• facebook
  • whatsapp
  • telegram

సబ్జెక్టుపై పట్టు... పట్టుదల ఉంటే చాలు!

* ఈఎస్‌ఈ టాపర్స్‌ వాయిస్‌

తాజాగా వెలువడిన ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ (ఈఎస్‌ఈ) -2018 ఫలితాల్లో తెలుగు విద్యార్థులు అఖిలభారత స్థాయిలో విశిష్ట ప్రతిభ చూపారు. ఈసీఈ విభాగంలో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణానికి చెందిన చెరుకూరి సాయి దీప్‌ 2వ ర్యాంకు సాధించగా...తెలంగాణలోని నారాయణఖేడ్‌ ప్రాంతానికి చెందిన రమేష్‌ కాముల్ల 3వ ర్యాంకు సాధించాడు. ఇంజినీరింగ్‌ సబ్జెక్టుల్లోని వివిధ అంశాలపై పట్టు పెంచుకుని...సర్వీస్‌ సాధించాలన్న పట్టుదలతో ఉంటే ఈఎస్‌ఈలో విజయం సాధించడం కష్టమేమీ కాదని అంటున్నారు ఈ విజేతలు!

క్లిష్టమైన పరీక్షల్లో ఒకటైన ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ (ఈఎస్‌ఈ)లో టాప్‌ ర్యాంకు తెచ్చుకోవటం సాధారణ విషయం కాదు. తాజా ఫలితాల్లో అఖిలభారత ర్యాంకులు సాధించిన ఇద్దరూ తమ సన్నద్ధతను ఎలా కొనసాగించారు? ఏ మెలకువలు పాటించారు? అగ్రశ్రేణి ర్యాంకులను ఎలా కైవసం చేసుకున్నారు? ‘చదువు’కు వారిచ్చిన ఇంటర్వ్యూ విశేషాలు చూద్దాం!

 

పరీక్షలో విజయం సాధించడానికి మీ సన్నద్ధత ఎలా సాగింది?
సాయి దీప్‌: ఎన్‌ఐటీ వరంగల్‌ నుంచి 2016లో బీటెక్‌ పూర్తి చేశాను. కొన్నాళ్లు గుజరాత్‌లోని హెచ్‌పీసీఎల్‌లో ఉద్యోగం చేసి మానుకున్నాను. 2017 జులైలో హైదరాబాద్‌ వచ్చి గేట్‌, ఈఎస్‌ఈకి శిక్షణ తీసుకున్నా. గేట్‌లో 9వ ర్యాంకు వచ్చింది. ప్రతి రోజూ కోచింగ్‌ సంస్థలో 5-6 గంటలు తరగతులు ఉండేవి. మళ్లీ ఇంటికి వచ్చి 5 గంటలు చదివేవాడిని. మూడు దశల్లోని మార్కులను కూడా లెక్కలోకి తీసుకుంటారు కాబట్టి ప్రిలిమ్స్‌ను కూడా తేలిగ్గా తీసుకోలేదు. మెయిన్‌కు ప్రతిరోజూ 2-3 గంటలు రాయటం సాధన చేశాను.
రమేష్‌: ఈసీఈ బ్రాంచిలో బీటెక్‌ను బాసరలోని రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్‌జీయూకేటీ) నుంచి 2015లో పూర్తి చేశా. బీటెక్‌లో బంగారు పతకం విజేతను. వెంటనే గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టు ఇన్‌ ఇంజినీరింగ్‌(గేట్‌) సహా ఈఎస్‌ఈ రాశాను. గేట్‌లో మంచి స్కోర్‌ దక్కడంతో కేంద్రప్రభుత్వ రంగ సంస్థ ఒడిశాలోని ఎన్‌టీపీసీలో ఉద్యోగం దక్కింది. ఆనాడు ఈఎస్‌ఈలో ఉత్తీర్ణుడిని కాలేదు. అప్పుడు ప్రధానంగా గేట్‌పై మాత్రమే దృష్టి పెట్టాను. అప్పటి నుంచి ఈఎస్‌ఈ కోసం సన్నద్ధం అవుతూనే ఉన్నాను. ప్రతిరోజూ ఇన్ని గంటలని చదవలేదు. ఉద్యోగం చేస్తూనే ఖాళీగా ఉన్నప్పుడు చదువుకున్నాను.

 

గేట్‌, ఈఎస్‌ఈకి ఒకేసారి సిద్ధం కావొచ్చా?
సాయి దీప్‌: సాంకేతిక సబ్జెక్టుపరంగా రెండిటిదీ ఒకే సిలబస్‌. ప్రిలిమినరీలో ఒక పేపర్‌ ఇప్పటివరకు ఇంజినీరింగ్‌కు సంబంధం లేని జనరల్‌ స్టడీస్‌, ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌, పర్యావరణం తదితర 10 సబ్జెక్టులకు సంబంధించినది ఉంటుంది. మెయిన్‌లో 2 పేపర్లు ఉంటాయి. ఒక్కో దాంట్లో 8 ప్రశ్నలకు అయిదు రాయాలి. ఇక్కడ 3 గంటల సమయం మాత్రమే ఉండటం వల్ల వేగం చాలా ముఖ్యం. నేను నాలుగు ప్రశ్నలకు పూర్తిగా, మరో ప్రశ్నకు సగం మాత్రమే జవాబు రాశాను. చివరి దశలో ముఖాముఖీ ఉంటుంది. ఈ మూడు దశల ప్రక్రియకు ఏడాది సమయం పడుతుంది కాబట్టి ఆత్మవిశ్వాసం కోల్పోకూడదు.
రమేష్‌: గేట్‌లో కేవలం ఇంజినీరింగ్‌ ఆప్టిట్యూడ్‌ను మాత్రమే పరీక్షిస్తారు. దీనిలో ఆబ్జెక్టివ్‌ విధానంలో ప్రశ్నలుంటాయి. ఒకటే పేపర్‌ ఉంటుంది. గేట్‌ ర్యాంకుతో ఎంటెక్‌ లేదా పీహెచ్‌డీలో చేరొచ్చు. ఆ ర్యాంకుల ఆధారంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ(పీఎస్‌యూ)ల్లో ఇంటర్వ్యూకు హాజరై ఉద్యోగం సాధించవచ్చు. అదే ఈఎస్‌ఈకి వస్తే మూడు విడతలుగా అభ్యర్థులను పరీక్షిస్తారు. మొదట ప్రిలిమినరీ పరీక్ష...దాంట్లో కటాఫ్‌ మార్కులను దాటితే మెయిన్‌ పరీక్ష రాయాలి. దీనిలో వ్యాసరూప విధానంలో జవాబులు రాయాలి. అక్కడ పాసైతే మళ్లీ యూపీఎస్‌ఈ బోర్డు నిర్వహించే ముఖాముఖీని ఎదుర్కోవాలి. ఈఎస్‌ఈలో విజేతలుగా నిలవాలంటే ఓర్పు తప్పనిసరి.

 

ఇంటర్వ్యూను ఎలా ఎదుర్కొన్నారు?
సాయి దీప్‌: నా ఇంటర్వ్యూ సుమారు 30 నిమిషాలు జరిగింది. ముందుగానే మన అలవాట్లు, ఆసక్తి ఉన్న అంశాలు తదితర అన్ని వివరాలను సమర్పిస్తాం కదా, వాటిపైనే సగం ప్రశ్నలుంటాయి. హెచ్‌పీసీఎల్‌లో పనిచేస్తున్నా కాబట్టి పైపులైన్లు, లీకేజీ అయితే ఎలా తెలుసుకుంటావు తదితర ప్రశ్నలు అడిగారు. సినిమాలు చూస్తానని చెప్పినందున ‘దంగల్‌’ సినిమా చూశావా అని అడిగారు. హిందీ సినిమాలు చూడనని సమాధానమిచ్చా. ‘బాహుబలి’ కథ చెప్పమన్నారు. అందులో వాడిన సాంకేతికత గురించి అడిగారు. ఇంటర్వ్యూ రోజు దినపత్రికలో వచ్చే అంశాలను కూడా అడిగే అవకాశం ఉంది. నా ఇంటర్వ్యూ ముందురోజు ఇస్రో నుంచి ఉపగ్రహాలను పంపినందున వాటి ఉపయోగం గురించి చెప్పమన్నారు. ముఖ్యంగా మన సబ్జెక్టుకు సంబంధించిన, ఎంచుకున్న శాఖ గురించి ఎంత వరకు తాజా విషయాలను తెలుసుకుంటున్నారని చూస్తారు.
రమేష్‌: 40 నిమిషాల వరకు ఇంటర్వ్యూ జరిగింది. ఎన్‌టీపీసీలో ఉద్యోగం చేస్తున్నందున ఆ అనుభవం గురించి అడిగారు. జవహర్‌ నవోదయ విద్యాలయంలో చదివినందున మిగిలిన పాఠశాలలకు, జేఎన్‌వీకి మధ్య తేడాలేంటని ప్రశ్నించారు. ఇండియన్‌ రైల్వే శాఖలో ఉద్యోగం చేయాలని నేను ప్రాధాన్యాన్ని ఇచ్చుకున్న కారణంగా ప్రయాణికుల భద్రత, రైలు ప్రమాదాల గురించి అడిగారు.

 

ఈఎస్‌ఈ అభ్యర్థులకు మీరిచ్చే సలహాలు ఏమిటి?
సాయి దీప్‌: ఈఎస్‌ఈలో విజయమా? విఫలమా? అని తేలాలంటే మూడు దశలు పూర్తి కావడానికి ఏడాది పడుతుంది. అందువల్ల ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఉండటం అవసరం. అందుకే నేను తరచూ అమ్మానాన్నలతో మాట్లాడుతుంటా. వారు ధైర్యం చెబుతారు. సన్నద్ధమయ్యే సమయంలో ముఖ్యమైన అంశాలను రాసుకోవాలి. లేకుంటే ఏడాది క్రితం చదివినది గుర్తుండదు.
రమేష్‌: ఆత్మవిశ్వాసం కోల్పోకూడదు. పట్టుదలగా ప్రయత్నించాలి. బీటెక్‌ పూర్తయిన తర్వాత ఈఎస్‌ఈ రాయాలని ఉంటే బీటెక్‌ చదివేటప్పుడు ఎలెక్టివ్‌ సబ్జెక్టులను ఎంచుకునేముందు ఈఎస్‌ఈ సిలబస్‌ చూసి వాటిని ఎంపిక చేసుకోవాలి. దాని వల్ల ఈఎస్‌ఈకి సన్నద్ధం కావడం సులభమవుతుంది. ఎన్‌పీటీఈఎల్‌ వీడియో పాఠాలను కూడా ఉపయోగించుకుంటే చాలా ప్రయోజనం ఉంటుంది.

Posted Date: 31-10-2019


  • Tags :

 

పోటీ పరీక్షలు

మరిన్ని