• facebook
  • whatsapp
  • telegram

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర బ‌డ్జెట్ 2021-22

ఇంతకుముందే ఆరంభించిన సంక్షేమ బాటలోనే ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర బడ్జెట్‌ బండి సాగిపోయింది. ఆసరా, చేయూత, భరోసా, అమ్మఒడి, గోరుముద్ద, విద్యా దీవెన, వసతి దీవెన...వంటి పథకాలకు ప్రాధాన్యమిస్తూ గత ఒరవడినే కొనసాగించింది. నేరుగా ప్రజలకు నిధులు అందించడమే ప్రధాన కార్యక్రమంగా అడుగులు వేసింది. రాష్ట్రంలోని లబ్ధిదారుల ఖాతాలకే రూ.48,083.92 కోట్లు చెల్లించనుంది. రాష్ట్ర బడ్జెట్‌లో వంద రూపాయలు ఖర్చు ప్రతిపాదిస్తే 20 రూపాయలు నేరుగా ప్రజల ఖాతాలకు బదిలీ చేయనుంది. నవరత్నాలకు ప్రాధాన్యమిస్తూ, దాదాపు 22 పథకాల ద్వారా రైతులు, మత్స్యకారులు, మహిళలు, విద్యార్థులు, వివిధ సామాజికవర్గాల్లోని పేదలకు చేయూత ఇవ్వనున్నట్లు ప్రకటించింది. రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ 2021-22 ఆర్థిక సంవత్సరానికి రూ.2,29,779.27 కోట్ల అంచనా వ్యయంతో బడ్జెట్‌ ప్రతిపాదనలను శాసనసభకు సమర్పించారు. తొలిసారిగా పిల్లల బడ్జెట్‌, మహిళల బడ్జెట్‌ పేరుతో విడిగా కేటాయింపులు చూపారు. వివిధ సామాజికవర్గాలకు కేటాయింపులను కూడా ప్రత్యేకంగా సభ ముందుంచారు. మొత్తం బడ్జెట్‌ ప్రతిపాదనల్లోనే అవి భాగమైనా ఏ వర్గం ఎంత ప్రయోజనం పొందుతోందో వివరించే ప్రయత్నం చేశారు. ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు చేరుకునే క్రమంలోనే ప్రభుత్వ ప్రాధాన్యాలు ఉన్నాయని  బుగ్గన రాజేంద్రనాథ్‌ ప్రకటించారు.

కరోనా కాలంలో ఏపీలో పేదలకు నేరుగా సాయం అందించిన తరహాలో మరే రాష్ట్రమూ చేయూత ఇవ్వలేదని ప్రపంచబ్యాంకు నివేదిక ప్రశంసించినట్లు ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఇస్తున్న వైఎస్సార్‌ పింఛను మొత్తాన్ని వచ్చే ఏడాది జనవరి నుంచి రూ.2,500కు పెంచబోతున్నట్లు ఆర్థికమంత్రి ప్రకటించారు. లబ్ధిదారులకు దాదాపు 22 పథకాల ద్వారా నేరుగా లబ్ధి కల్పిస్తున్నట్లు వివరించారు. కిందటి ఆర్థిక సంవత్సరం కన్నా ప్రస్తుత ఏడాది ఇందుకోసం అదనంగా రూ.4,141 కోట్లు వెచ్చిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇలా అందించే మూడు పథకాలకు సంబంధించి రూ.16,890 కోట్లు రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్‌ ద్వారా రుణాల రూపంలో సమీకరించాల్సి వస్తోంది. వైఎస్సార్‌ ఆసరా, వైఎస్సార్‌ చేయూత, అమ్మఒడి కార్యక్రమాలకు అవసరమైన నిధులు రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్‌ వివిధ ఆర్థిక సంస్థల నుంచి సమీకరిస్తోంది.

కొవిడ్‌కు రూ.1000 కోట్లు!

రాష్ట్ర ప్రజానీకాన్ని కకావికలం చేస్తున్న కొవిడ్‌పై పోరుకు రూ.500 కోట్లు, కరోనా టీకాల కోసం రూ.500 కోట్లు బడ్జెట్‌లో చూపారు. ప్రస్తుత సంవత్సరంలోనే ప్రజలందరికీ టీకాల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందుకు కేటాయించిన నిధులు ఏమేరకు సరిపోతాయన్నది ప్రశ్నార్థకం.

రాష్ట్రంలో ప్రధాన వ్యవసాయ రంగానికి రూ.11,210.80 కోట్లు ఖర్చు చేస్తున్నారు. వైఎస్సార్‌ రైతు భరోసాకు రూ.3,845.30 కోట్లు, ధరల స్థిరీకరణకు రూ.500 కోట్లు కేటాయించారు.

విశాఖపట్నం, తిరుపతి, అనంతపురంలను కాన్సెప్ట్‌ సిటీలుగా అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి బుగ్గన ప్రకటించారు. ప్రభుత్వ తోడ్పాటుతో, ప్రైవేటు రంగం నేతృత్వంలో వీటిని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు.

ఆదాయాలపైనే సందిగ్ధత

బడ్జెట్‌ ప్రతిపాదనలు పూర్తి స్థాయిలో సాకారం కావాలంటే ఆదాయ సముపార్జన అన్నింటి కన్నా ముఖ్యం. అనుభవాలు ఒకలా ఉన్నాయి. అంచనాలు మరోలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో లక్ష్యాలు చేరుకోవడం ఎంత వరకు సాధ్యమవుతుందనేది వచ్చే ఏడాది మార్చి చివరి నాటికే తెలుస్తుంది.

బడ్జెట్‌ ముఖ్యాంశాలు:

ఆంధ్ర‌ప్ర‌దేశ్ బ‌డ్జెట్ రూ.2,29,779 కోట్లు

పోలవరం ప్రాజెక్టుకు రూ.4,510 కోట్లు

వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీకి రూ.2,258 కోట్లు

వైఎస్సార్‌ రైతు భరోసాకు రూ.3,845.30 కోట్లు

కడప జిల్లాలో 3,155 ఎకరాల్లో మెగా ఇండస్ట్రియల్‌ హబ్‌ అభివృద్ధికి రూ.25వేల కోట్ల పెట్టుబడి

కడప స్టీలు ప్లాంటుకు రూ.250 కోట్లు

ఆసుపత్రుల్లో నాడు-నేడుకు రూ.1,535 కోట్లు

పరిశ్రమల ఏర్పాటు ప్రోత్సాహక రాయితీలకు రూ.1000 కోట్లు

వైఎస్సార్‌ ఎలక్ట్రానిక్‌ మాన్యుఫ్యాక్చరింగు క్లస్టర్‌కు రూ.200 కోట్లు

భూముల రీ సర్వేకు రూ.206.97 కోట్లు

పులివెందుల ప్రాంత అభివృద్ధికి రూ.100 కోట్లు

అర్చకులకు ప్రోత్సాహకాలు రూ.120 కోట్లు, పాస్టర్లకు రూ.40 కోట్లు, ఇమాంలు, మౌజంలకు రూ.80 కోట్లు

వైఎస్సార్‌ ఫసల్‌ బీమా యోజనకు రూ.1,802.82 కోట్లు

కాపుల సంక్షేమానికి 3,306 కోట్లు, బ్రాహ్మణ సంక్షేమానికి రూ.359.20 కోట్లు

మూలధన వ్యయం అంతంతే

అభివృద్ధి పనులకు, మౌలిక సౌకర్యాలకు అన్నింటి కన్నా ముఖ్యం మూలధన వ్యయమే. గడిచిన ఆర్థిక సంవత్సరంలో ప్రతిపాదనల్లో సగం కన్నా కాస్త ఎక్కువ మేర మాత్రమే ఖర్చు చేయగలిగారు. మూలధన వ్యయం కింద రూ.29,907.62 కోట్లు వ్యయంగా ప్రతిపాదిస్తే ఖర్చు చేసింది రూ.18,797.39 కోట్లే. ఇందులో పాత పెండింగు బిల్లుల చెల్లింపు కూడా కలిసి ఉందని సమాచారం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.31,198.38 కోట్ల మూలధన వ్యయంగా ప్రతిపాదించారు.

అప్పులే ఆలంబన

ఆశించినంత ఆదాయాలు రాని క్రమంలో, అప్పులే ఆలంబనగా మారిన స్థితిలోనూ ఇంతకుముందు ఏడాది కన్నా కొద్దిగా బడ్జెట్‌ అంచనాలు పెంచారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో అంచనాల్లో 82 శాతమే ఖర్చు చేయగలిగారు. రెవెన్యూ రాబడి రూ.1,61,958.50 కోట్లుగా లెక్క కడితే వచ్చింది రూ.1,18,063 కోట్లే. ఈ పరిస్థితుల్లో మరింత అంచనాలు పెరిగిన ప్రస్తుత పద్దులో ఏ మేరకు ఖర్చు చేయగలరనేది పెద్ద సవాల్‌. ప్రస్తుత ఏడాది సాధించిన రాబడి కన్నా వచ్చే ఏడాది దాదాపు రూ.59వేల కోట్లు అదనంగా వస్తుందని లెక్కించి మరీ ఈ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దాదాపు 44వేల కోట్ల రూపాయలు బహిరంగ మార్కెట్‌ నుంచి రుణంగా తీసుకుంటామని బడ్జెట్‌లో ప్రస్తావించారు.

సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనకు పెద్దపీట

కొవిడ్‌ క్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. నవరత్నాలు, ఎన్నికల ప్రణాళికలోని ఇతర హామీల అమలు ద్వారా 2030 నాటికి వాటిని సాధించే దిశగా సమగ్ర విధానాన్ని అనుసరిస్తున్నామని తెలిపారు. ఒకవైపు ప్రజల ప్రాణాలు కాపాడటం, మరోవైపు ఆర్థిక వ్యవస్థ పట్టాలు తప్పకుండా చూసుకోవడం తమ ప్రభుత్వానికి పరీక్షలుగా నిలిచాయన్నారు. 2021-22 రాష్ట్ర బడ్జెట్‌ను గురువారం ఆయన శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మొత్తం 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో ఆంధ్రప్రదేశ్‌ జాతీయస్థాయిలో మూడోస్థానంలో ఉందని తెలిపారు. రాష్ట్ర పౌరుల భవిష్యత్తుపై పెట్టుబడులు పెట్టటం, వారి నిజమైన సామర్థ్యాన్ని వెలికితీసేందుకు అధికారం ఇవ్వటం నిరంతరం కొనసాగుతున్నాయన్నారు. హోంమంత్రి మేకతోటి సుచరిత శాసనమండలిలో బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన బుగ్గన బడ్జెట్‌ ప్రసంగం 12.45 వరకూ కొనసాగింది. అందులోని ప్రధానాంశాలు ఇవీ..

సంక్షేమ ఫలాలు అందరికీ అందాలని, ఎవర్నీ విస్మరించకూడదనే మార్గదర్శక సూత్రంతో పాటు, కొవిడ్‌ను పూర్తిగా నిర్మూలించాల్సిన ఆవశ్యకతను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రాన్ని సామాన్య స్థితికి, స్థిరమైన వృద్ధి మార్గంలో మార్చడానికి అవసరమైన, ధైర్యంతో కూడుకున్న పురోగామి చర్యలు తీసుకోవాలని మా నాయకుడు నిశ్చయించుకున్నారు. కొవిడ్‌-19పై పోరాటానికి గుర్తింపు-పరీక్ష-చికిత్స విధానాన్ని అమలుచేస్తున్నాం. ఈ విధానంపై బ్రిటిష్‌ హై కమిషన్‌ ప్రశంసలు కురిపించింది.

వైఎస్‌ఆర్‌ రైతు భరోసా- ప్రధానమంత్రి కిసాన్‌ యోజన కింద కౌలుదారులు, అటవీ భూముల్ని సాగు చేసుకునే రైతులకూ పెట్టుబడి సాయం కింద రూ.13,500 చొప్పున అందించాం. 51.59 లక్షల రైతు కుటుంబాలకు రూ.6,928 కోట్లు ఇచ్చాం. పెట్టుబడి సాయం రూ.7,400 కోట్లు ప్రతిపాదించాం.

రూ.50,940 కోట్లతో 28.30 లక్షల మందికి ఇళ్లు నిర్మిస్తాం. గృహనిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పనకు రూ.5,661 కోట్లు కేటాయిస్తున్నాం.

162 గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో లక్షమంది రైతులకు లబ్ధి చేకూర్చేలా, 2.5 లక్షల ఎకరాల భూమిని సాగులోకి తెచ్చేలా వైఎస్‌ఆర్‌ జలకళ కింద 2 లక్షల బోర్లు ఉచితంగా వేయించనున్నాం.

2021-22లోగా భోగాపురం గ్రీన్‌ఫీల్డ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం, దగదర్తి గ్రీన్‌పీల్డ్‌ విమానాశ్రయాలకు భూసేకరణ పూర్తవుతుందని భావిస్తున్నాం.

2020-21లో రూ.6,243.64 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 39,578 మందికి ఉపాధి లభించింది. 117 పెద్ద కంపెనీలు వస్తున్నాయి. వీటి ద్వారా రూ.31,668 కోట్ల పెట్టుబడితో పాటు 67,716 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

రూ.1,510 కోట్లతో జువ్వలదిన్నె, ఉప్పాడ, నిజాంపట్నం, మచిలీపట్నం వద్ద ఫిషింగ్‌ నౌకాశ్రయాల అభివృద్ధి పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. రెండోదశలో రూ.1365.35 కోట్లతో బుడగట్లపాలెం, పూడిమడక, బియ్యపుతిప్ప, కొత్తపట్నాలలో అభివృద్ధి చేస్తాం.

అప్పులు రూ. 3.87 లక్షల కోట్లు

ఆంధ్రప్రదేశ్‌లో అప్పులు నానాటికీ పెరిగిపోతున్నాయి. రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో రుణాల వాటాను తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నామని చెబుతున్నా క్రమేణా ఆ వాటా పెరిగిపోతూ ఉంది. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం రుణాల నియంత్రణ కష్టమవుతోంది. 2021-22 చివరి నాటికి రాష్ట్ర ప్రభుత్వం అప్పులు రూ.3,87,125.39 కోట్లకు చేరుకుంటాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో గడిచిన అయిదేళ్ల కాలంలో రుణాల వాటా ఏకంగా 8.63 శాతం మేర పెరిగిపోయిందంటే పరిస్థితి అర్థమవుతోంది. ప్రతి ఆర్థిక సంవత్సరంలోనూ అంచనాలకు మించి మరీ ప్రభుత్వాలు అప్పులు చేయాల్సి వస్తోంది. గతేడాది బడ్జెట్‌ అంచనాల ప్రకారం అప్పుల వాటాను స్థూల ఉత్పత్తిలో 34.945 శాతానికి పరిమితం చేస్తామని ప్రభుత్వం చెప్పినా ప్రస్తుతం సవరించిన అంచనాల ప్రకారం అది 35.23 శాతానికి ఎగబాకింది. మరోవైపు 2021-22 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రుణాల వాటా 36.46 శాతానికి చేరబోతోందని లెక్కిస్తున్నారు. అంటే మన ఉత్పత్తి విలువలో మూడో వంతు కన్నా ఎక్కువే రుణాలు చేస్తున్నట్లు తేలుతోంది.

అంచనాలకు మించి మరీ అప్పులు

ఏటా బడ్జెట్‌ అంచనాలకు మించి అప్పులు చేయాల్సి వస్తోంది. బహిరంగ మార్కెట్‌ రుణాలు, కేంద్రం, ఇతర సంస్థల నుంచి తీసుకునే రుణాలు, చిన్న మొత్తాల పొదుపు, ప్రావిడెంట్‌ ఫండ్‌ మొత్తాలు, డిపాజిట్లే కాకుండా ప్రభుత్వం గ్యారంటీలు కూడా కల్పిస్తూ వివిధ కార్పొరేషన్ల ద్వారా రుణ సమీకరణ చేస్తోంది. ఆ మొత్తాలు దీనికి అదనమే. 2020-21 అంచనాల ప్రకారం రాష్ట్రం చేసే రుణం రూ.3,48,998.11 కోట్లు ఉండాలి. అంతకంటే రూ.6,876.19 కోట్లు అదనంగా అప్పు తీసుకున్నారు. అంతకు ముందు ఏడాది రూ. 2,91,345 కోట్లకు రుణభారం పెరుగుతుందని బడ్జెట్‌ సమయంలో సర్కారు అంచనా వేసింది.  అది ఏకంగా రూ.3,01,802.34 కోట్లకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.54,071.96 కోట్ల రుణం తీసుకున్నారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేవలం రూ.31,251.09 కోట్లకే రుణాల్ని పరిమితం చేస్తామని ప్రతిపాదిస్తున్నారు. గతేడాది రూ.54 వేల కోట్ల రుణాలు తీసుకున్న ప్రభుత్వం ఈ సంవత్సరం అంత తక్కువకు పరిమితం చేయగలదా అన్నది చర్చనీయాంశమే. వేరే రాబడి మార్గాల్లేని పరిస్థితుల్లో రుణాలను గతేడాది కంటే దాదాపు 40% తగ్గించడం ఎంత వరకు సాధ్యమవుతుందన్నది ప్రశ్నార్థకమే.ఎప్పుడూ లేనంత...

రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో రుణాల వాటా గతంలో ఎన్నడూ లేనంత పెరిగింది.  అయిదేళ్లుగా రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో రుణాల వాటా పెరుగుతూ వచ్చిన తీరిదీ..

బ‌డ్జెట్ ప్ర‌సంగం 

Posted Date: 21-05-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం