• facebook
  • whatsapp
  • telegram

సబ్జెక్టు కాన్సెప్ట్‌లపై పట్టు సాధించాలి!  

* ఏఐఈఈఈ- 2012 జాతీయస్థాయి నాలుగో ర్యాంకర్ 'సాయి అఖిల్'
'ఏ పోటీ పరీక్షలోనైనా, వార్షిక పరీక్షల్లోనైనా అత్యధిక మార్కులు సాధించాలంటే సబ్జెక్టు కాన్సెప్ట్‌లపై పట్టు సాధించాలని' ఏఐఈఈఈ- 2012 జాతీయస్థాయి నాలుగో ర్యాంకర్ 'సాయి అఖిల్' అన్నారు. ఇటీవల ప్రకటించిన ఏఐఈఈఈలో మంచి ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయిలో నాలుగో ర్యాంకు అందుకున్న నేపథ్యంలో 'న్యూస్‌టుడే'తో తన విజయ విశేషాలను పంచుకున్నారు. వాటి వివరాలు...

 

 

ప్ర.. సక్సెస్‌కు ప్రధాన కారణం ఏమిటి?
జ. అనుభవజ్ఞులైన టీచర్లు చెప్పిన పాఠాలు, వారిచ్చిన గైడెన్స్, ఫ్రెండ్స్‌తో చర్చించడం. ఇవి ఒకవైపు అయితే, మరో ప్రధాన కారణం సబ్జెక్టు కాన్సెప్ట్‌లపై పూర్తి అవగాహన ఏర్పర్చుకోవడానికి కృషి చేయడం. బేసిక్స్‌పై ఎంత అవగాహన ఉంటే పరీక్షల్లో అంత ఎక్కువగా మార్కులు వస్తాయి.


ప్ర.. మీ కుటుంబ నేపథ్యం ఏమిటి?
జ. ప్రస్తుతం మేం శ్రీకాకుళంలోని న్యూ కాలనీలో ఉంటున్నాం.. మా నాన్నగారు కాసుల బాబు రణస్థలంలోని గవర్నమెంట్ స్కూల్‌లో మ్యాథ్స్ టీచర్‌గా చేస్తున్నారు. అమ్మగారు వెంకటలక్ష్మి గృహిణి. అక్కయ్య జీఎంఆర్ కాలేజీలో ఇంజినీరింగ్ చేస్తోంది.


ప్ర.. మీ విద్యార్హతలు..
జ. శ్రీకాకుళంలోని భాష్యం స్కూల్‌లో నేను పదో తరగతి చదివాను. 572 మార్కులు వచ్చాయి. ఇక ఇంటర్ కూడా గుంటూరులోని భాష్యం సంస్థలకు చెందిన కాలేజీలోనే చదివాను. 968 మార్కులు వచ్చాయి.


ప్ర.. జాతీయ స్థాయిలో నాలుగో ర్యాంకు రావడంలో మీ కుటుంబ సభ్యుల, మిత్రుల సహకారం ఎలా ఉంది? ఏ విధమైన ప్రోత్సాహాన్ని అందించారు?
జ. తలిదండ్రులు నిరంతరం నా వెన్నంట ఉండి ప్రోత్సహించారు. కొన్ని సబ్జెక్టుల్లో మార్కులు తక్కువ వస్తున్నా నిరుత్సాహ పడవద్దని, వచ్చే పరీక్షల్లో ఇంకా ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చని చెప్పారు. ఇక మిత్రులతో ఎప్పుడూ సబ్జెక్టుల గురించి చర్చించే వాడిని. దాంతో వారు కూడా కొత్తకొత్త ఆలోచనలను నా ముందుంచే వారు. నిరుత్సాహపరిచిన వారు చాలా తక్కువ.


ప్ర.. ఏఐఈఈఈ కోసం ప్రత్యేకంగా శిక్షణ పొందారా? ప్రిపరేషన్ ఎలా సాగింది?
జ. ఇంటర్ చేరినప్పటి నుంచే ఐఐటీ జేఈఈ, ఎంసెట్‌తదితర పరీక్షలకు కాలేజీలోనే శిక్షణ ఇచ్చేవారు. లెక్చరర్లు రోజుకు నాలుగున్నర గంటలు పాఠాలు చెప్పేవారు. ఆ సమయంలో నేను ముఖ్యమైన పాయింట్లపై విడిగా నోట్స్ రాసుకునే వాడిని. ఒక్కో సబ్జెక్టు కాన్సెప్ట్‌లపై బాగా దృష్టి పెట్టే వాడిని. క్లాసులు పూర్తయిన తర్వాత మళ్లీ దాదాపు మూడు గంటలు చదివే వాడిని. ప్రతి రోజూ ఏం చదువుతున్నాం; ఎంత వచ్చింది? ఇంకా ఎంత చదవాలి? వంటి ప్రశ్నలు వేసుకుని ఆలోచించే వాడిని. తద్వారా ఏం చేయాలో తెలిసేది. అంతేకాదు మిత్రులతో కూడా చర్చించే వాడిని. దీనివల్ల మా ఆలోచనా పరిధి బాగా పెరిగింది. ఐఐటీ ప్రిపరేషన్ సమయంలోనే ఏఐఈఈఈ గురించి కూడా చర్చించి దీనికి కూడా ప్రిపేర్ అయ్యాను.


ప్ర.. పరీక్షల కోసం తీసుకున్న జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా?
జ. ప్రత్యేకంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదు. ఆరోగ్య పరంగా జాగ్రత్తగా ఉండేందుకు టెన్షన్‌కు లోనుకాలేదు. చదివేటప్పుడు వచ్చే అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి మొదట ఆలోచించే వాడిని. తర్వాత ఫ్రెండ్స్‌తో చర్చించే వాడిని. అప్పటికి కూడా నివృత్తి కాకపోతే లెక్చరర్లను సంప్రదించే వాడిని.


ప్ర.. పరీక్షలు ఇంగ్లిష్ మీడియంలో ఉంటాయి కదా? తెలుగు మీడియం విద్యార్థులు ఎలా చదవాలి?
జ. మీడియం ఏదైనా ముందు సబ్జెక్టు కాన్సెప్ట్‌లపై లోతైన అవగాహన ముఖ్యం. సహజంగా ఇంటర్‌లో అందరూ ఇంగ్లిష్ మీడియం పుస్తకాలపైనే ఎక్కువ ఆధారపడతారు. కాబట్టి ఇంటర్‌నుంచే ఇంగ్లిష్ సబ్జెక్టుపై పూర్తి పట్టు సాధిస్తే బాగుంటుంది. నా వరకు నేను టెన్త్, ఇంటర్ ఇంగ్లిష్ మీడియంలో చదివాను కాబట్టి, లాంగ్వేజ్ గురించి అంతగా భయం కలగలేదు.


ప్ర.. భవిష్యత్తు ప్రణాళికలు ఏమిటి?
జ. ఐఐటీ ముంబయిలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చేయాలనుకుంటున్నాను. తర్వాత సివిల్స్‌కు ప్రిపరేషన్ మొదలుపెడతాను.


ప్ర.. కొత్త వారికి మీరిచ్చే సలహా.
జ. పరీక్ష ఏదైనా కావచ్చు. హార్డ్ వర్క్ చాలా ముఖ్యం. సబ్జెక్టుపై అవగాహనకు మొదట ఆలోచించాలి. తర్వాత మిత్రులతో చర్చించాలి. తర్వాత లెక్చరర్లను సంప్రదించాలి. ఎలాంటి పరిస్థితుల్లోనూ టెన్షన్ పడకూడదు. కూల్‌గా ఉండాలి. చేసే పనిలో నిజాయితీ ఉండాలి. ఎన్ని గంటలు చదివామని కాకుండా చదివనంత వరకు ఆసక్తితో చదవాలి. క్లాసులో చెప్పేటప్పుడు శ్రద్ధగా వినడతోపాటు టైమ్ మేనేజ్‌మెంట్ కోసం మోడల్ పేపర్లు బాగా ప్రాక్టీస్ చేయాలి. కాలేజీలో ఈ విధానాన్ని అమలు చేస్తుంటే ప్రిపరేషన్ సమయంలో ఏ పాయింట్ల దగ్గర ఇబ్బందులు వస్తున్నాయో గుర్తించి వాటిని లెక్చరర్ల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించుకోవాలి. సమయాన్ని సరైన మార్గంలో ఉపయోగించడంలోనే సగం విజయం ఆధాపడి ఉంటుంది. కాబట్టి కాలేజీలో చేరిన మొదటి రోజు నుంచి ఎలాంటి లక్ష్యం నిర్దేశించుకున్నారో దానికి తగిన విధంగా నడుచుకోవాలి. చదవాలి. తద్వారా విజయం సొంతమవుతుంది.

Posted Date: 01-11-2019


  • Tags :