• facebook
  • whatsapp
  • telegram

ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక సర్వే 2020-21

ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి దిశగా స్థిరంగా అడుగులు వేస్తోంది. గత అయిదేళ్లలో రాష్ట్ర నికర ఉత్పత్తి (నెట్‌ డొమెస్టిక్‌ ప్రొడక్ట్‌) 60% పెరిగింది. తలసరి ఉత్పత్తిలోనూ ఇదే తరహా పెరుగుదల కనిపించింది. ఈ కాలంలో రాష్ట్రంలో మాతా శిశు మరణాలు తగ్గాయి. సగటు ఆయుర్దాయం పెరిగింది. ప్రజలకు కనీస సౌకర్యాలు కాస్త మెరుగుపడ్డాయి. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 2020-21 ఆర్థిక సర్వే ఈ విషయాలను వెల్లడించింది. ప్రాథమిక, మాధ్యమిక విద్యలో విద్యార్థుల నమోదు 90 శాతానికి పైగా ఉండగా ఉన్నత విద్యలో అది 35 శాతం కూడా దాటకపోవడాన్ని నివేదిక ప్రస్తావించింది. సేవారంగంలో వెనుకబాటు వంటివి ఆర్థికాభివృద్ధిని వెనక్కి లాగుతున్నాయని స్పష్టం చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి కల్పనలో రాష్ట్రం అట్టడుగున నిలవడం.. దీనిపై ప్రభుత్వం అత్యవసరంగా దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పింది. 


ముఖ్యాంశాలు
ఆర్థికాభివృద్ధిలో ముందడుగు
అయిదేళ్లలో ఏపీ నికర ఉత్పత్తి 60.68% పెరిగింది. 2011-12 నాటి తాజా ధరల ప్రకారం 2015-16లో ఏపీ నికర ఉత్పత్తి విలువ రూ.5,44,827 కోట్లు కాగా, 2019-20 నాటికి రూ.8,75,429 కోట్లకు చేరింది. ఈ అయిదేళ్లలో నికర ఉత్పత్తి వృద్ధిరేటు వరుసగా 15.7%, 12.4%, 16.4%, 8.9%, 12.8% మేర నమోదైంది.
రాష్ట్రంలో తలసరి నికర ఉత్పత్తి విలువ 2015-16లో రూ.1,08,002 ఉండగా, 2019-20 నాటికి రూ.1,69,519 (56.95%)కి చేరింది. తలసరి నికర ఉత్పత్తిలో 2015-20 మధ్య అయిదేళ్లలో వరుసగా 15%, 11.7%, 15.7%, 8.2% 12.1% మేర వృద్ధి నమోదైంది. 
2020 మార్చి నాటికి ఆంధ్రప్రదేశ్‌ బ్యాంకుల్లో రూ.3,27,947 కోట్ల డిపాజిట్లు ఉండగా సెప్టెంబర్‌ నాటికి రూ.3,58,890 కోట్లకు చేరాయి. ఇదే సమయంలో బ్యాంకులు ఇచ్చిన రుణాలు రూ.4,06,130 కోట్ల నుంచి రూ.4,31,997 కోట్లకు పెరిగాయి. అయితే ఈ డిపాజిట్లు 9.43% పెరగ్గా, బ్యాంకులు ఇచ్చే రుణాలు 6.3% మాత్రమే పెరిగాయి. మొత్తం రుణాల్లో ప్రాధాన్యతా రంగాల వాటా 53 శాతం. 
కరోనా తగ్గుముఖం పట్టేకొద్దీ రాష్ట్రాల ఆదాయాలు వేగంగా పుంజుకున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో జారీ చేసిన ఈ-వే బిల్లులు 2019 జూన్‌ స్థాయికి చేరుకున్నాయి. 
2019-20లో ఆంధ్రప్రదేశ్‌ స్థూల ఉత్పత్తికి అదనంగా సమకూరిన విలువలో (గ్రాస్‌ స్టేట్‌ వాల్యూ యాడెడ్‌) సేవా రంగం వాటా 41.80% ఉంది. అయిదేళ్లలో ఈ రంగం సగటున 7.56% వృద్ధి నమోదు చేసింది. జీవీఏలో సేవారంగం వాటా అతి తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఏపీ 27వ స్థానంలో నిలిచింది. 


ఆయుష్మాన్‌భవ 
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-4 నాటితో పోలిస్తే సర్వే-5 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో శిశుమరణాల రేటు గణనీయంగా తగ్గింది. చిన్నారుల్లో బరువులేమి, అధికబరువు సమస్యలను తగ్గించడంలోనూ ఏపీ విజయవంతమైంది. 
జననాల రేటు (ప్రతి వెయ్యి మందికి) 2008లో 18.4  ఉండగా, 2018 నాటికి 16కి తగ్గింది. మరణాల రేటు 7.5 నుంచి 6.7కి తగ్గింది. మరోవైపు సంతానసాఫల్య రేటు 1.8 నుంచి 1.6కి తగ్గింది. 
ఏపీలో ప్రజల సగటు ఆయుర్దాయం 2010-14లో 67.9 కాగా 2014-18 నాటికి 69.7 ఏళ్లకు పెరిగింది.  ఈ కాలంలో పురుషుల సగటు ఆయుర్దాయం 65.5 నుంచి 68.3కి, మహిళల సగటు ఆయుర్దాయం   70.4 సంవత్సరాల నుంచి 71.2 ఏళ్లకు పెరిగింది.  
కరోనా సమయంలో కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు ఎక్కువ ప్రాణాలను రక్షించగలిగాయి. అంచనా వేసిన దానికంటే ఏపీలో 1,410 మరణాలు, తెలంగాణలో 2,290 మరణాలు, కేరళలో 3,800 మరణాలు తగ్గాయి. అయితే కేసుల విషయంలో ఏపీలో అంచనా కంటే 1.45 లక్షలు పెరిగాయి.
దేశంలోని ఆంధ్రప్రదేశ్, దిల్లీ, తమిళనాడుల్లో వైద్యులు, నర్సులు సమతుల్య స్థాయిలో ఉన్నారు. 


ఉన్నత విద్యలో వెనుకబాటు 
2018-19 లెక్కల ప్రకారం రాష్ట్రంలో ప్రాథమిక పాఠశాలల్లో 92.9%, మాధ్యమిక పాఠశాలల్లో 79.7%, మాధ్యమికోన్నత పాఠశాలల్లో 46.8%, ఉన్నత విద్యలో 32.4% నమోదు నిష్పత్తి ఉంది. 2018-19 లెక్కల ప్రకారం ఏపీలో గుర్తింపు పొందిన విద్యాలయాలు ఉన్నత విద్యస్థాయి వరకు 2,182, మాధ్యమిక స్థాయి వరకు 12,513, ప్రాథమికోన్నత స్థాయి వరకు 9,427, ప్రాథమిక స్థాయిలో 39,499 ఉన్నాయి. యూనివర్శిటీలు, ఆ స్థాయి విద్యాసంస్థలు 41, 2,678 కళాశాలలు ఉన్నాయి.  
2018-19నాటి లెక్కల ప్రకారం రాష్ట్రంలో నిరుద్యోగ రేటు 5.3%. గ్రామీణ ప్రాంతాల్లో 4.5%, పట్టణ ప్రాంతాల్లో 7.3%గా ఉంది. 
దేశీయ పర్యాటకులను అత్యధికంగా ఆకర్షిస్తున్న రాష్ట్రాల్లో ఉత్తర్‌ప్రదేశ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర ముందున్నాయి. 2019లో మొత్తం దేశీయ పర్యాటకుల్లో 71% ఈ రాష్ట్రాలకే వచ్చారు. అత్యధిక విదేశీ పర్యాటకులను ఆకర్షించిన రాష్ట్రాల జాబితాలో మాత్రం ఏపీకి చోటు దక్కలేదు. 
2012తో పోలిస్తే 2018 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో కనీస సౌకర్యాలు మెరుగుపడ్డాయి. ఈ మధ్యకాలంలో పట్టణ ప్రాంతాల్లోని కుటుంబాలకు తాగునీటి సరఫరా మెరుగుపడింది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి అందుబాటు సూచికలో ఆంధ్రప్రదేశ్‌ అట్టడుగున ఉంది. 

