• facebook
  • whatsapp
  • telegram

కేంద్ర బ‌డ్జెట్ 2021-22

ఆత్మనిర్భర్‌ పేరుతో 2021-22 ఆర్థిక సంవత్సరానికి రూ.34,83,236 కోట్లతో ఆత్మరక్షణాత్మక బడ్జెట్టును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఫిబ్రవరి 1న లోక్‌సభలో తొలిసారిగా డిజిటల్‌ పద్ధతిలో ప్రవేశపెట్టారు. కరోనాతో కునారిల్లిన ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించి ఆదాయాన్ని ఆర్జించి పెట్టే కార్యక్రమాలకే విత్త మంత్రి ప్రాధాన్యం ఇచ్చారు. 


ఈ ఆరు స్తంభాలు మూలం 
1) ఆరోగ్యం-యోగక్షేమాలు 2) ఆర్థిక రంగం-మౌలిక సదుపాయాలు 3) సమ్మిళిత వృద్ధి-ఆకాంక్షపూరిత భారత్‌  4) మానవ వనరులు 5) నవకల్పనలు-పరిశోధన-అభివృద్ధి 6) కనిష్ఠ ప్రభుత్వం-గరిష్ఠ పాలన
ఈ ఆరు మూల స్తంభాలపై బడ్జెట్‌ ప్రతిపాదనలు రూపొందాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. 


ముఖ్యాంశాలు
* ఆరోగ్య రంగానికి 137% కేటాయింపులు పెంపు  * కరోనా వ్యాక్సిన్‌కు రూ.35,000 కోట్లు * 2030 నాటికి రైల్వే వ్యవస్థ ఆధునికీకరణ  * పీఎస్‌యూల భూముల అమ్మకానికి ప్రత్యేక సంస్థ  * 75ఏళ్లు దాటితే ఐటీ రిటర్నులు తప్పనిసరి కాదు * బంగారం, వెండిపై ‘వ్యవసాయ సెస్సు’ * బీమా రంగంలో ఎఫ్‌డీఐలు ఇక 74% * పబ్లిక్‌ ఇష్యూకు రానున్న ఎల్‌ఐసీ * బీపీసీఎల్, ఐడీబీఐ బ్యాంకు, ఒక బీమా సంస్థ ప్రైవేటీకరణ * స్వచ్ఛ భారత్‌- స్వాస్థ్య భారత్‌ కార్యక్రమానికి రూ.1.90 లక్షల కోట్లు  * మౌలిక సదుపాయాలపై మూలధన వ్యయం రూ.5.54 లక్షల కోట్లు * రక్షణ రంగానికి రూ.4,78,196 కోట్లు * పట్టణ ప్రాంతాల కోసం ఐదేళ్లలో రూ.2.87 లక్షల కోట్లతో జల్‌ జీవన్‌ మిషన్‌  * 9.5 శాతానికి పెరిగిన ద్రవ్య లోటు.. 2025-26 నాటికి 4.5% కంటే దిగువకు  * కొత్త ఏడాదిలో ప్రభుత్వ అప్పులు రూ.12 లక్షల కోట్లు * రూ.75,000 కోట్లతో ‘అభివృద్ధి ఆర్థిక సంస్థ’  * బస్సు రవాణా సేవల మెరుగుదలకు రూ.18,000 కోట్లతో కొత్త పథకం * అందుబాటు ధరలో ఇల్లు కొన్నవారికి మినహాయింపు మరో ఏడాది పెంపు 
* ఐ.టి. అసెస్‌మెంట్‌ కేసుల్ని తిరిగి తెరవడానికి వ్యవధి మూడేళ్లకు కుదింపు* 6.48 కోట్లకు చేరిన ఐ.టి. చెల్లింపుదారులు * అంకుర సంస్థలకు పన్ను విరామం * 400 పైగా కస్టమ్స్‌ సుంకం మినహాయింపులపై సమీక్ష 
* రాష్ట్రాలకు ఇచ్చే పన్ను వాటాలో 30% తగ్గుదల 


సంకల్పానికి అష్టపది 
2021-22 బడ్జెట్‌కు ఎనిమిది ప్రాధాన్య రంగాలను గుర్తించినట్లు మంత్రి చెప్పారు. ‘దేశమే ముందు’ అనే సంకల్పంలో ఇది భాగమని ప్రకటించారు. ఆయా రంగాలు.. 1) రైతుల ఆదాయం రెట్టింపు 2) బలమైన మౌలిక సదుపాయాలు 3) ఆరోగ్య భారత్‌ 4) సుపరిపాలన 5) యువతకు అవకాశాలు 6) అందరికీ విద్య 7) సమ్మిళిత వృద్ధి 8) ఆరోగ్య రంగం: అన్ని జిల్లాల్లో సమీకృత ఆరోగ్య ప్రయోగశాలలు. 202 జిల్లాల్లో  క్లిష్టతర చికిత్స ఆసుపత్రులు, ఆరోగ్య పరిరక్షణకు జాతీయస్థాయిలో ఒక సంస్థ ఏర్పాటు. 
కేటాయింపులు.. సంస్కరణలు 
* పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం రూ.1.75 లక్షల కోట్లు 
* ప్రభుత్వ రంగ బ్యాంకుల పెట్టుబడుల పునర్వ్యవస్థీకరణకు రూ.20,000 కోట్లు 
* రూ.64,180 కోట్లతో ఆత్మనిర్భర్‌ ఆరోగ్య కార్యక్రమం 
*  డిజిటల్‌ విధానంలో తొలిసారి జరగబోతున్న జనాభా లెక్కల సేకరణకు రూ.3,726 కోట్లు
*  మూడేళ్లలో ఏడు టెక్స్‌టైల్‌ పార్కులు 
ఎక్కువ మొత్తంలో పీఎఫ్‌ వడ్డీ పొందేవారిపై పన్ను విధించారు. వ్యవసాయ మౌలిక సదుపాయాల కోసం బంగారం, వెండి సహా మరికొన్నింటిపై సెస్సు వేశారు. ఈ ఒక్క సెస్సు రూపంలోనే రూ.30,000 కోట్లు రానున్నాయని అంచనా. పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.1.75 లక్షల కోట్లు రాబట్టాలన్న భారీ ప్రణాళికను ఆమె పార్లమెంటు ముందుంచారు. ఆరోగ్యం, మౌలిక సదుపాయాల రంగాలు రెండు కళ్లుగా నూతన బడ్జెట్‌ను ఆమె ఆవిష్కరించారు. జాతీయ రహదారులు, రైల్వేలకు చెరో రూ.లక్ష కోట్లకు పైగా కేటాయింపులు చూపించారు. ఇవి రెండూ సహా మొత్తం మౌలిక సదుపాయాల కల్పనకు రూ.5.54 లక్షల కోట్లు మేర నిధులు కేటాయించాలని ప్రతిపాదించారు. ప్రజారోగ్యాన్ని మినహాయిస్తే సంక్షేమ పథకాల జాడేమీ లేదు. కీలకమైన అంశాలకే ప్రాధాన్యమిస్తూ ఆదాయానికి తగినట్టే కేటాయింపులు చేశారు. బీమా రంగంలో విదేశీ పెట్టుబడులకు పరిమితిని పెంచారు. దేశీయ తయారీ రంగానికి ఊతమిచ్చేలా కొన్నింటిపై కస్టమ్స్‌ సుంకాలను పెంచాలని విత్తమంత్రి ప్రతిపాదించారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఆమె బడ్జెట్టును ప్రవేశపెట్టడం వరసగా ఇది మూడోసారి.


సంక్షేమ పథకాలు 
బడ్జెట్‌లో ఈసారి కొత్త పథకాల జాడ కనిపించలేదు. ఇప్పుడు ఉన్నవాటికే ఆచితూచి కేటాయింపులు చేశారు. బడుగు బలహీన వర్గాలు, వెనుకబడిన తరగతుల కోసం ప్రత్యేకించి రాయితీలు, పన్ను మినహాయింపులు ఇవ్వలేదు. ఎరువులు, ఆహారం, పెట్రోలియం మీద రాయితీని బాగా తగ్గించారు. కేంద్ర పథకాలకు కేటాయింపులు నిరుడు రూ.12,63,690 కోట్లు ఉంటే ఇప్పుడు రూ.10,51,703కోట్లకి తగ్గిపోయింది. 


