• facebook
  • whatsapp
  • telegram

సివిల్స్‌ కొట్టాలంటే.. 24 గంటలూ చదవక్కర్లేదు

ల కన్నాడు... జనం వెతలు తగ్గించి ఆత్మసంతృప్తినిచ్చే హోదాను అందుకోవాలనే అందమైన కల! దాన్ని నిజం చేసుకోవాలని తపించాడు. ఆశానిరాశల ఊగిసలాటల మధ్య సహనంతో సుదీర్ఘకాలం శ్రమించాడు. సాధించాడు! క్లుప్తంగా కర్నాటి వరుణ్‌రెడ్డి విజయగాథ ఇది! నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ఇతడు సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలో అఖిలభారత స్థాయి ఏడో ర్యాంకు, తెలుగు రాష్ట్రాల్లో టాప్‌ ర్యాంకు సాధించాడు. వదిలేస్తేనే ఓటమి అనీ, నిలిచి గెలవాలంటూ తన స్ఫూర్తిదాయక విశేషాలను ‘చదువు’తో ఇలా పంచుకున్నాడు.

చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం, ఐఏఎస్‌ సాధించాలన్న కల, అమ్మానాన్నల ప్రోత్సాహం... ఇవీ సివిల్స్‌లో నేను ఏడో ర్యాంకు పొందడానికి కారణాలు. ఈ ర్యాంకును అసలు ఊహించలేదు. తప్పకుండా 100 లోపు ర్యాంకు వస్తుందని మాత్రం ఇంటర్వ్యూ తర్వాత అనిపించింది. కానీ సింగిల్‌ డిజిట్‌లో ర్యాంకు రావడం అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే..మనం ఎంత చదివినా మంచి ర్యాంకు రావాలంటే కొంత అదృష్టం కూడా కావాలేమో...

మాది నల్గొండ జిల్లా మిర్యాలగూడ. ఏడో తరగతి వరకు అక్కడే... తర్వాత ఇంటర్‌ వరకూ విజయవాడ దగ్గర్లోని గూడవల్లిలో చదువుకున్నా. ఐఐటీ బాంబేలో సీటు రావడంతో ఉన్నత విద్య అక్కడే గడిచింది. నాన్న జనార్దన్‌రెడ్డి నేత్రవైద్యుడు, అమ్మ నాగమణి వ్యవసాయ శాఖ ఉద్యోగిని. తమ్ముడు పృథ్వీరెడ్డి ప్రస్తుతం హౌస్‌ సర్జన్‌గా పనిచేస్తున్నాడు. జనంతో మమేకమయ్యే ఉద్యోగం సాధించాలని చిన్నప్పటి నుంచీ ఉండేది. దానిలోనే ఆత్మసంతృప్తి ఉంటుందనిపించింది. సివిల్స్‌ సాధించాలని ఐఐటీలో చదువుతున్నపుడు బలంగా నిర్ణయించుకున్నా!

 

ఐదేళ్ల శ్రమ
ఈ ర్యాంకు రావడానికి వెనుక దాదాపు ఐదేళ్ల శ్రమ ఉంది. సివిల్స్‌ మొదటి ప్రయత్నంలో ఇంటర్వ్యూ వరకు వెళ్లినా నిరాశే ఎదురైంది. రెండో ప్రయత్నంలో మెయిన్స్‌లోనే విఫలమయ్యా. మూడో ప్రయత్నంలో బాగా కష్టపడి చదివి 166వ ర్యాంకు సాధించా.. అప్పుడు ఇండియన్‌ రెవిన్యూ సర్వీసు (ఐఆర్‌ఎస్‌)లో ఉద్యోగం వచ్చింది. సివిల్‌ సర్వీసు ఉద్యోగం చేయాలని పట్టుదలతో మళ్లీ నాలుగో ప్రయత్నం చేయగా అప్పుడు 225 ర్యాంకు వచ్చింది. దీంతో ఐఆర్‌ఎస్‌ ఉద్యోగంలో శిక్షణలో ఉన్నప్పుడే సెలవు పెట్టుకొని ప్రిపేరయ్యా. ఐదో ప్రయత్నంలో ఇప్పుడీ ర్యాంకు సాధించాను.

గతంలో ఊహించినంత ర్యాంకు రానప్పుడు ‘అనవసరంగా సివిల్స్‌ వైపు వచ్చానేమో’నని నిరాశ చెందా. ఇవన్నీ వదిలేసి ఎం.ఎస్‌. చేయడానికి అబ్రాడ్‌ వెళ్దామని అనుకున్నా. అయితే నా నిరాశ తొలగేలా స్నేహితులు, తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహం మరవలేనిది. చిన్నప్పుడు క్షేత్రస్థాయిలో చూసిన ప్రజల కష్టాలను మళ్లీ తలుచుకొని సివిల్స్‌ ప్రయత్నాలు కొనసాగించా. మొదటి రెండు ప్రయత్నాల్లో విజయం సాధించకపోవడానికి ప్రధాన కారణం నేను ఎస్సే రైటింగ్‌ను అంతగా పట్టించకోకపోవటం. మూడో ప్రయత్నంలో దానిపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించా. ఆప్షనల్స్‌ సబ్జెక్ట్స్‌నూ ఎక్కువగా సాధన చేశా.

ప్రస్తుతం సివిల్స్‌కు సన్నద్ధమయ్యేవారు ఒక్కసారి ప్రయత్నించి విఫలమవగానే వదిలేస్తున్నారు. అలా కాకుండా లోటుపాట్లు ఎక్కడ జరిగాయో తెలుసుకొనే గ్రహించి సవరించుకోవాలి. ఇంకా కసిగా చదవాలి. మొదట ఫెయిల్యూర్‌ వచ్చినా స్వీకరించే మానసిక సన్నద్ధత ఉండాలి.

