• facebook
  • whatsapp
  • telegram

వేలల్లో ఒక్కడు!

ఎంబీబీఎస్‌లో ఆశించిన ర్యాంకు రాకపోయినా నిరాశపడలేదు. కృషి చేసి రెండో ప్రయత్నంలో ఉచిత సీటు సాధించాడు. ఆ పట్టుదలే పీజీ ప్రవేశపరీక్షలోనూ కొనసాగింది. జిప్‌మర్‌లో జాతీయస్థాయి ర్యాంకు సాధించిన సూరంపల్లి విజయ్‌ విజయానికి ఏ అంశాలు దారితీశాయి?
జిప్‌మర్‌ (జవహర్‌లాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌)లో మూడేళ్ల ఎండీ/ ఎంఎస్‌ కోర్సుల్లో ప్రవేశం పొందాలంటే దేశంలోని అన్ని ప్రాంతాల వారితోనూ పోటీ పడాలి. ఆ పోటీని విజయ్‌ విజయవంతంగా ఎదుర్కొని తృతీయ స్థానంలో నిలిచాడు.
ఖమ్మం జిల్లా కొణిజర్లకు చెందిన ఇతడిది సాధారణ రైతు కుటుంబం. తల్లిదండ్రులు శిరోమణి, నరసింహారావు. తండ్రి చదువు ఆర్థిక సమస్యలతో హైస్కూల్‌ స్థాయిలోనే అర్దాంతరంగా ఆగిపోయింది. తన కుమారుడికి అటువంటి పరిస్థితి ఎదురుకాకూడదని ఆయన ఆశయం. వైద్యవిద్య అంటే ఖర్చుతో కూడిన వ్యవహారం. చిన్నతనం నుంచి తల్లిదండ్రులు పడుతోన్న కష్టం.. ఆర్థిక ఇబ్బందులను దగ్గరి నుంచి చూసిన విజయ్‌ ఆ ఆటంకాలను ప్రతిభతోనే జయించాలని నిశ్చయించుకున్నాడు. తల్లిదండ్రుల, స్నేహితుల, గురువుల ప్రోత్సాహంతో ఒక్కో మెట్టు ఎక్కుతూ వెళ్ళాడు.
చిన్నప్పటి నుంచి సైన్స్‌ అంటే ఎక్కువ ఇష్టం. దీంతో ఆ సబ్జెక్టులో అధిక మార్కులు సాధించేవాడు. పాఠశాల విద్య అంతా కొణిజర్లలో, ఇంటర్‌ విజయవాడలో పూర్తయింది. పదో తరగతిలో 554 మార్కులు, ఇంటర్మీడియట్‌లో 95.1 శాతం వచ్చాయి.


ప్రామాణిక పాఠ్యపుస్తకాలు ముఖ్యం: విజయ్‌
ఎంబీబీఎస్‌ నుంచే పీజీ ప్రవేశ పరీక్షను దృష్టిలో పెట్టుకుని చదివాను. మొత్తం సబ్జెక్టుల్లో జనరల్‌ మెడిసిన్‌, జనరల్‌ సర్జరీ, పిడియాట్రిక్స్‌, పెథాలజీ, ఫార్మకాలజీలు చాలా ముఖ్యం. వీటిపై అధిక దృష్టిపెట్టాను. మొదట్నుంచీ ప్రామాణిక పాఠ్యపుస్తకాలు చదివాను. దీనివల్ల పరీక్షంగా, తికమక పెట్టే ప్రశ్నలు వచ్చినా సరైన జవాబులు గుర్తించగలిగాను. జిప్‌మర్‌లో మైనస్‌ మార్కులుంటాయి. తగిన జాగ్రత్త తీసుకోకపోతే ర్యాంకు దూరమయ్యే ప్రమాదముంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆత్మవిశ్వాసంతో పరీక్షకు సిద్ధంకావాలి. పీజీ పూర్తయిన తర్వాత సూపర్‌ స్పెషలైజేషన్‌ చేయాలనేది నా లక్ష్యం. తర్వాత గ్రామీణ ప్రాంత ప్రజలకు సేవలు అందించేలా కృషి చేస్తాను.


తొలి యత్నంలో తడబడినా...
ఎంసెట్‌ దీర్ఘకాలిక శిక్షణ పొందినప్పటికీ తొలి ప్రయత్నంలో రెండు వేలకు పైగా ర్యాంకు వచ్చింది. దీంతో కొందరు అతడి వైద్యవిద్య గురించి హేళన చేశారు. ఈ తరుణంలో 'విజయమేమీ అంతం కాదు.. అపజయం తుది మెట్టూ కాదు...' అన్న స్వామి వివేకానందుని మాటలు స్ఫురణకు వచ్చాయి. కష్టపడి చదివి రెండో ప్రయత్నంలో 620 ర్యాంకు సాధించి ఖమ్మం మమత వైద్య కళాశాలలో ఉచితంగా సీటు పొందాడు. ఎంబీబీఎస్‌ మొదటి ఏడాదిలో అనాటమీలో బంగారు పతకాన్ని సాధించాడు.
వైద్యవిద్య పీజీలో మెరుగైన ర్యాంకు సాధించడం సులువైన వ్యవహారం కాదు. ఎంబీబీఎస్‌ మార్చిలో పూర్తవగానే పీజీలో ప్రవేశానికి హైదరాబాద్‌లో శిక్షణ తీసుకున్నాడు. ఉచిత సీటు పొందాలని శ్రమించాడు.
పీజీ ప్రవేశ పరీక్ష కోసం తొలుత ఎయిమ్స్‌ రాత పరీక్షకు హాజరవగా అందులో 66వ ర్యాంకూ, పీజీఐ చండీగఢ్‌కు సంబంధించి 60వ ర్యాంకూ లభించాయి. ఈ ర్యాంకులను బేరీజు వేసుకొని ఎలాగైనా జిప్‌మర్‌లో మొదటి పది స్థానాల్లో నిలవాలనే లక్ష్యం పెట్టుకున్నాడు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి 16,000 మందికి పైగా ఈ పరీక్షకు హాజరవగా అందులో 661 మార్కులతో తృతీయ స్థానంలో నిలిచాడు. ఇతడికంటే తొమ్మిదో మార్కుల ఎక్కువ వచ్చిన విద్యార్థికి రెండో ర్యాంకు వచ్చింది.

Posted Date: 02-11-2019


  • Tags :