• facebook
  • whatsapp
  • telegram

అడుగ‌డుగునా క‌ష్టాలే..అయినా ఆగ‌ని ఆమె జైత్ర‌యాత్ర‌!  

* త‌ల్లిదండ్రుల మ‌ర‌ణం, ఆర్థిక ఇబ్బందుల‌ను దాటి 15 బంగారు ప‌త‌కాలు సాధించిన స‌ర‌స్వ‌తీ పుత్రిక‌!


ఓ పక్క నాన్న మరణం.. మరోపక్క తుది పరీక్షలు! ఆ బాధ తట్టుకొని సాగుతోంటే.. అమ్మా మరణంలో ఆయన్ని అనుసరించింది. ఆర్థిక కష్టాలు.. దానికితోడు చెల్లెలి బాధ్యత. అన్నింటినీ దాటుకొంటూ వచ్చింది. తల్లయ్యాక తిరిగి చదువు ప్రారంభించి ఏకంగా 15 బంగారు పతకాలు సాధించింది.. శ్రీవిద్య. ఆమె కథ ఇది..

మాది మైసూరు జిల్లాలోని కల్కుణికె గ్రామం. నాన్న స్వామి వంట పాత్రలను సైకిల్‌పై మోసుకెళ్లి పక్క ఊళ్లలో వాయిదా పద్ధతిలో అమ్మేవారు. ఇంటివద్ద సైకిల్‌ రిపేర్‌ షాపునీ నిర్వహించేవారు. ఆర్థిక ఇబ్బందుల రీత్యా పదోతరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలోనే చదివా. ఇంటర్‌లో మంచి కాలేజీలో చేర్చాలి.. అందుకోసం మకాం హుణసూరుకి మార్చాలనుకున్నారు నాన్న. అయితే నాకు పదోతరగతిలో 90 శాతానికిపైగా మార్కులు రావటంతో నెలకు రూ.వెయ్యి విద్యార్థి వేతనం అందేది. అది ఇంటర్‌ చదువులకు ఉపయోగపడింది. నాన్నకు భారం తగ్గించినందుకు చాలా సంతోషించా. ఆ ఉత్సాహంతో మరింత బాగా చదివా. ఇంతలో రేపట్నుంచి ఇంటర్‌ ప్రథమ సంవత్సర వార్షిక పరీక్షలనగా నాన్న రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆయన ఆసుపత్రిలో.. నాకేమో తొలి పరీక్ష. రాయనంటే అమ్మే ఒప్పించింది. తీరా బయల్దేరే సమయానికి సీరియస్‌గా ఉందన్నారు. అది విని ఆగిపోతే.. పరీక్ష మిస్‌ కావొద్దని బలవంతంగా పంపారు. ఇంటికొచ్చేసరికి  నాన్న బాగున్నారన్న కబురు వినాలని ఆశగా వస్తే.. చనిపోయారన్న కబురు అందింది. ఏడుపు ఆపుకోలేకపోయా. అంత బాధలోనూ అమ్మ నన్ను ఓదార్చి పరీక్షలన్నీ రాయించింది. దుఃఖం ఆపుకోలేక ఏడుస్తూనే రాసేదాన్ని. సమాధాన పత్రాలన్నీ కన్నీటితో తడిసిపోయేవి. తీరా ఫలితాలొచ్చాక కాలేజీ టాపర్‌గా నిలిచా. నన్నెప్పుడూ పైస్థాయిలో చూడాలని నాన్న కోరిక. తీరా అది చూడటానికి ఆయన లేరని ఆ రోజంతా ఏడ్చా.

అంతా.. చీకటి!

ఇల్లు గడవాలంటే నాన్న పనే దిక్కు. పైగా అప్పులున్నాయి. దీంతో ఇంట్లోనే వాయిదా పద్ధతిలో వస్తువుల అమ్మకాలు కొనసాగించాం. కానీ నాన్నపై దిగులుతో మంచాన పడ్డ అమ్మ నేను డిగ్రీలో చేరిన నాలుగు నెలలకే చనిపోయింది. తను లేని రోజున మాకు అంతా చీకటిగా కనిపించింది. నన్ను, చెల్లిని బంధువులు చూసుకుంటామని ముందుకొచ్చినా నా మనసు అంగీకరించలేదు. డిగ్రీ చదువుతూనే చెల్లి సాయంతో వ్యాపారాన్ని కొనసాగించి 80 శాతం మార్కులు సాధించా. పై చదువులు చదవాలన్న కోరిక ఉన్నా.. ఆర్థిక ఇబ్బందులు. ఎలాగోలా చెల్లిని డిగ్రీ చదివించి, పెళ్లి చేశా. అప్పులూ తీర్చా. తర్వాతే నేను పెళ్లి చేసుకున్నా. మావారు ప్రదీప్‌ టీచర్‌. ఆయన ప్రోత్సాహంతో బీఈడీలో ఉచిత సీటు సాధించా. ఇంతలో పాప పుట్టడంతో ఎంఏ కలకు బ్రేక్‌ పడింది. పైగా చదవాలంటే మైసూరుకు వెళ్లాలి. మాది ఉమ్మడి కుటుంబం. ఇంట్లో పనితోనే రోజంతా గడిచేది. అంతదూరం పంపడానికి ఇంట్లో అంగీకరించలేదు. రెండేళ్లకు.. అంటే 2020లో హుణసూరులోనే కళాశాల ప్రారంభమవ్వడంతో చదువుపై మళ్లీ కోరిక కలిగింది. ఇంట్లో ఒప్పించి ఎంఏ (కన్నడ)లో చేరా. తెల్లవారుజామున లేచి ఇంటిపని పూర్తిచేసి కళాశాలకు వెళ్లేదాన్ని. రెండేళ్లు చదువు ఆపినా 8.9పర్సెంటైల్‌ సాధించా. మైసూరు విశ్వవిద్యాలయంలో స్నాతకోత్సవంలో 15 బంగారు పతకాలు, నాలుగు నగదు పురస్కారాలు అందుకున్నా. మెడల్‌ అందుకుంటానని ఊహించా కానీ.. ఇన్ని వస్తాయనుకోలేదు. అమ్మానాన్న ఉండుంటే కచ్చితంగా గర్వపడేవాళ్లు. నాలో చదువుపై కోరిక కలిగించింది వాళ్లే! అందుకే ఈ పతకాలు వాళ్లకే అంకితం. టీచర్‌గానూ ఎంపికయ్యా. పోస్టింగ్‌ కోసం ఎదురుచూస్తున్నా. పెళ్లి చదువుకు అడ్డు కాదు. పట్టుదలవుంటే ఎప్పుడైనా కెరియర్‌లో ముందుకెళ్లొచ్చు. 
 

 

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఆత్మవిశ్వాసంతో అద్భుత విజయాలు!

‣ పీజీ విద్యార్థులకు పది వేల స్కాలర్‌షిప్పులు (చివరి తేదీ: డిసెంబరు 31, 2023)

‣ ఒత్తిడిని జయించే మార్గాలివిగో!

‣ డిగ్రీ ప్రతిభావంతులకు కేంద్రం ఆసరా (చివరి తేదీ: డిసెంబరు 31, 2023)

Posted Date: 27-10-2023


 

తాజా కథనాలు

మరిన్ని