• facebook
  • whatsapp
  • telegram

Success : చెత్తకుప్పలో పారేసిన ఆ అమ్మాయే...


అది మహారాష్ట్రలోని జల్గావ్‌ రైల్వేస్టేషన్‌. చెత్తకుండీలో ఒక పసిగుడ్డు ఉందనే వార్త తెలిసి అక్కడకు వచ్చిన పోలీసులకు రెండుకళ్లూ లేని పసిపాప దొరికింది. ‘కళ్లు లేని పిల్ల కదా’ అందుకే వదిలేసి ఉంటారని కాసేపు చర్చించుకున్న ఆ ఊరివాళ్లు తరవాత ఆ సంగతే మర్చిపోయారు. ఇది జరిగి 25 ఏళ్లు. ఇప్పుడా అమ్మాయి మహారాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ ఎగ్జామినేషన్‌లో ఉద్యోగం సాధించి ఎంతోమందిలో స్ఫూర్తినింపుతోంది... 

ఆ రోజు చెత్తకుండీలో దొరికిన పసిపాప అమ్మానాన్నలకోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా పోలీసులకు వాళ్ల ఆచూకీ తెలియలేదు. చివరికి ఆ పాపని రిమాండ్‌హోమ్‌కి తరలించారు. అనాథల జీవితాలు ఎలా ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అందులోనూ ఈ పాప అంధురాలు కావడంతో మరింత దయనీయంగా ఉండేది. అదృష్టవశాత్తు కొద్దిరోజులకి ఆ పాప గురించి సామాజిక కార్యకర్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత శంకర్‌బాబా పాపల్కర్‌కి తెలిసింది. జీవితం మొత్తం సమాజసేవకే వెచ్చించిన శంకర్‌బాబా ఆ పసిపాపకి మాలా అనే పేరుపెట్టి, పాపల్కర్‌ అనే తన ఇంటిపేరునీ ఇచ్చారు. మాలాకి చదువుపై ఇష్టాన్నీ, గౌరవాన్ని పెంచారు. ‘నాకు దేవుడు అమ్మానాన్నల్ని చూసే అవకాశం ఇవ్వలేదు. కానీ అంతకంటే గొప్పగా చూసే మంచి మనుషుల మధ్య పెరిగే అవకాశం ఇచ్చాడు’ అనే మాలా అమరావతి యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తిచేసింది. విదర్భ యూనివర్సిటీ ఆఫ్‌ నుంచి సైన్స్‌ అండ్‌ హ్యుమానిటీస్‌లో పీజీ చేసింది. ప్రొఫెసర్‌ ప్రకాష్‌టోప్లే, అమోల్‌పాటిల్‌ వంటి వారు చదువుకయ్యే ఖర్చు భరిస్తూ, మెంటార్లుగా వ్యవహరించారు. వారిందరి ప్రోత్సాహంతో తాజాగా మహారాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ ఎగ్జామినేషన్‌ పూర్తిచేసి... సెక్రటేరియట్‌లో క్లర్క్, టైపిస్ట్‌ ఉద్యోగాన్ని సంపాదించుకుంది. ‘ఇంతటితో ఆగిపోను. సివిల్స్‌ రాసి ఐఏఎస్‌ అవ్వాలన్నది నా కల. అలా అయితేనే కదా.. నాలాంటి వారికి అండగా ఉండొచ్చు’ అనే మాలా పాపల్కర్‌ రెండు వైఫల్యాల తరవాత ఈ విజయాన్ని సాధించారు.

Posted Date: 20-05-2024


 

ఇత‌రాలు

మరిన్ని