• facebook
  • whatsapp
  • telegram

ఇష్టపడి చదివితే ఉత్తమ ఫలితాలు ఖాయం!

 

* నిట్ పీజీసెట్ 2013- రెండో ర్యాంకర్ రణధీర్
విద్యార్థుల్లో ఉత్తమ విద్యార్థి సాధారణ విద్యార్థి అంటూ ఎవరూ ఉండరని, ప్రణాళిక ప్రకారం ఇష్టపడి చదివితే ప్రతి విద్యార్థి ఉత్తమ ఫలితాలు సాధించవచ్చంటున్నారు- నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ పీజీ సెట్-2013లో జాతీయస్థాయిలో ద్వితీయర్యాంకు సాధించిన రావుల రణధీర్.

ఈ ర్యాంక్‌ను అందుకోవడంలో తన కృషిని న్యూస్‌టుడేకు వివరించారు. వివరాలు తన మాటల్లోనే...

జీడిమెట్ల, న్యూస్‌టుడే:

న్యూస్‌టుడే: ఎన్ఐటీ వరంగల్ నిర్వహించిన జాతీయస్థాయి పీజీ ప్రవేశపరీక్ష (నిట్ పీజీ సెట్ 2013)లో రెండో స్థానం వచ్చినందుకు మీకెలా అనిపిస్తోంది? (నిట్‌లో ఎంఎస్సీ మ్యాథ్స్, ఎంఎస్సీ కెమిస్ట్రీ, ఎంఎస్సీ ఫిజిక్స్ కోర్సుల్లో ప్రవేశానికి ఈ పరీక్ష జరుగుతుంది).
రణధీర్: చాలా ఆనందంగా ఉంది. ఓయూపీజీ ప్రవేశపరీక్షలో కూడా నాకు 26వ ర్యాంకు వచ్చింది.

 

న్యూ: మీ కుటుంబ నేపథ్యం...
ర: నా తండ్రి పేరు వరప్రసాద్, తల్లి సునీతాదేవి. ఇద్దరూ ప్రయివేటు ఉపాధ్యాయులు.

న్యూ: మీ విద్యార్హతలు, సాధించిన మార్కుల గురించి వివరిస్తారా....
ర: పదో తరగతిలో 87 శాతం మార్కులు సాధించాను. ఇంటర్మీడియట్‌లో 88.5 శాతం, బీఎస్సీ ఎంపీసీలో 83 శాతం మార్కులు సాధించాను.

న్యూ: నిట్ పీజీ సెట్ 2013లో ర్యాంకు సాధించడానికి ఏవిధంగా కృషిచేశారు?
ర: ప్రతిరోజు ఆరు నుంచి 7 గంటలు ప్రణాళిక వేసుకుని ఇష్టపడి చదివాను.ఎక్కువ గంటల చదవాల్సి వస్తుందేమోననే భావన రానివ్వలేదు. ముఖ్యంగా ప్రతి రోజు ఉదయం 4 గంటల నుంచి 7 గంటలవరకూ ఆదివారంతో సహా చదవడం అలవాటు చేసుకున్నాను. సబ్జెక్టులను అవగాహన చేసుకుంటూ చదివాను. దీనివల్ల కొంత ఎక్కువ సమయం పట్టినా, పరీక్షలో మంచి ఫలితాలు వచ్చాయి. సబ్జెక్టు మీద ఎంత పట్టు ఉంటే అంత ప్రయోజనం ఉంటుందని నా అభిప్రాయం.

న్యూ. మీ తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎలా ఉంది?
ర. ఇద్దరూ విద్యావంతులు కావడంతో మంచి గైడెన్స్ లభించింది. ముఖ్యంగా వారి ఇష్టాన్ని నాపై రుద్దకుండా నా ఇష్టాన్ని గుర్తించి అన్నీ సమకూర్చడంతోపాటు నన్ను ప్రోహించారు.

న్యూ. ఎన్ఐటీ వరంగల్‌లో చేరతారా? ఓయూ పీజీలో చేరుతారా?
ర. నాకు హైదరాబద్ సెంట్రల్ యూనివర్సీటీలో సీటు లభించింది. అందులో చేరాను.

న్యూ. ఒత్తిడికి గురైనప్పుడు దాన్ని జయించడానికి ఏంచేస్తారు?
ర. నా వరకు నేను సంగీతం వింటాను. మా వాళ్లతో మాట్లాడతాను. ఎవరైనా ఒత్తిడి నుంచి దూరం కావాలంటే తమకి ఇష్టమైన పనిచేస్తే విశ్రాంతి పొందుతారని నా అభిప్రాయం.

న్యూ. మీ జీవిత లక్ష్యం ఏమిటి?
ర. సివిల్స్ రాసి ఐఏఎస్‌గా సమాజానికి సేవ చేయడమే నాలక్ష్యం.

నూ. కొత్తవారికి మీరిచ్చే సలహా?
ర. విద్యార్థుల్లో ఉత్తమ విద్యార్థి, సాధారణ విద్యార్థి అనే తేడా ఉండదు. ఇష్టపడి చదివితే ప్రతి విద్యార్థి ఉత్తమ ఫలితాలు సాధిస్తాడు. అలా చదవడంలేదంటే అతనికి ఇతర రంగాలపై ఆసక్తి ఉందని గమనించాలి. కాబట్టి విద్యార్థులు తమకు ఆసక్తి ఉన్న కెరీర్ గురించి తల్లిదండ్రులకు, టీచర్లకు చెప్పడం మంచిది.

Posted Date: 01-11-2019


  • Tags :