• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ప్రోటోజోవాలో గమనం, ప్రత్యుత్పత్తి - ముఖ్య‌మైన ప్రశ్న‌లు

ప్రోటోజోవాలో గమనం, ప్రత్యుత్పత్తి

2 మార్కుల ప్రశ్నలు

1. కశాభానికి, శైలికకు మధ్య భేదాలు రాయండి.
జ: కశాభం: పొడవైన కొరడా నిర్మాణం లాంటివి. ఇవి ఒకటి, రెండు, నాలుగు లేదా అనేకం ఉంటాయి. తరంగ చలనాన్ని చూపుతాయి.
    శైలిక: పొట్టి రోమాల్లాంటివి. ఇవి అనేకం ఉంటాయి. లోలక చలనాన్ని చూపుతాయి.

2. కైనెటి అంటే ఏమిటి?
జ: సీలియేట్‌ జీవుల బాహ్య జీవ ద్రవ్యంలో ఉండే ఆయత వరుసలోని కైనటోసోమ్‌లు, వాటిని కలిపి ఉంచే కైనెటో డెస్మేటాలను కలిపి కైనెటి అంటారు.

3. డైనీన్‌ భుజాలు అంటే ఏమిటి? వాటి విశిష్టత తెలపండి.
జ: కశాభంలో కేంద్రీయ సూక్ష్మనాళిక ‘A’ కు జతల భుజాలు ఉంటాయి. ఇవి డైనీన్‌ అనే ప్రొటీన్‌ నిర్మితాలు. వీటిని డైనీన్‌ భుజాలు అంటారు. ఇవి జారుడు శక్తిని పుట్టిస్తాయి.

4. ఏకకాలిక, దీర్ఘకాలిక లయబద్ధ చలనాల మధ్య భేదాలు రాయండి.
జ: ఏకకాలిక లయబద్ధ చలనం: అడ్డు వరుసలో ఉన్న అన్ని శైలికలు ఏకకాలంలో ఒకే దిశలో కదలడం.
దీర్ఘకాలిక లయబద్ధ చలనం: ఆయత వరుసలోని శైలికలు ఒకదాని తర్వాత మరొకటి ఒక నిర్దిష్ట దిశలో చలనం జరపడం.

5. ప్రోటర్, ఒపిస్థే మధ్య భేదాలను రాయండి.
జ: ప్రోటర్‌: పేరమీషియం అడ్డు ద్విధావిచ్ఛిత్తి ద్వారా ఏర్పడే పూర్వాంత పిల్లజీవి. ఇది ఒక పూర్వాంత సంకోచ రిక్తిక, కణగ్రసని, కణ ముఖాలను తల్లి జీవి నుంచి పొందుతుంది.
ఒపిస్థే: పేరమీషియం పూర్వాంత అడ్డు ద్విధావిచ్ఛిత్తి ద్వారా ఏర్పడే పరాంత పిల్లజీవి. ఇది కేవలం పరాంత సంకోచ రిక్తికను తల్లి కణం నుంచి పొందుతుంది.

6. జీవ పరిణామంలో లైంగిక ప్రత్యుత్పత్తి ఏవిధంగా ఉన్నతమైంది?
జ: లైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా ఏర్పడిన పిల్ల జీవులు తల్లి జీవులకు సమరూపాలుగా ఉండవు. దీనివల్ల జీవపరిణామంలో కొత్తజీవుల ఆవిర్భావం సంభవిస్తుంది.

7. అలైంగిక ప్రత్యుత్పత్తి విధానం ద్వారా ఏర్పడిన పిల్ల జీవులను క్లోన్‌ అని ఎందుకు అంటారు?
జ: అలైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా ఏర్పడిన పిల్ల జీవులు తల్లి జీవులకు సమరూపాలుగా ఉంటాయి. స్వరూపం, జన్యురూపంలో సమానంగా ఉన్న జీవులను క్లోన్‌ అని అంటారు.
8. లోబోపోడియమ్, ఫిలోపోడియమ్‌ల మధ్య భేదాలను రాసి ఉదాహరణలు తెలపండి.
జ: లోబోపోడియా: మొద్దువేలి లాంటి మిథ్యాపాదాలు. ఉదా: అమీబా
ఫిలోపోడియా: తంతువుల లాంటి మిథ్యాపాదాలు ఉంటాయి. ఉదా: యూగ్లైఫా

9. సీలియేట్‌ల సంయుగ్మాన్ని నిర్వచించి రెండు ఉదాహరణలు రాయండి.
జ: రెండు భిన్న క్లోన్‌లకు చెందిన సీలియేట్‌ జీవుల్లో కేంద్రక పదార్థాల మార్పిడి, పునర్‌ వ్యవస్థీకరణ కోసం జరిగే తాత్కాలిక కలయిక సంయుగ్మం. ఉదా: పారమీషియం, వర్టిసెల్లా

10. కశాభం అడ్డుకోత పటం గీసి భాగాలను గుర్తించండి.

జ:

4 మార్కుల ప్రశ్నలు

1. పార్శ్వ నిర్మాణాలు అంటే ఏమిటి? వివిధ రకాల కశాభాలను ఉదాహరణలతో రాయండి.

జ: కశాభాల మీద ఉండే పొట్టి, పార్శ్వ తంతువులను పార్శ్వ నిర్మాణాలు అంటారు. ఇవి ఒకటి, రెండు లేదా అనేక వరుసల్లో ఉంటాయి. వీటిని మాస్టిగోనీమ్‌లు లేదా ప్లిమ్మర్లు అంటారు. వీటి రకాలు:
స్టైకోనిమాటిక్‌: అక్షీయ తంతువుపై ఒక వరుస పార్శ్వ నిర్మాణాలు ఉంటాయి. ఉదా: యూగ్లీనా
పాంటోనిమాటిక్‌: అక్షీయ తంతువుపై రెండు లేదా అంతకంటే ఎక్కువ వరుసల్లో పార్శ్వ నిర్మాణాలు ఉంటాయి. ఉదా: పేరానీమా
ఏక్రోనిమాటిక్‌: పార్శ్వ నిర్మాణాలు ఉండవు. అక్షీయ తంతువు అంత్య భాగం నగ్నంగా ఉంటుంది. ఉదా: క్లామిడోమోనాస్‌
పాంటిక్రోనిమాటిక్‌: పార్శ్వ నిర్మాణాలు రెండు లేదా అంతకంటే ఎక్కువ వరుసల్లో ఉంటాయి. అంత్య తంతువు నగ్నంగా ఉంటుంది. ఉదా: అర్సియూలస్‌
ఏనిమాటిక్‌: పార్శ్వ నిర్మాణాలు, అంత్య తంతువులు ఉండవు. ఉదా: క్రిప్టోమోనాస్‌

2. మిథ్యా పాదాల గురించి ఒక వ్యాఖ్య రాయండి.
జ: మిథ్యా పాదాలు రైజోపొడా జీవుల్లో ఉంటాయి. ఇవి తాత్కాలిక జీవ ద్రవ్యపు విస్తరణలు. ఇవి నాలుగు రకాలు.
లోబోపోడియా: మొద్దువేలు లాంటి మిథ్యాపాదాలు
ఉదా: అమీబా
ఫిలోపోడియా: తంతురూప మిథ్యాపాదాలు
ఉదా: యూగ్లైఫా

రెటిక్యులోపోడియా: జాలక రూప మిథ్యాపాదాలు
ఉదా: ఎల్ఫీడియం
ఎక్సోపోడియా: సూర్యకిరణం లాంటి మిథ్యాపాదాలు

ఉదా: ఏక్టిన్‌ఫ్రిస్‌

3. యూగ్లీనాలో ఆయత ద్విదావిచ్ఛిత్తిని గురించి వర్ణించండి.
జ: ద్విదావిచ్ఛిత్తి ద్వారా కేంద్రకం, ఆధార కణికలు, క్రొమటోఫోర్లు, జీవద్రవ్యం విభజన చెందుతాయి. కేంద్రకం సమ విభజన ద్వారా విభజితమవుతుంది. దేహ పూర్వాంత మధ్యలో ఒక ఆయత గాడి ఏర్పడి నెమ్మదిగా పరాంతానికి రెండు పిల్ల జీవులుగా విడిపోయే వరకు విస్తరిస్తుంది. కొత్తగా ఏర్పడిన రెండు పిల్ల జీవుల్లో ఒకటి యూగ్లీనా తల్లి కశాభాన్ని పొందుతుంది. మరొకటి కొత్తగా ఏర్పడిన ఆధార కణికల నుంచి కొత్త కశాభాన్ని ఏర్పరచుకుంటుంది. రెండు పిల్ల జీవుల్లో నేత్రపుచుక్క, సంకోచరిక్తిక కొత్తగా ఏర్పడతాయి. రెండు పిల్ల యూగ్లీనాలు దర్పణ ప్రతిబింబాలుగా ఉండటం వల్ల ఆయత ద్విదావిచ్ఛిత్తిని సిమ్మెట్రోజెనిక్‌ విభజన అంటారు.

4. పేరమీషియంలో అడ్డు ద్విదావిచ్ఛిత్తిని గురించి వివరించండి.
జ: స్లిప్పర్‌ యానిమల్‌క్యూల్‌కు (పేరమీషియం) ఒక స్థూల కేంద్రకం, ఒక సూక్ష్మ కేంద్రకం, రెండు సంకోచ రిక్తికలు, ట్రైకోసిస్ట్‌లు, నిమ్న శైలికావ్యవస్థ, దేహమంతా అనేక శైలికలు ఉంటాయి. అనుకూల పరిస్థితులు ఉన్నప్పుడు సూక్ష్మ కేంద్రకం సమ విభజన ద్వారా తర్వాత స్థూల కేంద్రకం ఎమైటాసిస్‌ ద్వారా విభజన చెంది రెండు పిల్ల కేంద్రకాలను ఏర్పరుస్తుంది. కారియోకైనెసిస్‌ తర్వాత మధ్య భాగంలో ఒక నొక్కు ఏర్పడుతుంది. ఈ నొక్కు విస్తరించడం వల్ల తల్లి కణం రెండు పిల్ల జీవులుగా ఏర్పడుతుంది. పూర్వాంత పిల్ల జీవిని ప్రోటర్, పరాంత పిల్ల జీవిని ఒపిస్థే అని అంటారు. ప్రోటర్‌ పూర్వాంత సంకోచ రిక్తిక, కణగ్రసని, కణ ముఖాన్ని తల్లిజీవి నుంచి పొందుతుంది.
ఒపిస్థే పరాంత సంకోచ రిక్తికను తల్లి కణం నుంచి పొందుతుంది. పూర్వాతం సంకోచ రిక్తికను, కణ గ్రసని, కొత్త నోటిగాడిని నూతనంగా ఏర్పరుస్తుంది. పేరమీషియంలో జరిగే అడ్డు ద్విదావిచ్ఛిత్తిని ‘హోమోథెటోజెనిక్‌ విచ్ఛిత్తి’ అంటారు.

5. యూగ్లీనా పటం గీసి భాగాలను గుర్తించండి.

జ: 

Posted Date : 21-05-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని

విద్యా ఉద్యోగ సమాచారం

మరిన్ని
 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