• facebook
  • whatsapp
  • telegram

దివ్యమైన సహాయం

ఏడాదికి రూ.యాభై వేల చొప్పున సాక్షమ్‌ ఉపకార వేతనాలు

దివ్యాంగులను ఉన్నత చదువుల దిశగా ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్ర మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) సాక్షమ్‌ స్కాలర్‌షిప్‌లను అందిస్తోంది. వీటికి డిప్లొమా, ఇంజినీరింగ్‌ కోర్సులు చదువుతోన్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హతలున్న ప్రతి ఒక్కరికీ ఏడాదికి రూ.యాభై వేల చొప్పున కోర్సు వ్యవధి మొత్తం చెల్లిస్తారు. దివ్యాంగులు సాంకేతిక విద్యలో రాణించి, సొంత కాలిపై నిలబడేలా చేయడానికే ఈ పురస్కారాలు. 

సాక్షమ్‌ పేరుతో ఏఐసీటీఈ ఏటా దివ్యాంగ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను అందిస్తోంది. వారు ఉన్నత చదువులకు దూరం కాకుండా చేసి, ఆర్థికంగా అండగా ఉండాలనే లక్ష్యంతో వీటిని ఏర్పాటు చేశారు. మిగిలిన ప్రోత్సాహకాలకు ఉన్నట్లు వీటికి పరిమితి లేదు. అంటే నిర్దేశిత అర్హతలు ఉన్న ప్రతి ఒక్కరికీ వీటిని అందిస్తారు. ఇలా ఎంపికైనవారికి ఏడాదికి రూ.యాభై వేలు చొప్పున చెల్లిస్తారు. వీటిని డిప్లొమా విద్యార్థులకు మూడేళ్లు, ఇంజినీరింగ్‌ వారికి నాలుగేళ్లపాటు అందజేస్తారు. ఒకవేళ లేటరల్‌ ఎంట్రీ విధానంలో డిప్లొమా లేదా ఇంజినీరింగ్‌లో చేరినట్లయితే డిప్లొమాలో రెండేళ్లు, ఇంజినీరింగ్‌లో మూడేళ్ల పాటు ప్రోత్సాహకం దక్కుతుంది. ఈ స్కాలర్‌షిప్‌ను పుస్తకాలు, ఫీజు, వసతి, కంప్యూటర్, ఇతర ఖర్చుల నిమిత్తం ఉపయోగించుకోవచ్చు. ఏటా అభ్యర్థుల బ్యాంకు ఖాతాలోకి నేరుగా సొమ్ము జమచేస్తారు. ఇందుకోసం బ్యాంకు అకౌంటు, ఆధార్‌ కార్డు తప్పనిసరి.

అర్హతలు

అభ్యర్థులు 2020-2021 విద్యా సంవత్సరంలో డిప్లొమా లేదా డిగ్రీ (ఇంజినీరింగ్‌) ప్రథమ సంవత్సరం కోర్సుల్లో చేరినవారై ఉండాలి లేదా లేటరల్‌ ఎంట్రీ విధానంలో డిప్లొమా లేదా ఇంజినీరింగ్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నవారై ఉండాలి. 

తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.8 లక్షల కంటే తక్కువగా ఉండాలి. ఇందుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాన్ని జతచేయాలి. వైకల్యం కనీసం 40 శాతం లేదా అంతకు మించి ఉండాలి. ఈ ప్రోత్సాహం ఆశించేవారు ఇతర ఏ స్కాలర్‌షిప్‌లనూ పొందనివారై ఉండాలి. 

పదో తరగతి తర్వాత డిప్లొమాలో చేరడానికి; ఇంటర్‌/ డిప్లొమా తర్వాత ఇంజినీరింగ్‌ విద్యకు మధ్య ఖాళీ వ్యవధి రెండేళ్లకు మించరాదు. ఏఐసీటీఈ గుర్తింపు పొందిన సంస్థల్లో కోర్సులు చదివుండడం తప్పనిసరి. 

దరఖాస్తులు: నేషనల్‌ స్కాలర్‌షిప్‌ పోర్టల్‌లో లభిస్తాయి. ఆన్‌లైన్‌లోనే పూర్తిచేయాలి. జతచేయాల్సిన సర్టిఫికెట్లను పీడీఎఫ్‌ విధానంలో స్కాన్‌చేసి మెయిల్‌ చేయాలి. 

దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: డిసెంబరు 30

వెబ్‌సైట్‌: https://scholarships.gov.in/
 

Posted Date: 02-12-2020


 

తాజా కథనాలు

మరిన్ని