తయారీ రంగం
అంతర్జాతీయంగా మన తయారీ రంగం విజేతగా అవతరించేందుకు 2021-22 నుంచి ఐదేళ్లలో రూ.1.97 లక్షల కోట్లు ఖర్చు చేయనుంది. మొత్తం 13 రంగాల్లో అభివృద్ధి జరగనుంది. 100% బ్రాడ్‌గేజ్‌ రైలుమార్గాల్లో విద్యుదీకరణ 2023కు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 


విద్యారంగం
దేశ వ్యాప్తంగా బడుల బలోపేతం, బోధనలో నాణ్యత పెంపొందించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. జాతీయ విద్యా విధానం అమల్లో భాగంగా వ్యాయామోపాధ్యాయులు (పీఈటీ), సంగీతం, కళలు, చిత్రలేఖనం తదితర ఉపాధ్యాయులను నియమించడంతోపాటు, ప్రయోగశాలలు, గ్రంథాలయాలను ఏర్పాటుచేయడం ద్వారా దేశంలోని 15,000 పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించనున్నట్టు పేర్కొంది. అవి దేశవ్యాప్తంగా ఉన్న మిగిలిన పాఠశాలలకు మెంటార్‌గా వ్యవహరిస్తాయి. 
బడ్జెట్‌లో విద్యకు సంబంధించిన కీలకాంశాలు...
దేశ వ్యాప్తంగా కొత్తగా 100 సైనిక పాఠశాలలు. వీటిని ఎన్‌జీవో సంస్థలు, ప్రైవేటు పాఠశాలలు, రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ఏర్పాటుచేస్తారు. 
‣ ఉన్నత విద్యలో విదేశీ విద్యా సంస్థలను ప్రోత్సహిస్తూనే...వాటిలో బహుళ డిగ్రీలు, గిరాకీ ఉన్న కోర్సులకు అనుమతులు ఇచ్చేందుకు, వాటి పర్యవేక్షణకు ఓ వ్యవస్థ. 
‣ ఉన్నత విద్యకు రూ.38,350 కోట్లు.
‣ దేశంలోని వివిధ నగరాల్లో కేంద్ర ఆధ్వర్యంలో నడిచే పరిశోధన కేంద్రాలు, విద్యాసంస్థలు, కళాశాలలన్నింటినీ ఒక గొడుకు కిందకు. జాతీయ పరిశోధన సంస్థ(ఎన్‌ఆర్‌ఎఫ్‌) కార్యకలాపాలకు ఐదేళ్లలో రూ.50 వేల కోట్లు ఖర్చు. 
‣ గిరిజన విద్యార్థుల కోసం ఆయా వర్గాలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో కొత్తగా 750 ఏకలవ్య గురుకుల పాఠశాలలు.


వైద్య రంగం 
కొవిడ్‌-19 కారణంగా మునుపెన్నడూ చూడని పరిస్థితులు ఏర్పడటంతో ప్రభుత్వం ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించింది. సవరించిన అంచనాల ప్రకారం గతేడాది వైద్య రంగానికి జీడీపీలో 1.5% కేటాయించగా ఈసారి దాన్ని 1.8 శాతానికి (రూ.2,23,846 కోట్లు) పెంచారు. గత బడ్జెట్‌తో పోలిస్తే ఈ మొత్తం 137 శాతం అధికం. కొవిడ్‌ టీకాల కోసం రూ.35,000 కోట్లు కేటాయింపు చూపించారు. పీఎం ఆత్మనిర్భర్‌ స్వాస్థ్‌ భారత్‌ యోజన కింద ఆరేళ్లకు రూ.64,180 కోట్లు కేటాయించనున్నారు. వెల్‌నెస్‌ కేంద్రాలు, సమ్మిళిత ప్రజా ఆరోగ్య ప్రయోగశాలలు, అత్యవసర ఆస్పత్రి విభాగాలను నిర్మించనున్నారు. రోగాలు రాకుండా, వస్తే నయం చేసేలా వైద్య రంగ బలోపేతానికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. పౌష్టికాహార పథకం, పోషణ్‌ అభియాన్‌ను కలిపి మిషన్‌ పోషణ్‌ 2.0ను ఆవిష్కరించారు. మొత్తం కేటాయింపుల్లో ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖకు రూ.71,268 కోట్లు దక్కనున్నాయి. 
- ప్రస్తుతం ఐదు రాష్ట్రాలకే పరిమితమైన న్యుమోకోకల్‌ టీకా పంపిణీని దేశమంతటా విస్తరించనున్నారు. న్యుమోనియా, సెప్టికామియా, మెదడువాపు వంటి ప్రాణాంతక ఇన్‌ఫెక్షన్ల నివారణకు ఈ టీకా ఉపయోగపడుతుంది. కేంద్రం తాజా నిర్ణయం దేశంలో ఏటా 50 వేల మంది చిన్నారుల మరణాలను తప్పించేందుకు దోహదపడుతుందని అంచనా. మరోవైపు- తాజా బడ్జెట్‌లో ఆయూష్‌కు రూ.2,970.30 కోట్లు, ఆరోగ్య పరిశోధనల విభాగానికి రూ.2,663 కోట్లు కేటాయించారు. 


డిజిటల్‌ రంగం
దేశంలో డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహించేందుకు రూ.1,500 కోట్ల పథకాన్ని కేంద్రం ప్రతిపాదించింది. కొంతకాలంగా డిజిటల్‌ లావాదేవీల్లో గణనీయమైన పెరుగుదల కనిపిస్తోందని, ఈ మార్పును మరింతగా ముందుకు తీసుకెళ్లేందుకు, ఆర్థిక పరమైన ప్రోత్సాహాన్ని అందించేందుకు ఈ పథకం దోహదపడుతుందని కేంద్రం భావిస్తోంది.


నైపుణ్యముంటే విదేశాలకు..శిక్షణకు రూ. 3000 కోట్లు
ఉద్యోగావకాశాలను మెరుగుపరిచేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంజినీరింగ్, డిప్లొమా, డిగ్రీ కోర్సులు పూర్తిచేసిన వారికి ఉపాధి కల్పించే  లక్ష్యంతో అప్రెంటిస్‌షిప్‌ చట్టాన్ని సవరించడంతోపాటు, జాతీయ అప్రెంటిస్‌షిప్‌ శిక్షణ పథకం పునరుజ్జీవానికి చర్యలు చేపట్టింది. ఆయా వర్గాల యువతను నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దేందుకు రూ.3 వేల కోట్లు కేటాయించింది. 


కాగితం లేకుండానే..జనగణనకు రూ.3,726 కోట్లు 
జనగణన కోసం రూ.3,726 కోట్లను కేటాయించారు. తొలిసారి జన గణనను డిజిటల్‌ రూపంలో చేయనున్నారు. దీంతోపాటు సముద్ర అధ్యయన మిషన్‌ కోసం రూ.4 వేల కోట్లను కేటాయించారు. మరోవైపు ఒప్పంద వివాదాల్లో సత్వర పరిష్కారానికి ఓ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు ప్రతిపాదించారు. జాతీయ నర్సింగ్, మిడ్‌వైఫరీ కమిషన్‌ బిల్లును తీసుకురానున్నట్లు ప్రతిపాదన చేశారు.


ఉపాధి హామీకి రూ. 73,000 కోట్లు
ఉపాధి హామీ పథకానికి కేంద్రం తాజా బడ్జెట్‌లో గత ఏడాది కన్నా 20 శాతం అదనంగా నిధులు కేటాయించింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఈ పథకం కింద  రూ.73వేల కోట్లు ఇచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వెచ్చించిన నిధులతో పోల్చితే ఈ మొత్తం తక్కువే. 2020-21లో ‘ఉపాధి%కి  రూ.61,500 కోట్లు ఇస్తున్నట్లు పేర్కొన్నా... కరోనా కారణంగా దాన్ని రూ.1.11లక్షల కోట్లకు పెంచారు.


విద్యుత్తు రంగం
ఆర్థిక ఇబ్బందులతో కునారిల్లుతున్న విద్యుత్తు పంపిణీ సంస్థలకు నూతన జవసత్వాలు అందించడమే లక్ష్యంగా రానున్న ఐదేళ్లలో రూ.3.05 లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వం వెచ్చించనుంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌  బడ్జెట్‌ ప్రవేశపెడుతూ ఓ నూతన పథకాన్ని ప్రతిపాదించారు. దీంతోపాటు వినియోగదారులు తమకు నచ్చిన సంస్థ (సర్వీస్‌ ప్రొవైడర్‌) లేదా డిస్కం నుంచి విద్యుత్తు కొనుగోలు చేసే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు త్వరలోనే ఓ విధానాన్ని అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లుగా వినియోగదారులు అందరికీ 24 గంటలూ నాణ్యమైన విద్యుత్తును అందించడమే లక్ష్యంగా ఈ ప్రకటనలు వెలువడ్డాయి.


వ్యవసాయం
వ్యవసాయం, రైతుల సంక్షేమ మంత్రిత్వశాఖకు ఈ దఫా బడ్జెట్‌లో కేటాయింపులు 5.63 శాతం మేర పెరిగి, రూ.1,31,531 కోట్లకు చేరాయి. ఇందులో దాదాపు సగం నిధులను.. కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ‘పీఎం-కిసాన్‌’ పథకానికి ప్రత్యేకించారు. వ్యవసాయ మౌలిక వసతుల నిధి, సాగునీటి కార్యక్రమాలకు కేటాయింపులు పెరిగాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రైతులకు రూ.16.5 లక్షల కోట్ల రుణాలను ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు నిర్మలా సీతారామన్‌ చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అది రూ.15 లక్షల కోట్లుగా ఉందన్నారు. పశు సంవర్థక, పాడి పరిశ్రమ, మత్స్య శాఖలకూ రుణ లభ్యతను పెంచేందుకు చర్యలు చేపడతామన్నారు. 
వ్యవసాయ రంగానికి.. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సవరించిన బడ్జెట్‌ అంచనాలు రూ.1,24,519 కోట్లుగా ఉన్నాయి.
‣ 2021-22లో వ్యవసాయ శాఖకు చేసిన కేటాయింపుల్లో వ్యవసాయం, రైతుల సంక్షేమ విభాగానికి రూ.1,23,017.57 కోట్లు కేటాయించారు. వ్యవసాయ పరిశోధన, విద్యకు రూ.8,513.62 కోట్లు ప్రత్యేకించారు. 
‣ 2021-22కు సంబంధించిన సవరించిన అంచనాల (రూ.1,03,162.30 కోట్లు)తో పోలిస్తే 10 కేంద్ర పథకాలకు ఈ దఫా స్వల్పంగా నిధులు పెంచి రూ.1,05,018.81 కోట్లు ప్రతిపాదించారు. 
‣ కీలకమైన పథకాల్లో పీఎం-కిసాన్‌కు రూ.65వేల కోట్లు దక్కాయి. దీనికింద.. నమోదైన రైతుకు మూడు వాయిదాల్లో రూ.6వేలను చెల్లిస్తారు.
‣ పీఎం-ఆశా పథకానికి 2020-21కి సంబంధించిన సవరించిన అంచనాలు రూ.996 కోట్లుగా ఉండగా తాజాగా ఈ పద్దు కింద రూ.1500 కోట్లు కేటాయించారు. 
‣ 10వేల వ్యవసాయ ఉత్పత్తి సంస్థల ఏర్పాటు, ప్రోత్సాహానికి కేటాయింపులను రూ.250 కోట్ల నుంచి రూ.700 కోట్లకు, వ్యవసాయ మౌలికవసతుల నిధిని రూ.208 కోట్ల నుంచి రూ.900 కోట్లకు పెంచారు. 
‣  18 కేంద్ర ప్రాయోజిత పథకాలకూ కేటాయింపులు జరిపారు. పీఎంకేఎస్‌వైకు 2020-21 సవరించిన అంచనాల్లో రూ.2,563 కోట్ల నుంచి రూ.4వేల కోట్లకు పెంచారు. 
‣  వ్యవసాయ మౌలిక వసతుల నిధిని.. మార్కెటింగ్‌ కమిటీల్లో మౌలిక వసతులు పెంచడానికీ అందుబాటులో ఉంచారు.  
‣ గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి నిధిని రూ.30వేల కోట్ల నుంచి రూ.40వేల కోట్లకు పెంచారు. సూక్ష్మ సాగు నిధికి సంబంధించిన కార్పస్‌ను ప్రస్తుతమున్న రూ.5వేల కోట్ల నుంచి రెట్టింపు చేశారు.   
‣ వ్యవసాయ, అనుబంధ ఉత్పత్తులకు విలువ జోడింపు, వాటి ఎగుమతులకు అవకాశాన్ని పెంచేందుకు ‘ఆపరేషన్‌ గ్రీన్‌ స్కీమ్‌’ను 22 ఉత్పత్తులకు విస్తరించారు. ప్రస్తుతం అది టమోటాలు, ఉల్లిపాయలు, బంగాళా దుంపలకు వర్తిస్తోంది.
‣ ఎలక్ట్రానిక్‌ నేషనల్‌ అగ్రికల్చరల్‌ మార్కెట్‌ (ఈనామ్‌)లో 1.68 కోట్ల మంది రైతులు నమోదయ్యారు. ఈ వేదిక ద్వారా రూ.1.14 లక్షల కోట్ల విలువైన సరకు వాణిజ్యం జరిగింది. మరో వెయ్యి మండీలను ఈనామ్‌తో అనుసంధానిస్తామని మంత్రి తెలిపారు.
‣ ఇక అనుబంధ మంత్రిత్వశాఖ విషయానికొస్తే మత్స్య, పశుసంవర్థక, పాడిపరిశ్రమాభివృద్ధి శాఖకు కేటాయింపులను రూ.3,918.31 కోట్ల నుంచి రూ.4,820.82 కోట్లకు పెంచారు.  
‣ ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వశాఖ కేటాయింపులు రూ.1247.42 కోట్ల నుంచి రూ.1308.66 కోట్లకు పెరిగాయి. 


శిశు సంక్షేమం
మహిళా, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖకు రూ.24,435 కోట్లు కేటాయించారు. గతేడాది కంటే ఇది దాదాపు 16 శాతం ఎక్కువ. ఇందులో అత్యధికంగా రూ.20,105 కోట్లు సక్షమ్‌ అంగన్‌వాడీ, మిషన్‌ పోషణ్‌ 2.0 కు కేటాయించారు.  బేటీ బచావో - బేటీ పఢావో, ప్రధాన్‌మంత్రి మాతృవందన్‌ యోజన తదితర పథకాలకు ఈ బడ్జెట్‌లో ఎలాంటి నిధులూ కేటాయించలేదు. 


జల్‌ జీవనం
తాగునీటి సరఫరాకు ఉద్దేశించిన జల్‌జీవన్‌ మిషన్‌కు రూ.50వేల కోట్లు కేటాయించారు. ఈ పథకం కింద పట్టణ ప్రాంతాలకు తాగునీటి సరఫరా అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. జల్‌శక్తి మంత్రిత్వ శాఖ పరిధిలోని తాగునీరు, పారిశుద్ధ్య విభాగానికి మొత్తం రూ.60,030 కోట్లు కేటాయించారు. 2020-21లో డీడీడబ్ల్యూఎస్‌కు రూ.17,023కోట్లే కేటాయించగా.. ఈసారి మూడింతలకుపైగా పెంచారు. 


రోడ్డు రవాణా రంగం
హైవే కారిడార్లు, ఇతర రవాణా ప్రాజెక్టుల్ని వేగవంతం చేసేందుకు కేంద్రం సిద్ధమైంది. వీటి నిర్మాణానికి గత ఏడాది రూ.91,823 కోట్లను కేటాయించగా తాజాగా ఆ నిధుల్ని రూ.1.01 లక్షల కోట్లకు పెంచింది. రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వ శాఖకు కేంద్రం రూ.1,18,101 కోట్లను ఇవ్వనుంది. ఇందులో రూ.1,08,230 కోట్లు మూలధనం. ఇప్పటిదాకా ఇదే అత్యంత ఎక్కువ అని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు.  
* ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఉత్తరాంధ్రల మీదుగా సాగే 464 కిలోమీటర్ల రాయ్‌పూర్‌-విశాఖపట్నం కారిడార్‌కు ఈ సంవత్సరం నిధులు కేటాయిస్తారు. వచ్చే ఆర్థిక సంవత్సరం పనులు ప్రారంభం అవుతాయి. 
* పట్టణ ప్రాంతాల్లో ప్రజారవాణాను మెరుగుపరిచేందుకు రూ.18,000 కోట్ల విలువైన పథకాన్ని ప్రతిపాదించింది. ఇందులోభాగంగా ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంలో 20,000 బస్సులను అందుబాటులోకి తెస్తారు.  
ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు అగ్రతాంబూలం
త్వరలో ఎన్నికలు జరగనున్న నాలుగు రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఈ బడ్జెట్‌లో అగ్రతాంబూలం లభించింది. తమిళనాడు, పశ్చిమబెంగాల్, అసోం, కేరళ రాష్ట్రాల్లోని రహదారుల నిర్మాణం, అభివృద్ధికి రూ. 2.27 లక్షల కోట్లను కేటాయిస్తున్నట్లు నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు.
* తమిళనాడులో రూ.1.03 లక్షల కోట్లతో 3,500 కిలోమీటర్లు. 
* కేరళలో రూ.65,000 కోట్లతో 1,100 కిలోమీటర్లు. 
* పశ్చిమబెంగాల్‌లో రూ.25,000 కోట్లతో రహదారుల పనులు.
* అసోంలో రూ.34,000 కోట్లతో 1,300 కిలోమీటర్ల మేర పనులు. 


పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలు
పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు కేంద్రం ప్రాధాన్యం ఇచ్చింది. ఇందులో భాగంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో మూలధన వ్యయాన్ని రూ.5.54 లక్షల కోట్లకు పెంచనుంది. సంస్థాగత నిర్మాణాలు, ఆస్తుల ఆర్జనకు ఉద్దేశించిన నేషనల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ పైప్‌లైన్‌(ఎన్‌ఐపీ) పథకం లక్ష్యాల్ని సాధించే క్రమంలో ‘నేషనల్‌ మోనిటైజేషన్‌ పైప్‌లైన్‌’ పథకాన్ని కేంద్రం ప్రకటించింది. 6,835 ప్రాజెక్టులతో కూడిన ఎన్‌ఐపీ పథకం 2019 డిసెంబరులో మొదలైంది. దీనిని 7,400 ప్రాజెక్టులకు విస్తరిస్తారు.  


పల్లెకు సౌకర్యం
ప్రస్తుతం రూ.30,000 కోట్లుగా ఉన్న గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి నిధి వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.40,000కు పెరగనుంది. 1,000 మండీలను ఎలక్ట్రిక్‌ నేషనల్‌ మార్కెట్‌లో విలీనం కానున్నాయి. ఐదు ప్రధాన ఫిషింగ్‌ హబ్‌ల అభివృద్ధికి ప్రకటించిన ‘ఆపరేషన్‌ గ్రీన్‌’ పథకాన్ని మరో 22 పాడైపోయే వస్తువులకూ వర్తింపచేస్తారు. వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని రూ.40,000 కోట్లకు, సూక్ష్మ నీటి పారుదల వ్యవస్థ కార్పస్‌ను రెట్టింపు చేస్తూ రూ.10,000 కోట్లకు పెంచుతారు.


రక్షణరంగం
రక్షణ శాఖకు రూ.4.78 లక్షల కోట్లు కేటాయించారు. గత బడ్జెట్‌తో పోల్చితే  1.4 శాతం అధికం. గత ఏడాది రూ.4.71 లక్షల కోట్లు ఇవ్వగా అందులో పెట్టుబడి వ్యయానికి రూ.1.13 లక్షల కోట్లు ప్రత్యేకించారు. అయితే చైనా సరిహద్దుల్లో ఏర్పడిన సమస్యల దృష్ట్యా అనంతర సమయంలో దాన్ని రూ.1.34 లక్షల కోట్లకు పెంచారు. రక్షణ పరికరాల కొనుగోలుకు ఈ మొత్తాన్ని వెచ్చించారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం పెట్టుబడి వ్యయాలకు రూ.1.35 లక్షల కోట్లు కేటాయించారు. 


అంతరిక్షరంగం
రోదసీలోకి మానవ రహిత వ్యోమనౌకను పంపించే గగన్‌యాన్‌ యాత్ర డిసెంబరులో ఉంటుందని ఆర్థికమంత్రి ప్రకటించారు. 2022లో భారత స్వాతంత్య్ర 75 ఏళ్ల వార్షికోత్సవం సందర్భంగా ముగ్గురు వ్యోమగాములను 5 నుంచి 7 రోజుల పాటు రోదసీలోకి పంపుతారు. ఇందుకు రూ.10వేల కోట్లు ఖర్చవుతుంది. బడ్జెట్‌లో అంతరిక్ష రంగానికి రూ.13,949 కోట్లు ఇచ్చారు. గత ఏడాది కన్నా రూ.8,228 అధికం. కొత్తగా ఏర్పాటయిన న్యూ స్పేస్‌ ఇండియా లిమిటెడ్‌ సంస్థకు రూ.700 కోట్లు కేటాయించారు. 


పర్యాటక రంగం
కరోనా లాక్‌డౌన్‌ కారణంగా కునారిల్లుతున్న పర్యాటక రంగానికి బడ్జెట్‌లో భారీ దెబ్బ తగిలింది. గత ఏడాదితో పోల్చితే నిధుల కేటాయింపులో 19 శాతం తగ్గుదల కనిపించింది. మునుపటి బడ్జెట్‌లో రూ.2,500 కోట్లు కేటాయించగా, చివరకు రూ.1,260 కోట్లు ఖర్చు చేశారు. ప్రస్తుత బడ్జెట్‌లో కేటాయింపులను రూ.2026 కోట్లకు పరిమితం చేశారు. ఇందులో మౌలిక వసతుల కల్పనకు రూ.1088 కోట్లు ఇచ్చారు. అయితే కేటాయింపులపై పర్యాటక మంత్రి ప్రహ్లాద పటేల్‌ సంతృప్తి వ్యక్తం చేశారు.  


ఉజ్వల పథకం 
ఉజ్వల పథకం కింద మరో కోటి ఉచిత వంట గ్యాస్‌ కనెక్షన్లు ఇస్తారు. మరోవైపు వాహనాలకు సీఎన్‌జీ సరఫరా, ఇళ్లకు పైప్‌లైన్‌ ద్వారా వంట గ్యాస్‌ సదుపాయాన్ని మరో 100 జిల్లాలకు విస్తరించనున్నట్లు నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. మరోవైపు గెయిల్, ఐవోసీ, హెచ్‌పీసీఎల్‌ పైప్‌లైన్ల ‘నగదీకరణ’కు అనుమతించాలని నిర్ణయించారు. అంటే వాటిని ఇతర కంపెనీల అవసరాలకూ వాడుకుని ఆదాయాన్ని ఆర్జించేందుకు అవకాశం కల్పిస్తారు.  


నౌకాశ్రయాల్లో పీపీపీ సేవలు రూ. 2,000 కోట్లతో 7ప్రాజెక్టులు
దేశంలోని ప్రధాన నౌకాశ్రయాల్లో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య(పీపీపీ) విధానంలో యాజమాన్య, నిర్వహణ సేవలు అందించనున్నట్లు కేంద్రం పేర్కొంది. ఇందుకోసం రూ. 2 వేల కోట్లకు పైగా విలువ గల ఏడు ప్రాజెక్టులను పీపీపీ విధానంలో చేపట్టనున్నట్లు వెల్లడించింది. వాణిజ్య నౌకలను ప్రోత్సహించేందుకు రానున్న ఐదేళ్లలో రూ. 1,624 కోట్ల రాయితీ ఇవ్వాలని ప్రతిపాదించింది.


రాయితీ రెండున్నర రెట్లు రూ. 6 లక్షల కోట్లకు బిల్లు
గతేడాది కరోనా విజృంభణకు ముందు ప్రవేశపెట్టిన 2020-21 బడ్జెట్‌లో ప్రభుత్వం రాయితీ బిల్లును రూ.2,27,793.89 కోట్లుగా ప్రతిపాదించింది. నాటి బడ్జెట్‌లో సవరించిన అంచనాల్లో ఈ మొత్తాన్ని రూ.5,95,620.23 కోట్లుగా చూపించింది. వచ్చే బడ్జెట్‌ అంచనాల్లో ఆహారం, ఎరువులు, ఎల్‌పీజీ, కిరోసిన్‌పై  రాయితీ మొత్తాన్ని రూ.3,36,439.03 కోట్లకు పరిమితం చేసింది.


పీఎఫ్‌పై కొత్త నిబంధనల ప్రతిపాదన
అధిక వేతనం ఉన్న ఉద్యోగులు భవిష్య నిధి (పీఎఫ్‌) ఖాతాల్లో జమ చేసే మొత్తంపై ఆర్జించే వడ్డీకి బడ్జెట్‌లో కొత్త నిబంధనలను ప్రతిపాదించారు.దీని ప్రకారం.. ఇకపై రూ.2,50,000 వరకు జమ చేసే మొత్తంపై వచ్చే వడ్డీకే పన్ను మినహాయింపు లభిస్తుంది. ఆపై జమ చేసే మొత్తానికి లభించే వడ్డీకి వర్తించే శ్లాబుల ప్రకారం పన్ను విధిస్తారు. ఇది ఏప్రిల్‌ 1, 2021 నుంచి చేసే జమలకే వర్తించనుంది. 


బడ్జెట్‌లో ఎవరికేంటి?
వలస కార్మికులు: వలస కార్మికుల కోసం పట్టణాల్లో తక్కువ అద్దెకే ఇళ్లు నిర్మించే వారిని ప్రోత్సహించనుంది. ఈ ఇళ్ల నిర్మాణానికి తీసుకున్న రుణంపైనా రూ.1.50 లక్షల వడ్డీ రాయితీ ఉంది. ఇది 2022 మార్చి 31 వరకు అమల్లో ఉంటుంది.
మధ్య తరగతి: పీఎంఏవై పథకం మరో ఏడాది పొడిగింపు. అందుబాటు ధరల్లో గృహాలు నిర్మించే సంస్థలకు పన్ను విరామం మరో ఏడాది పొడిగింపు.
రైతులు: అన్నదాతల ఆదాయాన్ని రెండు రెట్లు చేయడంలో భాగంగా దేశవ్యాప్తంగా అయిదు వ్యవసాయ హబ్‌ల ఏర్పాటు. రైతులకు రూ.16.5 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు ఇవ్వాలని నిర్ణయం. దేశంలో వేయి వ్యవసాయ మార్కెట్ల(మండీ)ను ఈనామ్‌తో అనుసంధానించాలనే మరో నిర్ణయంతో గిట్టుబాటు ధరలు దక్కే అవకాశం.
విద్యార్థులు: దేశంలోని 15 వేల ప్రభుత్వ పాఠశాలల ఆధునికీకరణ. ఏకలవ్య పాఠశాలల కోసం రూ.40 కోట్లు కేటాయింపు. ఎన్‌జీఓలు, ప్రయివేట్‌ పాఠశాలలు, రాష్ట్రాల భాగస్వామ్యంతో 100 కొత్త సైనిక పాఠశాలల ఏర్పాటు. సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షా విధానంలో 2022-23 నుంచి దశలవారీగా సంస్కరణలు.
ఎన్‌ఆర్‌ఐలు: విదేశాల నుంచి ప్రవాస భారతీయులు తిరిగి వచ్చేసినప్పుడు ఆయా దేశాలతోపాటు ఇక్కడా ఆదాయ పన్ను చెల్లించాల్సి వస్తోంది. ఇది సమస్యలకు దారి తీస్తుండడంతో వివాద పరిష్కార కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
చిరు వ్యాపారులు: విదేశాల నుంచి దిగుమతి చేసుకొనే ఇంకు కాట్రిడ్జిలు, సెల్‌ఫోన్‌ విడిభాగాలైన కెమెరా, కనెక్టర్లు, బ్యాక్‌ కవర్, ఛార్జర్లపై కస్టమ్స్‌ సుంకం పెంచనున్నారు. దీంతో వాటి ధరలు పెరిగి దర్జీలు, సెల్‌ఫోన్‌ల మరమ్మతు దుకాణాల వారు, జిరాక్సు కేంద్రాల నిర్వాహకులు కొంతమేరకు ఇబ్బంది పడవచ్చు.
వృద్ధులు: కేవలం పింఛను, డిపాజిట్ల వడ్డీపై ఆధారపడి జీవించే 75 ఏళ్లు దాటిన వృద్ధులు ఇకపై ఎలాంటి రిటర్నులు సమర్పించాల్సిన అవసరం లేదు. బ్యాంకు ఖాతాల్లోనే వారి పన్ను మొత్తాన్ని మినహాయిస్తారు.
యువత: మౌలిక, తయారీ రంగాల్లో ప్రభుత్వం భారీగా కేటాయింపులు పెంచనుండటంతో యువతకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. జాతీయ అప్రెంటిస్‌ చట్టంలో సవరణలతోనూ ఉపాధి అవకాశాలు   లభిస్తాయి. 
వేతన జీవులు: ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన మరో ఏడాది పొడిగింపు. గృహ రుణాల వడ్డీపై అదనంగా రూ.1.5 లక్షల పన్ను మినహాయింపు సౌలభ్యం 2022 వరకు పొడిగింపు. అయితే పీఎఫ్‌ జమ సంవత్సరానికి రూ.2.5 లక్షలు మించితే వడ్డీపై పన్నువిధించనుండటం   అసంతృప్తే.
గృహిణులు: మరో కోటి మందికి ఉజ్వల గ్యాస్‌ పథకం. ఎక్కడి నుంచైనా రేషన్‌ తీసుకునే వీలు. 32 రాష్ట్రాల్లో వన్‌ నేషన్‌ వన్‌ రేషన్‌ కార్డు అమలు. పసిడి, వెండిపై కస్టమ్స్‌ సుంకం 12.5% నుంచి 7.5% తగ్గింపుతో తగ్గనున్న ఆభరణాల ధరలు.


స్థిరాస్థి రంగం
స్థిరాస్తి రంగానికి ఊతమిచ్చే చర్యలను కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది. అందుబాటు ధరల్లోని ఇళ్ల కొనుగోలుకు సంబంధించి గృహరుణంపైకట్టే వడ్డీపై 1.5 లక్షల అదనపు పన్ను మినహాయింపును కేంద్రం 2022, మార్చి 31 వరకు పొడిగించింది. తొలిసారి గరిష్ఠంగా రూ.45 లక్షల వరకు విలువైన గృహాల్ని కొనేవారికి వడ్డీపై రూ.2 లక్షల మినహాయింపు ఉండగా.. మరో రూ.1.5 లక్షల  మినహాయింపు పథకాన్ని కేంద్రం 2019లో ప్రవేశపెట్టింది. కొవిడ్‌ నేపథ్యంలో స్థిరాస్తి, నిర్మాణ రంగాల పునరుత్తేజం కోసం పథకం గడువును కేంద్రం తాజాగా మరో ఏడాది పొడిగించింది. 


