• facebook
  • whatsapp
  • telegram

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఆర్థిక సర్వే 2021-22

 ప్రస్తుత ఆర్థిక సంవత్సరం స్థూల ఉత్పత్తిలో (జీఎస్‌డీపీ) 11.43% వృద్ధి (స్థిర ధరల ప్రకారం) నమోదైంది. జాతీయ సగటు వృద్ధితో పోలిస్తే.. ఇది 2.53% అధికమని రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు అంచనాల్లో వెల్లడించింది. రాష్ట్ర తలసరి ఆదాయంలోనూ 17.58% వృద్ధి నమోదైందని పేర్కొంది. 2021-22 రాష్ట్ర సామాజిక ఆర్థిక సర్వేను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ, ప్రణాళికశాఖ ముఖ్య కార్యదర్శి జీఎస్‌ఆర్‌కేఆర్‌ విజయ్‌ కుమార్‌, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌ తదితరులు శుక్రవారం సచివాలయంలో విడుదల చేశారు. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో 10.14 లక్షల కోట్లు ఉన్న స్థూల ఉత్పత్తి విలువ.. ఈ ఏడాది 12.02 లక్షల కోట్లకు పెరిగిందని సర్వే వివరించింది. ప్రస్తుత ధరల ప్రకారం చూస్తే.. 18.47% వృద్ధి చోటు చేసుకుందని ప్రభుత్వం వివరించింది. రాష్ట్ర తలసరి ఆదాయం రూ.31వేలు పెరిగినట్లు సర్వే వెల్లడించింది. జాతీయ స్థాయిలో పెరిగిన తలసరి ఆదాయంతో పోలిస్తే.. రూ.8వేలు అధికంగా పేర్కొంది. స్థిర ధరల ప్రకారం రంగాల వారీగా చూస్తే.. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో 11.27%, పారిశ్రామికంగా 12.78%, సేవల రంగంలో 9.73% వృద్ధి నమోదైంది.

2020 - 21లో బడ్జెట్‌ అంచనాలు.. వాస్తవంలో ఏం జరిగింది?

2020 - 21 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం రూ.2,24,789.18 కోట్ల అంచనా వ్యయంతో బడ్జెట్‌ సమర్పించింది. ఈ ఏడాది బడ్జెట్‌ సమర్పించే క్రమంలో ఆ ఆర్థిక సంవత్సరం వాస్తవ లెక్కలనూ వెల్లడించింది.
ఆ లెక్కల ప్రకారం వాస్తవంగా ఖర్చుచేసింది రూ.1,87,101.77 కోట్లే. బడ్జెట్‌ అంచనాల్లో ఖర్చు 83శాతమే.
రెవెన్యూ రాబడులు ఆశించింది రూ.1,61,958.50 కోట్లు. వచ్చింది రూ.1,17,136.18 కోట్లే.
రాబడి విషయంలోనూ అంచనాలు భిన్నంగా ఉంటున్నాయి. వాస్తవంగా వచ్చే రాబడిని అంచనాల్లో పేర్కొనకుండా కేంద్రం నుంచి వచ్చే నిధులు, ఇతర రూపాల్లో వచ్చే నిధులనూ భారీగా ఊహిస్తున్నారు. వాస్తవానికి వస్తున్నది తక్కువగా ఉంటోంది.

2021 - 22 బడ్జెట్‌ - సవరించింది ఏ మేరకు?

మరికొద్ది రోజుల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగుస్తుందనగా గత బడ్జెట్‌ అంచనాలన్నీ తలకిందులయ్యాయి.
సవరించిన అంచనాల ప్రకారం ఆ బడ్జెట్‌ను రూ.2,09,995.83 కోట్లకు కుదించారు. అంచనా ప్రకారం ఖర్చు చేయలేకపోయామని తేల్చేశారు.
రాబడి కూడా ఆశించినంతగా లేదు. అంచనా ప్రకారం రూ.1,77,196 కోట్లు వస్తుందని లెక్కిస్తే జనవరి నెలాఖరు వరకు వచ్చింది 1.11 లక్షల కోట్లే. సవరించిన అంచనాల్లో రూ.1.54 లక్షల కోట్లు వస్తుందన్నా అదీ వచ్చే అవకాశాలు లేవని ఆర్థికశాఖ వర్గాల విశ్లేషణ. వాస్తవ లెక్కలు ఖరారయ్యేసరికి రాబడి మరింత తగ్గుతుందని అంచనా వేస్తున్నారు.

కరోనా ప్రభావం ఎంత?

కరోనా వల్ల 2020 - 21 ఆర్థిక సంవత్సరంలో రాబడులు కొంతమేర తగ్గాయి. 2021 - 22లో మళ్లీ మామూలు స్థాయికి చేరాయి. రాష్ట్ర ఆర్థికసర్వే కూడా ఆర్థిక వ్యవస్థలో కరోనా మునుపటి పరిస్థితులు ఏర్పడ్డాయంది. అయినా 2021 - 22 బడ్జెట్‌ స్వరూపాన్ని తగ్గించాల్సి వచ్చింది.

అంచనాలకు మించి ప్రజా అప్పులు

బడ్జెట్‌ అంచనా మేరకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ప్రజారుణం రూ.3,87,125 కోట్లు ఉంటుందని ప్రభుత్వం అంచనా వేయగా అది సవరించిన గణాంకాల మేరకు రూ.3,90,670 కోట్లకు చేరింది. 
రాష్ట్రంలో అప్పులు అంచనాలకు మించిపోతున్నాయి. ప్రజా రుణం రూపంలో వినియోగించుకుంటున్న అప్పులే హద్దులు దాటుతుండగా అంతకుమించి కార్పొరేషన్లకు గ్యారంటీలు ఇవ్వడం ద్వారా ప్రభుత్వం అనేక రుణాలు పొందుతోంది. ప్రభుత్వమే పేర్కొన్న గణాంకాల్లో ఖరారైన లెక్కలను, సవరించిన లెక్కలను, రాబోయే ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ అంచనాలను పోల్చి చూస్తే వాస్తవిక దృక్పథంతో రూపొందించిన లెక్కలుగా ఇవి కనిపించడం లేదని ఆర్థిక శాఖలో అనుభవం ఉన్నవారు విశ్లేషిస్తున్నారు. ఒక్క ప్రజా రుణమే 2022 - 23 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రూ.4,39,394 కోట్లకు చేరుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ప్రజారుణం మొత్తం లెక్క కట్టే క్రమంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బహిరంగ మార్కెట్‌ నుంచి తీసుకున్న రుణానికి పట్టికలో చూపిన దానికి మధ్య వ్యత్యాసం కనిపిస్తోంది. అంటే బహిరంగ మార్కెట్‌ నుంచి రూ.46,443 కోట్లు రుణం తీసుకున్నట్లు బడ్జెట్‌ పట్టికలో పేర్కొనగా సవరించిన అంచనాల్లో అది రూ.55,723.12 కోట్లుగా ఉంది. ఇలాంటివి పరిగణనలోకి తీసుకుంటే తుది లెక్కలు తేలేసరికి ప్రజారుణం రూపంలోనే ప్రస్తుత అంచనాలు చాలా ఎక్కువగా ఉంటాయన్నది విశ్లేషకుల మాట. ఖరారైన లెక్కల ప్రకారం 2020 - 21లో రూ.69,415 కోట్లు మూలధన వసూళ్లుగా (రుణాలు) లెక్కించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సవరించిన అంచనాల ప్రకారం మూలధన వసూళ్లు రూ.55,723.12 కోట్లు ఉంటాయని పేర్కొన్నారు. 2022 - 23 ఆర్థిక సంవత్సరంలో అంచనాల ప్రకారం అది రూ.65,031 కోట్లు ఉంటుందని అంచనా. ఇవన్నీ ప్రజాపద్దులో ప్రతిబింబిస్తే ప్రస్తుతం చూపిన మొత్తం మరింత ఎక్కువగా ఉంటుందనే మాట వినిపిస్తోంది.

కార్పొరేషన్ల నుంచి రుణాలూ!

మరోవైపు ప్రభుత్వం కార్పొరేషన్లకు గ్యారంటీలు ఇచ్చి రుణాలు తీసుకుంటోంది. ఏపీఎస్‌డీసీ నుంచి తీసుకున్న రుణాలతోనే కొన్ని కార్యక్రమాలు అమలు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. ఇంతవరకూ రుణాల కోసం ఇచ్చిన గ్యారంటీలు రూ.1,52,123 కోట్లు కాగా అందులో రూ.1,17,503 కోట్లు మాత్రమే వినియోగించుకున్నట్లు పేర్కొంటోంది. మరిన్ని కార్పొరేషన్లకు గ్యారంటీలు ఇస్తూ ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చినా గ్యారంటీల మొత్తంలో ఆ సొమ్ము వివరాలు కలప లేదని పేర్కొంటున్నారు. ఇవన్నీ కలిపితే మొత్తం అప్పుల గుదిబండ ఎంతుందో స్పష్టంగా తేలుతుందని పేర్కొంటున్నారు.
ఈ అప్పుల్లో కార్పొరేషన్లకు గ్యారంటీలు ఇచ్చి తీసుకున్న రుణాలు కలిసి లేవు...వాటిని విడిగా చూపించారు.
జీఎస్‌డీపీలో రుణాలు ఎంత శాతమో బడ్జెట్‌లో పేర్కొన్నారు. మొత్తం అప్పులన్నింటినీ వీటిలో పరిగణనలోకి తీసుకోకపోవడం వల్ల వాస్తవ గణాంకాలకు ఇది అద్దం పట్టడం లేదనే విమర్శ వస్తోంది.

