమ్ములందరూ చనిపోయారు. ఆ దుఃఖం నా మనసును మిక్కిలి బాధిస్తోంది. సుకుమారవతి అయిన ద్రౌపది దాహంతో నేలపై పడి చనిపోయింది. వారంతా ఈ మహాప్రస్థాన ప్రయాణంలో నాకు తోడుగా బయలుదేరి వచ్చినవారు. వారులేకుండా నేను ఒక్కడినే ఇప్పుడు మీతో స్వర్గానికి రాను.


చ.  జనులు నుతింపఁగా సుకృత సంపదఁజేసి యమర్త్య భావముం

     గనియును జెందకిట్లునికి కార్యమె ద్రౌపది భీమసేను న

     ర్జునుఁ గవలం ద్యజించుటకు సువ్రత చాలితి చాల వయ్యే దీ

     శునకము విద్వ నెత్తెఱఁగు సూరి సుతుండగు నీకు నర్హమే

భావం: ఓ పుణ్యాత్ముడా! ప్రజలందరూ ప్రశంసించగా నీ పుణ్య సంపద వల్ల దివ్యత్వాన్ని దర్శించి కూడా దాన్ని పొందకుండా ఉండటం తగిన పని కాదు. ద్రౌపది, భీముడు, అర్జునుడు, నకుల సహదేవులను వదిలి వేయడానికి నీవు అంగీకరించావు.  కానీ ఈ కుక్కను విడిచిపెట్టడానికి సిద్ధపడటం లేదు. పండితుల చేత ప్రశంసించబడే నీకు ఈ పద్ధతి తగినదేనా? (కాదు)

6 మార్కుల ప్రశ్నలు

1.  ద్రౌపది, పాండవుల పతనానికి కారణాలు వివరించండి. 

జ: ధర్మరాజు మహాప్రస్థానానికి బయలుదేరాడు. ఆయన వెంట భీమార్జున, నకుల సహదేవులు, ద్రౌపది కూడా ప్రయాణమయ్యారు. ధర్మరాజు వెంట ఒక కుక్క కూడా వెళ్లింది. మొదట మార్గమధ్యంలో ద్రౌపది నేలపై పడి మరణించింది. భీముడు  ధర్మరాజును తమ సోదరుల పతనానికి కారణాలు అడిగాడు. అప్పుడు ధర్మరాజు ఈ విధంగా వారి పతనానికి కారణాలు వివరించాడు.

ద్రౌపది పతనం: ద్రౌపదికి అయిదుగురు భర్తలు. అయినా ద్రౌపది అర్జునుడి విషయంలో పక్షపాతం కలిగి ఉండేది. అందువల్లే ఆమె చేసుకున్న పుణ్యాలు ఫలించక అలాంటి దురవస్థ కలిగి దారిలో మరణించింది.    

సహదేవుడి పతనం: సహదేవుడు లోకంలో తన కంటే గొప్ప పండితుడు ఎవరూ లేరని మనసులో తలచుకుంటూ గర్వపడేవాడు. ఆ విధంగా సహదేవుడు తన విద్యా సంబంధమైన అహంకారం వల్ల పతనం చెందాడు.

నకులుడి పతనం: నకులుడు తనతో సమానమైనవాడు సమస్త లోకాల్లో ఎవరూ లేరని, చక్కని సౌందర్య రూపం తనకే ఉందని భావించేవాడు. నకులుడికి గల ఆ సౌందర్య అహంకారం వల్లే కీడు కలిగి మరణించాడు.

అర్జునుడి పతనం: అర్జునుడు కౌరవులందరినీ ఒక్క రోజులోనే చంపుతానని మాట ఇచ్చాడు. కానీ అలా చేయలేదు. మాట ఒకటి, చేత మరొకటి కావడం చాలా దోషం. అంతేకాకుండా అర్జునుడు ధనుర్ధారులందరినీ నిందించేవాడు. ఈ విధంగా అసత్య వచనం, పరనింద అనే దోషాలు అర్జునుడి పతనానికి కారణమయ్యాయి.