వలస కార్మికుల కోసం.. 
వలస కార్మికులకు లబ్ధి చేకూర్చేందుకు అందుబాటు ధరల్లోని నోటిఫైడ్‌ అద్దె గృహ (రెంటల్‌ హౌసింగ్‌) ప్రాజెక్టులకు కూడా పూర్తిగా పన్ను మినహాయింపు ఇవ్వనున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. సదరు ప్రాజెక్టు 2016 జూన్‌ తర్వాత, 2021 మార్చి 31లోపు అనుమతి పొంది ఉండాలని షరతు విధించారు. 


‘హౌసింగ్‌’కు రూ.54,581 కోట్లు
కేంద్ర హౌసింగ్, పట్టణ వ్యవహారాల శాఖకు బడ్జెట్‌లో రూ.54,581 కోట్లు కేటాయించారు. స్వచ్ఛ భారత్‌ మిషన్‌ (పట్టణ)కు రూ.2,300 కోట్లు, ఎంఆర్‌టీఎస్, మెట్రో సేవల కోసం రూ.23,500 కోట్లు, స్మార్ట్‌ సిటీస్‌ మిషన్‌కు రూ.6,450 కోట్లు, అమృత్‌ పథకానికి బడ్జెట్‌లో రూ.7,300 కోట్లు ప్రత్యేకించారు. 


మూడేళ్లలో ఏడు మెగా టెక్స్‌టైల్‌ పార్కులు
దేశీయ వస్త్ర పరిశ్రమకు ఊతమిచ్చి ప్రపంచస్థాయిలో పోటీపడే వాతావరణం కల్పించేందుకు, ఉపాధి అవకాశాల మెరుగుకు పలు చర్యలకు కేంద్రం ఉపక్రమించింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా రాబోయే మూడేళ్లలో ఏడు మెగా టెక్స్‌టైల్‌ పార్కుల ఏర్పాటుకు ప్రత్యేక పథకాన్ని బడ్జెట్‌లో ప్రకటించింది. ఈ పార్కుల్లో అత్యాధునిక సమీకృత వసతులు, రవాణా నష్టాల నివారణకు ప్రత్యేక చర్యలు ఉంటాయి. ‘‘మెగా ఇన్వెస్ట్‌మెంట్‌ టెక్స్‌టైల్‌ పార్క్స్‌ (మిత్ర) భారతీయ వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి కీలకం.


వంటగ్యాస్‌ 
కేంద్ర బడ్జెట్లో ఈ పథకానికి రూ.25వేల కోట్ల మేర నిధుల కోత పడటంతో.. ఈ భారం వినియోగదారుడే మోయాల్సి వస్తోంది. గతేడాది కిరోసిన్‌పై రూ.2,982 కోట్లు రాయితీ ఇవ్వగా.. ఈ ఏడాది కేటాయింపులే లేవు. వంటగ్యాస్‌పైనా గతేడాదితో పోలిస్తే రూ.22వేల కోట్లను తగ్గించారు. 


ఇతర దేశాలకు
పొరుగు దేశాలతో పాటు ఆఫ్రికా, లాటిన్‌  అమెరికా దేశాలకు రూ.7,100 కోట్లు ఇవ్వనున్నారు. ఇందులో భూటాన్‌కు రూ.3,004 కోట్లు కేటాయించారు. ఇరాన్‌లో చాబహార్‌ నౌకాశ్రయానికి రూ.100 కోట్లు ఇచ్చారు. 


మరిన్ని విశేషాలు
* ఎయిర్‌ ఇండియాలో పెట్టుబడుల విక్రయాన్ని 2021-22లో పూర్తి చేయనున్నట్లు ఆర్థిక మంత్రి వెల్లడించారు. దీని కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక సంస్థ (ఎస్‌పీవీ), ఎయిర్‌ ఇండియా అస్సెట్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌కు రూ.2,268 కోట్లు కేటాయించనున్నట్లు తెలిపారు. 


74% ఎఫ్‌డీఐకి అనుమతి 
దేశీయ బీమా కంపెనీల్లో ప్రస్తుతం 49 శాతం విదేశీ పెట్టుబడికి అనుమతి ఉంది. దీన్ని 74 శాతానికి పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి బడ్జెట్‌లో ప్రకటించారు. బీమా కంపెనీల్లోని బోర్డు సభ్యులు, కీలక ఉద్యోగుల్లో ఎక్కువ మంది భారతీయులై ఉండాలని నిర్దేశించారు. బీమా కంపెనీల లాభాల్లో నిర్దేశించిన శాతాన్ని జనరల్‌ రిజర్వుకు మళ్లించాలని స్పష్టం చేశారు. దేశంలో బీమా విస్తృతి జీడీపీలో 3.6 శాతమే. ప్రపంచ సగటు 7.13 శాతం. సాధారణ బీమాలో  బీమా విస్తృతి ప్రపంచ సగటు 2.88 శాతం కాగా, మనదేశంలో జీడీపీలో 0.94 శాతంగా ఉంది. ప్రస్తుతం ప్రైవేటు రంగంలో 23 జీవిత బీమా కంపెనీలు, 28 సాధారణ బీమా/ ఆరోగ్య బీమా కంపెనీలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ప్రభుత్వ రంగంలో ఎల్‌ఐసీ ఒక్కటే జీవిత బీమా సంస్థ. ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీలు 4 ఉన్నాయి. 


వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఎల్‌ఐసీ ఐపీఓ 
ఎల్‌ఐసీ తొలి పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ) 2021-22లో కార్యరూపం దాల్చనుంది. స్టాక్‌ఎక్స్ఛేంజీలో నమోదు కావడం వల్ల క్రమశిక్షణ పెరగడంతో పాటు, ఎల్‌ఐసీ సంపద సృష్టి ప్రక్రియలో రిటైల్‌ మదుపరులు భాగస్వాములు అయ్యే అవకాశం కలుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఎల్‌ఐసీలో ప్రస్తుతం నూరుశాతం వాటా కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది. ఐపీఓ ద్వారా ప్రభుత్వం 10 శాతం వాటా విక్రయించే అవకాశం కనిపిస్తోంది. 


విమానాల లీజింగ్‌ కంపెనీలకు పన్ను మినహాయింపు 
విమానాల లీజింగ్‌ కంపెనీలకు పన్ను మినహాయింపు ఇవ్వాలని 2021-22 బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రస్తుతం విమాన లీజింగ్‌ కంపెనీల కార్యకలాపాలు ఎక్కువగా ఐర్లాండ్, దుబాయ్, హాంకాంగ్‌ కేంద్రంగా సాగుతున్నాయి. ఐర్లాండులో కార్పొరేట్‌ పన్ను 12.5 శాతం. ఇది ప్రపంచంలోనే తక్కువ. అందువల్లే ప్రపంచవ్యాప్తంగా రూ.75000 కోట్ల (1000 కోట్ల డాలర్ల) ఆస్తులు కలిగిన విమాన లీజింగ్‌ కంపెనీలు 8 ఉండగా, ఇవన్నీ ఐర్లాండ్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నాయి. కాకపోతే మూలధన లాభాలపై మాత్రం 33 శాతం పన్నును ఐర్లాండ్‌ వసూలు చేస్తుంది. ఇటీవల కాలంలో చైనా కంపెనీలు కూడా విమానాల లీజు వ్యాపారాన్ని పెంచుతున్నాయి. మనదేశం నుంచే 900 విమానాల లీజుకు ఆర్డర్లు ఉన్నట్లు సమాచారం. అందుకే విమానాల లీజింగ్‌ కార్యకలాపాలు దేశీయంగా చేపట్టేలా చూడాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. 


