• facebook
  • whatsapp
  • telegram

బట్టీ వ్యర్థం.. వేగం ముఖ్యం: రవిశ్రీతేజ

 

 

* రెండు ఎంసెట్‌ల టాప్‌ ర్యాంకర్‌ రవిశ్రీ తేజ

ఎంసెట్‌లో మంచి ర్యాంకు తెచ్చుకుంటే అభినందిస్తాం. రెండు రాష్ట్రాల ఎంసెట్‌లలోనూ టాప్‌ ర్యాంకు వస్తే ఇంకా మెచ్చుకుంటాం. మరి రెండింటిలోనూ ప్రథమ ర్యాంకు తెచ్చుకుంటే? ఆ పనే చేసి ఆశ్చర్యపరిచాడు తాడేపల్లిగూడెం విద్యార్థి కురిశేటి రవిశ్రీతేజ. బట్టీ పట్టే విధానం ఎంసెట్‌లాంటి ఏ పోటీ పరీక్షకూ సరిపోదంటున్న ఇతడు తనకీ ఘనత ఎలా సాధ్యమైందో, అందుకు తను చేసిన కృషి ఏమిటో వివరిస్తున్నాడు..!

మాది పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని రామచంద్రరావుపేట. నాన్న ఉమామహేశ్వరగుప్త ప్రింటింగ్‌ ప్రెస్‌ నిర్వహిస్తున్నారు. అమ్మ గీతాకుమారి గృహిణి. పదో తరగతిలో 9.8 జీపీఏ సాధించా. నాకిష్టమైన హిందీలో 9.8 జీపీఏ రావడంతో పునర్మూల్యాంకనం చేయిస్తే ఫలితంలో మార్పు రాలేదు. మొదట 90 మార్కులు రాగా.. పునర్మూల్యాంకనంలో 89 మార్కులొచ్చాయి. అందువల్ల ఫలితం మారలేదు. అప్పుడే అనిపించింది పరీక్ష రాయడం వరకే మనవంతు, ఫలితాన్ని ఆశించకూడదని! ఇంటర్‌ విజయవాడ శ్రీచైతన్య కళాశాలలో చేరా. మా బ్యాచ్‌కి వచ్చేసరికి కళాశాల యాజమాన్యం బోధన, సాధన, పునశ్చరణ అంశాల్లో మార్పులు చేసింది. ఇది నాలాంటి విద్యార్థులకు ఎంతో కలిసొచ్చింది. ఒత్తిడి అనిపిస్తే క్యారమ్స్‌, చదరంగం లాంటి ఆటలు ఆడుకోవడానికి అనుమతించేవారు. సినిమాలకు వెళ్లనిచ్చేవారు. ఇది మా ఫలితాలపై చక్కని ప్రభావాన్ని చూపింది.
ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో 12 గంటలు చదవడానికే కేటాయించేవాడిని. సీనియర్ల సూచనల మేరకు ద్వితీయ సంవత్సరంలో దాన్ని రెండు గంటలు తగ్గించా. కష్టమైన అంశాలను స్నేహితులమంతా బృందాలుగా చర్చించేవాళ్లం. నేను ఇనార్గానిక్‌ కెమిస్ట్రీ పాఠ్యాంశాల్లో కాస్త వెనుక ఉండేవాడిని. స్నేహితులతో బృందంగా చర్చించడం ద్వారానే మెరుగయ్యా. కఠినమైన ఫార్ములాలు, అంశాలకు కోడ్‌లు, గుర్తులు పెట్టుకునేవాడిని. ఇలా చేయడం పునశ్చరణ, పరీక్ష సమయాల్లో బాగా ఉపయోగపడింది.
ఈసారి..
ఎంసెట్‌ మూడు గంటల పరీక్ష. ఈసారి ఏపీ ఎంసెట్‌లో ప్రశ్నలు.. ఎక్కువ రఫ్‌ వర్క్‌ చేసేలా వచ్చాయి. మొత్తం చేయడానికి నాలుగు నుంచి అయిదు గంటల సమయం సులువుగా పడుతుందనిపించింది. ఇచ్చిన ఎనిమిది రఫ్‌ పేపర్లు సరిపోలేదు. చాలామంది చేతులు, కాళ్లపైనా లెక్కలు చేసుకున్నారు. తెలంగాణ ఎంసెట్‌ పేపర్‌కు మూడు గంటలు కచ్చితంగా సరిపోయింది. ఎలాంటి ఒత్తిడికీ ఎదురుకాలేదు. ఏపీ ఎంసెట్‌లో 155, తెలంగాణ ఎంసెట్‌లో 150 మార్కులతో ప్రథమ ర్యాంకు పొందగలిగా.
భవిష్యత్తులో సివిల్స్‌ రాసి, ఐఏఎస్‌గా ప్రజలకు సేవ చేయాలన్నది నా జీవితాశయం. దానికి మరికొంత సమయం ఉన్నందున ప్రస్తుతం ఐఐటీలో చేరాలనే ప్రయత్నంలో నిమగ్నమయ్యా.
ప్రాథమ్యాలు గ్రహించి..
చదవడం, పరీక్ష రాయడాల్లో ప్రాథమ్యాలు తెలుసుకుంటే ర్యాంకు తెచ్చుకోవడం సులువు. ఎంసెట్‌కు సన్నద్ధమయ్యేటపుడు కష్టమనిపించే భౌతికశాస్త్ర పాఠాలను మొదట చదివేవాడిని. ఆ తర్వాత రసాయనశాస్త్రం.. చివరగా సులువైన గణితంపై దృష్టిసారించాను. పరీక్షల విషయానికి వచ్చేసరికి సులువైన వాటిని మొదట, కష్టమైన వాటిని తరువాత అంటే.. మొదట గణితం, తర్వాత రసాయన శాస్త్రం, భౌతికశాస్త్ర ప్రశ్నలకు జవాబులు రాసేవాడిని. ఈ విధానమే నాకు కలిసొచ్చింది.
ఎంసెట్‌ వంటి వంటి వాటిల్లో విజయం సాధించాలంటే.. బట్టీ పట్టే విధానం సరిపోదు. పాఠ్యాంశాలతోపాటు అధ్యాపకులు చెప్పిన ముఖ్యమైన అంశాలను నోట్స్‌ రూపంలో అర్థమయ్యేలా రాసుకోవాలి. వాటిని ఎప్పటికప్పుడు చదువుకుంటూ ఉండాలి. ఎక్కువమంది సులువైన అంశాలను మొదటా, కష్టమైన అంశాలను చివరగా చదువుతారు. దీనివల్ల ఒత్తిడి పెరుగుతుంది. కష్టమైన అంశాల సాధనకు నిర్దిష్ట సమయాన్ని నిర్దేశించుకొని మిగిలిన సమయాన్ని తేలికైన పాఠ్యాంశాలకు కేటాయించుకోవాలి. అప్పుడే సాధనకు సమయం సరిపోతుంది.
ఎంసెట్‌ రాసేటప్పుడు చాలా సమయం ఉందనే భావన ఎక్కువమందిలో ఉంటుంది. అది సరికాదు. మొదటి నుంచి చివరి వరకు ఒకే వేగంతో పరీక్ష రాయాలి. లేదంటే సమయం మించిపోయి, చివరకు వచ్చిన ప్రశ్నలకూ సమాధానాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఫలితంగా ర్యాంకుపై ప్రభావం చూపుతుంది.

Posted Date: 01-11-2019


  • Tags :