• facebook
  • whatsapp
  • telegram

నౌకాదళంలో 910 సివిల్‌ కొలువులు

ఐఎన్‌సెట్‌ నోటిఫికేషన్‌ విడుదల



భారత నౌకాదళం 910 ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ విద్యార్హతలతో వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష ఆధారంగా నియామకాలుంటాయి. ఎంపికైనవారు ఆకర్షణీయ వేతనాలు అందుకోవచ్చు. ఇవి సివిల్‌ పోస్టులు. మహిళలు, దివ్యాంగులూ పోటీ పడవచ్చు. బ్యాంకు, ఎస్‌ఎస్‌సీ, రైల్వే ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్నవారు పరీక్షను సులువుగానే ఎదుర్కోవచ్చు.  


ఇండియన్‌ నేవీ సివిలియన్‌ ఎంట్రన్స్‌ టెస్టు (ఐఎన్‌సెట్‌)తో ఈ పోస్టులు భర్తీ చేస్తారు. గ్రూప్‌ బీ, గ్రూప్‌ సీ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. వీటికి ఎంపికైనవారు చార్జ్‌మెన్, సీనియర్‌ డ్రాఫ్ట్స్‌మెన్, ట్రేడ్స్‌మెన్‌ మేట్‌ హోదాతో విధులు నిర్వర్తిస్తారు. ఇవన్నీ సాంకేతిక సేవలకు చెందిన ఉద్యోగాలే. వీరికి ఎలాంటి దేహదార్ఢ్య పరీక్షలూ ఉండవు. రాత పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సాధారణ వైద్య పరీక్షలతో ఉద్యోగంలోకి తీసుకుంటారు. దేశంలో ఉన్న నేవీ కేంద్రాల్లో వీరు విధులు నిర్వర్తిస్తారు. ఆసక్తి ఉన్నవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.  


పోస్టులు, ఖాళీలు

గ్రూప్‌ బీలో..

ఛార్జ్‌మెన్‌ వర్క్‌షాప్‌

ఖాళీలు: 22

అర్హత: బీఎస్సీ మ్యాథ్స్‌/ఫిజిక్స్‌/కెమిస్ట్రీ వీటిలో ఏదైనా సబ్జెక్టు చదివుండాలి లేదా కెమికల్‌ ఇంజినీరింగ్‌లో డిప్లొమా


ఛార్జ్‌మెన్‌ ఫ్యాక్టరీ

ఖాళీలు: 20

అర్హత: బీఎస్సీ మ్యాథ్స్‌/ ఫిజిక్స్‌/ కెమిస్ట్రీ వీటిలో ఏదైనా సబ్జెక్టు చదివుండాలి లేదా ఎలక్ట్రికల్‌/ ఎలక్ట్రానిక్స్‌/ మెకానికల్‌/ కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌లో డిప్లొమా


సీనియర్‌ డ్రాఫ్ట్స్‌మెన్‌ 

ఖాళీలు: ఎలక్ట్రికల్‌ 142, మెకానికల్‌ 26, కన్‌స్ట్రక్షన్‌ 29, కార్టోగ్రాఫిక్‌ 11, ఆర్మమెంట్‌ 50

అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత అనంతరం రెండేళ్ల డిప్లొమా లేదా డ్రాఫ్ట్‌మెన్‌షిప్‌లో ఐటీఐ సర్టిఫికెట్‌ ఉండాలి. దరఖాస్తు చేసుకున్న విభాగం ప్రకారం ఎలక్ట్రికల్‌/ మెకానికల్‌/ నేవల్‌ ఆర్కిటెక్చర్‌/ కార్ట్టోగ్రఫీ వీటిలో ఎందులోనైనా మూడేళ్లు డ్రాయింగ్‌/ డిజైన్‌ అనుభవం తప్పనిసరి. 


గ్రూప్‌ సీలో..

డ్రాఫ్ట్స్‌మెన్‌ మేట్‌

ఖాళీలు: 610. ఈస్టర్న్‌ నేవల్‌ కమాండ్‌ 9, వెస్ట్రన్‌ నేవల్‌ కమాండ్‌ 565, సదరన్‌ నేవల్‌ కమాండ్‌ 36

అర్హత: పదోతరగతి ఉత్తీర్ణతతోపాటు నిర్దేశిత ట్రేడుల్లో ఐటీఐ సర్టిఫికెట్‌ అవసరం. నోటిఫికేషన్‌లో పేర్కొన్న 64 ఐటీఐ ట్రేడుల్లో ఏదైనా పూర్తి చేసుకున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.



ప్రశ్నల స్థాయిలో తేడా

గ్రూప్‌ బీ, గ్రూప్‌ సీ రెండు పోస్టులకూ విడిగా పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష విధానం, సిలబస్‌ ఒకటే. అయితే ప్రశ్నల స్థాయిలో తేడా ఉంటుంది. గ్రూప్‌ సీ ప్రశ్నపత్రం పదో తరగతి స్థాయిలో, గ్రూప్‌ బీ డిగ్రీ స్థాయిలో వస్తుంది. 

పరీక్షను వంద మార్కులకు ఆబ్జెక్టివ్‌ పద్ధతిలో నిర్వహిస్తారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. మొత్తం వంద ప్రశ్నలు. ఇందులో జనరల్‌ ఇంటెలిజెన్స్‌ 25, జనరల్‌ అవేర్‌నెస్‌ 25, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ 25, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 25 ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది. వ్యవధి 90 నిమిషాలు. పరీక్షలో విజయవంతమైతే, వైద్య పరీక్షలు నిర్వహించి, ఉద్యోగంలోకి తీసుకుంటారు. 


ప్రశ్నలు ఏ అంశాల్లో? 

జనరల్‌ ఇంటెలిజెన్స్‌: మ్యాథ్స్‌ ఆపరేషన్స్, సిరీస్, ఆడ్‌మెన్‌ అవుట్, లాజికల్‌ వెన్‌ డయాగ్రమ్‌లు, ఎనాలజీ, వర్డ్‌ బేస్డ్‌ ప్రాబ్లమ్స్, ప్రాబ్లమ్‌ సాల్వింగ్, డ్రాయింగ్‌ ఇన్ఫరెన్స్, కోడింగ్‌ డీకోడింగ్, నాన్‌ వెర్బల్‌ రీజనింగ్‌ నుంచి ప్రశ్నలు వస్తాయి. పోలికలు, తేడాలు, పరిశీలనలు, సంబంధాలు.. మొదలైన విభాగాలను బాగా అధ్యయనం చేయాలి. గణితంలోని ప్రాథమికాంశాలపై పట్టు సాధించడం ద్వారా వీటికి సమాధానాలు గుర్తించవచ్చు. తర్కంతో ముడిపడే తేలిక ప్రశ్నలే అడుగుతారు. 


జనరల్‌ అవేర్‌నెస్‌: ఈ విభాగంలోని ప్రశ్నలకు సమాధానాలు గుర్తించడానికి ప్రత్యేక ప్రావీణ్యం అవసరం లేదు. సాధారణ పరిజ్ఞానంతోనే జవాబులు రాయవచ్చు. ఎక్కువ ప్రశ్నలు దైనందిన జీవితంతో ముడిపడే ఉంటాయి. పర్యావరణాంశాలకు ప్రాధాన్యం. రోజువారీ సంఘటనలే (వర్తమాన వ్యవహారాలు) ప్రశ్నలుగా వస్తాయి. వీటితోపాటు భారత్‌- పొరుగు దేశాలు, చరిత్ర, సంస్కృతి, భూగోళం, ఆర్థిక వ్యవహారాలు, భారత రాజ్యాంగం, సైన్స్‌ పరిశోధనలు.. నుంచి ప్రశ్నలు వస్తాయి. హైస్కూల్‌ సోషల్, సైన్స్‌ పాఠ్యపుస్తకాలు బాగా చదువుకుంటే సరిపోతుంది. వర్తమాన వ్యవహారాల ప్రశ్నలు ఎదుర్కోవడానికి జనవరి 2023 నుంచి ముఖ్యాంశాలపై దృష్టి సారించాలి.  


క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌: నంబర్‌ సిస్టమ్స్, టైమ్‌ అండ్‌ వర్క్, రేషియో అండ్‌ ప్రపోర్షన్, సరాసరి, లాభనష్టాలు, రాయితీ, శాతాలు, కాలం-దూరం, వడ్డీలు, స్టాటిస్టికల్‌ చార్టులు, చలన జ్యామితి, త్రికోణమితిల్లో ప్రశ్నలు ఉంటాయి. అంకెలతో ముడిపడే ప్రశ్నలే ఎక్కువగా అడుగుతారు. వీటిలో దాదాపు అన్ని అంశాలూ హైస్కూల్‌ మ్యాథ్స్‌ పుస్తకాల్లోనివే. వాటిని బాగా చదువుకుని వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేస్తే సరిపోతుంది.


ఇంగ్లిష్‌: అభ్యర్థి ప్రాథమిక ఆంగ్ల పరిజ్ఞానాన్ని పరిశీలించేలా ప్రశ్నలు వస్తాయి. ఖాళీలు పూరించడం, వాక్యాల్లో తప్పును గుర్తించడం, సమానార్థకాలు, వ్యతిరేక పదాలు, తప్పుగా ఉన్న పదాన్ని గుర్తించడం, జాతీయాలు, సామెతలు, ప్రత్యక్ష, పరోక్ష వాక్యాలుగా మార్చడం, వాక్యంలో పదాలను క్రమ పద్ధతిలో అమర్చడం, కాంప్రహెన్షన్‌..తదితర విభాగాల నుంచే వీటిని అడుగుతారు హైస్కూల్‌ స్థాయి ఆంగ్ల పాఠ్యపుస్తకాల్లోని వ్యాకరణాంశాలు బాగా చదువుకుంటే ఎక్కువ మార్కులు సాధించడం కష్టమేమీ కాదు. 


విధులు, వేతనం

గ్రూప్‌ బీ పోస్టులకు ఎంపికైనవారు లెవెల్‌-6 వేతనం అందుకోవచ్చు. రూ.35,400 మూలవేతనం ఉంటుంది. దీనికి అలవెన్సులు అదనం. అన్నీ కలిపి సుమారు రూ.55,000 మొదటి నెల నుంచే అందుకోవచ్చు. వీరు ఇంజినీర్లు, అధికారులకు సహాయకులుగా ఉంటారు. సాంకేతిక సేవల్లో భాగమవుతారు. గ్రూప్‌ సీలో.. ట్రేడ్స్‌మెన్‌ మేట్‌ ఉద్యోగంలో చేరినవారికి రూ.18,000 మూలవేతనం లభిస్తుంది. డీఏ, హెచ్‌ఆర్‌ఏ.. అన్నీ కలిపి రూ.30 వేల వరకు ప్రారంభ వేతనం పొందవచ్చు. వీరు ప్రధానంగా సబ్‌మెరైన్లు, షిప్పుల ఉత్పత్తి/నిర్వహణ విధుల్లో పాల్గొంటారు. వీటికి సంబంధించిన వివరాలు నమోదు, ఫైళ్లను తీసుకెళ్లడం, కార్యాలయం, ఫర్నిచర్, పార్కులు మొదలైనవి శుభ్రపరచడం..తదితరాలు వీరి బాధ్యతల్లో భాగం. అలాగే కార్యాలయాల్లో చేయాల్సిన నాన్‌ క్లరికల్‌ సహాయక కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు. 


వయసు: ఛార్జ్‌మెన్, ట్రేడ్స్‌మెన్‌ మేట్‌ పోస్టులకు డిసెంబరు 31, 2023 నాటికి 18-25 ఏళ్లలోపు ఉండాలి. సీనియర్‌ డ్రాఫ్ట్స్‌మెన్‌ ఖాళీలకు 27 ఏళ్ల వరకు అవకాశం. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపులు వర్తిస్తాయి. 


ఆన్‌లైన్‌ దరఖాస్తులు: డిసెంబరు 31 వరకు స్వీకరిస్తారు.


ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలు చెల్లించనవసరం లేదు. మిగిలినవారికి రూ.295. 


పరీక్ష తేదీ: తర్వాత ప్రకటిస్తారు. ఈ సమాచారం ఈమెయిల్, మొబైల్‌కు అందుతుంది. 


వెబ్‌సైట్‌: https://www.joinindiannavy.gov.in/


ఇదీ సన్నద్ధత

సిలబస్‌ వివరాలు శ్రద్ధగా గమనించాలి. అంశాలవారీగా వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధించాలి.

గతంలో నిర్వహించిన ఐఎన్‌సెట్‌ ప్రశ్నపత్రాలను పరిశీలించాలి. వీటిద్వారా ప్రశ్నల స్థాయి తెలుస్తుంది. సాధనను అందుకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలి.  

పరీక్షలో 90 నిమిషాల వ్యవధిలో వంద ప్రశ్నలకు జవాబులు గుర్తించాలి. అంటే ప్రతి ప్రశ్నకు 54 సెకన్ల సమయమే ఉంటుంది. అందువల్ల అభ్యర్థులు తక్కువ వ్యవధిలో వీలైనన్ని సరైన సమాధానాలు గుర్తిస్తేనే విజయం సాధించగలరు.  

క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్, జనరల్‌ ఇంటెలిజెన్స్‌ విభాగాల ప్రశ్నలకు జవాబులు గుర్తించడానికి ఎక్కువ సమయం కావాలి. పరీక్షకు ముందు వీలైనన్ని ఎక్కువ సంఖ్యలో మాదిరి ప్రశ్నలు సాధన చేయడం, సూత్రాలు ఉపయోగించే విధానం, షార్ట్‌ కట్‌ మెథడ్స్‌పై పట్టు సాధిస్తే తక్కువ వ్యవధిలో జవాబు గుర్తించగలుగుతారు. 

ఆర్మీ, నేవీ, ఎయిర్‌ ఫోర్స్‌.. అగ్నివీర్‌ పరీక్షల ప్రశ్నపత్రాలూ అధ్యయనంలో ఉపయోగమే. 

గ్రూప్‌ సీలోని ట్రేడ్స్‌మెన్‌ మేట్‌ పోస్టులకు ప్రశ్నలన్నీ సగటు అభ్యర్థి జవాబు గుర్తించ గలిగే సాధారణ స్థాయిలోనే ఉంటాయి. వీటికోసం 8, 9, 10 తరగతుల మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఇంగ్లిష్‌ పుస్తకాలు బాగా చదువుకుంటే అధిక మార్కులు సాధించవచ్చు. ఇప్పటికే బ్యాంకు క్లరికల్, ఆర్‌ఆర్‌బీ, ఎస్‌ఎస్‌సీ.. ఇంటర్మీడియట్‌ అర్హతతో నిర్వహించే పరీక్షలకు సన్నద్ధమవుతున్నవారు గ్రూప్‌ సీ పరీక్షను సులువుగానే ఎదుర్కోగలరు. 

ఐబీపీఎస్, ఆర్‌ఆర్‌బీ, ఎస్‌ఎస్‌సీ.. డిగ్రీ అర్హతతో నిర్వహించే పరీక్షలకు సన్నద్ధమయ్యేవారు గ్రూప్‌ బీ ప్రశ్నలకు సులువుగానే జవాబులు గుర్తించగలరు. 

గ్రూప్‌ బీ, గ్రూప్‌ సీ రెండు పోస్టులకూ ఐబీపీఎస్, ఎస్‌ఎస్‌సీ, రైల్వే పాత ప్రశ్నపత్రాలు అధ్యయనంలో బాగా ఉపయోగపడతాయి. 

పరీక్షకు ముందు కనీసం ఐదారు మాక్‌ టెస్టులు రాయాలి. వాటి ఫలితాలు సమీక్షించుకోవాలి. 


-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఫుట్‌వేర్‌ తయారీలో శిక్షణ ఇలా..

‣ ఉక్కు సంస్థలో ఉన్నత ఉద్యోగాలు

‣ సివిల్స్‌ మౌఖిక పరీక్షకు మౌలిక సూచనలు

‣ డిప్లొమాతో ఎన్‌టీపీసీలో అవకాశాలు

‣ ఫర్నిచర్‌ డిజైన్‌ కెరియర్‌ గైడెన్స్‌

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Follow us on Whataapp, Telegram, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 19-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