• facebook
  • whatsapp
  • telegram

ఇతడు అడవిని జయించాడు!

* ఐఎఫ్ఎస్ 2019 - అఖిలభారత ప్రథమ ర్యాంకర్ మందడి నవీన్‌రెడ్డి

సివిల్స్‌లో వరస వైఫల్యాలు నిరాశను కలిగిస్తే... ఓ మిత్రుడి విజయం స్ఫూర్తినిచ్చింది. ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీసు (ఐఎఫ్‌ఎస్‌) వైపు దృష్టి పెట్టేలా చేసింది. రాసిన తొలిసారే అఖిలభారత ప్రథమ ర్యాంకు సాధించిన ఆ విజేత... నల్గొండ[ కుర్రాడు మందడి నవీన్‌రెడ్డి. ఒకే సబ్జెక్టుపై చాలా పుస్తకాలు చదివి గందరగోళపడటం కంటే- అవసరమైనవి ఎంచుకుని, స్పష్టతతో రాయాలని సూచిస్తున్నాడు. పోటీపరీక్షల కీకారణ్యాన్ని తానెలా అధిగమించి గెలిచాడో.. ఆ విశేషాలను ‘ఈనాడు- చదువు’తో పంచుకున్నాడు.

 

అటవీ సర్వీసులో అఖిల భారత స్థాయి మొదటి ర్యాంకు ఊహించారా?
సివిల్స్‌ ఐదుసార్లు ప్రయత్నించా. రాకపోయేసరికి నిరాశ కలుగుతుండేది. ముంబైలో పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ (పీజీసీ)లో ఉద్యోగం చేసేటపుడు నా సహోద్యోగికి ఐఎఫ్‌ఎస్‌లో మంచి ర్యాంకు వచ్చింది. అతడి స్ఫూర్తితో రెండు నెలలు కష్టపడి ఐఎఫ్‌ఎస్‌ రాశాను. తొలి ప్రయత్నంలోనే అఖిల భారత స్థాయిలో మొదటి ర్యాంకు రావడం సంతోషంగా ఉంది. స్నేహితుడు ఫోన్‌ చేసి ఆలిండియా ఫస్ట్‌ వచ్చిందని చెప్పడంతో మొదట నమ్మలేదు. లిస్ట్‌ పంపించాక నా తల్లిదండ్రులకు విషయం చెప్పాను. దీంతో వాళ్లూ చాలా ఆనందపడ్డారు. సివిల్స్‌ ప్రిపరేషన్‌ అప్పుడే రెండు సబ్జెక్టులకు దిల్లీలో కోచింగ్‌ తీసుకున్నాను. ఫారెస్ట్‌ సర్వీసుకు తీసుకోలేదు. ఇందుకు కావాల్సిన మెటీరియల్‌ను ఆన్‌లైన్‌లో తీసుకున్నాను.

 

సివిల్స్‌తో పాటే దీనికీ సిద్ధమయ్యారా?
సివిల్స్‌కూ, ఐఎఫ్‌ఎస్‌కూ కలిపే ప్రిపేర్‌ అయ్యాను. ఈ రెండు పరీక్షలకూ ప్రిలిమ్స్‌ ఒకేలా ఉంటాయి. మెయిన్స్‌ మాత్రం వేరే. గతంలో సివిల్స్‌, ఐఎఫ్‌ఎస్‌ పరీక్షలు పది రోజుల వ్యవధిలో జరుగుతుండేవి. దీంతో అసలీ పరీక్షను పట్టించుకునే వారు కాదు. కానీ ఇప్పుడు తొలి సారిగా నోటిఫికేషన్‌ ఇచ్చినప్పుడే సివిల్స్‌, ఐఎఫ్‌ఎస్‌లకు మధ్య రెండు నెలల వ్యవధి ఇచ్చారు. దీంతో దీనిపై శ్రద్ధ పెట్టడానికి ఉపయోగపడింది.

 

ర్యాంకుకోసం ఎలా ప్లాన్‌ చేసుకోవాలి?
సివిల్స్‌కు ప్రిపేర్‌ అవుతున్నవారికి ఐఎఫ్‌ఎస్‌ రాయడం తేలిక. నేను గత రెండేళ్ల నుంచి దిల్లీలో కొన్ని సబ్జెక్టుల్లో కోచింగ్‌ తీసుకోవడం వల్ల ఈ పరీక్ష రాయడం సులభమైంది. నేనైతే రెండు నెలల పాటు ఈ పరీక్షకు ప్రిపేర్‌ అయ్యాను. ఈ పరీక్ష రాయాలనుకునేవారు ఇందులోని సాధకబాధకాలపై ముందు దృష్టి పెట్టాలి. నిబంధనలు ఎలా ఉన్నాయి, అటవీ చట్టాలు, సంరక్షణ, ఉద్యోగి బాధ్యతలు, కర్తవ్యాలు అన్నింటిపై పట్టు ఉండాలి.

 

ప్రిపరేషన్‌లో మీరు చేసిన పొరపాట్లు?
ఐఎఫ్‌ఎస్‌కు నేను జియాలజీ, ఫారెస్ట్‌ సబ్జెక్టులను ఎంచుకున్నాను. అయితే రెండు నెలల కాలంలో దాదాపు నెల రోజులూ ఒక్క జియాలజీ సబ్జెక్ట్‌పైనే పూర్తిగా దృష్టి కేంద్రీకరించాను. పరీక్ష రాసిన తర్వాత ఇంగ్లిష్‌పై ఇంకొంత సమయం వెచ్చించాల్సి ఉండేదని బాధపడ్డా. అందుకే పరీక్ష రాస్తున్నామని నిర్ణయించుకున్నప్పుడే ఎన్ని రోజుల్లో పూర్తి చేయాలో సమయ నిబంధన పెట్టుకోవాలి.
పరీక్షకు సంబంధించి అన్ని విషయాలూ పుస్తకాల్లో దొరకవు. దీంతో పుస్తకాల్లో దొరకని విషయాలు, సందేహం వచ్చిన అంశాలపై మనం నెట్‌లో సెర్చ్‌ చేయాలి. నిర్దిష్ట విషయంపై ఎంతవరకు, ఎంత లోతుగా సమాధానం కావాలనే దానిపై మనం నెట్‌లో సెర్చ్‌కు ముందే ఓ నిర్ణయానికి రావాలి. దీంతో మన పని సులువవుతుంది. .

 

ఇంటర్వ్యూ ఎలా జరిగింది?
సామాజిక అంశాలపైనే ఎక్కువగా సభ్యులు ప్రశ్నలు అడిగారు.‘గాంధీజీ గ్రామోదయ, సర్వోదయ ఉద్యమాలపై అభిప్రాయమేమిటి’ అని అడిగారు. ‘గాంధీజీ చేపట్టిన గ్రామోదయ ఉద్యమం వల్ల తొలుత గ్రామాలు పారిశుద్ధ్య నిర్వహణవైపు అడుగులు వేశాయి. ఆయన ప్రవచించిన అహింసా సిద్ధాంతం పర్యావరణ పరిరక్షణకు దోహదపడింది. జంతువులన్నీ వాటికి కావాల్సిన ఆహారాన్ని అడవిలోనే సంపాదించుకునేలా ఉండేది. ఇప్పుడు జీవ హింస ఎక్కువగా ఉండటంతో పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోంది.’... ఇలా సమాధానం ఇవ్వడంతో ప్యానెల్‌ సంతృప్తి వ్యక్తం చేసింది. ఉద్యోగంలోకి ప్రవేశించిన తర్వాత ఎలాంటి పనులు చేస్తామో దానికి అనుబంధంగా ఉండే ప్రశ్నలు అడిగారు. ఇంటర్వ్యూకు వెళ్లే ముందే అన్ని అంశాలపై ప్రిపేర్‌ కావాలి. జీతభత్యాలు, హోదా విషయంలోనూ సివిల్‌ సర్వీసెస్‌తో సమానం. అయితే ఐఎఫ్‌ఎస్‌ ప్రత్యక్షంగా ప్రజలతో కలిసి పనిచేసే ఉద్యోగం కాదు. పర్యావరణ హితానికి తోడ్పడుతూ పరోక్షంగా ప్రజలకు మేలు చేసే కొలువు. . సివిల్‌ సర్వీసెస్‌లో పనిచేసేవారికి వచ్చినంత పేరు ప్రతిష్ఠలు రాకపోవచ్చు కానీ ప్రతిష్ఠాకరమైనదే. ఈ కెరియర్‌పైనా యువత దృష్టిపెట్టాలి.

 

ఎలా సిద్ధమయ్యారు?
ఏ పోటీ పరీక్షలోనైనా విజయం సాధించాలంటే పత్రికా పఠనం తప్పనిసరి. రోజూ నాలుగైదు ఆంగ్ల పత్రికలు గంటకు తక్కువ కాకుండా చదివేవాడిని. ఎంచుకున్న అంశాలపై మౌలిక పుస్తకాలను అధ్యయనం చేయాలి. చరిత్ర లాంటి సబ్జెక్టులపై చాలా పుస్తకాలుంటాయి. మనకు ఏది అవసరమో నిర్ధారించుకొని వాటిని మాత్రమే చదవాలి. ఎక్కువ పుస్తకాలను చదవడం వల్ల ఒకదానికొకటి పొంతన లేకుండా అసలుకు ఎసరు వచ్చే ప్రమాదం ఉంది. పరీక్షకు అవసరయ్యే పుస్తకాలనే ఎక్కువసార్లు చదవాలి. మాక్‌ పరీక్షల్లో ఎక్కువ ప్రశ్నలు జవాబు ఇచ్చేలాగా ప్రిపేర్‌ కావాలి. అసలు పరీక్షలో ఎక్కువ ప్రశ్నలు రాయాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పటినుంచే మన సామర్థ్యం పెంచుకునేలా సన్నద్ధం కావాలి.
మన చుట్టూ జరుగుతున్న విషయాలపై ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ కావాలి. దీనికి పత్రికా పఠనం మంచి వనరుగా పనిచేస్తుంది.

Posted on 11.2.2019

Posted Date: 31-10-2019


 

పోటీ పరీక్షలు

మరిన్ని