• facebook
  • twitter
  • whatsapp
  • telegram

మొక్కల్లో  ప్రత్యుత్పత్తి విధానాలు  

 ప్రశ్న‌లు - జ‌వాబులు

 అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు
 

1. భిన్న సిద్ధబీజత అంటే ఏమిటి? ఆవృత బీజ మొక్క అభివృద్ధి చేసే రెండు రకాల సిద్ధబీజాలను తెలపండి.

జ: ఒకే మొక్కపై ఒకటి కంటే ఎక్కువ రకాల సిద్ధబీజాలు ఏర్పడే స్థితినే భిన్నసిద్ధబీజత అంటారు. ఆవృత బీజ  మొక్కల్లో సూక్ష్మ, స్థూల సిద్ధబీజాలు ఏర్పడతాయి.
 

2. లివర్ వర్ట్‌లు ఏ విధంగా శాఖీయ ప్రత్యుత్పత్తిని జరుపుతాయి?

జ: లివర్ వర్ట్‌లు జెమ్మాలు అనే ప్రత్యేక నిర్మాణాలతో ఉండి, ముక్కలు కావడం ద్వారా శాఖీయ ప్రత్యుత్పత్తి జరుపుతాయి.
 

3. అలైంగిక ప్రత్యుత్పత్తి పద్ధతి ద్వారా ఏర్పడే సంతతిని 'క్లోన్' అని ఎందుకు అంటారు?

జ: అలైంగిక పద్ధతి లేదా శాఖీయ పరంగా ఏర్పడే మొక్కలు స్వరూపాత్మకంగా, జన్యుపరంగా ఒకేవిధంగా ఉంటాయి. వీటినే 'క్లోన్‌'లు అంటారు.

4. ఒక పుష్పించే మొక్కలో లైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా జరిగే విధానంలోని కింది సంభవాలను ఒక క్రమ పద్ధతిలో తిరిగి పొందు పరచండి. పిండ జననం, ఫలదీకరణ, సంయోగబీజ జననం, పరాగ సంపర్కం.

జ: పరాగ సంపర్కం  సంయోగబీజ జననం  ఫలదీకరణ  పిండ జననం

5. కిందివాటిలో ద్విలింగాశ్రయ, ఏకలింగాశ్రయ మొక్కలను గుర్తించండి.

ఎ) ఖర్జూరం   బి) కొబ్బరి   సి) కారా   డి) మర్కాంషియా

జ: ఎ) ఖర్జూరం - ఏకలింగ్రాశయ
     బి) కొబ్బరి - ద్విలింగ్రాశ్రయ
     సి) కారా - ద్విలింగాశ్రయ
     డి) మార్కాంషియా - ఏకలింగాశ్రయ

 

6. కింది పుష్పభాగాలు ఫలదీకరణ తర్వాత ఏ విధంగా అభివృద్ధి చెందుతాయో తెలపండి.
     ఎ) అండాశయం   బి) కేసరాలు   సి) అండాలు   డి) రక్షక పత్రావళి
జ: అండాశయం - ఫలంగా మారుతుంది
     కేసరాలు - రాలిపోతాయి
     అండాలు - విత్తనాలుగా మారతాయి
     రక్షక పత్రావళి - రాలిపోతాయి. కొన్ని మొక్కల్లో ఫలాన్ని అంటిపెట్టుకుని ఉంటాయి (వంగ)

 

7. 'వివిపారి' (శిశు ఉత్పాదన)ని ఒక ఉదాహరణతో నిర్వచించండి.
జ: పరిసరాల ఒత్తిడిని తగ్గించుకోవడానికి కొన్ని మాంగ్రూవ్ మొక్కల్లో విత్తనాలు తల్లిమొక్కను అంటి పెట్టుకుని ఉండగానే అంకురిస్తాయి. దీన్ని వివిపారి (శిశు ఉత్పాదన) అంటారు. ఉదా: రైజోఫోరా

 

స్వల్ప సమాధాన ప్రశ్నలు 

1. కింది పదాలను వివరించండి. 
     1) శైశవ దశ         2) ప్రత్యుత్పత్తి దశ
జ: శైశవ దశ: ఏ జీవిలోనైనా సంయుక్త బీజం ఏర్పడి, తిరిగి లైంగికావయవాల నుంచి ప్రత్యుత్పత్తి కణాలు ఉత్పత్తి అయ్యే వరకు మధ్య ఉండే కాలాన్ని 'శైశవ దశ' అంటారు. అన్ని జీవుల్లోనూ అభివృద్ధి జరిగి, పక్వస్థితికి చేరి లైంగికోత్పత్తి దశకు చేరడంతో శైశవ దశ అంతమవుతుంది. ఉదాహరణకు ఆవృతబీజ (ఏక, ద్వివార్షిక) మొక్కల్లో విత్తనం మొలకెత్తడం నుంచి పుష్పోత్పత్తి జరిగే వరకూ ఉండే మధ్య కాలాన్ని (శాఖీయ దశనే) శైశవ దశ అంటారు.
     

ప్రత్యుత్పత్తి దశ: అలైంగిక లేదా లైంగిక ప్రత్యుత్పత్తి నిర్మాణాలను ఉత్పత్తి చేసే దశను ప్రత్యుత్పత్తి దశగా పేర్కొనవచ్చు. ఈ దశలో సిద్ధబీజాలు లేదా సంయోగ బీజాలు ఉత్పత్తి అవుతాయి. ఆవృతబీజ (ఏక, ద్వివార్షిక) మొక్కల్లో లైంగిక ప్రత్యుత్పత్తి అవయవమైన పుష్పంలో మొదట సిద్ధబీజాలు (పరాగ రేణువులు,  స్థూల సిద్ధబీజం) ఏర్పడతాయి. వాటి నుంచి సంయోగబీజాలు ఉత్పత్తి అయి లైంగికోత్పత్తికి తోడ్పడతాయి.
 

2. అలైంగిక, లైంగిక ప్రత్యుత్పత్తుల మధ్య తేడాలను గుర్తించండి. శాఖీయ ప్రత్యుత్పత్తిని కూడా ఒక రకమైన  అలైంగిక ప్రత్యుత్పత్తిగా ఎందుకు పరిగణిస్తారు?

జ:

  
ముక్కలు కావడం (శైవలాలు, బూజులు, పుట్ట గొడుగులు), జెమ్మాలు, (లివర్ వర్ట్స్), శాఖీయ వ్యాప్తి కారకాలు (రన్నర్‌లు, స్టోలన్లు, పిలక మొక్కలు, కొమ్ము, కందం, లఘు లశునాలు, ప్రత్యుత్పత్తి పత్రాలు) లాంటి నిర్మాణాలు శాఖీయ వ్యాప్తికి తోడ్పడతాయి. ఇవి ఏర్పడటానికి రెండు జనకాలు పాల్గొనకపోవడం వల్ల శాఖీయ ప్రత్యుత్పత్తిని అలైంగిక విధానంగా పరిగణిస్తారు.

 

3. కింది పుష్పించే మొక్క భాగాలను గుర్తించి అవి ఏకస్థితికమా (n) లేదా ద్వయస్థితికమా(2n) అనేది రాయండి.
      ఎ) అండాశయం 
      బి) పరాగకోశం 
      సి) స్త్రీ బీజకణం 
      డి) పరాగరేణువు 
      ఇ) పురుష సంయోగ బీజం 
      ఎఫ్) సంయుక్త బీజం
జ: అండాశయం - ద్వయస్థితికం (2n)
     పరాగకోశం    - ద్వయస్థితికం (2n) 
     స్త్రీ బీజకణం    - ఏకస్థితికం (n) 
     పరాగరేణువు  - ఏకస్థితికం (n) 
     పురుష సంయోగ బీజం - ఏకస్థితికం (n) 
     సంయుక్తబీజం - ద్వయస్థితికం (2n)

 

4. ఆవృత బీజమొక్క జీవిత చక్రంలోని దశల గురించి క్లుప్తంగా రాయండి.
జ: ఆవృత బీజ మొక్క: జీవిత చక్రంలో రెండు దశలు ఏకాంతరంగా ఏర్పడుతూ ఉంటాయి.
అవి: 1) సిద్ధబీజద దశ 2) సంయోగ బీజద దశ.
సిద్ధబీజద దశ: జీవితచక్రంలో ఇది ద్వయస్థితిక (2n) దశ. ప్రబలమైంది. సంయుక్త బీజం నుంచి ఏర్పడుతుంది.  ఈ మొక్కపై ప్రత్యుత్పత్తి అంగాలు (పుష్పాలు) ఏర్పడతాయి.
సంయోగ బీజద దశ: ఇది ఏకస్థితిక (n) దశ. సిద్ధ బీజమాతృకణాలు క్షయకరణ విభజన ఫలితంగా ఏర్పడిన సిద్ధబీజం నుంచి ఈ దశ ఏర్పడుతుంది. ఆవృత బీజాల్లో సిద్ధబీజ మాతృకణాలు రెండు రకాలు. సూక్ష్మ సిద్ధబీజ మాతృకణాలు పరాగకోశంలో; స్థూల సిద్ధబీజ మాతృకణాలు అండంలోని అండాంతః కణజాలంలో అభివృద్ధి చెందుతాయి. ఈ మాతృకణాల్లో క్షయకరణ విభజన జరగడం వల్ల సూక్ష్మ, స్థూల సిద్ధబీజాలు ఏర్పడతాయి. సూక్ష్మ, స్థూల సిద్ధ బీజాలు వరుసగా పురుష, స్త్రీ సంయోగబీజాలను ఏర్పరుస్తాయి. పురుష, స్త్రీ సంయోగ బీజాలు వరుసగా పురుష సంయోగ బీజం, స్త్రీ బీజకణాలను ఏర్పరుస్తాయి. పురుష సంయోగబీజం, స్త్రీ బీజ కణంతో సంయోగం చెంది ద్వయస్థితిక (2n) సంయుక్త బీజం ఏర్పడుతుంది. అనేక సమ విభజనల అనంతరం విత్తనంలో సంయుక్తబీజం పిండం (2n) ఏర్పడుతుంది. విత్తనం మొలకెత్తి సిద్ధబీజద మొక్క ఏర్పడుతుంది.

 

దీర్ఘ సమాధాన ప్రశ్న 

1. పుష్పంలో ఫలదీకరణం తర్వాత జరిగే మార్పులను వివరించండి.
జ: ఆవృత బీజాల్లో ఫలదీకరణ తర్వాత పుష్పంలో జరిగే మార్పులను ఫలదీకరణానంతర మార్పులు అంటారు. సంయుక్త బీజం ఏర్పడటం, పిండ జననం ముఖ్యమైన మార్పులు.
* అండాశయం బాగా ఆహార పదార్థాలను సేకరించి ఫలంగా మారుతుంది.
* ఇది రక్షణ కోసం ఒక మందమైన 'ఫలకవచాన్ని' ఏర్పరచుకుంటుంది.
* పుష్పంలోని రక్షక పత్రావళి, ఆకర్షణ పత్రావళి, కేసరావళి, అండకోశంలోని కీలం, కీలాగ్రం వడలి రాలిపోతాయి.
* కొన్ని మొక్కల్లో ఫలాన్ని అంటిపెట్టుకుని ఉన్న రక్షక పత్రావళిని శాశ్వత రక్షక పత్రావళి అంటారు.  (సోలనేసిలో కొన్ని మొక్కలు, ఆస్టరేసిలో కేశగుచ్ఛం)
* ఫలదీకరణం చెందిన అండాలు విత్తనాలుగా మారతాయి.
* అండవృంతం విత్తన వృంతంగా మారుతుంది.
* బాహ్య అండ కవచం బాహ్య బీజకవచం (టెస్టా)గా, అంతర అండ కవచం అంతర బీజ కవచం (టెగ్మన్)గా ఏర్పడతాయి.
* అండద్వారం బీజ ద్వారంగా, అండచార విత్తు చారగా మారతాయి.
* సంయుక్త బీజం పిండంగా వృద్ధి చెందుతుంది.
* సహాయ కణాలు, ప్రతిపాద కణాలు క్షీణిస్తాయి.
* ప్రాథమిక అంకురచ్ఛద కేంద్రకం అంకురచ్ఛదంగా వృద్ధి చెందుతుంది. ఇది అభివృద్ధి చెందే పిండాలకు పోషకాలను అందిస్తుంది. ఇది త్రయ స్థితికం (3n). అంకురచ్ఛదం పూర్తిగా వినియోగం చెందితే అంకురచ్ఛద రహిత విత్తనాలు (డాలికస్ - చిక్కుడు), అరాఖిస్ (వేరుశనగ); కొంత మిగిలి ఉంటే అంకురచ్ఛద సహిత విత్తనాలు రిసినస్ (ఆముదం), కోకాస్ (కొబ్బరి) ఏర్పడతాయి. విత్తనం పరిపక్వం అయ్యేసరికి అండాంతఃకణజాలం మిగిలి ఉంటే దాని పరిచ్ఛదం అంటారు.
 ఉదా: మిరియాలు, కలువ గింజలు
* కొన్ని మొక్కల్లో ఫలదీకరణ చెందిన అండంలోని అండ వృంతం నుంచి అండ కవచాన్ని పోలిన బాహ్య పెరుగుదల ఏర్పడుతుంది (బీజపుచ్ఛం).
   ఉదా: పితకలోబియమ్ డల్సి (సీమచింత), మిరిస్టికా ఫ్రాగ్రెన్స్ (జాజికాయ).
* కొన్ని మొక్కల్లో విత్తనాల్లో బీజరంధ్రం ప్రాంతంలోని అండ కవచాల కణాల నుంచి ఏర్పడే స్పంజి లాంటి బాహ్య పెరుగుదలను 'కారంకుల్' అంటారు. ఇది విత్తనం అంకురించే సమయంలో నీటిశోషణకు ఉపయోగపడుతుంది.

ఉదా: రిసినస్ కమ్యూనిస్ (ఆముదం)

Posted Date : 28-08-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని

విద్యా ఉద్యోగ సమాచారం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