 

రోజువారీ లక్ష్యాలు
రోజుకు 10 నుంచి 12 గంటలు చదివేవాణ్ణి. చర్చ ద్వారా చదివితే ఎక్కువగా గుర్తుండటానికి అస్కారముంటుందని నలుగురైదుగురు స్నేహితులం కలిసి గ్రూప్‌ స్టడీస్‌ చేసేవాళ్లం. నాతో పాటు చదువుకున్న సూర్యాపేటకు చెందిన మల్లు చంద్రకాంత్‌రెడ్డికి 208 ర్యాంకు వచ్చింది. మిత్రులం అంతా రోజు వారీ లక్ష్యాలు పెట్టుకొని చదివేవాళ్లం. ఈ రోజు ఒక సబ్జెక్ట్‌ను పూర్తి చేయాలంటే ఎంత కష్టపడైనా దాన్ని పూర్తి చేసేవాళ్లం. జనరల్‌ స్టడీస్‌ (జీఎస్‌) అంశం పరిధి చాలా ఎక్కువ. దీన్నెలా చదవాలో అర్థంకాకే చాలామంది మెయిన్స్‌లో విఫలమవుతారు. అలా కాకుండా ఒకే అంశాన్ని వివిధ కోణాల్లో సమగ్రంగా తెలుసుకోగలిగితే ఉపయోగం ఉంటుంది. ఎప్పటికప్పుడు నోట్స్‌ ప్రిపేర్‌ చేసుకుని, సందేహాలను నివృత్తి చేసుకోవాలి. తెలిసిన విషయం ఎంతమేర ప్రెజెంట్‌ చేస్తామనే దానిపైనే విజయం ఆధారపడి ఉంటుంది. అలా కాకుండా ఎక్కువ చదవాలనే ఆరాటంతో అన్ని అంశాలను సగంసగం చదవడం వల్ల ఉపయోగం లేదు. నిత్యం సమాజంలో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే పత్రికాపఠనం తప్పనిసరి.

మొదట్లో ఆటంకాలు ఎదురైనా దీర్ఘకాలంలో మంచి ఫలితాలు వస్తాయి. అప్పటివరకూ ఓపిగ్గా ఉండాలి. నిరాశ పడకుండా సన్నద్ధమయితే సివిల్స్‌ సాధించవచ్చు.

 

స్నేహాలూ, సినిమాలూ...
సివిల్స్‌కు ప్రిపేర్‌ అవుతున్నాం కదాని రోజంతా చదువుతూనే కూర్చోకూడదు. అన్నింటినీ బ్యాలెన్స్‌ చేయాలి. స్నేహితులు, సినిమాలు, కుటుంబం అన్నీ ఉండాలి. నేనైతే రోజులో చదివే సమయం తప్పితే స్నేహితులతో గడిపేవాడిని. సినిమాలు చూసేవాడిని. ఇవి కొంత మనకు ఆలోచన శక్తినీ, లక్ష్యాన్ని సాధించడానికి ఆత్మవిశ్వాసాన్నీ కలిగిస్తాయి.

ప్రిలిమ్స్‌ పాసైనవారు చాలామంది మెయిన్స్‌లో విఫలమవుతారు. మొదటి రెండు సార్లు విఫలమవడానికి నేను ఎంచుకున్న ఆప్షనల్స్‌ సబ్జెక్ట్స్‌ కారణమని అనిపించింది. మొదటి రెండు ప్రయత్నాల్లో జాగ్రఫీని ఆప్షనల్‌గా ఎంచుకున్నా. అందులో ఊహించిన మార్కులు రాకపోవడంతో మూడో ప్రయత్నంలో మ్యాథ్స్‌ని ఎంచుకున్నా. నిరంతరం సాధన చేయడంతో మూడో ప్రయత్నంలో 166వ ర్యాంకు వచ్చింది. ఇక్కడ సివిల్స్‌ సన్నద్ధమయ్యేవారికి చెప్పేదేమంటే- వారు ఎంచుకున్న సబ్జెక్టులపై మంచి పట్టు ఉండాలి. అప్పుడే ఆ పేపర్లలో ఎక్కువ స్కోర్‌ చేయగలుగుతాం. ఎక్కువ చదవడం కంటే సాధనపై దృష్టి పెడితేనే చదివినది గుర్తుంచుకోగలుగుతాం..

 

ఇంటర్‌వ్యూలో...
ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ సాధించిన తర్వాత మరో ప్రధాన అంకం ఇంటర్వ్యూ. బస్సీ నేతృత్వంలోని బోర్డు 25 నుంచి 30 నిమిషాల పాటు నన్ను ఇంటర్వ్యూ చేసింది. ఇంటర్వ్యూ ఎక్కువగా డిబేట్‌ గానే సాగింది. ఈ బోర్డులో అడిగే ప్రశ్నలు అభ్యర్థులకు ఎక్కువగా ఒత్తిడికి గురి చేసేలా ఉంటాయి. దాన్ని మొదట అధిగమిస్తేనే మంచి ర్యాంకు సాధించగలం.

* ‘ఐఐటీల్లో చదువుకునేవారు దేశానికి సేవ చేయకుండా ఉన్నతోద్యోగాల కోసం ఇతర దేశాలకు వెళ్తున్నారు, దీనిపై మీ అభిప్రాయం?’ అని అడిగారు.

‘ఐఐటియన్ల వల్లే మనదేశానికి ప్రతిష్ఠాత్మక సాఫ్ట్‌వేర్‌ సంస్థలు వచ్చాయి. మన దగ్గర నాణ్యమైన ఇంజినీర్లు ఉండటం వల్లే అమెరికా, చైనా, ఆస్త్ట్రేలియా లాంటి దేశాలు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ల కోసం మనవైపు చూస్తున్నాయి. ఇక్కడ స్టార్టప్‌ విప్లవం సైతం బాగా ఉంది. దీంతో చాలామంది సొంతంగా కంపెనీలను ఏర్పాటు చేసి ఉపాధిని కల్పించటం కోసం చూస్తున్నారు. ఇందులో ఎక్కువగా ఐఐటి©యన్లే చురుగ్గా ఉన్నారు’ అని చెప్పా.

* నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మేక్‌ ఇన్‌ ఇండియా కార్యక్రమం ఏ విధంగా ఉంది? దీనివల్ల దేశంలోని నిరుద్యోగ యువతకు దక్కాయా? లేదా?’ అని ప్రశ్నించారు.

ఈ కార్యక్రమం మంచిదే. ఇప్పటికిప్పుడు ఫలితాలు రాకపోవచ్చు. దీర్ఘకాలంలో దీనివల్ల నిరుద్యోగ యువతకు మేలు జరుగుతుంది’ అని చెప్పాను.

దేశంలో ఫార్మా రంగం సాధిస్తోన్న ప్రగతి, సూక్ష్మ, మధ్య తరగతి పరిశ్రమల వల్ల దేశ పారిశ్రామిక రంగానికి కలిగే మేలు, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ తదితర అంశాలను ఇంటర్వ్యూల్లో అడిగారు. ప్రశాంతంగా సమాధానాలు ఇచ్చాను. ఇక్కడ ఒత్తిడిని హ్యాండిల్‌ చేయాలి. తెలిసిన విషయాన్ని వారికి ఎంతబాగా వివరిస్తామనే దానిపైనే ఇంటర్వ్యూ ఫలితం ఆధారపడి ఉంటుంది.

 

సివిల్స్‌లో సత్తా చాటిన తెలుగు తేజాలు

* మిర్యాలగూడ వాసి కర్నాటి వరుణ్‌రెడ్డి (7వ ర్యాంకు) తెలుగు రాష్ట్రాల్లో టాపర్‌
* నాగర్‌కర్నూల్‌కు చెందిన షాహీద్‌కు 57వ స్థానం
* రెండు రాష్ట్రాల నుంచి దాదాపు 40 మంది ఎంపిక


ఈనాడు - హైదరాబాద్‌: దేశంలో అత్యున్నత సర్వీస్‌గా భావించే సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తా చాటారు. తెలంగాణ రాష్ట్రంలోని మిర్యాలగూడేనికి చెందిన కర్నాటి వరుణ్‌రెడ్డి 7వ ర్యాంకు సాధించారు. తెలుగు రాష్ట్రాల్లో ఈసారి ఇదే అగ్ర ర్యాంకు. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 40 మంది ఎంపికైనట్లు ప్రాథమిక సమాచారం. పరీక్షల తుది ఫలితాలను యూపీఎస్‌సీ శుక్రవారం సాయంత్రం విడుదల చేసింది. మూడు దశల్లో జరిగే సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షల్లో గత ఏడాది జూన్‌ 3న జరిగిన మొదటి దశ ప్రాథమిక పరీక్షలకు దేశవ్యాప్తంగా 3 లక్షల మందికిపై హాజరయ్యారు. అందులో 10,468 మంది ప్రధాన పరీక్షలకు అర్హత సాధించారు. గత ఏడాది సెప్టెంబరు 28 నుంచి అక్టోబరు 7 వరకు ప్రధాన పరీక్షలు జరిగాయి. వారి నుంచి 1994 మంది వ్యక్తిత్వ (మౌఖిక) పరీక్షకు ఎంపికయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 39 వేల మంది ప్రాథమిక పరీక్షలు రాయగా, అందులో దాదాపు 500 మంది ప్రధాన పరీక్షలకు అర్హత పొందారు. వారిలో 75 మందికిపైగా మౌఖిక పరీక్షకు ఎంపికకాగా చివరకు 40 మంది విజేతలుగా నిలిచినట్లు అంచనా వేస్తున్నారు. తొలి వందర్యాంకుల్లో అయిదుగురు తెలుగువాళ్లు ఉన్నట్లు భావిస్తున్నారు. ‘గత ఏడాది కంటే ఈసారి ఖాళీల సంఖ్య తగ్గడంతో ప్రధాన పరీక్షలకు అర్హత సాధించిన వారి సంఖ్య కూడా తగ్గింది’ అని బ్రెయిన్‌ ట్రీ శిక్షణ సంస్థ నిర్వాహకుడు గోపాలకృష్ణ చెప్పారు. తమ వద్ద శిక్షణ పొందిన వారిలో 15 మంది ర్యాంకులు సాధించారని చెప్పారు. తెలుగు రాష్ట్రాల టాపర్‌ వరుణ్‌రెడ్డి డాక్టర్‌ లక్ష్మయ్య సివిల్స్‌ శిక్షణ సంస్థలో జనరల్‌ స్టడీస్‌లో శిక్షణ పొందారు. లక్ష్మయ్య మాట్లాడుతూ గత ఏడాది కూడా తమ వద్ద శిక్షణ తీసుకున్న విద్యార్థికి 7వ ర్యాంకు వచ్చిందన్నారు. తమ సంస్థలో శిక్షణ తీసుకున్న వారిలో తొమ్మిది మంది వివిధ సర్వీస్‌లకు ఎంపికయ్యారని చెప్పారు. ట్వంటీ ఫస్ట్‌ సెంచరీ శిక్షణ సంస్థ ఛైర్మన్‌ కృష్ణ ప్రదీప్‌ మాట్లాడుతూ తమ వద్ద శిక్షణ తీసుకున్న వారిలో 10 మంది ఎంపికయ్యారని చెప్పారు.

 

కృషికి గుర్తింపు: షాహీద్‌(57వ ర్యాంకర్‌)
అచ్చంపేట, న్యూస్‌టుడే: అఖిల భారత స్థాయిలో 57వ ర్యాంకుతో ప్రతిభను చాటారు మహమ్మద్‌ అబ్దుల్‌ షాహీద్‌. రెండు నెలల కిందట ఈయన ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ (ఐఎఫ్‌ఎస్‌)కు ఎంపికయ్యారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా బల్మూరు మండలం తుమ్మన్‌పేట గ్రామానికి చెందిన మహమ్మద్‌ అబ్దుల్‌ హన్నన్‌, రెహనాబేగం దంపతులు ఇద్దరూ ఉపాధ్యాయులే. అదే మండలంలోని పోలిశెట్టిపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో ఉద్యోగం చేస్తూ అచ్చంపేటలో నివాసం ఉంటున్నారు. వారి కుమారుడు మహమ్మద్‌ అబ్దుల్‌ షాహీద్‌ అయిదో తరగతి వరకు అచ్చంపేటలో చదివారు. 6వ తరగతి వట్టెం నవోదయ గురుకుల పాఠశాలలో సీటు సాధించారు. పదో తరగతి వరకు అక్కడే విద్యాభ్యాసం చేశారు. సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలకు మూడేళ్లుగా సాధన చేశారు. గతేడాది మౌఖిక పరీక్ష వరకూ వెళ్లారు. పట్టుదలతో శ్రమించి రెండో ప్రయత్నంలో జాతీయ స్థాయిలో 57వ ర్యాంకు సాధించారు. మూడేళ్లుగా చేసిన కృషికి తగిన గుర్తింపు లభించిందని షాహీద్‌ సంతోషం వ్యక్తం చేశారు.

అమలాపురం యువకుడికి 64వ ర్యాంకు

అమలాపురం పట్టణం, న్యూస్‌టుడే: తూర్పుగోదావరి జిల్లా అమలాపురం పట్టణానికి చెందిన గోకరకొండ సూర్యసాయి ప్రవీణ్‌చంద్‌ శుక్రవారం విడుదలైన యూపీఎస్సీ(సివిల్స్‌) ఫలితాల్లో 64వ ర్యాంకు కైవసం చేసుకున్నారు. ఈయన తల్లి చిన్నతనంలోనే చనిపోగా, ఐఐటీ ఎంట్రన్స్‌ రాసే సమయంలో తండ్రి చనిపోయారు. అనంతరం మేనమామ సంరక్షణలో పెరిగారు. పాట్నాలోని ఐఐటీలో ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ చేసిన తరువాత బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ కొలువులో చేరారు. 2015లో ఆ ఉద్యోగానికి రాజీమానా చేసి సివిల్స్‌కు సిద్ధమయ్యారు. 2016లో ఒకసారి సివిల్స్‌ ఇంటర్వ్యూ వరకు వచ్చినా విజయం దక్కలేదు. తిరిగి 2017 సంవత్సరంలో మళ్లీ ప్రయత్నించారు. అప్పట్లో 512వ ర్యాంకు పొందగా, దిల్లీలోని ఇండియన్‌ ఇన్ఫర్మేషన్‌ సర్వీస్‌లో ఉద్యోగం వచ్చింది. మళ్లీ సివిల్స్‌కు సన్నద్ధమై పరీక్ష రాశారు. తాజాగా శుక్రవారం విడుదలైన ఫలితాల్లో 64వ ర్యాంకును కైవసం చేసుకున్నారు. ‘కుటుంబం అంటే అమ్మా నాన్నే కాదు.. సమాజం కూడా..’ అని తన మాతృమూర్తి చెప్పేవారని ఆమె స్ఫూర్తితోనే సివిల్స్‌లో విజయం సాధించానని సూర్యసాయి ప్రవీణ్‌చంద్‌ అన్నారు.

ఐఏఎస్‌ కావడమే లక్ష్యంగా..

ఈనాడు, హైదరాబాద్‌: ఐఏఎస్‌ సాధించాలన్న తపనతో సివిల్స్‌కు సిద్ధమయినట్లు 126వ ర్యాంక్‌ సాధించిన కేవీ మహేశ్వరరెడ్డి తెలిపారు. కడప జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం పందిళ్లపల్లికి చెందిన ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్‌ పూర్తిచేశారు. ముంబయి ఐఐటీలో ఎంటెక్‌ పూర్తిచేశారు. తండ్రి వెంకట్రామిరెడ్డి రైతు. మూడేళ్లపాటు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేసి ఆ తర్వాత జనరల్‌ స్టడీస్‌లో సొంతంగా పరీక్షలకు సిద్ధమయ్యారు. మిగిలిన పాఠ్యాంశాల్లో కోచింగ్‌ తీసుకున్నారు. తనకు ఐపీఎస్‌ క్యాడర్‌ వస్తుందని అనుకుంటున్నట్లు ‘ఈనాడు’కు తెలిపారు. కానీ, ఐఏఎస్‌ కావడమే తన అంతిమ లక్ష్యమని వివరించారు. మొదటి ప్రయత్నంలో ప్రిలిమ్స్‌ కోల్పోయినప్పటికీ పట్టు వదలకుండా ప్రయత్నించినట్లు వివరించారు.

 

131వ ర్యాంకు పొందిన శ్రీపాల్‌

శాయంపేట, న్యూస్‌టుడే: వరంగల్‌ రూరల్‌ జిల్లా శాయంపేట మండలం పత్తిపాక గ్రామానికి చెందిన చిట్టిరెడ్డి శ్రీపాల్‌ సివిల్స్‌లో 131వ ర్యాంక్‌ సాధించారు. వారణాసిలో 2017లో ఐఐటీ పూర్తి చేసిన శ్రీపాల్‌ ఏడాది కాలం ఇంటి వద్దనే ఉంటూ సివిల్స్‌ సాధనకు కష్టపడ్డారు. రెండో ప్రయత్నంలోనే సివిల్స్‌కు ఎంపికయ్యారు. దిల్లీలోని కోచింగ్‌ కేంద్రాల నుంచి పరీక్ష అభ్యసన సామగ్రిని తెప్పించుకుని చదివినట్లు శ్రీపాల్‌ తెలిపారు. తల్లిదండ్రులు మంజుల, సాంబశివది వ్యవసాయ కుటుంబం. తమ కుమారుడు సివిల్స్‌ సాధించడంతో వారు సంతోషం వ్యక్తం చేశారు.

 

అనుకోని ప్రశ్న అది - సిరి మేఘన (ర్యాంకు 171)


లక్ష్యం ఎప్పుడు పెట్టుకున్నామన్నది కాదు... దాన్ని ఎంత విజయవంతంగా చేరుకోగలిగాం అనేదే ముఖ్యం. ఇంజినీరింగ్‌ చివరి ఏడాదిలో సివిల్స్‌ సాధించాలని నిర్ణయించుకున్నా. వందశాతం కష్టపడి మొదటి ప్రయత్నంలోనే ఇంటర్వ్యూ వరకు వెళ్లగలిగా. నేను చేసిన పొరబాట్లు, తెలుసుకోలేకపోయిన అంశాలు... వీటన్నింటినీ ఓ పుస్తకంలో రాసుకుని చూసుకున్నా. సొంతంగా ఇంట్లోనే ఉండి చదువుకోవడం మంచిదే కానీ... వెనకబడిన అంశాల్లో నిపుణుల సూచనలూ అవసరమే. అందుకే ఇంటర్వ్యూలో గోపాలకృష్ణ సర్‌ దగ్గర మెలకువలు నేర్చుకున్నా. ప్రత్యేకంగా ఇంత సమయం చదవాలనే నియమం పెట్టుకోలేదు. చదివిన ప్రతి విషయాన్ని రాసుకునేదాన్ని. రాసే వేగాన్ని పెంచుకున్నా. లోపాలు సరిదిద్దుకుంటూ చదివా. ఇంటర్వ్యూలో నెగ్గాలంటే కొన్ని మెలకువలు అవసరం అని తెలుసుకున్నా. ఎందుకంటే ఇంటర్వ్యూ బోర్డు ఎప్పుడే ప్రశ్న వేస్తుందో ఊహించలేం. దేనికయినా లాజికల్‌గా సమాధానం చెప్పగలగాలి. అందులో నిజాయతీ ఉండాలి. సూటిగా, స్పష్టంగా అర్థమవ్వాలి. నన్ను బోర్డు ‘సెన్సార్‌షిప్‌ ఉండాలా వద్దా’...? నేను చదివిన రిషివ్యాలీ స్కూల్‌ పద్ధతిని అంతటా ప్రవేశపెట్టొచ్చా... అనే అంశాలపై ప్రశ్నలడిగారు.వాటికి నా సమాధానాలే నాకు ర్యాంకు తెచ్చిపెట్టాయి. చదువుకునే క్రమంలో అమ్మ, చెల్లి నాకెంతో సాయం చేశారు. మాది హైదరాబాద్‌. నాన్న సీతారామ్‌ మలేసియాలో ఇంజినీర్‌గా చేస్తున్నారు. అమ్మ సునీత గృహిణి, నాకో చెల్లి. నేను చిత్తూరు జిల్లా మదనపల్లిలోని రిషీవ్యాలీ పాఠశాలలో చదువుకున్నా. బిట్స్‌లో సివిల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేశా. మారుమూల గ్రామంలోని చిట్ట చివరి వ్యక్తికి కూడా ప్రభుత్వ ఫలాలు అందాలంటే... సివిల్స్‌ సర్వీస్‌ వల్లే సాధ్యమని అనిపించింది. అందుకే ఇటువైపు రావాలనుకున్నా.

 

వారికి సేవ చేయాలనే.. - శివ్‌ నిహారిక (ర్యాంకు 237)


డిగ్రీ చివరేడాది చదువుతున్నప్పుడు ఓ సారి ప్రయత్నించి చూద్దాం అంటూ మొదటిసారి సివిల్స్‌ రాశా. ఆ తరువాత రెండోసారి ప్రభుత్వోద్యోగం గౌరవం అనుకుని ప్రయత్నించా. ఆ ప్రయత్నంలోనే 484 ర్యాంకు సాధించా. ప్రస్తుతం ఇండియన్‌ డిఫెన్స్‌ అకౌంట్స్‌ సర్వీస్‌ అధికారిణిగా ప్రస్తుతం హరియాణాలోని ఫరీదాబాద్‌లో శిక్షణ తీసుకుంటున్నా. ఈ క్రమంలోనే మారుమూల గ్రామాలకు వెళ్తున్నప్పుడు వారి జీవితాలు బాగుండాలంటే ఐఏఎస్‌ సాధించాల్సిందేనని అనిపించింది. అందుకే మూడో ప్రయత్నం చేశా. ఇప్పుడు ర్యాంకు వచ్చింది. మా స్వస్థలం హైదరాబాద్‌. నా చదువంతా ఇక్కడే సాగింది. డిగ్రీ సెయింట్‌ఫ్రాన్సిస్‌ కాలేజీ నుంచి పూర్తిచేశా. నాన్న శివ్‌గోపాల్‌ సింగ్‌ అడ్వొకేట్‌. అమ్మ కవితాసింగ్‌ గృహిణి. నాకో తమ్ముడు. లా చేస్తున్నాడు. ఆంత్రోపాలజీ ఆప్షనల్‌ సబ్జెక్ట్‌గా నేను పరీక్షకు సిద్ధమయ్యా. రెండు కోచింగ్‌ సెంటర్లలో డబ్బులు కట్టినా...ఎక్కడా శిక్షణ తీసుకోలేదు. సొంతంగానే చదివా.

