• facebook
  • whatsapp
  • telegram

అపోహలు వ‌దిలేస్తే.. ఆన్‌లైన్ విధాన‌మే ఉత్తమం!

* మ్యాట్-2013 ఆల్ ఇండియా టాప‌ర్ తేజ్ భ‌ర‌త్‌

ఎంచుకున్న కెరీర్‌ను విజ‌య‌వంతంగా పూర్తి చేసి, జీవితంలో ఉన్నతంగా స్థిర‌ప‌డ‌టానికి అత్యుత్తమ విద్యాసంస్థలు ఎంత‌గానో తోడ్పడ‌తాయి. ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశం పొందాల‌ని చాలా మంది క‌ల‌లు కంటారు. కానీ, ప‌క్కాగా ప్రణాళిక‌ను అమ‌లుచేసేవారే విజ‌యం సాధిస్తారు.

ఈ కోవ‌లోకే చెందుతాడు గుంటూరు జిల్లాకు చెందిన నెల్లూరి తేజా భ‌ర‌త్‌. ఇటీవ‌ల విడుద‌లైన మేనేజ్‌మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (మ్యాట్‌-2013) ఫ‌లితాల్లో 99.83 ప‌ర్సెంటైల్ సాధించి, ఆల్ ఇండియా టాప‌ర్‌గా నిలిచాడిత‌డు. దేశంలోని సుమారు 600 బిజినెస్ స్కూ ళ్లతోపాటు, కొన్ని అంత‌ర్జాతీయ విద్యాసంస్థలు కూడా వివిధ మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రవేశం క‌ల్పించ‌డానికి మ్యాట్ స్కోర్‌కార్డును ప్రామాణికంగా తీసుకుంటాయి. దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ఈ ప‌రీక్షను ఏటా నాలుగు ప‌ర్యాయాలు నిర్వహిస్తారు. 2013 మే 5న‌ నిర్వహించిన ప‌రీక్షలో తేజ్‌ భ‌ర‌త్ 800 మార్కులకు గాను 793.5 మార్కులు సాధించి దేశంలోనే అత్యుత్తమ ప్రతిభ క‌న‌బ‌రిచాడు. దేశవ్యాప్తంగా మొత్తం 50 వేల మందికి పైగా అభ్యర్థులు పరీక్ష రాయ‌గా, అందరిలో టాపర్‌గా నిలిచాడు. గుంటూరులోని ఆచార్య నాగార్జున కాలేజ్ ఆఫ్‌ ఇంజినీరింగ్ & టెక్నాల‌జీలో బీ.టెక్ (CSE) చివ‌రి సంవ‌త్సరం చ‌దువుతున్న తేజ్‌ భ‌ర‌త్‌ను ఈనాడుప్రతిభ‌.నెట్ బృందం ప‌లుక‌రించ‌గా అనేక ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను వెల్లడించాడు. ఆ వివ‌రాలు మీ కోసం....

 

ప్ర. మీరు మ్యాట్ ప‌రీక్షకు ప్రిపేర‌వ్వడానికి స్ఫూర్తి ఏమిటి?
జ‌: ఇంజినీరింగ్ పూర్తవ‌గానే ఉన్నత చ‌దువులు చ‌ద‌వాలనుకున్నాను. ఐఐఎమ్‌ల‌లో ఎంబీఏ చేద్దామ‌ని నిర్ణయించుకున్నాను. అందుకోసం మ్యాట్ ఉత్తమ మార్గంగా ఎంచుకున్నాను.


ప్ర. మీ కుటుంబ నేప‌థ్యం గురించి చెప్పండి.
జ‌: నాన్న శివరావు విజ‌య‌వాడ‌లోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. అమ్మ గృహిణి. ఉన్నత చ‌దువుల విష‌యంలో అమ్మా, నాన్న న‌న్ను ఎంతగానో ప్రోత్సహించారు.


ప్ర. మ్యాట్‌కు ఏవిధంగా ప్రిపేరయ్యారు?
జ‌: మ్యాట్ కోసం ఇంజినీరింగ్ మూడో సంవ‌త్సరం నుంచే ప్రయ‌త్నాలు ప్రారంభించాను. గుంటూరులోని TIME ఇన్‌స్టిట్యూట్‌లో కోచింగ్ తీసుకున్నాను. సొంతంగా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను. గ‌త నాలుగు నెల‌లుగా తీవ్రంగా శ్రమించాను.


ప్ర. మీరు కంప్యూట‌ర్ ఆధారిత ప‌రీక్ష రాశారు క‌దా! పేప‌ర్ బేస్‌డ్ విధానం, క‌ంప్యూట‌ర్ బేస్‌డ్ విధానం రెండింట్లో ఏది మెరుగైందిగా చెప్పవ‌చ్చు?
జ‌: చాలామంది కంప్యూట‌ర్ బేస్‌డ్ విధానాన్ని క‌ష్టంగా భావిస్తారు. ఇది అపోహ మాత్రమే. రెండింట్లో పెద్ద తేడా ఏం లేకున్నా... కంప్యూట‌ర్ బేస్‌డ్ విధానాన్నే మెరుగైందిగా చెప్పవ‌చ్చు. దీంట్లో నిర్దిష్ట స‌మ‌యంలో ఒకే ప్రశ్నపై దృష్టి కేంద్రీక‌రించ‌డానికి వెసులుబాటు ఉంటుంది. ఒక‌వేళ ఏదైనా ప్రశ్నకు స‌మాధానం తెలియ‌క‌పోతే, దాన్ని స్కిప్ చేసి, చివ‌ర్లో స‌మ‌యం మిగిలితే తిరిగి రివ్యూ చేసుకుని జ‌వాబు గుర్తించ‌వ‌చ్చు. పేప‌ర్ బేస్‌డ్ విధానంలోనూ ఈ సౌల‌భ్యం ఉన్నా.. పేజీలు తిప్పడంలోనే స‌మ‌యం వృథా అవుతుంది.


ప్ర. ఆన్‌లైన్ ప‌రీక్షా విధానానికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
జ‌: త‌ప్పనిస‌రిగా దీనికి స‌రిప‌డా ముంద‌స్తు క‌స‌ర‌త్తు చేయాలి. ఇంట‌ర్నెట్లో మ్యాట్‌కు సంబంధించి ఆన్‌లైన్ టెస్టులు చాలా ఉంటాయి. వీటిని సాధ్యమైనంత ఎక్కువ‌గా ప్రాక్టీస్ చేయాలి. ముందుగా మాన‌సికంగా సంసిద్ధమ‌వ్వాలి. భ‌యం అనేది మ‌న‌సుకు సంబంధించిన అంశం. దాన్ని వ‌దులుకుంటే కంప్యూట‌ర్ బేస్‌డ్ విధానంలోనే సౌక‌ర్యవంతంగా ప‌రీక్ష రాయ‌వ‌చ్చు. సుల‌భ‌మైన ప్రశ్నల‌కు వేగంగా స‌మాధానాల‌ను గుర్తిస్తే, మిగిలిన స‌మ‌యాన్ని మ్యాథ్స్‌, రీజ‌నింగ్ లాంటి విభాగాల‌కు అధికంగా వినియోగించుకోవ‌చ్చు. ప‌రీక్షకు సంబంధించిన అయిదు విభాగాల్లో... సుల‌భంగా చేయ‌గ‌లిగే వాటిని ముందుగా ఎంచుకొని సమాధానాల‌ను గుర్తిస్తూ, క‌ష్టత‌ర‌మ‌ని భావించిన‌వి చివ‌ర్లో ఆన్సర్ చేయ‌వ‌చ్చు.


ప్ర. ఏయే స‌బ్జెక్టుల‌కు ఏవిధంగా ప్రిపేర‌య్యారు?
జ‌: మ‌్యాథ్స్ బేసిక్స్ కోసం 8, 9, 10వ త‌ర‌గ‌తుల గ‌ణితం పుస్తకాల‌ను క్షుణ్ణంగా చ‌దివాను. లాజిక‌ల్ రీజ‌నింగ్‌, వెర్బల్ రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, డేటా ఇంట‌ర్‌ప్రిటేష‌న్ విభాగాల‌ కోసం ఆర్.ఎస్. అగర్వాల్ పుస్తకాల‌ను, రీడింగ్ కాంప్రహెన్షన్ కోసం ఇంగ్లిష్ ఫర్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ - ఎ.కె. కపూర్ పుస్తకం చ‌దివాను. వీటితోపాటు TIME ఇన్‌స్టిట్యూట్ మెటీరియ‌ల్ చ‌దివాను. వ‌ర్తమాన అంశాల కోసం హిందూ దిన‌ప‌త్రిక‌, ఇండియా టుడే మేగ‌జైన్ చ‌దివాను. www.eenadupratibha.net లో ఇచ్చే క‌రెంట్ అఫైర్స్‌ను బాగా ప్రిపేర‌య్యాను. ఇవి నా విజ‌యానికి ఎంత‌గానో తోడ్పడ్డాయి.


ప్ర. ప్రస్తుతం ఏం చేస్తున్నారు? మీ త‌దుప‌రి ల‌క్ష్యం ఏమిటి?
జ‌: నేను ప్రస్తుతం ఆచార్య నాగార్జున కాలేజ్ ఆఫ్‌ ఇంజినీరింగ్ & టెక్నాల‌జీలో బీ.టెక్ (సీఈసీ) నాలుగో సంవ‌త్సరం చదువుతున్నాను. ఇప్పటివ‌ర‌కూ 84 శాతం అక‌డ‌మిక్ ప‌ర్సెంటేజ్ సాధించాను. బీటెక్‌ పూర్తవ్వగానే ఐఐఎం, బెంగ‌ళూరులో ఎంబీఏ ఫైనాన్స్ లేదా ఆప‌రేష‌న్స్ కోర్సులో చేరాల‌నుకుంటున్నాను.


ప్ర. మ్యాట్ కోసం సిద్ధమ‌య్యేవారికి మీరిచ్చే సూచ‌న‌లేమిటి?
జ‌: కాంపిటేటివ్ ఎగ్జామ్స్ విష‌యంలో టైమ్ మేనేజ్‌మెంట్‌పై ఎక్కువ‌గా దృష్టి కేంద్రీక‌రించాలి. వీలైన‌న్నీ ఎక్కువ‌గా న‌మూనా ప‌రీక్షల‌ను, ఆన్‌లైన్ టెస్టుల‌ను ప్రాక్టీస్ చేయాలి. మ్యాట్ మెటీరియ‌ల్‌, ఆన్‌లైన్ టెస్టుల కోసం www.mbauniverse.com, testfunda.com వెబ్‌సైట్లు చూడ‌వ‌చ్చు. మ్యాథ్స్‌, రీజ‌నింగ్, డేటా ఇంట‌ర్‌ప్రిటేష‌న్ లాంటి విభాగాల‌ను ఎంత ఎక్కువ‌గా ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. ఒక ల‌క్ష్యాన్ని నిర్దేశించుకొని, పూర్తి ఆత్మవిశ్వాసంతో శ్రమిస్తే సాధించ‌లేనిదేదీ లేదు..

Posted Date: 02-11-2019


  • Tags :