రాష్ట్ర స్థూల‌ ఉత్పత్తిలో 1.5% వృద్ధి 
 

రాష్ట్ర స్థూల ఉత్పత్తి.. జాతీయ స్థూల ఉత్పత్తి కన్నా మెరుగ్గా ఉందని రాష్ట్ర ఆర్థిక సర్వే వెల్లడించింది. తలసరి ఆదాయమూ పెరిగిందని విశ్లేషించింది. ఐక్యరాజ్యసమితి సూచించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల ర్యాంకుల్లోనూ మెరుగుపడ్డామని పేర్కొంది. 2020-21 సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక‌ సర్వేను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మే 19న‌ విడుదల చేశారు. కార్యక్రమంలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ప్రణాళికాశాఖ ఎక్స్‌అఫీషియో కార్యదర్శి విజయకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.
 

ఆర్థిక సర్వే ముఖ్యాంశాలివీ..


రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో పెరుగుదల స్థిర ధరల వద్ద 1.58 శాతం ఉందని ఆర్థిక‌ సర్వే పేర్కొంది. జాతీయ స్థూల ఉత్పత్తి కన్నా ఇది మెరుగ్గా ఉందని స్పష్టం చేసింది. జాతీయ స్థూల ఉత్పత్తి -3.8 శాతం ఉన్న విషయాన్ని ప్రస్తావించింది. 2020-21 ముందస్తు అంచనాల మేరకు ఈ గణాంకాలను పేర్కొంటున్నట్లు వివరించింది. 

స్థిర ధరల వద్ద  2020-21లో రాష్ట్రంలో తలసరి ఆదాయం రూ.1,70,215. 2019-20లోని రూ.1,68,480తో పోలిస్తే రూ.1,735 పెరుగుదల ఉంది. జాతీయ తలసరి ఆదాయం కన్నా ఇది ఎక్కువే. జాతీయ స్థాయిలో 2019-20లో తలసరి ఆదాయం రూ.1,34,186.
 

‣ సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో నాలుగు నుంచి మూడుకు.. 
 

ఐక్యరాజ్యసమితి 2030 నాటికి 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను నిర్దేశించింది. వీటి సాధనలో దేశంలో రాష్ట్రం తన ర్యాంకును నాలుగో స్థానం నుంచి మూడో స్థానానికి మెరుగుపరుచుకుంది. 2018లో 4వ స్థానంలో ఉండగా 2019 నాటి గణాంకాలు వెల్లడించడంతో ఆ ఏడాదిలో మూడో స్థానానికి రాష్ట్రం ఎగబాకింది. 2019 సంవత్సరానికి సంబంధించి నీతిఆయోగ్‌ ర్యాంకులను విడుదల చేయగా రెండు లక్ష్యాల్లో (పరిశుభ్రమైన నీరు- పారిశుద్ధ్యం శాంతి- న్యాయం) ఏపీ మొదటి ర్యాంకులో నిలిచింది.  పేదరిక నిర్మూలనలో మూడో స్థానం సాధించింది. మంచి ఆరోగ్యం, ఆర్థిక వృద్ధి వాతావరణ మార్పులు... తదితర అంశాల్లో రెండో ర్యాంకు సాధించింది. అయితే దేశం మొత్తం మీద అక్షరాస్యత 72.98 శాతం ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో అది 67.35 శాతమే ఉంది. 2019-20లో రాష్ట్రంలో 175.12 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను పండిస్తే 2020-21 వచ్చేసరికి  అది 168.31 లక్షల టన్నులకు తగ్గింది.
 


‣ నవరత్నాలే ప్రాధాన్యం

విద్య, వైద్యం, సామాజిక భద్రత, మహిళల సంక్షేమం, పేద అట్టడుగు వర్గాల సంక్షేమం, రైతుల సంక్షేమం, పరిశ్రమలు-మౌలిక సౌకర్యాలు, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలే ప్రభుత్వ ప్రాధాన్యాలు.

జగనన్న అమ్మఒడి కింద 44.5 లక్షల పేద కుటుంబాల్లోని అమ్మలకు రూ.15,000 చొప్పున ఏడాదికి రూ.6,673 కోట్ల సాయం

జగనన్న విద్యా కానుక కింద పదో తరగతి వరకు విద్యార్థులకు మెటీరియల్‌ పంపిణీ

జగనన్న గోరుముద్ద కింద 36.88 లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కింద పోషకాహారం అందజేత

‘నాడు- నేడు’ కింద 15,715 పాఠశాలల్లో తొలిదశ కింద సౌకర్యాల కల్పన

రూ.4,879 కోట్లతో 13.26 లక్షల మంది విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన కింద ఫీజు రీయింబర్సుమెంటు 

జగనన్న వసతి దీవెన కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, మైనారిటీ విద్యార్థులు 10.89 లక్షల మందికి హాస్టళ్ల వసతి

వైఎస్సార్‌ చేయూత  కింద ఏడాదికి 24.55 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ  మహిళలకు రూ.4,604.13 కోట్ల వితరణ

కాంట్రాక్టు పోస్టులు, నామినేటెడ్‌ పదవుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ల కేటాయింపు

87,74,674 స్వయం సహాయ సంఘాలకు వైఎస్సార్‌ ఆసరా కింద రూ.6,792.21 కోట్ల రుణసాయం

వైఎస్సార్‌ జగనన్న కాలనీలు తొలి దశలో 15.60 లక్షల నిర్మాణం

అన్ని రకాల పింఛన్లు కలిపి 61.73 లక్షల మందికి రూ.1,487 కోట్ల పంపిణీ

వైఎస్సార్‌ రైతుభరోసా కింద ఏడాదికి రూ.13,500 (ఇందులో కేంద్ర  వాటా రూ.6,000) 5.67 లక్షల మంది రైతులకు పంటల బీమా కింద రూ.1,968 కోట్ల విడుదల



కొవిడ్‌ వేళ.. మెరుగైన వైద్యం 


కొవిడ్‌ సమయంలో మెరుగైన వైద్య సౌకర్యాలు. దేశంలో ప్రతి 10 లక్షల మందికి 2.2 లక్షల పరీక్షలు మాత్రమే చేస్తే ఏపీలో 3.3 లక్షలు చేశారు.

కేంద్రం కేటాయించిన 590 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ కోటా వినియోగించుకోవడంతో పాటు రాష్ట్రానికి 900 మెట్రిక్‌ టన్నులు అవసరమని కేంద్రానికి వినతి

కొవిడ్‌ వ్యాక్సిన్‌ మొదటి డోసు 53.28 లక్షల మందికి, రెండు డోసులు 21.64 లక్షల మందికి ఇచ్చారు.

ఏడాదికి రూ.5 లక్షల్లోపు ఆదాయం ఉన్న 1.44 కోట్ల కుటుంబాలకు వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ కింద సాయం. ఈ పథకం కింద 5,33,676 మంది రోగులు రూ.1,902.35 కోట్ల మేర ప్రయోజనం పొందారు.

వైఎస్సార్‌ కంటి వెలుగు కింద ఉచిత కంటి శస్త్రచికిత్సల నిర్వహణ. మూడేళ్లలో అవసరమైన వారందరికీ ఆపరేషన్లు పూర్తి చేయడం.  

ఆర్థిక స‌ర్వే 2020-21

  ఆర్థిక స‌ర్వే Volume -1 PDF 

ఆర్థిక స‌ర్వే  Volume -2 PDF 

ఆర్థిక సర్వే E-Book కోసం క్లిక్‌ చేయండి..

Posted Date: 30-01-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం