• facebook
  • whatsapp
  • telegram

మైనారిటీలకు కేంద్రం ఆర్థిక చేయూత

ప్రీ, పోస్ట్‌మెట్రిక్‌, మెట్రిక్‌కమ్‌ మీన్స్‌బేస్డ్‌ స్కాలర్‌షిప్‌లకు ప్రకటన విడుదల

మ‌న‌దేశంలో చ‌దువుకు అయ్యే ఖ‌ర్చు త‌క్కువేం కాదు. ప్రాథ‌మిక ద‌శ నుంచి ఉన్నత విద్య వ‌ర‌కు లక్షల రూపాయ‌లు వెచ్చించాల్సిందే. పిల్లలను చ‌దివించే ఆర్థిక స్థోమ‌త లేక త‌ల్లిదండ్రులు ప‌నుల‌కు పంపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడేసేందుకు, ఆర్థికంగా వెనుక‌బ‌డిన మైనారిటీ వర్గాలకు చెందిన వారికి అండ‌గా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం ప‌లు ర‌కాల‌ స్కాల‌ర్‌షిప్‌లను అందిస్తోంది. తాజాగా 2021-22 విద్యా సంవత్సరానికి మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వశాఖ జైన్‌లు, బౌద్ధులు, సిక్కులు, పార్సీ, ముస్లిం, క్రిస్టియన్‌ అభ్యర్థుల నుంచి ఉపకార వేతనాలకు దరఖాస్తులు కోరుతోంది.

ఎవరు అర్హులు?

కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రీ-మెట్రిక్‌, పోస్ట్‌-మెట్రిక్‌, మెట్రిక్‌ కమ్‌ మీన్స్‌బేస్డ్‌ స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గత ఏడాది చదివిన తరగతిలో కనీసం 50 శాతం మార్కులు సాధించాలి. అంటే ఉదాహరణకు పదో తరగతి విద్యార్థి స్కాలర్‌షిప్‌నకు దరఖాస్తు చేసుకుంటే, తను తొమ్మిదో తరగతి మార్కులను పరిగణలోకి తీసుకుంటారు. కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ స్కాలర్‌షిప్‌ ఇస్తారు.

ఒకటి నుంచి పదో తరగతి మధ్య చదివేవారు ప్రీ-మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తు చేసుకోవచ్చు. తల్లిదండ్రుల వార్షికాదాయం లక్ష రూపాయలు మించకూడదు. 

ప్రభుత్వ/ ప్రైవేటు కాలేజ్‌/ యూనివర్సిటీల్లో హయ్యర్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌/ ఒకేషనల్‌ కోర్సులో శిక్షణ పొందే మైనారిటీ విద్యార్థులు పోస్ట్‌మెట్రికల్‌ స్కాలర్‌షిప్స్ పొందడానికి అర్హులు. తల్లిదండ్రుల వార్షికాదాయం ఏడాదికి రెండు లక్షల రూపాయలు మించకుండా ఉండాలి. 

ప్రొఫెషనల్‌, టెక్నికల్‌ కోర్సులు చదివే పేద, ప్రతిభావంతులైన మైనారిటీ విద్యార్థులు మెరిట్‌కమ్‌మీన్స్‌ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవాలి. తల్లిదండ్రుల వార్షికాదాయం ఏడాదికి రూ.2.50 లక్షలు మించకూడదు.

ఎంపిక విధానం

అభ్యర్థుల అకడమిక్‌ మెరిట్‌, తల్లిదండ్రుల వార్షికాదాయం ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. నిబంధనల ప్రకారం పైరెండింటి గ్రేడ్‌ సమానమైనప్పుడు విద్యార్థుల వయసును ప్రామాణికంగా తీసుకుని సీనియారిటీ ఆధారంగా ఎంపిక చేస్తారు. ప్రీ-మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ పరిధిలో 30 లక్షలు, పోస్ట్‌-మెట్రిక్‌ పరిధిలో 5 లక్షలు, మెరిట్‌కమ్‌మీన్స్‌ పరిధిలో 60 వేల మందికి స్కాలర్‌షిప్‌లు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. 

ఉపకారం ఎంతంటే..?

ప్రీ-మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ కింద ఒకటి నుంచి అయిదో తరగతి డే-స్కాలర్‌ విద్యార్థులకు మెయింటెనెన్స్‌ అలవెన్స్‌ కోసం నెలకు రూ.100 ఇస్తారు. ఆరు నుంచి పదో తరగతి వసతిగృహంలో ఉండే వారికి నెలకు రూ.600 మెయింటెనెన్స్‌ అలవెన్స్‌(డే-స్కాలర్‌కు రూ.100), ట్యూషన్‌ఫీజు నెలకు రూ.350, అడ్మిషన్‌ఫీజు రూ.500 ఇస్తారు. 

పోస్ట్‌మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ పరిధిలో అడ్మిషన్‌ఫీజు కింద ఏటా రూ.7000, కోర్సు/ ట్యూషన్‌ఫీజు కింద రూ.10000, మెయింటెనెన్స్‌ అలవెన్స్‌ కింద వసతిగృహంలో ఉండేవారికి నెలకు రూ.380, డే-స్కాలర్‌కి రూ.230 చెల్లిస్తారు. 

మెరిట్‌కమ్‌ మీన్స్‌బేస్డ్‌ స్కాలర్‌షిప్‌కు ఎంపిక అయిన వారికి కోర్సు ఫీజు కోసం రూ.20,000, మెయింటెనెన్స్‌ అలవెన్స్‌ కింద వసతిగృహంలో ఉండే వారికి నెలకు రూ.1000, డే-స్కాలర్‌ అభ్యర్థులకు రూ.500 చెల్లిస్తారు. దేశవ్యాప్తంగా కేంద్ర మంత్రిత్వశాఖ గుర్తింపు కలిగిన 85 విద్యాసంస్థలకు సంబంధించిన పూర్తి కోర్సు ఫీజును ఈ స్కాలర్‌షిప్‌ పరిధిలో మినహాయిస్తారు. 

ట్యూషన్‌ఫీజు విద్యాసంస్థకు చెందిన బ్యాంకు ఖాతాలో, మెయింటెనెన్స్‌ అలవెన్స్‌ విద్యార్థి బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. ఏడాదిలో పది నెలలను అకడమిక్‌ ఇయర్‌గా పరిగణించి ఉపకారవేతనాన్ని అందిస్తారు. 

దరఖాస్తు విధానం

అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ప్రీ-మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌లను నవంబరు 15, 2021లోపు దరఖాస్తు చేసుకోవాలి. పోస్ట్‌-మెట్రిక్‌, మెరిట్‌కమ్‌ మీన్స్‌ స్కాలర్‌షిప్స్‌ను నవంబరు 30, 2021లోపు అప్లై చేయాలి.

వెబ్‌సైట్: www.scholarships.gov.in 

Posted Date: 30-10-2021


 

తాజా కథనాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
 

విద్యా ఉద్యోగ సమాచారం