ప్రభుత్వరంగ బ్యాంకులకు
నియంత్రణ సంస్థల నిబంధనలు చేరుకునేందుకు వీలుగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోకి (పీఎస్‌బీలు) 2021-22లో మరో రూ.20,000 కోట్ల నిధుల్ని చొప్పించనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ (2020-21) మూలధన పునర్‌వ్యవస్థీకరణ కోసం ప్రభుత్వం రూ.20,000 కోట్ల కేటాయింపులు చేసిందని తెలిపారు. ఆర్థిక వ్యవస్థకు బలమైన ప్రేరణ కోసం 2019-20లో ప్రభుత్వం బ్యాంకులకు రూ.70,000 కోట్ల మూలధన సాయం చేసిన సంగతి తెలిసిందే.  2020 సెప్టెంబరులో పీఎస్‌బీలకు రూ.20,000 కోట్ల మూలధన సాయం చేసేందుకు పార్లమెంట్‌ ఆమోదం తెలిపింది. ఇందులో రూ.5,500 కోట్లు పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌కు గత నవంబరులో అందజేసింది. 2017-18లో పీఎస్‌బీలకు ప్రభుత్వం రూ.90,000 కోట్ల మూలధన సాయం చేసింది. 2018-19లో ఏకంగా రూ.1.06 లక్షల కోట్ల మూలధన సాయం ప్రకటించింది. 


కొన్ని వాహన విడిభాగాలపై 15% కస్టమ్స్‌ పన్ను
దేశీయ తయారీకి మద్దతు ఇచ్చే లక్ష్యంతో వాహనాల్లో వినియోగించే కొన్ని విడిభాగాలపై కస్టమ్స్‌ సుంకాన్ని ప్రభుత్వం పెంచింది. ఇగ్నిషన్‌ వైరింగ్‌ సెట్లు, సేఫ్టీ గ్లాస్, సిగ్నలింగ్‌ ఎక్విప్‌మెంట్‌ సహా వివిధ విడిభాగాలపై సుంకాన్ని7.5-10 శాతం నుంచి  15 శాతానికి పెంచారు. నేటి  నుంచి ఇవి అమల్లోకి వస్తాయి.  అగ్రిసెస్‌ సైతం ఉంటుంది.


సౌర ఇన్వర్టర్లు, దీపాలపై దిగుమతి సుంకం పెంపు
సౌర ఇన్వర్టర్లు, లాంతర్లు లేదా దీపాలపై దిగుమతి సుంకాన్ని ప్రభుత్వం పెంచనుంది. అయితే సౌర పరికరాలపై సాధారణ కస్టమ్‌ సుంకం (బీసీడీ) విధించాలన్న ప్రణాళికను వెనక్కి తీసుకుంది. సోలార్‌ ఇన్వర్టర్లపై కస్టమ్స్‌ సుంకాన్ని 5% నుంచి 20 శాతానికి, సోలార్‌ లాంతర్లపై సుంకాన్ని 5% నుంచి 15 శాతానికి పెంచనున్నారు.


పాత వాహనాలకు మంగళం
ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్న స్వచ్ఛంద వాహన తుక్కు విధానాన్ని సోమవారం బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు.దీని కింద.. 20 ఏళ్ల తర్వాత వ్యక్తిగత వాహనాలు; 15 ఏళ్ల తర్వాత వాణిజ్య వాహనాలకు సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తారు. ఈ విధానం వల్ల ఇంధన సామర్థ్యం మెరుగు పడటంతో పాటు పర్యావరణహిత వాహనాలకు ప్రోత్సాహం లభిస్తుందని సీతారామన్‌ అన్నారు. 


రూ.12 లక్షల కోట్ల అప్పు తప్పదు
వచ్చే ఆర్థిక సంవత్సరం(2021-22)లో ప్రభుత్వం రూ.12.05 లక్షల కోట్లు అప్పు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సర అంచనా రూ.12.80లక్షల కోట్ల కంటే ఇది తక్కువని వివరించారు. సవరించిన అంచనాల మేరకు ఈ ఏడాది రూ.12.8లక్షల కోట్లు రుణం పొందామని ఇది బడ్జెట్‌ అంచనా (రూ.7.8 లక్షల కోట్లు) కంటే 64శాతం అధికమన్నారు. 2021-22 జీడీపీలో ద్రవ్యలోటు 6.8% నమోదు కావచ్చని కేంద్రం అంచనా! 2025-26 నాటికల్లా లోటును 4.5 శాతానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామని నిర్మల తెలిపారు.

తెలంగాణలోని వివిధ సంస్థలకు బడ్జెట్‌లో కేటాయింపులు

‣ ఐఐటీ హైదరాబాద్‌కు ఈఏపీ కాంపోనెంట్‌ కింద రూ.150 కోట్లు.
‣ దేశవ్యాప్తంగా ఉన్న డైరెక్టరేట్‌ ఆఫ్‌ హిందీకి రూ.30 కోట్లు కేటాయించారు. ఇందులో హైదరాబాద్‌ కేంద్రమూ ఉంది.
‣ హైదరాబాద్‌తో సహా దేశవ్యాప్తంగా సీడాక్‌లకు కలిపి రూ.200 కోట్లు
‣  హైదరాబాద్‌తో సహా దేశవ్యాప్తంగా ఉన్న సెంటర్‌ ఫర్‌ మెటీరియల్స్‌ ఫర్‌ ఎలక్టాన్రిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీకి రూ.80 కోట్లు.
‣  నేషనల్‌ ఫిషరీస్‌ బోర్డుకు రూ.23.84 కోట్లు.
‣ హైదరాబాద్, గోవా విముక్తి పోరాటంలో పాల్గొన్న స్వాతంత్ర సమరయోధులు, అండమాన్‌ రాజకీయ ఖైదీలకు పింఛను కోసం రూ.775.31 కోట్లు.
‣ హైదరాబాద్‌ పోలీస్‌ అకాడమీ సహా దేశంలోని వివిధ పోలీసు శిక్షణ కేంద్రాలకు రూ.300.72 కోట్లు.
‣  నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పంచాయతీరాజ్‌కు రూ.124 కోట్లు.
‣ డీఎన్‌ఏ ఫింగర్‌ప్రింటింగ్‌ డయాగ్నస్టిక్స్‌ కేంద్రం, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అనిమల్‌ బయోటెక్నాలజీతో పాటు దేశంలోని స్వయంప్రతిపత్తి సంస్థలకు రూ.806 కోట్లు.
‣ సాలార్‌జంగ్‌తో సహా దేశంలోని వివిధ మ్యూజియాలకు రూ.293 కోట్లు కేటాయించారు.
‣  సింగరేణి బొగ్గు గనులకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.2,500 కోట్లు కేటాయించింది. గత ఏడాది బడ్జెట్‌ కేటాయింపుల కంటే ఇది రూ.200 కోట్లు అధికం. 

ఆంధ్రప్రదేశ్‌ 

ప్రత్యేక హోదా ప్రస్తావన లేదు. రైల్వే జోన్‌ మాటే ఎత్తలేదు. కొత్తగా ఒక్క వరమూ ఇవ్వలేదు. కనీసం విభజన హామీల గురించి మాట్లాడలేదు. బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మరోసారి మొండిచెయ్యి చూపింది. ఇప్పటికే అన్ని వనరులూ ఉండి ఆర్థిక పరిపుష్టి కలిగిన కేరళ, కర్ణాటక, మహారాష్ట్రవంటి రాష్ట్రాలపై కేంద్రం అపార ప్రేమను చూపింది. రాష్ట్ర విభజనతో కనీస వనరులు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాల్లేక.. ఆర్థిక లోటు, ప్రకృతి విపత్తులతో కునారిల్లుతున్న ఆంధ్రప్రదేశ్‌పై మాత్రం మరోసారి అంతులేని నిర్లక్ష్యాన్ని కనబరిచింది. వరాలకు నోచుకోకపోయినా.. కనీస విదిలింపులూ లేవు. కేంద్ర బడ్జెట్‌పై కోటి ఆశలు పెట్టుకున్న రాష్ట్ర వాసులకు మళ్లీ తీవ్ర నిరాశే ఎదురైంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చేసిన మొత్తం బడ్జెట్‌ ప్రసంగంలో.. ఏపీ నుంచి 3 పేర్లు మాత్రమే వినిపించాయి. అవి చిత్తూరు, విజయవాడ, విశాఖపట్నం. అలాగని ఆ 3 ప్రాంతాలకు భారీ పరిశ్రమలో, ప్రాజెక్టులో ప్రకటించారనుకుంటే పొరపాటే! విశాఖలో మేజర్‌ ఫిషింగ్‌ హార్బర్‌, ఖరగ్‌పూర్‌-విజయవాడ, ఇటార్సీ-విజయవాడ మధ్య ప్రత్యేక సరకు రవాణా రైల్వే కారిడార్లు, చిత్తూరు-తాచ్చూరు జాతీయ రహదారి ప్రాజెక్టులను ఆర్థిక మంత్రి ప్రకటించారు. జాతీయ రహదారి ప్రాజెక్టుల వల్ల ప్రత్యేకంగా ఏపీకి ఒరిగేదేమీ లేదు.

‣  రైల్వే రవాణా కారిడార్లు కూడా ఆంధ్రప్రదేశ్‌పై ప్రేమతో ప్రకటించినవి కావు! ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ ప్రధాన రాష్ట్రం కావడం, తీరం వెంట కొత్త ఓడరేవులు అభివృద్ధి చెందనుండటం, విజయవాడ జంక్షన్‌ మధ్యలో ఉండటంతో ఉత్తర, దక్షిణ భారతాల అనుసంధానంలో భాగంగానే ఆ రైల్వే రవాణా కారిడార్లను కేంద్రం ప్రకటించింది. ఉద్దేశమేదైనా.. మన రాష్ట్రంలోని ఓడరేవులకు, సరకు రవాణాకు అవి కొంత ఆలంబనగా నిలిచే అవకాశం ఉంది. వాటిని కూడా ఏళ్ల తరబడి ప్రతిపాదనల దశలోనే నాన్చకుండా వేగంగా పూర్తి చేస్తేనే ప్రయోజనం. ఇవి తప్ప.. ఈ బడ్జెట్‌లో మరెక్కడా ఆంధ్రప్రదేశ్‌ గురించి ఆర్థిక మంత్రి ప్రస్తావించలేదు. దక్షిణ భారతదేశంలో ఇప్పటికే ఎంతో అభివృద్ధి చెందిన బెంగళూరు, చెన్నై, కోచితోపాటు మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌, నాసిక్‌లలోని మెట్రోరైలు ప్రాజెక్టులకు భారీ కేటాయింపులు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని మెట్రోరైలు ప్రాజెక్టులను మాత్రం విస్మరించారు. విజయవాడ మెట్రో ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వమే అటకెక్కించింది. ఇక కేంద్రం మనకెందుకు అనుకుందో ఏమో? అలాగని కనీసం విశాఖ మెట్రో ప్రాజెక్టునూ ప్రస్తావించలేదు. ద్వితీయశ్రేణి నగరాలకు కొత్తగా మెట్రోలైట్‌, మెట్రోనియో ప్రాజెక్టులు వస్తాయని చెప్పారు. వాటిలోనైనా విజయవాడ, విశాఖ మెట్రో ప్రాజెక్టులకు చోటు ఉంటుందా? అన్న స్పష్టత లేదు. కేంద్రాన్ని ఎన్నడూ పల్లెత్తు మాట అనేందుకు ఇష్టపడని వైకాపా నాయకులు కూడా ఈ బడ్జెట్‌ను విమర్శించడం.. రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి నిదర్శనం!
విభజన హామీలు విస్మరించారు
‣  ఏటా బడ్జెట్లు వస్తున్నాయి.. పోతున్నాయి. కొత్త వరాల్లేకపోయినా విభజన హామీలను కేంద్రం నెరవేర్చడం లేదు. అసలే ఆర్థిక కష్టాలు, ఆపై తుపాన్లతో నష్టపోతున్న రాష్ట్రాన్ని ఆదుకుందామన్న ధ్యాస లేదు. ఈసారైనా కేంద్రం ప్రత్యేక హోదానిస్తే రాష్ట్రానికి ఆర్థికంగా చేయూత లభిస్తుందని.. పరిశ్రమలు, ఉద్యోగాలొస్తాయని రాష్ట్రవాసులు ఆశించారు. అది నెరవేరలేదు. విశాఖ కేంద్రంగా రైల్వేజోన్‌కు పోరాడుతున్న వారికి మళ్లీ కంఠశోషే మిగిలినట్టు కనిపిస్తోంది.  త్వరలో రైల్వేబోర్డు విడుదల చేసే ‘పింక్‌ బుక్‌’లోనైనా జోన్‌ ప్రస్తావన ఉంటుందేమోనన్న ఆశ మిణుకుమిణుకుమంటోంది. నాబార్డుతో సంబంధం లేకుండా పోలవరానికి కేంద్రమే నేరుగా నిధులనిచ్చి ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయాలన్న విజ్ఞప్తులనూ కేంద్రం పట్టించుకోలేదు. విభజించి ఏడున్నరేళ్లవుతున్నా.. 2014-15 నాటికి ఇవ్వాల్సిన రెవెన్యూ లోటు భర్తీ ఇప్పటికీ లేదు. విభజన హామీల్లో భాగంగా రాష్ట్రానికి మంజూరుచేసిన కేంద్రీయ విశ్వవిద్యాలయం అనంతపురంలోని జేఎన్‌టీయూలో ఒక భవనంలో నడుస్తోంది. దానికి 2020-21 బడ్జెట్‌లో రూ.60.35 కోట్లు కేటాయించిన కేంద్రం.. సవరించిన అంచనాల్లో మాత్రం రూ.4.80 కోట్లే చూపించింది.

‣  ఈ బడ్జెట్‌లో మళ్లీ రూ.60.35 కోట్లు ప్రతిపాదించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ గిరిజన వర్సిటీలకు కలిపి 2020-21 బడ్జెట్‌లో రూ.53.80 కోట్లు కేటాయించిన కేంద్రం.. సవరించిన అంచనాల్లో దాన్ని రూ.4కోట్లకే పరిమితం చేసింది. ఈ బడ్జెట్‌లో మళ్లీ రూ.53.80 కోట్లు ప్రతిపాదించింది. కంటితుడుపు కేటాయింపులు తప్ప ఖర్చు చేయడం లేదనడానికి ఇదే నిదర్శనం. వెనకబడిన జిల్లాల అభివృద్ధికి నిధుల కేటాయింపు గురించీ ఈ బడ్జెట్‌లో స్పష్టత లేదు. విశాఖ-చెన్నై, చెన్నై-బెంగళూరు పారిశ్రామిక నడవాల్లో పనులు వేగం పుంజుకునే దిశగా ఎలాంటి చర్యలనూ, నిధులనూ ప్రకటించలేదు. రాష్ట్రానికి అంతర్జాతీయ విమాన సర్వీసులను పెంచే దిశగా చర్యలూ లేవు.  రాష్ట్రంలో ఎంతగానో ఎదురుచూస్తున్న బల్క్‌డ్రగ్‌ పార్క్‌, ఇతర పరిశ్రమల గురించిన ప్రస్తావన లేదు. ఒక్క కేంద్ర ప్రభుత్వ సంస్థనుగానీ, విద్యాసంస్థనుగానీ రాష్ట్రానికి ప్రకటించలేదు.

బ‌డ్జెట్  ముఖ్యాంశాల పీడీఎఫ్‌
బ‌డ్జెట్ ప్ర‌సంగం పీడీఫ్‌

Posted Date: 01-02-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం