• facebook
  • whatsapp
  • telegram

15వ ఆర్థిక సంఘం సిఫార్సులు - తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌  

దేశంలో మొత్తం పన్నుల్లో రాష్ట్రాల వాటా 2025-26 వరకు 42 శాతంగానే కొనసాగనుంది. 15వ ఆర్థిక సంఘం ఈ మేరకు సిఫార్సు చేసింది. ఎన్‌.కె.సింగ్‌ నేతృత్వంలోని 15వ ఆర్థిక సంఘం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు గత ఏడాది నవంబరులో తమ నివేదికను సమర్పించింది. ఆ నివేదికను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తాజాగా లోక్‌సభలో ప్రవేశపెట్టారు. 
 


సిఫార్సులు

పన్నుల్లో రాష్ట్రాల వాటాను 2021-22  నుంచి 2025-26 వరకు ప్రస్తుతమున్న 42%గానే కొనసాగించాలని ఆర్థిక సంఘం సూచించింది. రాష్ట్రాలు మరిన్ని అప్పులు తీసుకునే వెసులుబాటు కల్పించాలని కూడా పేర్కొంది. విద్యుత్తు రంగంలో సంస్కరణలకు సంబంధించిన పనితీరును అందుకు ప్రాతిపదికగా తీసుకోవాలని సిఫార్సు చేసింది. 

ద్రవ్యలోటు 2021-22లో 6%, 2022-23లో 5.5%, 2023-24లో 5%, 2024-25లో 4.5%, 2025-26లో 4%గా ఉండొచ్చు. 

‣ 2021-22 నుంచి 2025-26 వరకు మొత్తం పన్ను వసూళ్లు రూ.135.2 లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా. సెస్సులు, సర్‌ఛార్జిల వంటివి మినహాయిస్తే ఈ మొత్తం రూ.103 లక్షల కోట్లకు తగ్గుతుంది. అందులో 42% రాష్ట్రాలకు దక్కాలి. 

దక్షిణాది రాష్ట్రాలకు దెబ్బ 

15వ ఆర్థిక సంఘం అనుసరించిన వెయిటేజీ విధానంతో నాలుగు దక్షిణాది రాష్ట్రాలు కేంద్ర పన్నుల్లో తమ వాటాను నష్టపోయాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్ణాటకల మొత్తం వాటా 13.955% నుంచి 11.721%కి తగ్గిపోయింది. అంటే ఈ రాష్ట్రాలు మొత్తంగా 2.234% వాటాను కోల్పోయినట్లయింది. వచ్చే అయిదేళ్లలో దేశంలోని అన్ని రాష్ట్రాలకూ కలిపి రూ.42,24,760 కోట్ల పన్నులను కేంద్రం పంచనున్నట్లు అంచనా. ఈ లెక్క ప్రకారం తెలుగు రాష్ట్రాలు, కేరళ, కర్ణాటకలకు మొత్తంగా రూ.94,381.13 కోట్ల నష్టం వాటిల్లనుంది. ఈ రాష్ట్రాలతోపాటు ఒడిశా, అసోం, ఉత్తర్‌ ప్రదేశ్‌ కూడా వెయిటేజీని కోల్పోయాయి. మొత్తంగా అయిదేళ్లలో ఈ ఏడు రాష్ట్రాలు కలిపి రూ.లక్ష కోట్లకుపైగా నష్టపోనున్నాయి. దక్షిణాదిలో తమిళనాడు వెయిటేజీ 4.023% నుంచి 4.079%కి పెరగడం గమనార్హం.  

తెలంగాణ 

తెలంగాణ రాష్ట్రనికి 15వ ఆర్థిక సంఘం ఐదేళ్ల కాలానికి రూ.1,09,786 కోట్లను సిఫార్సు చేసింది. స్థానిక సంస్థలకు రూ.13,111 కోట్లు ప్రతిపాదించింది. ఎన్నో ప్రాజెక్టులకు సాయం అర్థించినా మిషన్‌భగీరథ నిర్వహణకు మాత్రం రూ.2,350 కోట్లను సిఫార్సు చేసింది. ఇంటింటికి రక్షిత మంచినీటిని అందించే కార్యక్రమం నేపథ్యంలో నిర్వహణకు ఈ నిధులను ప్రతిపాదించినట్లు పేర్కొంది. ఈ సారి విద్య, వ్యవసాయం, ఆరోగ్యానికి ప్రత్యేకంగా నిధులను సిఫార్సు చేసింది. వివిధ అంశాల పనితీరు ప్రాతిపదికగా వ్యవసాయానికి సిఫార్సు చేసిన నిధులను అందించనుంది. రాజధాని హైదరాబాద్‌కు ఘనవ్యర్థాల నిర్వహణ, వాయు కాలుష్యం నిర్వహణ నేపథ్యంలో ఐదేళ్లకు రూ.1,939 కోట్లను సిఫార్సు చేసింది.

సమీకృత అభివృద్ధి లక్ష్యాల(ఎస్‌డీజీ) సాధనలో తెలంగాణ పనితీరు బాగుందని 15వ ఆర్థిక సంఘం ప్రశంసించింది. 2019లో ఎస్‌డీజీ ర్యాంకుల్లో తెలంగాణ ఐదో స్థానంలో నిలిచిందని పేర్కొంది. ఫిబ్ర‌వ‌రి 1న‌ పార్లమెంటులో ప్రవేశపెట్టిన 15వ ఆర్థిక సంఘం నివేదిక రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను వెల్లడించింది. 2015-19 మధ్యకాలంలో తెలంగాణ మెరుగైన వృద్ధి రేటుతో ముందుకు సాగిందని వివరించింది. రాష్ట్రంలో వెనుకబడిన 20 శాతం మండలాల అభివృద్ధికి కార్యాచరణ రూపొందించాలని సూచించింది. దేశంలోని 35 జిల్లాల అభివృద్ధిపై వామపక్ష తీవ్రవాదం ప్రభావం ఉండగా ఇందులో ఒక జిల్లా తెలంగాణలో ఉందని చెప్పింది.


‘కాళేశ్వరం’ విద్యుత్తు బిల్లులను వినియోగ ఛార్జీల ద్వారా పొందాలి

కాళేశ్వరం ఎత్తిపోతలకు భారీ విద్యుత్తు బిల్లు వస్తుందని, నిర్వహణకు అవసరమయ్యే మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం వినియోగ ఛార్జీల ద్వారా పొందాలని 15వ ఆర్థిక సంఘం సూచించింది. కచ్చితమైన ఆదాయ వనరు లేకుంటే ప్రాజెక్టు ఆర్థిక స్థిరత్వం ప్రశ్నార్థకంగా మారుతుందని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం 18 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటిని అందించడానికి రూ.80 వేల కోట్ల అంచనా వ్యయంతో కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టిందని పేర్కొంది. తాగు, సాగు నీటి పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం రుణాలు తీసుకుందని, రికవరీకి అవకాశం లేకుండా ఈ రుణాలకు అవసరమైన వడ్డీలను బడ్జెట్‌ నుంచే చెల్లించాల్సి వస్తుందని, ఇది ద్రవ్యలోటుకు దారి తీసే అవకాశముందని తెలిపింది. ఈ పరిస్థితి రాకుండా చర్యలు తీసుకోవాలంది. 2016-17లో ఆడిట్‌ పరిశీలనలోకి వచ్చిన అంశాలను ఉదాహరణగా పేర్కొంది. ఆ సంవత్సరం రెవెన్యూ మిగులును రూ.1,386 కోట్లుగా పేర్కొన్నారని, అయితే అకౌంటింగ్‌ సక్రమంగా చేయకుండా రెవెన్యూ మిగులును రూ.6,778 కోట్లు ఎక్కువగా చూపించారని వివరించింది.


ఆర్థిక సంఘం పేర్కొన్న అంశాలు

* తెలంగాణలోని రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌, సంగారెడ్డి జిల్లాల వాటానే రాష్ట్ర స్థూల అభివృద్ధిలో 52 శాతం. జిల్లాల అభివృద్ధిలో అసమానతలు ఉన్నాయి.. అన్ని జిల్లాల్లో సమాన అభివృద్ధి సాధించేందుకు ఇతర పట్టణాలపైనా దృష్టి సారించాలి.

* 15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసు కలిగిన వారిలో నిరుద్యోగం అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణది ఐదో స్థానం.

* 2016-17లో అన్ని రకాల విద్యపై పెట్టిన ఖర్చు జీఎస్‌డీపీలో 1.8 శాతం మాత్రమే. సాధారణంగా 2.6 శాతం ఉండాలి.

* ద్రవ్యభారం నుంచి తప్పించుకోడానికి ఉదయ్‌ పథకం కింద లక్ష్యాల సాధనకు ప్రణాళిక రూపొందించుకోవాలి.

* అర్హులకు విద్యుత్తు సబ్సిడీ అందేలా చూడాలి. 2019 మార్చి 31 నాటికి డిస్కంలు చేసిన అప్పులు రూ.17121 కోట్లు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రుణం రూ.11 కోట్లు.

* ఆరోగ్య సూచిలు, సులభతర వాణిజ్యం అమలు, భూ రికార్డుల నవీకరణలో తెలంగాణ ముందుంది. జీఎస్‌డీపీ వృద్ధిరేటు 2020-21లో గతం కంటే 2% తగ్గనుంది. 2021-22లో అది 14.5%.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌

రాష్ట్ర విభజనతో హైదరాబాద్‌ను కోల్పోవడం ద్వారా జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి విశాఖపట్నం అభివృద్ధికి నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరడంతో 15వ ఆర్థికసంఘం రూ.1,400 కోట్ల గ్రాంట్‌ను సిఫార్సు చేసింది. నగరాన్ని ప్రధాన ఆర్థిక కేంద్రంగా, అభివృద్ధి సూచీ (గ్రోత్‌పోల్‌)గా రూపుదిద్దాలని.. ఇందుకోసం రహదారులు, నీటిసరఫరా, విద్యుత్తు పంపిణీ, భూగర్భ డ్రైనేజీ, అవసరమైన భవనాల నిర్మాణానికి ఏపీ నిధులు కోరింది. అందువల్ల ఈ మేరకు సిఫార్సు చేశామని ఆర్థిక సంఘం వెల్లడించింది. తక్కువ వర్షపాతం పడేచోట, దీర్ఘకాలంగా కిడ్నీవ్యాధులు, ఫ్లోరైడ్‌ సమస్య ఉన్న ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు గ్రాంట్లు కావాలని కూడా ఏపీ విజ్ఞప్తి చేసిందని పేర్కొంది. అందుకే కిడ్నీ సమస్యలున్న ఉద్దానం ప్రాంతానికి రూ.300 కోట్లు, ఫ్ల్లోరైడ్‌ సమస్యతో సతమతమవుతున్న గుంటూరు జిల్లాలోని పల్నాడు, ప్రకాశం జిల్లాలోని కనిగిరి ప్రాంతాలకు కలిపి రూ.400 కోట్లు, యురేనియం ఫిల్టరింగ్‌తో ప్రభావితమైన పులివెందుల ప్రాంతానికి రూ.200 కోట్ల ఇవ్వాలని సిఫార్సు చేసినట్లు ఆర్థికసంఘం తెలిపింది. రాష్ట్రానికి మంజూరు చేసిన రూ.2,300 కోట్ల రాష్ట్ర ప్రత్యేక గ్రాంట్లన్నీ ఈ పనులకే ఉపయోగించుకోవాలని పేర్కొంది. ఈ పద్దు కింద 2021-22లో ఏమీ రాదు. తర్వాత రెండేళ్లలో ఏటా రూ.460 కోట్ల చొప్పున విడుదలవుతుంది. మిగిలిన రెండేళ్లు రూ.690 కోట్ల చొప్పున అందుతుంది.

జీఎస్టీ పరిహారంగా రూ.12,296 కోట్లు

ఏపీకి జీఎస్టీ పరిహారం రూపంలో 2020-21 నుంచి 2025-26 వరకు ఆరేళ్లలో రూ.12,296 కోట్లు రానున్నట్లు ఆర్థిక సంఘం అంచనా వేసింది. 2021-26 మధ్యకాలంలో ఏపీ జీఎస్‌డీపీ పరిమాణం రూ.68,12,739 కోట్లుగా ఉంటుందని లెక్కగట్టింది. ఇందులో పన్నుల వాటా ఏపీలో జాతీయ సగటు కంటే అధికంగా ఉంది. ఏపీ సహా దేశంలో 12 కరవు ప్రభావిత రాష్ట్రాలకు రూ.100 కోట్ల చొప్పున గ్రాంటు మంజూరు చేసింది.

Posted Date: 02-02-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం