• facebook
  • whatsapp
  • telegram

ఇంటర్మీడియట్‌తో నౌకాదళం కొలువులు

2500 సెయిలర్‌ ఉద్యోగాలకు ప్రకటన విడుదల

తక్కువ విద్యార్హతతో, చిన్న వయసులోనే చక్కని ఉద్యోగాలు పొందే అవకాశం వచ్చింది! ఇంటర్మీడియట్‌ అర్హతతో ప్రతి ఆరు నెలలకు ఒకసారి క్రమం తప్పకుండా భారతీయ నౌకాదళం సెయిలర్‌ పోస్టులకు ప్రకటనలు విడుదల చేస్తోంది. అందువల్ల వీటిని లక్ష్యంగా చేసుకున్నవారు విజయాన్ని అందుకోవచ్చు. తాజాగా 2500 పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది! 

ప్రకటించిన ఖాళీల్లో సీనియర్‌ సెకెండరీ రిక్రూట్‌ (ఎస్‌ఎస్‌ఆర్‌) 2000, ఆర్టిఫీసర్‌ అప్రెంటీస్‌ (ఏఏ) 500 ఉన్నాయి. రాత పరీక్ష, ఫిజికల్‌ టెస్టుల్లో చూపిన ప్రతిభతో నియామకాలు చేపడతారు. శిక్షణ నిర్వహించి అనంతరం విధుల్లోకి చేర్చుకుంటారు. వీరు ఆకర్షణీయ వేతనంతోపాటు పలు ప్రోత్సాహకాలు పొందవచ్చు.

క్యాలెండర్‌ ప్రకారం పోస్టులు భర్తీచేయడం రక్షణ ఉద్యోగాల ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఇంటర్మీడియట్‌ అర్హతతో నిర్వహించే సెయిలర్‌ - ఎస్‌ఎస్‌ఆర్, ఏఏ పోస్టుకు జాతీయ స్థాయిలో పరీక్షలు నిర్వహించినప్పటికీ భర్తీ మాత్రం రాష్ట్రాలవారీగా కేటాయించిన ఖాళీల ప్రకారం జరుగుతుంది. ఎంపీసీ గ్రూపుతో ఇంటర్మీడియట్‌ పూర్తిచేసుకున్న విద్యార్థులు ఎస్‌ఎస్‌ఆర్, ఏఏ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్షను ఉమ్మడిగా నిర్వహిస్తారు. వీటిలో ఏ పోస్టుకు ఎంపికైనప్పటికీ శిక్షణ సమయంలో రూ.14,600 చెల్లిస్తారు. అనంతరం లెవెల్‌ 3 ప్రకారం రూ.21,700 మూలవేతనం లభిస్తుంది. దీంతోపాటు రూ.5200 మిలటరీ సర్వీస్‌ పే (ఎంఎస్‌పీ) చెల్లిస్తారు. వీటికి అదనంగా డీఏ, ఇతర ప్రోత్సాహకాలు అందుకోవచ్చు. 

ఏఏకు ఎంపికైనవారికి ఎక్స్‌ గ్రూప్‌ పే కింద అదనంగా రూ.6200 అందుతుంది. అన్ని ప్రోత్సాహకాలూ కలుపుకుని ఎస్‌ఎస్‌ఆర్‌లు ప్రారంభంలోనే రూ.35 వేలు, ఏఏలు రూ.42 వేల వరకు వేతన రూపంలో పొందవచ్చు. క్యాంటీన్, ఎల్‌టీసీ, వైద్య సేవలు..మొదలైన సౌకర్యాలు కల్పిస్తారు. ఏఏకు ఎంపికైనవాళ్లు 20, ఎస్‌ఎస్‌ఆర్‌ విభాగాల్లో చేరినవాళ్లు 15 ఏళ్లు ఉద్యోగంలో కొనసాగవచ్చు. ఆ తర్వాత అభ్యర్థుల ఆసక్తి, నేవీ అవసరాలకు అనుగుణంగా సేవలు పొడిగిస్తారు. నిర్ణీత వ్యవధి తర్వాత పదవీ విరమణ చేసినవారికి పూర్తిస్థాయి పింఛను లభిస్తుంది. సెయిలర్‌- ఎస్‌ఎస్‌ఆర్, ఏఏగా విధుల్లో చేరినవారు భవిష్యత్తులో లెవెల్‌ 8 మాస్టర్‌ చీఫ్‌ పెటీ ఆఫీసర్‌-1 హోదా వరకు చేరుకోవచ్చు.   

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్టు (పీఎఫ్‌టీ), ప్రాథమిక వైద్య పరీక్షల ద్వారా అర్హులను ఎంపిక చేస్తారు. ఒక్కో ఖాళీకి నలుగురు చొప్పున ఇంటర్‌ మార్కుల మెరిట్, రాష్ట్రాల కోటా ప్రకారం మొత్తం పదివేల మందికి పరీక్ష రాసే అవకాశం కల్పిస్తారు.  

పరీక్ష ఇలా...

ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున వంద ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి గంట. ప్రశ్నపత్రంలో 4 సెక్షన్లు ఉంటాయి. అవి ఇంగ్లిష్, మ్యాథ్స్, సైన్స్, జనరల్‌ అవేర్‌నెస్‌. ప్రశ్నలన్నీ 10+2 (ఇంటర్మీడియట్‌) స్థాయిలోనే ఉంటాయి. రుణాత్మక మార్కులు ఉన్నాయి. తప్పుగా గుర్తించిన ప్రతి సమాధానానికీ పావు మార్కు చొప్పున తగ్గిస్తారు. అన్ని సెక్షన్లలోనూ కనీస అర్హత మార్కులు సాధించాలి అలాగే నిర్ణీత సగటు కంటే ఎక్కువ స్కోర్‌ ఉన్నవారిని తర్వాత దశకు తీసుకుంటారు. ఈ పరీక్షకు సంబంధించిన సిలబస్, మాదిరి ప్రశ్నపత్రాలను నేవీ వెబ్‌సైట్‌ నుంచి పొందవచ్చు. పరీక్షకు 72 గంటల ముందు తీసుకున్న ఆర్‌టీపీసీఆర్‌ నెగెటివ్‌ రిపోర్టు తీసుకుని వెళ్లాలి.    

పరీక్షలో అర్హత సాధించినవారికి పీఎఫ్‌టీ నిర్వహిస్తారు. ఇందులో భాగంగా 1.6 కి.మీ. దూరాన్ని 7 నిమిషాల్లో పరుగెత్తాలి. 20 స్క్వేట్‌ అప్స్, 10 పుష్‌అప్స్‌ తీయగలగాలి. అభ్యర్థులు కనీసం 157 సెం.మీ. ఎత్తు ఉండాలి. ఊపిరి పీల్చక ముందు, పీల్చిన తర్వాత ఛాతీ కొలతలో వ్యత్యాసం కనీసం 5 సెం.మీ. రావాలి. ఏఏ పోస్టులకు 600, ఎస్‌ఎస్‌ఆర్‌ పోస్టులకు 2500 మందిని ఎంపికచేసి వైద్యపరీక్షలు జరుపుతారు. ఇందులోనూ విజయవంతమైతే రాత పరీక్షలో చూపిన ప్రతిభ ప్రాతిపదికన మెరిట్‌ ఆధారంగా ఆయా రాష్ట్రాల కోటా ప్రకారం తుది నియామకాలు చేపడతారు. 

శిక్షణ: ఐఎన్‌ఎస్‌ చిలక సర్సులో ఆగస్టు నుంచి శిక్షణ మొదలవుతుంది. ఏఏ పోస్టుకు 9 వారాలు, ఎస్‌ఎస్‌ఆర్‌ ఉద్యోగాలకు 22 వారాలపాటు ఇది కొనసాగుతుంది. అనంతరం అభ్యర్థులకు కేటాయించిన బ్రాంచ్‌/ ట్రేడుల్లో ఏదైనా నేవీ కేంద్రంలో తర్వాత దశ శిక్షణ ఉంటుంది. విజయవంతంగా ప్రొఫెషనల్‌ శిక్షణను పూర్తిచేసుకున్నవారిని సెయిలర్‌ - ఏఏ/ ఎస్‌ఎస్‌ఆర్‌ హోదాతో ఉద్యోగంలోకి తీసుకుంటారు.

విధులు: ఆర్టిఫీసర్‌ అప్రెంటిస్‌ విధులు నిర్వర్తించేవారు నేవీలో ఉపయోగించే పరికరాలు (టర్బైన్లు, యంత్రాలు) నిర్వహణ, మరమ్మతులను చేపడతారు. వీరికి డిప్లొమా సర్టిఫికెట్‌ అందిస్తారు. ఎస్‌ఎస్‌ఆర్‌ విభాగంలో చేరినవాళ్లు అధునాతన నౌకలు, శక్తిమంతమైన పరికరాల నిర్వహణ, పర్యవేక్షణ తదితర బాధ్యతలు తీసుకుంటారు. సబ్‌మెరైన్లు, ఎయిర్‌క్రాఫ్ట్‌లకు అవసరమైన మరమ్మతులు వీరే చూసుకుంటారు. వీరికి 15 ఏళ్ల సర్వీసు అనంతరం డిగ్రీతో సమానమైన సర్టిఫికెట్‌ ప్రదానం చేస్తారు.

ఇవీ అర్హతలు

సెయిలర్‌-ఎస్‌ఎస్‌ఆర్, ఏఏ ఉద్యోగాలకు అవివాహిత పురుషులే అర్హులు.

సీనియర్‌ సెకెండరీ రిక్రూట్‌ (ఎస్‌ఎస్‌ఆర్‌): ఇంటర్మీడియట్‌ మ్యాథ్స్, ఫిజిక్స్‌తోపాటు కెమిస్ట్రీ/ బయాలజీ/ కంంప్యూటర్‌ సైన్స్‌ వీటిలో ఏదో ఒక సబ్జెక్టు చదివుండాలి. 

ఆర్టిఫీషర్‌ అప్రెంటిస్‌ (ఏఏ): ఇంటర్మీడియట్‌ మ్యాథ్స్, ఫిజిక్స్‌తోపాటు కెమిస్ట్రీ/ బయాలజీ/ కంంప్యూటర్‌ సైన్స్‌ వీటిలో ఏదో ఒక సబ్జెక్టు చదివుండాలి. ఈ సబ్జెక్టుల్లో కనీసం 60 శాతం మార్కులు సాధించడం తప్పనిసరి. 

వయసు: ఎస్‌ఎస్‌ఆర్, ఏఏ రెండు పోస్టులకూ ఆగస్టు 1, 2002 - జులై 31, 2005 మధ్య జన్మించి ఉండాలి. 

ఆన్‌లైన్‌ దరఖాస్తులు: మార్చి 29 నుంచి ఏప్రిల్‌ 5 వరకు స్వీకరిస్తారు.

పరీక్ష: మే/జూన్‌లో నిర్వహిస్తారు. 

వెబ్‌సైట్‌: https://www.joinindiannavy.gov.in/
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ IIT Madras‌: ఐఐటీ మద్రాస్‌ ఆన్‌లైన్‌ బీఎస్సీ

‣ అడోబ్‌ ఇంటర్న్‌షిప్‌ అలా సాధించారు!

‣ ఏఈ పరీక్ష తుది సన్నద్ధత ఎలా?

‣ సర్కారు కొలువుకు సిద్ధమయ్యే ముందు..!

‣ నేర్పుగా... ఓర్పుగా!

‣ అర్హత ఉన్న అన్ని ఉద్యోగాలకు ప్రారంభించండి ప్రిపరేషన్‌!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 21-03-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