భీముడి పతనం: భీముడికి తిండి అత్యధికం. భీముడు భయంకరుడై తన బాహుబలంతో ఎవరినీ లెక్క చేయకుండా ఎక్కువగా వ్యర్థపు మాటలు మాట్లాడుతూ ఉంటాడు. అందువల్లనే భీముడికి పతనం సంభవించింది.


2.  ధర్మరాజు, ఇంద్రుడికి శునకం విషయంలో జరిగిన చర్చను విశ్లేషించండి. 

జ: శునకం విషయంలో జరిగిన వివాదం: ధర్మరాజు హస్తినాపురం నుంచి మహాప్రస్థానానికి బయలుదేరినప్పుడు ఒక కుక్క అందరి కంటే ముందుగా ధర్మరాజు వెంట వెళ్లింది. అందుకే ఆ కుక్క కూడా తన వెంట స్వర్గానికి రావాలని, దాన్ని విడిచి రావడం అనే కఠిన కారుణ్యాన్ని తాను సహించలేనని ధర్మరాజు ఇంద్రుడితో అన్నాడు. కుక్కను తన వెంట తీసుకొని వస్తానని అనడం న్యాయం కాదని, కుక్కకు దివ్యత్వం రాదని, ఆ ఆలోచన అశక్యమని, కుక్కను విడిచిపెట్టడం పాపం కాదని, ఆలస్యం చేయకుండా రథాన్ని ఎక్కమని ఇంద్రుడు ధర్మరాజుకు చెప్పాడు. కుక్కను స్వర్గానికి తీసుకువెళ్లడం అసాధ్యమైన పని అయినా ఇంద్రుడి లాంటి పూజ్యుడైన సత్పురుషుడు తనను ఆశ్రయించిన వారి కోసం ఆ పనిని చేసిపెట్టాలని, భక్తి గల కుక్కను విడిచిపెట్టడం వల్ల కలిగే భాగ్యం తనకు సంతోషాన్ని కలిగించదని ధర్మరాజు ఇంద్రుడితో చెప్పాడు. అప్పుడు దేవేంద్రుడు కోపం ధర్మాన్ని నశింపజేస్తుందని, కోపగించుకోవద్దని, కుక్కకు స్వర్గంలో తావు లేదని, కుక్కను విడిచిపెట్టినా పాపం రాదని, స్వర్గలోక సుఖం లాంటి శుభాన్ని దూరం చేసుకోవడం తగదని ధర్మరాజుకు నచ్చజెప్పడానికి ప్రయత్నించాడు.

‘భక్తితో కూడిన సేవకుడిని వదిలిపెట్టడం బ్రహ్మ హత్యతో సమానమైన పాపం అని పెద్దలు చెబుతారు. కుక్కను వదిలిపెట్టడం తగని పని. స్వర్గసుఖం కోసం కుక్కను వదిలిపెట్టడం అనే పాపాన్ని నేను చేయలేను’ అని ధర్మరాజు ఇంద్రుడికి నిష్కర్షగా చెప్పాడు. 

ఇంద్రుడు ధర్మరాజుకు నచ్చజెెప్పడం: యజ్ఞ దీక్షలో ఉన్నవాడు కుక్కను ముట్టుకుంటే అతడు ఆశించిన పుణ్యం నశిస్తుంది. అలాంటి పరిస్థితిలో ఎందుకు ఇంతగా నిర్బంధం చేస్తున్నావు. ఈ కుక్కను వదిలిపెట్టు. దాన్ని విడిచిపెడితే నీకు స్వర్గంలో సౌఖ్యం లభిస్తుంది. నీవు చేసుకున్న పుణ్యసంపద వల్ల దివ్యత్వాన్ని దర్శించి కూడా దాన్ని స్వీకరించకుండా ఉండటం తగిన పని కాదు. నీ భార్య ద్రౌపది, సోదరులను వదిలివేయడానికి అంగీకరించావు. కుక్కను విడిచిపెట్టడానికి అంగీకరించకపోవడం నీకు తగదు అని ఇంద్రుడు ధర్మరాజుకు చెప్పాడు. 

ధర్మరాజు సమాధానం: ఓ దేవేంద్రా! నీవు అన్ని లోకాలకు ధర్మ రక్షకుడవు. నేను నీ కంటే ఎక్కువ మంచి చెడులు తెలిసినవాడను కాను. మహాత్ములతో వాదించడం సాధ్యం కాదు. అయినా విన్నవించాల్సిన విషయం విన్నవించడం తప్పు కాదని నీకు తెలియజేస్తున్నాను. నా సోదరులు, ద్రౌపది మార్గమధ్యలోనే చనిపోయారు. నేను వారి కోసం ఎంత ఏడ్చినా  తిరిగిరారు. ఈ కుక్క మాత్రం దారిలో చనిపోకుండా నా వెంట వచ్చింది. దీన్ని విడిచిపెట్టమని అనడం మీకు సమంజసం కాదు. సేవకుడిని నిర్దాక్షిణ్యంగా వదిలివేయడం అనేది శరణాగతుడిని స్వీకరించకపోవడం, మంచి స్నేహితుడికి ద్రోహం చేయడం, కుల వధువును చంపడం అనే ద్రోహాలతో సమానం కాబట్టి నేను కుక్కను విడిచిపెట్టలేను. స్వర్గసుఖం విషయం అలా ఉండనీ, నీవు నాపై నీ విభూతిని అనుగ్రహించు. అందువల్ల నేను కుక్కను ఆదరించిన కార్యం దోషం కాకుండా పోతుంది. ఇక నీవు వెళ్లు. నేను ఇక్కడే తపస్సుతో నిన్ను సేవిస్తూ ఈ పవనాల్లోనే ఉండిపోతాను అని ధర్మరాజు దేవేంద్రుడితో కుక్కను విడిచి తాను స్వర్గానికి రానని వాదించాడు.


3 మార్కుల ప్రశ్నలు

1.   దీనికట్టి దురవస్థ వాటికెల్లా నీడ్యచరిత! 

జ: పరిచయం: ఈ వాక్యం తిక్కన రచించిన ఆంధ్ర మహాభారతంలోని మహాప్రస్థానిక పర్వం నుంచి గ్రహించిన ‘ధర్మపరీక్ష’ అనే పద్యభాగంలోనిది.

సందర్భం: పాండవులందరూ ద్రౌపదితో కలిసి మహాప్రస్థానానికి బయలుదేరి వెళుతున్నారు. మార్గమధ్యలో ద్రౌపది యోగం చేది నేలపై పడి మరణించింది. అది చూసిన భీముడు ద్రౌపది మరణానికి కారణం ఏమిటని ధర్మరాజును అడిగాడు. ద్రౌపది అర్జునుడిపై పక్షపాతం చూపడం వల్ల ఆమె పుణ్యాలు ఫలించలేదని, అందుకే ఆ దురవస్థ వచ్చిందని ధర్మరాజు భీముడికి చెప్పిన సందర్భంలోనిది.

అర్థం: పొగడదగిన చరిత్ర గల భీమా! ద్రౌపదికి ఇలాంటి కష్టం వచ్చింది. 

వ్యాఖ్య: ద్రౌపది ఎప్పుడూ ధర్మహాని చేయలేదు. మరి ఎందుకు ఆమె దారిలో చనిపోయిందని భీముడు ధర్మరాజును అడిగాడు. ద్రౌపదికి అర్జునుడిపై పక్షపాతం ఉంది. ఆ దోషం వల్లే ఆమె చనిపోయిందని ధర్మరాజు భీముడికి వివరించి చెప్పాడు.


2.  పల్కొక్కటి సేత యొక్కటి యగుట చాలా దోషము? 

జ: పరిచయం: ఈ వాక్యం తిక్కన రచించిన ఆంధ్ర మహాభారతంలోని మహాప్రస్థానిక పర్వం నుంచి గ్రహించిన ‘ధర్మపరీక్ష’ అనే పద్యపాదంలోనిది. 

సందర్భం: పాండవులు మహాప్రస్థానానికి వెళుతుండగా ద్రౌపది, నకుల సహదేవులు మధ్యలో మరణించారు. అది చూసిన అర్జునుడు బాధపడి తాను కూడా మరణించాడు. అర్జునుడి మరణానికి కారణం చెప్పమని భీముడు ధర్మరాజును అడిగాడు. అర్జునుడు కౌరవులందరినీ యుద్ధంలో ఒక రోజులోనే చంపుతానని చెప్పాడు. కానీ అలా చేయలేదు. అర్జునుడు ఒకమాట చెప్పి మరో రకంగా చేయడం వల్లే దారిలో మరణించాడని ధర్మరాజు భీముడికి చెప్పిన సందర్భంలోనిది.

అర్థం: ఒక మాట చెప్పి మరొకటి చేయడం అనేది చాలా తప్పు.

వ్యాఖ్య: అర్జునుడు కౌరవులందరినీ యుద్ధంలో ఒకరోజులోనే చంపుతానని చెప్పి మరో రకంగా చేశాడు. అలా అబద్ధం మాట్లాడటం పెద్ద తప్పు, ఆ అసత్య దోషం వల్లే అర్జునుడు మార్గంలో మరణించాడని ధర్మరాజు భీముడికి చెప్పాడు.


3.  శునకమధిక భక్తి విడువక చనఁగన్‌ 

జ: పరిచయం: ఈ వాక్యం తిక్కన రచించిన ఆంధ్ర మహాభారతంలోని మహాప్రస్థానిక పర్వం నుంచి గ్రహించిన ‘ధర్మరాజు’ అనే పద్యపాదంలోనిది.

సందర్భం: పాండవులందరూ మహాప్రస్థానానికి వెళుతుండగా ధర్మరాజు వెంట వెళ్లిన ద్రౌపది, భీమార్జున, నకుల సహదేవులు మార్గమధ్యలోనే చనిపోయారు. ధర్మరాజు వారి మరణాన్ని గురించి ఏమాత్రం పట్టించుకోకుండా గొప్ప నిశ్చయంతో ముందుకు సాగిపోయాడు. ధర్మరాజు వెంట వెళ్లిన కుక్క మాత్రం భక్తితో ఆయనతోపాటే వెళ్లిందని కవి చెప్పిన సందర్భంలోనిది.

అర్థం: కుక్క గొప్ప భక్తితో ధర్మరాజును విడిచిపెట్టకుండా వెళ్లింది.

వ్యాఖ్య: మహాప్రస్థానానికి బయలుదేరిన ధర్మరాజు భార్య ద్రౌపది, సోదరులు మరణించినా ధైర్యంగా ముందుకు సాగాడని, అతడి వెంట వచ్చిన కుక్క మాత్రం ఆయనతోపాటే వెళ్లిందని భావం.


4.  శుభ గమనంబెడ సేఁత కృత్యమే 

జ: పరిచయం: ఈ వాక్యం తిక్కన రచించిన ఆంధ్ర మహాభారతంలోని మహాప్రస్థానిక పర్వం నుంచి గ్రహించిన ‘ధర్మపరీక్ష’ అనే పద్యభాగంలోనిది.

సందర్భం: మహాప్రస్థానానికి బయలుదేరిన ధర్మరాజుకు దేవేంద్రుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన ధర్మరాజును తన రథాన్ని ఎక్కి స్వర్గానికి రమ్మన్నాడు. ధర్మరాజు తనతోపాటు కుక్కను కూడా స్వర్గానికి తీసుకువెళ్లమని కోరాడు. భక్తితో వెంట వచ్చిన కుక్కను విడిచిపెట్టడం వల్ల కలిగే స్వర్గసౌఖ్యం తనకు వద్దని ధర్మరాజు ఇంద్రుడితో చెప్పాడు. కుక్కలకు స్వర్గంలో చోటు లేదని, కుక్కను విడిచిపెడితే పాపం రాదని, శుభప్రదమైన స్వర్గసుఖాన్ని దూరం చేసుకోవడం తగదని దేవేంద్రుడు ధర్మరాజుకు హితవు చెప్పిన సందర్భంలోనిది.

అర్థం: స్వర్గసుఖం అనే శుభాన్ని దూరం చేసుకోవడం తగదు.

వ్యాఖ్య: తన వెంట వచ్చిన కుక్కను స్వర్గానికి తీసుకువెళ్లమని పట్టుపట్టడం తగదని, శుభమైన స్వర్గసుఖాన్ని దూరం చేసుకోవద్దని ఇంద్రుడు ధర్మరాజుకు హితవు చెప్పాడు.


5.  ఇత్తెఱఁగు సూరి సుతుండగు నీకు నర్హమే

జ: పరిచయం: ఈ వాక్యం తిక్కన రచించిన ఆంధ్ర మహాభారతంలోని మహాప్రస్థానిక పర్వం నుంచి గ్రహించిన ‘ధర్మపరీక్ష’ అనే పద్యభాగంలోనిది.

సందర్భం: తనతో వచ్చిన కుక్కను కూడా స్వర్గానికి తీసుకువెళ్లమని ధర్మరాజు దేవేంద్రుడిని కోరాడు. దేవేంద్రుడు కుక్కకు స్వర్గంలో తావులేదని అన్నాడు. భక్తితో వెంట వచ్చిన వాడిని విడిచిపెట్టడం బ్రహ్మ హత్య పాతకంతో సమానమని, స్వర్గం కోసం కుక్కను విడిచిపెట్టి పాపం చేయనని ధర్మరాజు అన్నాడు. చేసుకున్న పుణ్యసంపద వల్లే ఆయనకు దైవత్వం వస్తుందని, దాన్ని కాదనడం మంచిది కాదని, సోదరులు, భార్యను కూడా తేలికగా విడిచిపెట్టిన ధర్మరాజు కుక్కను విడిచిపెట్టనని చెప్పడం తగదని దేవేంద్రుడు చెప్పిన సందర్భంలోనిది.

అర్థం: పండితులతో కొనియాడబడే నీకు ఈ పద్ధతి తగినది కాదు.

వ్యాఖ్య: ధర్మరాజు సోదరులు, భార్యను విడిచిపెట్టి ముందుకు వెళ్లగలిగాడు. కానీ తనతో వెంట వచ్చిన కుక్కను విడిచి స్వర్గానికి ఒంటరిగా వెళ్లనని పట్టుపట్టాడు. కుక్క కోసం స్వర్గసుఖాన్ని కాదనుకోవడం ధర్మరాజుకు తగదని ఇంద్రుడు నచ్చజెప్పాడు.


6.  వత్స! భూలోకమును నిట్టి వారుఁగలరే 

జ: పరిచయం: ఈ వాక్యం తిక్కన రచించిన ఆంధ్ర మహాభారతంలోని మహాప్రస్థానిక పర్వం నుంచి గ్రహించిన ‘ధర్మపరీక్ష’ అనే పద్యభాగంలోనిది.

సందర్భం: కుక్కను విడిచి తాను స్వర్గానికి రానని ధర్మరాజు దేవేంద్రుడితో నిష్కర్షగా చెప్పాడు. అప్పుడు కుక్క రూపంలో ధర్మరాజు వెంట వచ్చిన యమధర్మరాజు సంతోషించి ఆ రూపాన్ని వదిలి నిజరూపంతో ధర్మరాజు ముందు నిలిచాడు. ధర్మరాజు సంతోషంతో యముడికి నమస్కరించాడు. ధర్మరాజు పుణ్య చరిత్ర, నిర్మల బుద్ధి, సకల ప్రాణులపట్ల దయ కలిగి ఉండటం అనే గుణాలు తనకు సంతోషాన్ని కలిగించాయని, భూలోకంలో ఇలాంటి సత్పురుషులు ఉండరని యమధర్మరాజు చెప్పిన సందర్భంలోనిది.

అర్థం: నాయనా! భూలోకంలో ఇలాంటి వారు కూడా ఉంటారా?

