• facebook
  • whatsapp
  • telegram

ఉప‌కారం.. ఉద్యోగం!

ఇంజినీరింగ్ విద్యార్థుల‌కు ఎల్‌&టీ చేయూత‌

బిల్డ్ ఇండియా స్కాల‌ర్‌షిప్‌ల‌కు ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం

మాస్ట‌ర్స్ డిగ్రీ అంటే ఖ‌ర్చుతో కూడుకున్న ప‌ని. దీంతో ప్ర‌తిభావంతులైన‌ పేద‌, మధ్యతరగతి ‌విద్యార్థులు వెనుక‌డుగు వేయాల్సిన ప‌రిస్థితి. ప్ర‌భుత్వాలు బోధ‌నా రుసుము అందిస్తున్నా.. ఇత‌ర‌త్రా ఫీజుల కార‌ణంగా ఉన్న‌త విద్య‌కు చాలా మంది విద్యార్థులు దూర‌మ‌వుతున్నారు. కొంద‌రు త‌మ స్థోమ‌త‌కు మించి క‌ళాశాల‌ల్లో చేరినా చివ‌ర‌కు ఉద్యోగం ల‌భించడం ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. ఇంజినీరింగ్ పూర్తి చేసి ఎంటెక్ చేసేందుకు ఇలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న‌ విద్యార్థులకు ఎల్&టీ సంస్థ ‘ఎల్&టీ బిల్డ్ ఇండియా స్కాలర్‌షిప్’ ప‌థ‌కం పేరుతో భరోసా క‌ల్పిస్తోంది. ప్ర‌స్తుతం 2021-22 విద్యా సంవత్సరానికి ఎంటెక్‌లో కన్‌స్ట్ర‌క్ష‌న్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ కోర్సులో చేరాల‌నుకునే విద్యార్థులకు ఈ అవ‌కాశాన్ని ఇస్తోంది. దీనికి సంబంధించి ఎల్&టీ సంస్థ‌ త‌మ వెబ్‌సైట్‌లో వివ‌రాలు పొందుప‌రిచింది. మీరూ అర్హులైతే దరఖాస్తు చేసుకోండి.

స్కాల‌ర్‌షిప్ ఇత‌ర‌ వివ‌రాలు

చెన్నై/ దిల్లీలోని ఐఐటీలు, సుర‌త్క‌ల్‌/ తిరుచ్చిలోని ఎన్ఐటీల భాగ‌స్వామ్యంతో ఎల్&టీ సంస్థ ఈ ప‌థ‌కాన్ని చేప‌డుతోంది. ఎంపికైన విద్యార్థులు ఈ నాలుగు ఇన్‌స్టిట్యూట్‌ల‌లోనే ఎంటెక్ (కన్‌స్ట్ర‌క్ష‌న్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్) పూర్తి చేయాల్సి ఉంటుంది. కోర్సు కాల వ్య‌వ‌ధి రెండు సంవ‌త్స‌రాలు. ఈ ఇన్‌స్టిట్యూట్‌ల‌కు సంబంధించిన స్పాన్స‌ర్‌షిప్ ఫీజుతో పాటు ట్యూషన్ ఫీజును ఎల్‌&టీ సంస్థ‌నే నేరుగా చెల్లిస్తుంది. దీంతో పాటు విద్యార్థుల‌కు నెల‌కు రూ.13,400 చొప్పున ఉప‌కార వేత‌నం అందిస్తుంది. విద్యార్థులు కోర్సు పూర్తి చేసుకునే వ‌ర‌కు ఎల్‌&టీ సంస్థ ఒక్కొక్క‌రి మీద సుమారు రూ.5 లక్ష‌ల వ‌ర‌కు ఖ‌ర్చు చేయ‌నుంది. ఈ కోర్సును విజయవంతంగా పూర్తి చేసుకున్న అభ్య‌ర్థులు ముందుగా చేసుకున్న ఒప్పందం ప్ర‌కారం అయిదేళ్ల‌పాటు ఎల్&టీ సంస్థ‌లోనే ప‌ని చేయాల్సి ఉంటుంది.

ఎలా ద‌ర‌ఖాస్తు చేయాలి?

అర్హులైన విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేదీ మార్చి 15, 2021. ఎటువంటి ద‌ర‌ఖాస్తు రుసుం చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు. ఆన్‌లైన్ రాత పరీక్ష ఈ ఏడాది ఏప్రిల్ - జూన్ మధ్య ఉంటుంది. ఇంటర్వ్యూలు జూన్ - జులై నెల‌ల్లో నిర్వ‌హిస్తారు. ఆగ‌స్టు మొద‌టి వారంలో స్పాన్సర్‌షిప్ లెట‌ర్లు అందిస్తారు. 

ఎంపిక విధానం

ఎల్&టీ బిల్డ్ ఇండియా స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులు 2021 విద్యా సంవ‌త్స‌రంలో 70 శాతంపైగా మార్కులతో బీఈ/బీటెక్ (సివిల్/ఎలక్ట్రికల్)లో ఉత్తీర్ణత సాధించాలి. ఇందులో అర్హులైన వారిని షార్ట్‌లిస్ట్ చేసి ఆన్‌లైన్ రాత ప‌రీక్ష నిర్వ‌హిస్తారు. స‌బ్జెక్టు, ఆప్టిట్యూడ్‌కు సంబంధించిన ప్ర‌శ్న‌లు అడుగుతారు. ఈ ప‌రీక్ష‌లో ఉత్తీర్ణ‌త సాధించిన వారిని ఇంట‌ర్వ్యూకు పిలుస్తారు. అనంత‌రం తుది ఎంపిక అయిన వారికి మెడిక‌ల్ ఫిట్‌నెస్ టెస్ట్ ఉంటుంది. 

వెబ్‌సైట్‌: https://www.lntecc.com/homepage/common/build-india-scholarship.html

Posted Date: 24-02-2021


 

తాజా కథనాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
 

విద్యా ఉద్యోగ సమాచారం