• facebook
  • whatsapp
  • telegram

అమ్మాయిలకు ఉపకారం   

ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్‌ల్లో కెరియర్‌ నిర్మించుకోవాలనుకునేవారికి సదవకాశం. ఫీజులో 60 శాతం వరకూ స్కాలర్‌షిప్‌ రూపంలో పొందొచ్చు. ప్రముఖ సంస్థ లెగ్రాండ్‌ ఈ అవకాశాన్ని కలిగిస్తోంది. ఈ ఏడాది ఇంటర్‌ పూర్తిచేసుకున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఇది అమ్మాయిలకు మాత్రమే!

ప్రముఖ ఎలక్ట్రికల్‌ పరికరాల తయారీ సంస్థ ‘లెగ్రాండ్‌’ అమ్మాయిలకు ఉపకార వేతనాలను ప్రకటించింది. గత రెండేళ్ల నుంచే వీటిని అందిస్తున్నారు. ‘లెగ్రాండ్‌ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌’ పేరుతో వీటిని అందిస్తున్నారు. దీని ద్వారా అమ్మాయిలకు ఉన్నతవిద్య పరంగా సాయమందించడం, మెరిట్‌ విద్యార్థులను ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్‌ కెరియర్లను ఎంచుకునే దిశగా ప్రోత్సహించడం చేస్తున్నారు. అమ్మాయిల అకడమిక్‌ కలలను నెరవేర్చుకోవడానికి అవసరమైన సాయాన్ని అందించడం దీని ప్రధాన ఉద్దేశం. సాంకేతిక రంగంలో భవిష్యత్‌ మహిళా నాయకులను తయారు చేయాలనే ఉద్దేశంతో ఈ స్కాలర్‌షిప్‌ను ప్రారంభించినట్లు సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.

అర్హతలు:
 భారతీయ విద్యార్థినులై ఉండాలి. 
 ఈ ఏడాది ఇంటర్‌ పాసై ఉండాలి. 
 పదో తరగతి, ఇంటర్మీడియట్‌ స్థాయుల్లో కనీసం 75 శాతం మార్కులు సాధించి ఉండాలి. 
 బీటెక్‌/ బీఈ/ ఆర్కిటెక్చర్‌ (బి.ఆర్క్‌) ప్రోగ్రాములు చదవాలనుకునే వారు మాత్రమే దరఖాస్తుకు అర్హులు. దేశంలో గుర్తింపు పొందిన కళాశాలల్లో ప్రవేశం పొందాలనుకునేవారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. 
 కుటుంబ వార్షిక ఆదాయం రూ. అయిదు లక్షలకు మించకూడదు. 
 విదేశాల్లో చదివే మన విద్యార్థులూ, మన దేశంలో విద్యనభ్యసించే విదేశీ విద్యార్థులూ దరఖాస్తుకు అనర్హులు. 
 లేటరల్‌ ఎంట్రీ వాళ్లకు అవకాశం లేదు. 
 బీఈ/ బీటెక్‌/ బీ ఆర్క్‌ ఏ స్పెషలైజేషన్‌ వారైనా దరఖాస్తుకు అర్హులే.
స్కాలర్‌షిప్‌ మొత్తం: అకడమిక్‌ ఫీజులో 60 శాతం మొత్తం లేదా రూ. 60,000 మొత్తం చెల్లిస్తారు. ఇది నాలుగేళ్లపాటూ కొనసాగుతుంది.

ఎంపిక ఎలా?
రెండు దశల్లో ఎంపిక చేస్తారు. ప్రత్యేకమైన పరీక్షలేమీ లేవు. అందిన దరఖాస్తుల్లో విద్యార్థుల ప్రతిభ, కుటుంబ ఆర్థిక పరిస్థితి ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. వీరికి ప్రత్యేకంగా ఎంపిక చేసిన పానెల్‌ టెలిఫోనిక్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది. దీనిలోనూ అర్హత సాధించినవారికి స్కాలర్‌షిప్‌ను అందజేస్తారు. ఫలితాలను ఈ ఏడాది డిసెంబరులో ప్రకటిస్తారు.

దరఖాస్తు: http://www.legrandscholarship.co.in/ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మొదట ఫేస్‌బుక్‌ లేదా జీమెయిల్‌ ఐడీ ఆధారంగా రిజిస్టర్‌ చేసుకోవాలి. ఆపై ఆరు దశల అప్లికేషన్‌ ఫారాన్ని నింపి, అవసరమైన ధ్రువపత్రాలను అప్‌లోడ్‌ చేయాలి.

సమర్పించాల్సిన పత్రాలు: 
 ఫొటో ఐడీ కార్డు 
‣ వయసు ధ్రువీకరణ పత్రం (జనన ధ్రువీకరణ పత్రం/ పాస్ట్‌పోర్టు/ పదో తరగతి సర్టిఫికెట్‌) 
 అడ్రస్‌ ప్రూఫ్‌ 
 పదో తరగతి, ఇంటర్‌ మార్క్‌ షీట్లు 
 కుటుంబ ఆదాయ ధ్రువీకరణ పత్రం/ ఫారం 16/ తల్లిదండ్రుల గత ఆరు నెలల బ్యాంకు స్టేట్‌మెంట్లు 
 పాస్‌పోర్ట్‌ సైజు ఫొటోలు 
‣ అడ్మిషన్‌ పొందిన కాలేజీ వివరాలు. 

Posted Date: 24-11-2020


 

తాజా కథనాలు

మరిన్ని