వ్యాఖ్య: ధర్మరాజులా సమస్త ప్రాణులను దయతో చూసే సత్పురుషులు భూలోకంలో ఉండరని యముడు ప్రశంసించాడు. కుక్క లాంటి ప్రాణిని కూడా దయతో చూసిన కుమారుడు ధర్మరాజును యముడు ఎంతగానో మెచ్చుకున్నాడు.


7.   ధర్మపరీక్ష పాఠ్యభాగ కవి గురించి రాయండి. 
జ: పాఠం: ధర్మపరీక్ష 
కవి: తిక్కన
కాలం: 13వ శతాబ్దం
రచనలు: నిర్వచనోత్తర రామాయణం, ఆంధ్ర మహాభారతంలోని 15 పర్వాలు.
అంకితాలు: * నిర్వచనోత్తర రామాయణాన్ని రచించి మనుమసిద్ధికి అంకితం ఇచ్చాడు.
* ఆంధ్ర మహాభారతంలోని 15 పర్వాలు రచించి హరిహరనాథుడికి అంకితం ఇచ్చాడు.


సమాసాలు       (2 మార్కులు)

1. సిద్ధసాధ్యులు: సిద్ధులును, సాధ్యులును, ద్వంద్వ సమాసం
2. నాకలోక సుఖములు: నాకలోకము నందలి సుఖములు, సప్తమీ తత్పురుష సమాసం
3. భక్తియుక్తుడు: భక్తితో కూడినవాడు, తృతీయ తత్పురుష సమాసం
4. ధైర్యలత: ధైర్యము అనెడి లత, రూపక సమాసం
5. పుష్పవర్షము: పుష్పములతో వర్షం, తృతీయ తత్పురుష సమాసం 
6. కోదండ ధీరుడు: కోదండమును ధరించినవాడు, ద్వితీయ తత్పురుష సమాసం 
7. ధర్మహాని: ధర్మమునకు హాని, షష్ఠీతత్పురుష సమాసం
8. విగతాసుడు: విగతమైన అసువులు కలవాడు, బహువ్రీహి సమాసం 
9. అసత్యము: సత్యము కానిది, నఞ్‌ తత్పురుష సమాసం 
10. దివ్య స్యందనము: దివ్యమైన స్యందనము, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం 
11. హిమాచలము: హిమము అనే పేరు గల అచలము (కొండ), సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం 
12. ధైర్య స్థైర్యములు: ధైర్యమును, స్థైర్యమును, విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం 

సంధులు (3 మార్కులు)


1.  రూపాతిశయము
    రూప + అతిశయము = సవర్ణదీర్ఘ సంధి 

2.  చిగురోత్తు 
    చిగురు + ఒత్తు  = ఉత్వ సంధి

3.  నీయనుజులు
    నీ + అనుజులు = యడాగమ సంధి

4.  దప్పింగూలె
    దప్పిన్‌ + కూలె = సరళాదేశ సంధి

5.  తూలినయట్లు
    తూలిన + అట్లు = యడాగమ సంధి

6.  రూపంబు దాల్చి
    రూపంబు + తాల్చి = గసడదవాదేశ సంధి

7.  ధుర్యాత్మ
    ధుర్య + ఆత్మ = సవర్ణదీర్ఘ సంధి

8.  అట్లుగావున
    అట్లు + కావున = గసడదవాదేశ సంధి

9.  శోకమేల
    శోకము + ఏల = ఉత్వసంధి

10. మునీంద్ర
     ముని + ఇంద్ర = సవర్ణదీర్ఘ సంధి

11. అమరేంద్రుడు
     అమర + ఇంద్రుడు = గుణ సంధి

12. దేహోద్ధతి
     దేహ + ఉద్ధతి = గుణ సంధి

13. అత్యంత
     అతి + అంత = యణాదేశ సంధి

14. నడువఁదగునె
     నడువన్‌ + తగునె = సరళాదేశ సంధి 

15. మహాత్మ
     మహా + ఆత్మ = సవర్ణదీర్ఘ సంధి


రచయిత: ఎం.మహేశ్వర నాయుడు  

Posted Date : 18-12-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని

విద్యా ఉద్యోగ సమాచారం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