రూ.లక్ష కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉన్నట్లు అంచనా 

రాష్ట్రంలో ఎక్కడో మారుమూల ప్రాంతంలో కరోనా వేళ రోగులకు ఆహారం సరఫరా చేసిన చిన్న కాంట్రాక్టరు నుంచి భారీ సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తున్న బడా గుత్తేదార్ల వరకు పెండింగ్‌ బిల్లులు అందకపోవడమే ప్రధాన సమస్య. పాత బిల్లులు చెల్లింపులకు ప్రత్యేకంగా వెసులుబాటు కల్పించిన దాఖలాలు ఈ బడ్జెట్‌లో ఏమీ లేవు. పెండింగ్‌ బిల్లుల విలువ దాదాపు రూ.లక్ష కోట్లు ఉన్నట్లు అనధికారిక సమాచారం. రాష్ట్రంలో దాదాపు 18 వేల హెడ్‌ ఆఫ్‌ అకౌంట్లు ఉన్నాయి. అవి కాకుండా పీడీ ఖాతాల ద్వారా చెల్లించాల్సిన మొత్తాలూ పెద్ద సంఖ్యలో పెండింగు పడినట్లు చెబుతున్నారు. వీటి చెల్లింపులకు బడ్జెట్‌లో  ప్రత్యేక కేటాయింపులు ఉండటం లేదు. అప్పులు చేసి సరకులు సరఫరా చేసినవారు, ఉప గుత్తేదారులుగా చిన్న చిన్న పనులు చేసుకున్నవారు సైతం బిల్లులు అందక.. తెచ్చిన అప్పులు వడ్డీలు కట్టలేక సతమతమవుతున్నారు. 

అద్దె బిల్లులు, వాహన బిల్లులదీ అదే దారి

ప్రభుత్వ ఉద్యోగులు వారు దాచుకున్న సొమ్ములపై రుణాలు తీసుకునేందుకు సమర్పించిన బిల్లులకు కూడా అతీగతీ లేదు. ఆఖరికి కార్యాలయాల అద్దె బిల్లులు, వాహనాల బిల్లులు కూడా చెల్లించడం లేదు. కొద్ది రోజులుగా ఖజానా తలుపులు మూసివేసి బిల్లుల చెల్లింపు ప్రక్రియను నిలిపేశారు. పెండింగు బిల్లుల మొత్తాన్ని, అప్పటికే బడ్జెట్‌ విడుదల ఉత్తర్వులిచ్చినా చెల్లింపులు జరపని వాటిని కొత్త బడ్జెట్‌కు బదిలీ చేయట్లేదు. దీంతో బిల్లుల కోసం ఏటా మొదటి నుంచి ప్రయత్నాలు ప్రారంభించాల్సి వస్తోంది. కాగ్‌ ఫిబ్రవరి నెలలో రాష్ట్ర ఆర్థికశాఖకు లేఖ రాస్తూ బడ్జెట్‌లో కేటాయింపులు లేని ఖర్చు దాదాపు రూ.90 వేల కోట్ల పైన ఉన్నట్లు పేర్కొంది. బడ్జెట్‌లో కేటాయింపులు చూపి కూడా ఖర్చు చేయని మొత్తాలు రూ.30 వేల కోట్లు దాటాయని ప్రస్తావించింది. ఇవన్నీ బిల్లుల చెల్లింపు విధానంలో ఏర్పడ్డ అసంబద్ధ వైఖరి వల్లే అని ఆర్థికశాఖలో గతంలో పని చేసిన సీనియర్‌ అధికారులు చెబుతున్నారు. పెండింగు బిల్లులు చెల్లించాలంటే కొత్త ఆర్థిక సంవత్సరం మొదటి నుంచి అదనపు బడ్జెట్‌ మంజూరు ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు.

అభివృద్ధిపై ప్రభావం

రాబడులు లేవంటూ ఏళ్ల తరబడి ప్రభుత్వం బిల్లులు పెండింగులో పెడుతుండటం రాష్ట్రాభివృద్ధిపై నేరుగా ప్రభావం చూపిస్తోంది. చాలామంది గుత్తేదార్లు ఏ పనులు చేయడానికీ ముందుకు రావడం లేదు. టెండర్లలో పాల్గొనాలంటేనే భయపడుతున్నారు. టెండర్లు దక్కించుకున్నవారు చేసిన పనికి బిల్లు వస్తేనే మిగతా పని కొనసాగిద్దామన్నట్లు స్తబ్దుగా ఉండిపోతున్నారు. ఆఖరికి హైకోర్టు జోక్యం చేసుకుని.. బిల్లులు చెల్లించకపోతే పనులు ఎలా జరుగుతాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు మరో 9 మంది అధికారులను పిలిచి ప్రశ్నించింది. అయినా కూడా మొత్తం పెండింగు బిల్లులపై ఒక దృక్పథం తీసుకుని వాటి పరిష్కారానికి అధికారులు దృష్టి సారిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. న్యాయస్థానానికి వెళ్లిన వారి బిల్లులు ఎంత పెండింగులో ఉన్నాయో సమాచారం ఇవ్వాలని ఉన్నతాధికారులు ఆదేశించారని సమాచారం. అంటే వారికి మాత్రమే బిల్లులు చెల్లించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా అనే సందేహాలు తలెత్తుతున్నాయి.  


ఆస్తులు సృష్టించే ఖర్చు అంతంతే!

- తీసికట్టుగా మూలధన వ్యయం

ఏపీలో మూలధన వ్యయం అంచనాల కన్నా మరీ తగ్గిపోతోంది. మొత్తం బడ్జెట్‌లో మూలధన వ్యయ కేటాయింపులే చాలా తక్కువ. అందులోనూ చేస్తున్న ఖర్చు మరీ దారుణం. ఒక రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు, రహదారులు, భవనాల వంటి ఆస్తుల కల్పనకు ప్రభుత్వం చేసే ఖర్చునే మూలధన వ్యయంగా పరిగణిస్తారు. రెవెన్యూ ఖర్చులవల్ల రాష్ట్రానికి ఒనగూరేది ఏదీ లేదు. ఒక ఆస్తిని సృష్టిస్తే దాన్నుంచి రాబోయే రోజుల్లో రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి పెరిగినా, ఆదాయం వచ్చినా రాష్ట్ర ఆర్థిక స్వరూపం మారుతుంది. మూలధన వ్యయాన్ని నిర్లక్ష్యం చేస్తుండటంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బహిరంగ మార్కెట్‌ రుణం తీసుకునేందుకూ కేంద్రం దీంతో ముడిపెట్టింది. ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రాష్ట్ర జీఎస్‌డీపీలో 4 శాతానికే రుణాలు పరిమితం కావాలి. 2021 - 22 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర జీఎస్డీపీ రూ.10,61,802 కోట్లుగా అంచనా వేశారు. అందులో 4% అంటే 42,472 కోట్లు రుణం తీసుకోవచ్చని కేంద్రం చెప్పింది. జీఎస్డీపీలో 0.5% అంటే రూ.5,309 కోట్ల రుణం పొందాలంటే లక్ష్యం మేరకు మూలధన వ్యయం చేయాలని షరతు విధించింది. ఆ ఆర్థిక సంవత్సరంలో నిర్దిష్ట పరిమితి మేరకు మూలధన వ్యయం చేయకపోతే ఆ మరుసటి ఆర్థిక సంవత్సరంలోనూ రుణ పరిమితిలో కోత పెడతామని కేంద్రం పేర్కొంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ తొలి సమీక్ష తర్వాత తప్ప.. ఆ తర్వాత పరిమితి మేరకు రాష్ట్రం మూలధన వ్యయం చేసిన దాఖలా లేదు. 2019 - 20 ఆర్థిక సంవత్సరంలో అధికారిక గణాంకాల ప్రకారం.. అంచనాల్లో 38 శాతమే మూలధన వ్యయం ఉంటోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 59.4% ఖర్చుచేసినట్లు సవరించిన అంచనాలు వివరిస్తున్నాయి. ఇవి ఇంకా తుది లెక్కలు కావు. కాగ్‌ లెక్కల ప్రకారం జనవరి నెలాఖరు వరకు రాష్ట్రంలో మూలధన వ్యయం రూ.12,072.28 కోట్లే. సవరించిన అంచనాల మేరకు కూడా చివరికి ఖర్చుచేసే పరిస్థితులు లేవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Posted Date: 12-03-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం