• facebook
  • whatsapp
  • telegram

మైనారిటీ విద్యార్థినులకు ఉపకారం

బేగం హజ్రత్‌మహల్‌ నేషనల్‌ స్కాలర్‌షిప్‌ ప్రకటన విడుదల

మైనారిటీ వర్గాలకు చెందిన చాలా మందికి పేదరికమే పెద్ద సమస్య. అందులోనూ ఎక్కువశాతం మైనారిటీ బాలికల చదువులకు ఆర్థిక సమస్యలే అవరోధం. దీంతో ఆసక్తి, ప్రతిభ ఉన్నప్పటికీ అర్ధాంతరంగా చదువులను ఆపేయాల్సి వస్తోంది. ఈ ఇబ్బందిని అధిగమించడానికి కొన్ని ప్రత్యేక ఉపకార వేతనాలు ఉన్నాయి. వాటిలో బేగం హజ్రత్‌మహల్‌ నేషనల్‌ స్కాలర్‌షిప్‌ ముఖ్యమైంది. దీన్ని కేంద్రప్రభుత్వం ఏటా అందిస్తోంది. తాజాగా 2021-22 విద్యా సంవత్సరానికి ఆ ప్రకటన వెలువడింది. 

ప్రతిభావంతులైన మైనారిటీ పేద బాలికలను ఉన్నత చదువులకు ప్రోత్సహించేలా ఈ స్కాలర్‌షిప్‌ను 2003లో ప్రారంభించారు. దిల్లీలోని మౌలానా ఆజాద్‌ ఎడ్యుకేషన్‌ ఫౌండేషన్‌ ఈ ఉపకార వేతనాలను అందిస్తోంది. 

ఎవరు అర్హులు..?

తొమ్మిది, పది, ఇంటర్‌ మొదటి, రెండో సంవత్సరం తరగతుల్లో కనీసం 50 శాతం మార్కులు సాధించిన మైనార్టీ వర్గాల విద్యార్థినులు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే ఉదాహరణకు పదో తరగతి విద్యార్థిని స్కాలర్‌షిప్‌నకు దరఖాస్తు చేసుకుంటే, ఆమె తొమ్మిదో తరగతి మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. అభ్యర్థులు మైనారిటీ వర్గాల్లోని ముస్లిం, క్రైస్తవ, సిక్కు, బౌద్ధ, పార్సీ, జైన మతాలకు చెంది ఉండాలి. బాలికల తల్లిదండ్రుల ఆదాయం ఏటా రెండు లక్షల రూపాయలు మించకూడదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏవైనా ఉపకారవేతనాలు పొందుతున్నవారు దీనికి దరఖాస్తు చేసుకోడానికి అనర్హులు. 

ఎంపిక విధానం...

అభ్యర్థుల అకడమిక్‌ మెరిట్, వారి కుటుంబ ఆదాయం ఇతర వివరాలను పరిగణనలోకి తీసుకుని ఎంపిక చేస్తారు. 

నేరుగా బ్యాంకు ఖాతాలోకి... 

తొమ్మిది, పది తరగతులు చదువుతున్న విద్యార్థినులకు నెలకు రూ. 5000, ఇంటర్మీడియట్‌వారికి నెలకు రూ.6000 చొప్పున స్కాలర్‌షిప్‌ ఇస్తారు. ప్రతి నెలా నేరుగా అభ్యర్థుల బ్యాంకు ఖాతాలో డబ్బు జమ చేస్తారు. స్కాలర్‌షిప్‌ పొందినవారు ఏదైనా కారణంతో చదువును మధ్యలో ఆపేస్తే వారి ఉపకారవేతనం రద్దవుతుంది. 

దరఖాస్తు విధానం...

అర్హులైన మైనారిటీ బాలికలు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు నిమిత్తం ఎలాంటి ఫీజు చెల్లించనవసరం లేదు. స్కూల్‌ వెరిఫికేషన్‌ ఫారాన్ని డౌన్‌లోడ్‌ చేసుకుని అందులో వివరాలు నమోదుచేసి ఫొటో అతికించి, దానిపై ప్రిన్సిపల్‌ సంతకం, స్కూల్‌ స్టాంప్‌ వేయించాలి. అనంతరం ఈ ఫారాన్ని స్కాన్‌చేసి అప్లికేషన్‌తోపాటు ఆదాయ ధ్రువీకరణ పత్రాన్నీ సంబంధిత వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలి.  

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: నవంబరు 30, 2021.

వెబ్‌సైట్: https://www.maef.nic.in/scholarship-scheme

Posted Date: 22-10-2021


 

తాజా కథనాలు

మరిన్ని