 

ప్రజాసేవే లక్ష్యం...

ఖమ్మం వైరారోడ్డు, న్యూస్‌టుడే: ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఈర్లపూడికి చెందిన బాణోతు మృగేందర్‌లాల్‌ సివిల్స్‌లో 551 ర్యాంకు సాధించారు. చెన్నై ఐఐటీ నుంచి 2015లో ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేశారు. సివిల్స్‌ కోసం ఆయన దిల్లీలో శిక్షణ తీసుకున్నారు. వైరా మాజీ శాసనసభ్యుడు మదన్‌లాల్‌, మంజుల దంపతుల కుమారుడైన మృగేందర్‌లాల్‌ తన మూడో ప్రయత్నంలో విజయం సాధించారు. ప్రజాసేవ చేయడమే లక్ష్యంగా ఐఏఎస్‌ అయ్యేందుకు కృషి చేసినట్లు తెలిపారు.

 

మిర్యాలగూడ వాసికి ఏడో ర్యాంకు


మిర్యాలగూడ, న్యూస్‌టుడే: సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షల ఫలితాల్లో జాతీయస్థాయిలో ఏడో ర్యాంకు సాధించిన కర్నాటి వరుణ్‌రెడ్డి నల్గొండజిల్లా మిర్యాలగూడ పట్టణానికి చెందిన కంటి వైద్యుడు డాక్టర్‌ జనార్దన్‌రెడ్డి, వ్యవసాయ శాఖ డివిజన్‌ అధికారి పోరెడ్డి నాగమణిల పెద్ద కుమారుడు. తన ఐదో ప్రయత్నంలో ఆయన విజేతగా నిలిచారు. మిర్యాలగూడ మండలంలోని ఎస్పీఆర్‌ఎస్‌ పాఠశాలలో ఒకటి నుంచి ఏడో తరగతి వరకు చదివిన వరుణ్‌రెడ్డి ఆరు నుంచి పదో తరగతి వరకు గుడివాడలో చదివారు. ఇంటర్మీడియట్‌ గూడవల్లి కేకేఆర్‌ జూనియర్‌ కళాశాలలో ఎంపీసీ చదివారు. ఐఐటీ పోటీ పరీక్షలో జాతీయ స్థాయిలో 29వ ర్యాంకు సాధించిన తరువాత ముంబై ఐఐటీలో కంప్యూటర్‌ సైన్సు ఇంజనీరింగ్‌ పూర్తి చేశారు. ఐఐటీ పూర్తయ్యాక, దిల్లీలో సివిల్స్‌ పరీక్షలకు సిద్ధమయ్యారు. మొదటి ప్రయత్నంలో ఇంటర్వ్యూ వరకు, రెండో సారి మెయిన్స్‌వరకు వెళ్లి ఆగిపోయారు. 2016లో మూడో ప్రయత్నంలో 166వ ర్యాంకు సాధించి ఇండియన్‌ రెవెన్యూ సర్వీసెస్‌లో చేరారు. కొంతకాలం సెలవు పెట్టి 2017లో నాలుగోసారి సివిల్స్‌ రాయగా 220వ ర్యాంకు వచ్చింది. తిరిగి ఉద్యోగంలో చేరారు. 2018లో ఐదో సారి పరీక్షరాసి జాతీయ స్థాయిలో ఏడో ర్యాంకు సాధించి ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. వరుణ్‌రెడ్డి సోదరుడు కర్నాటి పృథ్వీర్‌రెడ్డి ఎంబీబీఎస్‌ హౌస్‌ సర్జన్‌గా వరంగల్‌ కాకతీయ యూనివర్సిటీలో చేస్తున్నారు. తమ కుమారుడు కర్నాటి వరుణ్‌రెడ్డి సివిల్స్‌ సాధించటం పట్ల కుటుంబ సభ్యులు ఆనందోత్సాహాలతో పొంగిపోయారు.

మూడో ప్రయత్నంలో 50వ ర్యాంక్‌

ఈనాడు, హైదరాబాద్‌: తిరుపతికి చెందిన రంగశ్రీ తిరుమలై కుమార మూడో ప్రయత్నంలో సివిల్స్‌లో 50వ ర్యాంకు సాధించారు. ఉన్నత విద్య వరకు బెంగళూరులో పూర్తిచేసిన ఆమె న్యాయవిద్యను దిల్లీలో అభ్యసించారు. సివిల్స్‌ రెండో ప్రయత్నంలో ఆర్‌పీఎఫ్‌ (రైల్వే రక్షక దళం)లో ఉద్యోగం లభించగా ప్రస్తుతం లక్నోలో సహాయక రక్షణాధికారిగా పనిచేస్తున్న ఆమె మూడో ప్రయత్నంలో విజయం సాధించారు. ఆమె తండ్రి శ్రీనాథ్‌ బెంగళూరులో హెచ్‌ఆర్‌ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నారు.

 

అపజయం నుంచి విజయం దిశగా- శరణ్య పొలుమాటి (ర్యాంకు 582)

ఏ రంగం అభివృద్ధి చెందాలన్నా, ఆ ప్రయోజనాలు ప్రజలందరికీ అందాలన్నా... అధికారులదే కీలకపాత్ర. టీఎన్‌ శేషన్‌ ఎన్నికల సంఘంలో చేపట్టిన ఎన్నో సంస్కరణలే ఇందుకు ఉదాహరణ. అలాంటివారే నాకు స్ఫూర్తి. నేను మూడో ప్రయత్నంలో ర్యాంకు తెచ్చుకున్నా. మొదటిసారి రాసినప్పుడు నా చదువు ఇంకా పూర్తికాలేదు. దాంతో పెద్దగా బాధపడలేదు. కానీ రెండోసారి మెయిన్స్‌ వరకు కూడా వెళ్లలేకపోయా. దీనికి నా నిర్లక్ష్యమేనని బాధపడ్డా. అప్పుడు అమ్మానాన్న ఇక్కడితో జీవితం ఆగిపోలేదని ధైర్యం చెప్పారు. పొరపాట్లను సరిదిద్దుకుంటే విజయం సొంతమన్నారు. మళ్లీ చదువుపై దృష్టిపెట్టా. దిల్లీలో శిక్షణ తీసుకున్నా. ప్రణాళికలోనూ మార్పులు చేసుకొని రోజూ ఆరేడు గంటలు చదివేదాన్ని. పరీక్షలు దగ్గరపడేకొద్దీ పది నుంచి పన్నెండు గంటలు చదివేదాన్ని. పేపర్‌ చదవడం, రాసే వేగం పెంచుకోవడం అలవాటు చేసుకున్నా. నా ఆప్షనల్‌ సబ్జెక్ట్‌ ఆంత్రోపాలజీ. భోపాల్‌లోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ నుంచి ఇంటిగ్రేటెడ్‌ కోర్సు పూర్తిచేశా. అదయ్యాకే సివిల్స్‌ ప్రయత్నాలు మొదలుపెట్టా. నాన్న సిండికేట్‌ బ్యాంక్‌ మేనేజర్‌. అమ్మ గృహిణి. నాకో తమ్ముడు.

ఆఖరి ప్రయత్నంలో సాధించా.. - అనూష (ర్యాంకు 375)

మాది కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు. నేను సీఏ చదివి నాలుగేళ్లు ఉద్యోగం చేశా. ముందు నుంచి సివిల్స్‌ రాయాలని ఉన్నా...ఆర్థికంగా భారం అనుకుని దూరంగా ఉన్నా. పెళ్లయ్యాక మా వారు ప్రోత్సాహంతో రాశా. మొదటిసారి రాస్తున్నప్పుడు ఐదునెలల గర్భిణిని. పెద్దగా దృష్టిపెట్టలేదు. రెండోసారి రెండు మార్కుల తేడాతో ఇంటర్వ్యూ పోయింది. అప్పుడు చాలా బాధపడ్డా. నిజానికి నాకు ఈ ప్రయత్నం చివరిది. జనరల్‌ కేటగిరి ప్రకారం ఇప్పుడు నేను నా లక్ష్యం చేరుకోలేకపోతే ఇక ఎప్పటికీ సాధించలేను. అందుకే ఎలాగైనా సాధించాలన్న కసి అప్పుడే పెరిగింది. సొంతంగా సిద్ధమై, బ్రెయిన్‌ట్రీ, సీఎస్‌బీఏల్లో ఇంటర్వ్యూకోసం సలహాలు తీసుకున్నా. ఇప్పుడు ర్యాంకు అందుకున్నా.

ఓటమిని లెక్కేసి.. - రంగశ్రీ తిరుమలై కుమార (ర్యాంకు 50)

సివిల్‌ సర్వీసెస్‌ నా చిన్నప్పటి కల. నాకు స్ఫూర్తి విదేశాంగ కార్యదర్శిగా పనిచేసిన జయశంకర్‌. ఇక, నాకన్నా ముందు మా బంధువుల్లో ముగ్గురు సివిల్‌ సర్వీసెస్‌ సాధించారు. దాంతో నేనూ ఇటువైపు వచ్చా. నేషనల్‌ లా యూనివర్సిటీలో న్యాయవిద్య చదివా. ఆ తరువాత సివిల్స్‌ పై దృష్టిపెట్టా. రెండుసార్లు ర్యాంకు రాలేదు. ప్రస్తుతం లఖ్‌నవూలో ప్రొబేషన్‌ ఆర్‌పీఎఫ్‌ అధికారిణిగా శిక్షణలో తీసుకుంటున్నా. మొదటి రెండుసార్లు చేసిన పొరపాట్లను గమనించుకున్నా. ఐచ్ఛికంలో ఎక్కువ మార్కులు సాధిస్తే మంచి ర్యాంకు వస్తుందని తెలిసింది. దాంతో ఈసారి దానిపై ఎక్కువ దృష్టిపెట్టా. నా ఆప్షనల్‌ సబ్జెక్ట్‌ లా. ఎవరు ఏ ఇనిస్టిట్యూట్‌లో కోచింగ్‌ తీసుకున్నా సరే కచ్చితంగా తమకంటూ సొంత ప్రణాళిక ఉండాలి. అప్పుడే విజయాన్ని అందుకోగలుగుతాం. మాది తిరుమల. నాన్న ఉద్యోగరీత్యా మేం బెంగళూరులో స్థిరపడ్డాం. నాన్న తిరుమలై కుమార శ్రీనాథ్‌ ఓ కార్పొరేట్‌ సంస్థలో హెచ్‌ఆర్‌ విభాగంలో చేస్తున్నారు. అమ్మ సుమిత్ర గృహిణి. నాకో తమ్ముడు.

 

గెలుపు నాలుగోసారి - మేఘన (ర్యాంకు 465)

