• facebook
  • whatsapp
  • telegram

కోచింగ్‌ లేకున్నా...కొట్టొచ్చు గ్రూప్స్‌!

* పేరు: నూకల ఉదయ్‌రెడ్డి, రెండో ర్యాంకు

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ తాజాగా విడుదల చేసిన గ్రూప్‌-1 ఫలితాల్లో రెండో ర్యాంకు సాధించాడు- నూకల ఉదయ్‌రెడ్డి. గ్రూప్స్‌- 2011 నోటిఫికేషన్లో ఐదో ర్యాంకు సాధించి, న్యాయవివాదాల మూలంగా తిరిగి నిర్వహించిన పోటీలో ఇప్పుడు అంతకంటే మెరుగైన ర్యాంకును తెచ్చుకోగలగడం విశేషం. ఎక్కడా కోచింగ్‌ తీసుకోని తన ప్రస్థానంతో పాటు, పోటీపరీక్షల్లో విజయ సాధనకు ఉపకరించే విలువైన మెలకువలను ‘చదువు’తో పంచుకున్నాడు. ఆ విశేషాలు అతడి మాటల్లోనే...!

చదువుల్లో నేను మరీ అంత తెలివైన విద్యార్థినేమీ కాదు. ఇంటర్లో 80-85 శాతం మార్కులే వచ్చాయి. ఎంసెట్‌లో నాకు వచ్చిన ర్యాంకు దాదాపు 18,000. అయితే ఇంజినీరింగ్‌ మొదటి సంవత్సరం నుంచే సివిల్స్‌ లక్ష్యంగా సిద్ధమవటం ఆరంభించాను. అలా అని కోచింగ్‌కు ఎక్కడా వెళ్ళలేదు. మార్గదర్శనం కోసం హైదరాబాద్‌ స్టడీసర్కిల్‌కు రెండు మూడు సార్లు వెళ్ళానంతే. 2011లో ఇంజినీరింగ్‌ పూర్తయ్యాక ఓ సంస్థలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా చేరాను. కొద్ది నెలల్లోనే ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించి గ్రూప్స్‌ ప్రకటన వచ్చింది. దీంతో ఉద్యోగానికి స్వస్తి చెప్పి, పోటీ పరీక్షలపై దృష్టిపెట్టాను. 2013లో ప్రకటించిన తుది ఫలితాల్లో ఐదో ర్యాంకు సాధించి, డీఎస్‌పీ పోస్టుకు ఎంపికయ్యాను. కానీ కోర్టు వివాదంతో ఆ ఫలితాలు నిలిచిపోయాయి.
ఫలితంగా 2016 సెప్టెంబర్లో మెయిన్స్‌ను తిరిగి నిర్వహించారు. దాన్ని రాసి, 2017 ఆగస్టు 10న జరిపిన ఇంటర్‌ వ్యూకు హాజరయ్యాను. ఈసారి రెండో ర్యాంకు లభించింది.
కారణం ఏదైనా, పొరపాటు ఎవరిదైనా ఈ నాలుగైదేళ్ళూ జరిగిన జాప్యంతో, అనిశ్చితితో అభ్యర్థులందరం బాధలుపడ్డాం. నాకు కుటుంబ సభ్యుల మద్దతు ఉంది కాబట్టి కొంత ఫర్వాలేదు. కానీ మిగతా ఎంతోమంది చాలా నష్టపోయారు.
ఈలోగా 2015లో సివిల్స్‌ మెయిన్స్‌ రాశాను. 2016లో మెయిన్స్‌కు అర్హత పొందినా, రాయలేదు. గ్రూప్స్‌పైనే దృష్టి కేంద్రీకరించాను. ఇది పూర్తిచేసి సివిల్స్‌ సంగతి చూడాలనుకున్నాను.
ఇంత సుదీర్ఘకాలం తర్వాత కూడా గ్రూప్స్‌లో రెండో ర్యాంకు వచ్చిందంటే... సబ్జెక్టుతో సంబంధం కోల్పోకపోవడమే కారణం. సివిల్స్‌ కోసం సాగించిన సంసిద్ధత నాకిలా ఉపయోగపడింది.
ఎలా చదివాను?
నేను ఏ కోచింగ్‌లోనూ చేరలేదు. ప్రామాణిక పుస్తకాలు చదివి, నోట్సు తయారుచేసుకున్నాను. పాలిటీకి లక్ష్మీకాంత్‌ పుస్తకం, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీలకు ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు చదివాను. తెలంగాణ చరిత్ర, భౌగోళిక వ్యవస్థలకోసం తెలుగు అకాడమీ పుస్తకాలు అనుసరించాను.
నాలుగైదు వార్తాపత్రికలు (లైవ్‌ మింట్‌, బిజినెస్‌ స్టాండర్డ్‌, ద హిందూ, హన్స్‌ ఇండియా...) క్రమం తప్పకుండా చదివాను. అసలు ఉన్న సమయంలో సగం వ్యవధిని వీటిని చదవటానికే వెచ్చించానని చెప్పవచ్చు. వర్తమాన అంశాలను అనుసంధానం చేసుకుంటూ వచ్చాను. జీడీపీ నిర్వచనం పుస్తకాల్లో ఉంటుంది కానీ దాని అన్వయం, అనువర్తనం కోసం పత్రికలు చూడాల్సిందే కదా!
వార్తా పత్రికలను చదవటం ఎంత ముఖ్యం అంటే... రోజూ రెండేళ్ళపాటు వార్తలనూ, సంపాదకీయాలనూ, సంపాదకీయ వ్యాసాలనూ సమగ్రంగా చదివితే పోటీపరీక్షల్లో హిస్టరీ, జాగ్రఫీ లాంటివి తప్ప మిగిలిన ఏ ప్రశ్నకు అయినా సమాధానం రాసేయవచ్చు.
మా గ్రూప్స్‌ కేసుకు సంబంధించి మేము ఐదేళ్ళపాటు న్యాయపోరాటాలు చేయటం వల్ల వ్యవస్థ ఎలా ఉంది, ఎలా పనిచేస్తుంది అన్నది బాగా అవగాహన వచ్చింది. థియరీతో పాటు ఇది కూడా ఉపయోగపడింది.
మీడియం ముఖ్యం కాదు
నేను చిన్నప్పటి నుంచీ ఇంగ్లిష్‌ మీడియంలో చదివాను. అయితే తెలుగుమీడియంలోనూ ఎంతో బాగా రాసినవాళ్ళు చాలామంది ఉన్నారు. భాష కాదు, పరిజ్ఞానం ముఖ్యం.
ప్రిలిమ్స్‌- మెయిన్స్‌ - ఇంటర్‌ వ్యూ ఇలా ఒక్కోదానికి ఒక్కోలా చదవటం కాదు. అసలు పరీక్ష కోసం కాకుండా విషయం తెలుసుకోవటం కోసం చదవాలి. అది పరీక్షల్లోనూ లాభిస్తుంది.
అభ్యర్థులకు ప్రతి అంశం/ సమస్య మీద స్పష్టత ఉండాలి. జీఎస్‌టీని తీసుకున్నా, మరొకటి తీసుకున్నా విభిన్న కోణాల్లో, దృక్పథాల్లో చూడాలి. ప్రశ్నలు మెయిన్స్‌లో నేరుగా అడగరు. కాస్త తిప్పి అడుగుతారు. అందుకే అభ్యర్థులకు సమగ్ర అవగాహన అవసరం.
హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ.. ఇలా విడివిడిగా దేనికదే చదవాలనుకోకూడదు.అన్నిటినీ సందర్భానుసారం అనుసంధానం చేసుకోవాలి.
రాత నైపుణ్యాలు చాలా ముఖ్యం. అన్ని ప్రశ్నలూ రాయాలి. రాసింది దిద్దేవారికి అర్థమవటం కూడా చాలా ముఖ్యం. మన పరిజ్ఞానాన్ని ఎదుటివారికి రాతపూర్వకంగా (మెయిన్స్‌లో), మాటల రూపంలో (ఇంటర్‌ వ్యూ) సమర్థంగా తెలియజేసే నేర్పు పెంచుకోవాలి.
చాలామంది హైదరాబాద్‌ వెళ్ళి లక్ష రూపాయిలు ఖర్చుపెట్టి కోచింగ్‌ తీసుకుంటేనే పోటీపరీక్షల్లో నెగ్గుతామనే అపోహతో ఉంటున్నారు. ఇది అపోహ మాత్రమే. తల్లిదండ్రులూ, విద్యార్థులూ ఇది గమనించాలి. అసలు కోచింగ్‌ అవసరమే లేదు. ఇంటర్నెట్‌లో ప్రతిదీ దొరుకుతోంది. ఇంట్లో కూర్చుని కూడా తయారవ్వొచ్చు.
కాకపోతే మార్గదర్శనం మాత్రం అవసరం. సీనియర్లూ, విజేతలూ, కొద్దిలో వైఫల్యం పొందినవారూ చాలా మంచి సలహాలు ఇస్తారు అవి చాలా ఉపయోగం కూడా. నేను కూడా అవసరమైనవారికి తప్పకుండా గైడ్‌ చేస్తాను. మెయిల్‌ ఐడీ: nukalaudayreddy18@gmail.com
అన్నీ రాస్తే చాలు
* గ్రూప్స్‌లో అన్ని ప్రశ్నలకూ సమాధానాలు రాయటానికి ప్రయత్నించాలి. ఇది సరిగా చేస్తే ఎంపికైనట్లే. కానీ చాలామంది ఈ అంశాన్ని నిర్లక్షం చేస్తారు. దీన్ని సవరించుకోవాలి.
* పరీక్షను వేగంగా రాయటం అవసరం. ఇది సాధన వల్లనే వస్తుంది.
* రాత నైపుణ్యాలు పెంచుకోవాలి.
* పోటీపరీక్షల్లో ఆత్మవిశ్వాసం, ప్రేరణను కోల్పోకపోవటం చాలా ప్రధానం.

Posted Date: 31-10-2019


  • Tags :

 

పోటీ పరీక్షలు

student

ఉద్యోగం మానేశా...

పేరు: మాధురి, ర్యాంకు: ఒక‌టి కాలంతో పోటీపడి కార్పొరేట్‌ కొలువుని అందుకున్నా ఏదో అసంతృప్తి. అందుకే చేస్తున్న ఉద్యోగాన్ని వదులుకోవడానికి ఏ మాత్రం వెనకాడలేదు. అసలు నాకు గ్రూప్స్‌ రాయాలన్న ఆలోచన కన్నా మందు నాకు సివిల్స్‌ హాజరవ్వాలనే ఆలోచన వచ్చింది. రెండు సార్లు ఇంటర్వ్యూ వరకూ వెళ్లాను. కానీ విజయం సాధించలేదు. ఈ గ్రూప్స్‌ విజయంతో త్వరలో అదీ సాధిస్తాననుకుంటున్నా. నిజానికి ఈ ఆలోచనకు రెండుకారణాలు. ఒకటి నాకు స్వతహాగా జనరల్‌ నాలెడ్జ్‌ అంటే ఇష్టం. ఇక, నాన్నా, తాతయ్య ప్రభుత్వ ఉద్యోగులు కావడం ఇందుకు మరో కారణం. సివిల్స్‌ ఆలోచన వచ్చినా గ్రూప్స్‌ రాయాలని నిర్ణయించుకున్నా. ఇప్పుడు డిప్యుటీ కలెక్టర్‌గా అర్హత సాధించా.

మరిన్ని