నేను ఉస్మానియాలో యూనివర్సిటీలో ఇంజినీరింగ్‌ చేసే సమయంలో నాకు సామాజిక అంశాలపై ఆసక్తి మొదలయ్యింది. పిల్లలు, లింగవివక్ష వంటి అంశాల్లో జరిగే చర్చల్ని గమనించేదాన్ని. వారికి మేలు చేయాలంటే సివిల్సే మార్గమని అనిపించింది. మాది హైదరాబాద్‌. నాన్న బీఆర్‌ అర్జున్‌ ఆర్‌అండ్‌బీ డిపార్ట్‌మెంట్‌లో ఇంజినీర్‌. అమ్మ వినోదిని గాంధీ మెడికల్‌ కాలేజీలో ప్రొఫెసర్‌. మొదటిసారి 2015లో సివిల్స్‌ రాశా. ప్రిలిమినరీ కూడా పాసవ్వలేదు. రెండో సారి ప్రిలిమినరీలో ఎంపికై కొద్దిరోజుల్లో పరీక్ష ఉందనగా కుడిచేతికి ఫ్రాక్చర్‌ అయ్యింది. మూడోసారి అంతే. ఈసారి ఎలాగైనా సాధించాలనే కసితో ప్రణాళిక సిద్ధం చేసుకున్నా. రెట్టింపు కష్టపడ్డా. మొదటిసారి రాస్తున్నప్పుడు శిక్షణ తీసుకున్నా కానీ... ఈ సారి సొంతంగానే చదివా. చివరిగా టెస్ట్‌ సిరీస్‌, ఇంటర్వ్యూకి అవసరమైన శిక్షణ సీఎస్‌బీ అకాడమీలోని తీసుకున్నా. సోషియాలజీ నా ఐచ్ఛికం. ఇంటర్వ్యూ బోర్డు మీటూ ఉద్యోమం, లైంగికవేధింపులు వంటి మహిళా సమస్యలపై ప్రశ్నలు అడిగింది. సివిల్స్‌ రాయాలనుకునే వారు ముందు తమ ఆలోచనలో స్థిరత్వం తెచ్చుకోవాలి. ఎక్కువ గంటలు కష్టపడే శక్తి అవసరం. అప్పుడే దృష్టి కేంద్రీకరించగలుగుతాం. నేను అదే చేశా.

 


సివిల్స్‌ టాపర్‌గా కనిష్క కటారియా
* అక్షత్‌జైన్‌కు రెండో ర్యాంకు
* ఇద్దరూ రాజస్థాన్‌ రాష్ట్రానికి చెందినవారే
* మహిళల్లో మేటిగా నిలిచిన సృష్టి

దిల్లీ: యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్‌సీ) నిర్వహించిన 2018 పరీక్షల్లో ఐఐటీ-బాంబేకు చెందిన బీటెక్‌ విద్యార్థి కనిష్క కటారియా టాపర్‌గా నిలిచారు. ఈయనది రాజస్థాన్‌. రెండో ర్యాంకు సాధించిన అక్షత్‌జైన్‌ కూడా రాజస్థాన్‌కు చెందినవారే. సృష్టి జయంత్‌ దేశ్‌ముఖ్‌ మహిళల్లో టాపర్‌గా నిలిచినా, ర్యాంకుపరంగా ఐదోస్థానాన్ని కైవసం చేసుకున్నారు. అగ్రస్థానంలో నిలిచిన 25 మందిలో 15 మంది పురుషులు, పదిమంది మహిళలు ఉన్నారు. 577 మంది పురుషులు, 182 మంది మహిళలు సహా మొత్తం 759 మంది అభ్యర్థులను ఎంపిక చేసినట్లు యూపీఎస్‌సీ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. వీరిలో 36 మంది దివ్యాంగులు ఉన్నారు. కేంద్రప్రభుత్వం నోటిఫికేషన్‌ ప్రకారం 180 ఐఏఎస్‌, 30 ఐఎఫ్‌ఎస్‌, 150 ఐపీఎస్‌ ఖాళీలతో పాటు సెంట్రల్‌ సర్వీసెస్‌లో గ్రూప్‌ ‘ఎ’ 384, గ్రూప్‌ ‘బి’ 68 ఖాళీలు ఉన్నాయి.

 

స్థిరత్వం, ఆత్మవిశ్వాసంతో లక్ష్యసాధన
టాపర్‌గా నిలిచిన కటారియా ఎస్సీ కేటగిరీకి చెందినవారు. కంప్యూటర్‌ సైన్స్‌, ఇంజినీరింగ్‌ నుంచి బీటెక్‌ పూర్తి చేశారు. సివిల్స్‌లో గణితం ఆప్షనల్‌ సబ్జెక్టుగా తీసుకున్నారు. ప్రస్తుతం డేటా సైంటిస్ట్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం.

మొదటి ప్రయత్నంలోనే మెరిసిన సృష్టి
మహిళల్లో అగ్రగామిగా నిలిచిన సృష్టి మధ్యప్రదేశ్‌కు చెందినవారు. భోపాల్‌లోని రాజీవ్‌గాంధీ ప్రౌద్యోగికి విశ్వవిద్యాలయం నుంచి కెమికల్‌ ఇంజినీరింగ్‌లో బీఈ చదివారు. ఇదే విభాగంలో ఎంఫిల్‌ సాధించారు. ‘‘నాపై నాకు నమ్మకం ఉంది. మొదటి ప్రయత్నంలోనే ర్యాంకు సాధించడం ఆనందంగా ఉంది. స్థిరత్వం, ఆత్మవిశ్వాసం ఉంటే అనుకున్నది సాధించవచ్చు’’ అని ఆమె పేర్కొన్నారు. ఈమె తండ్రి ఇంజినీర్‌, తల్లి పూర్వప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలు.

 

సొంత రాష్ట్రానికి సేవలందిస్తానంటున్న రెండో ర్యాంకర్‌
సమాజానికి సేవ చేయాలనే తలంపుతోనే సివిల్స్‌ రాశానని రెండో ర్యాంకు సాధించిన అక్షత్‌జైన్‌ తెలిపారు. సొంతరాష్ట్రమైన రాజస్థాన్‌లో ఐఏఎస్‌గా సేవలందిస్తానంటున్నారు. ఈయన ఐఐటీ గువాహటి నుంచి ఇంజినీరింగ్‌ పూర్తి చేశారు. జైపుర్‌కు చెందిన అక్షత్‌ తండ్రి ఐపీఎస్‌ అధికారి. తల్లి ఇండియన్‌ రెవెన్యూ సర్వీస్‌ అధికారిణి.

Posted Date: 01-11-2019


  • Tags :