• facebook
  • whatsapp
  • telegram

కేంద్ర ఆర్థిక సర్వే 2020-21

* ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో తిరోగమనం * వృద్ధి రేటు  -7.7 శాతం
* రానున్న సంవత్సరం ఆశాజనకం    ప్రగతి 11 శాతం ఉండవచ్చని అంచనా
* కష్టకాలంలో అండగా ఉన్నది రైతులే
బడ్జెజ్‌ సమావేశాల్లో భాగంగా 2020-21 ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ జ‌న‌వ‌రి 29న లోక్‌సభలో ప్రవేశపెట్టారు. పార్లమెంట్‌ ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రసంగం పూర్తయిన తర్వాత ఆమె ఆర్థిక సర్వేను సమర్పించారు. 
కేంద్ర బడ్జెట్‌ సమర్పణకు ముందు గతేడాదికి సంబంధించిన ఆర్థిక సర్వేను పార్లమెంట్‌ ఉభయసభల ముందు ప్రవేశపెట్టడం ఆనవాయితీ. ప్రధాన ఆర్థిక సలహాదారు కేవీ సుబ్రమణియన్‌ నేతృత్వంలోని బృందం ఈ ఆర్థిక సర్వేను రూపొందించింది. గతేడాది పలు రంగాల ఆర్థిక స్థితిగతులను ఇందులో వివరించారు. దీంతో పాటు ఆర్థిక వృద్ధికి చేపట్టాల్సిన సంస్కరణలను పేర్కొన్నారు. 

ఏటా కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టే ముందు రోజు ‘ఆర్థిక సర్వే’ నివేదిక విడుదల అవుతుంది. అయితే, ఈ సారి రెండు రోజుల ముందుగానే కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ఆర్థిక సర్వే 2020-21 నివేదికను విడుదల చేశారు. దేశ ఆర్థిక స్థితిగతులను కళ్లకు కట్టిచూపించే ఈ నివేదిక ఆధారంగానే బడ్జెట్ రూపకల్పన జరుగుతుంది. అందుకే ఆర్థిక మంత్రిత్వ శాఖ రూపొందించే ఈ ‘ఆర్థిక సర్వే’కు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది.
కరోనా కారణంగా అతలాకుతలం అయిన దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకుంటుందని ఆర్థిక సర్వే విశ్వాసం వ్యక్తంచేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో వి-షేప్‌ రికవరీతో 11 శాతం జీడీపీ వృద్ధి రేటు నమోదు చేస్తుందని అంచనావేసింది. మార్చి 31తో ముగస్తున్న ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2020-21) వృద్ధిరేటు 7.7 (మైనస్‌) శాతం మేర క్షీణిస్తుందని పేర్కొంది. 2020-21 సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సర్వేను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌లో ఇవాళ ప్రవేశ పెట్టారు. అనంతరం ముఖ్య ఆర్థిక సలహాదారు డాక్టర్‌ కేవీ సుబ్రణియన్‌ మీడియాతో సర్వే వివరాలను వెల్లడించారు. ఈ ఆర్థిక సర్వేను కొవిడ్‌ వారియర్స్‌కు అంకితమిస్తున్నట్లు సుబ్రమణియన్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆర్థిక సర్వేకు సంబంధించిన ప్రత్యేక యాప్‌ను విడుదల చేశారు. ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటే మళ్లీ కోలుకుంటుంది గానీ, ప్రజల ప్రాణాలు కోల్పోతే తిరిగి తీసుకురాలేమన్న ఉద్దేశంతో ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించినట్లు సర్వే అభిప్రాయపడింది.
ముఖ్యాంశాలు
* ప్రభుత్వం తీసుకొచ్చిన లాక్‌డౌన్‌ వల్ల 37 లక్షల కేసులు తగ్గించగలిగామని, లక్ష ప్రాణాలను కాపాడగలిగామని సర్వే పేర్కొంది. 500 కేసులు కూడా నమోదు కాకుండానే లాక్‌డౌన్‌ ప్రకటించిన తొలి దేశమని తెలిపింది.
కరోనా మహమ్మారి వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నా.. తగినన్ని ఫారెక్స్‌ నిల్వలు, తయారీ రంగం నుంచి సానుకూల సంకేతాలు, దృఢమైన కరెంట్‌ ఖాతా వంటివి వి-షేప్‌ రికవరీకి దోహదం చేశాయని ఆర్థిక సర్వే అభిప్రాయపడింది.
యూపీ, గుజరాత్‌, బిహార్‌ రాష్ట్రాలు కరోనా కేసులు పెరగకుండా జాగ్రత్తగా వ్యవహరించాయి. కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు ఎక్కువ మంది ప్రాణాలను కాపాడాయని సర్వే అభిప్రాయపడింది. కేసులు, మరణాలు నివారించడంతో మహారాష్ట్ర విఫలమైంది.
కొవిడ్‌ సమయంలో కేవలం వ్యవసాయ రంగం మాత్రమే సానుకూల వృద్ధిని నమోదు చేసింది. లాక్‌డౌన్‌లో తయారీ, నిర్మాణ రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
* ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను ఆర్థిక సర్వే సమర్థించింది. ఈ చట్టాల వల్ల దీర్ఘకాలంలో చిన్న, మధ్య తరహా రైతుల ఆదాయం పెరుగుతుందని పేర్కొంది. ఎక్కడైనా విక్రయించుకునే స్వేచ్ఛ వల్ల రైతులు తమ ఉత్పత్తులకు అధిక ధర పొందుతారని తెలిపింది. మార్కెట్‌ యార్డుల్లో గంటలకొద్దీ వేచి చూడాల్సిన పరిస్థితులు ఉండబోవని పేర్కొంది.
* దేశ సార్వభౌమ క్రెడిట్‌ రేటింగ్‌ విషయంలో విదేశీ రేటింగ్‌ సంస్థల వ్యవహారంపై సర్వే అసంతృప్తి వ్యక్తంచేసింది. రేటింగ్‌ ఏజెన్సీలు పారదర్శకంగా వ్యవహరించాలని అభిప్రాయపడింది. ఆర్థిక వ్యవస్థలకు అనుగుణంగా మదింపు చేసే విధానం ఉండాలని పేర్కొంది.
* అందుబాటులో ధరల్లోని ఇల్లు అమ్మకాలు జులై నుంచి పుంజుకున్నాయని సర్వే పేర్కొంది. రియల్‌ ఎస్టేట్‌ రంగం కోలుకుందనడానికి ఇదే నిదర్శనమని అభిప్రాయపడింది.
* 2020 ఓ చేదు జ్ఞాపకంగా మిగిలిపోనుంది. మార్చి 31న ముగియనున్న 2020-21 ఆర్థిక సంవత్సరంలో దేశం తిరోగమనంలో పయనించింది. వృద్ధిరేటు మైనస్‌ 7.7 శాతంగా నమోదయ్యింది. పరిస్థితులు చక్కదిద్దుకొని రానున్న ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 11 శాతంగా ఉండనుందని అంచనా. ఆర్థిక వృద్ధి ఆంగ్ల అక్షరం ‘జు’ రూపంలో పురోగమిస్తోంది. ఒడిదొడుకుల్లోనూ దేశానికి అండగా నిలిచింది అన్నదాతే. ఆర్థిక రంగం మరీ కునారిల్లకుండా ఆదుకున్నది వ్యవసాయ రంగమే. రానున్న సంవత్సరమూ దీనిదే కీలక పాత్ర. అసలు 2020 ప్రారంభమే సవ్యంగా సాగలేదు. 2019-20లో వృద్ధి రేటు 4.2 శాతం ఉంటుందని అంచనా వేశారు. అదే బాగా తక్కువ అనుకుంటే తీరా 4 శాతానికే పరిమితమయ్యింది. దెబ్బమీది దెబ్బగా కరోనా రావడంతో 2020-21లో పరిస్థితి దారుణంగా మారి తిరోగమనం నమోదయింది.
'V' రూపంలో వృద్ధి గ్రాఫ్‌
లాక్‌డౌన్‌, ఇతర కారణాలతో 2020-21 మొదటి త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ ఆగినంత పనయ్యింది. తొలి వృద్ధి రేటు మైనస్‌ 23.9%కి పడిపోయింది. జులై నుంచి పరిస్థితులు కాస్త మెరుగుపడడంతో రెండో త్రైమాసికానికల్లా తిరోగమనం -7.5%కే పరిమితమైంది. అప్పటి నుంచి ఈ-వే బిల్లులు, రైళ్లలో సరకు రవాణా, జీఎస్‌టీ వసూళ్లు, విద్యుత్తు వినియోగం మెరుగు పడ్డాయి. ఈ రెండు త్రైమాసికాల్లో వ్యవసాయ రంగం 3.4% మేర వృద్ధిరేటు నమోదు చేసింది. వస్తు తయారీ రంగం నిలబడటం, గ్రామీణ ప్రాంతాల్లో వస్తువుల డిమాండ్‌ పెరగడం ఆర్థిక వ్యవస్థకు అండగా నిలిచాయి. దీంతో ఆర్థిక రంగం వృద్ధి గ్రాఫ్‌  ‘v’ రూపంలో కనిపించింది.
వివిధ రంగాల స్థితిగతులను ఆర్థిక సర్వే సమగ్రంగా వివరించింది. వ్యవసాయ చట్టాలను సమర్థించడంతో పాటు, రాయితీలను హేతుబద్ధం చేయాలని సిఫార్సు చేసింది. ఆ వివరాలు...
వ్యవసాయం... ఆధునిక వ్యాపారం
వ్యవసాయ చట్టాలు ప్రాథమికంగా చిన్న, మధ్య తరహా రైతుల ప్రగతి కోసం ఉద్దేశించినవి. మార్కెట్‌ స్వేచ్ఛ లభించి నూతన శకం ఆరంభమవుతుంది. వ్యవసాయాన్ని గ్రామీణ ఉపాధి రంగంగా కాకుండా ఆధునిక వ్యాపార సంస్థగా చూడాల్సిన సమయం వచ్చింది. అందుకే సుస్థిర ప్రగతి ఉండేలా ప్రభుత్వం అత్యవసర సంస్కరణలు చేపట్టాల్సి ఉంది.
ఉల్లి నిల్వకు ఆధునిక పద్ధతులు
ఉల్లి ధరలు ప్రతి ఏటా ఆగస్టు-నవంబరు మధ్య విపరీతంగా పెరుగుతున్నాయి. వీటి నిల్వకు ఆధునిక పద్ధతులను అనుసరించాలి. బాగా ఎండబెట్టి నిల్వ చేసే విధంగా ఏర్పాట్లు చేయాలి. స్టాకుపైనా తగిన విధానం ఉండాలి.
రేషన్‌ సరకుల ధరలు పెంచాలి
రేషన్‌ సరకులు ఇచ్చేందుకు చేస్తున్న వ్యయం భరింపరానిదిగా మారినందున వాటి ధరలు పెంచాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం కిలో బియ్యాన్ని రూ.3, గోధుమలను రూ.2, చిరుధాన్యాలను రూ.1కే సరఫరా చేస్తోంది. కొన్ని వర్గాలకు ఉచితంగా ఇస్తోంది. ఖర్చులు పెరుగుతున్నా 2013 నుంచి వీటి ధరల్లో మార్పు చేయలేదు. సబ్సిడీ భారాన్ని తగ్గించాలి.
అవసరాలు తీరుతున్నా అసమానతలు
కనీస అవసరాలైన ఆహారం, ఇళ్లు, విద్యుత్తు వంటి 26 అంశాలు అందుతున్నా ప్రజల్లో అసమానతలు పెరిగిపోతున్నాయి. అర్హులకే పథకాలు చేరితే ఈ సమస్యను అధిగమించవచ్చు. కనీస సౌకర్యాలు ఉన్నచోట్ల విద్యా వ్యవస్థ కూడా మెరుగ్గా ఉంటోంది.
‘లాక్‌డౌన్‌ డివిడెండ్‌’
కరోనాపై సకాలంలో స్పందించడం ద్వారా అది మరింతగా విస్తరించకుండా అరికట్టాం. తద్వారా లక్ష ప్రాణాలను కాపాడాం. మహమ్మారి వచ్చిన మొదట్లోనే లాక్‌డౌన్‌ విధించడం కారణంగా జీవితాలు, జీవనోపాధిని కాపాడాం. దీర్ఘకాలిక లాభం కోసం జనం స్వల్పకాలిక బాధను అనుభవించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సామాజిక సేవలకు అధికంగా నిధులు ఖర్చు చేశాయి. ఇది లాక్‌డౌన్‌ వల్ల వచ్చిన డివిడెండ్‌లాంటిది.
బ్రాడ్‌ బ్యాండ్‌ విస్తరణతో తగ్గిన ఛార్జీలు
ఇంటర్నెట్‌, బ్రాడ్‌బ్యాండ్‌ విస్తరణతో ఛార్జీలు తగ్గి మరింత మందికి అందుబాటులోకి వచ్చాయి. ప్రతి వినియోగదారుడి వైర్‌లెస్‌ డాటా వినియోగం 2019 మార్చిలో సగటున 9.1 జీబీ ఉండగా, 2020 జూన్‌లో అది 12.2 జీబీకి పెరిగింది.
వైద్యంపై ప్రభుత్వ వ్యయం పెరగాలి
వైద్య రంగంపై ప్రభుత్వ వ్యయం పెరిగితే తద్వారా ప్రజలపై భారం తగ్గుతుంది. ప్రస్తుతం జీడీపీలో కేవలం 1 శాతం మేర వైద్య రంగంపై ఖర్చు చేస్తున్నారు. దానిని 2.5 నుంచి 3 శాతం వరకు పెంచితే వైద్యం కోసం ప్రజలు చేసే వ్యయం 30 నుంచి 65 శాతం వరకు తగ్గుతుంది. ఆరోగ్య సౌకర్యాల అందుబాటులో మన దేశం ప్రపంచంలో 145వ స్థానం (మొత్తం 180 దేశాలకుగాను)లో ఉంది. ప్రధానమంత్రి జన్‌ ఆరోగ్య యోజనను ఉపయోగించుకున్న రాష్ట్రాలన్నీ లబ్ధి పొందాయి. దీన్ని అమలుచేయని రాష్ట్రాలు ఆరోగ్య బీమా ప్రయోజనాలను పొందలేకపోయాయి.
ఆన్‌లైన్‌ విద్య మంచిదే
కరోనా తెచ్చిన మరో పరిణామం ఆన్‌లైన్‌ విద్య. ఇది మంచిదే. దీన్ని సమర్థంగా ఉపయోగించుకుంటే విద్యా రంగంలో అసమానతలు తగ్గుతాయి. గ్రామీణ-పట్టణ విద్యార్థుల మధ్య పెద్దగా తేడాలు కనిపించవు. ప్రాథమిక పాఠశాల స్థాయిలో అక్షరాస్యత 96 శాతం ఉంది. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో అక్షరాస్యత శాతం జాతీయ సగటు కన్నా తక్కువగా ఉంది. విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచేందుకు 9-12 తరగతుల్లో క్రమేణా వృత్తి విద్య కోర్సులను ప్రారంభించాలి.
నవ్య ఆవిష్కరణల్లో 48వ స్థానం
నూతన ఆవిష్కరణల సూచీల్లో భారత్‌కు 48వ స్థానం దక్కింది. 2015లో 81వ ర్యాంకు ఉండగా క్రమేణా మెరుగయింది. ప్రయివేటు రంగంలో మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉంది.
మహిళలపై వివక్ష తగదు
పని స్థలాల్లో మహిళలపై వివక్ష ఉండకూడదు. జీతాలు, పదోన్నతులు, ప్రోత్సాహకాలు, సామాజిక భద్రతలో సమాన అవకాశాలు కల్పించాలి. పురుషుల్లో 80.3 శాతం మంది ఉద్యోగం చేస్తుండగా, స్త్రీలలో ఆ సంఖ్య కేవలం 26.5 శాతమే. మరింత మంది మహిళలు కార్మికులుగా చేరేందుకు వ్యవస్థాగతంగా ప్రోత్సహించాలి.  

విద్యుత్తులో 20 శాతం వృథా
ఉత్పాదన అవుతున్న విద్యుత్తులో 20 శాతం పంపిణీ, సరఫరా సమయంలో వృథా అవుతోంది. నిర్ణీత వినియోగదారులు కాకుండా ఇతరులు అక్రమంగా వాడుకుంటున్నారు. ప్రపంచ గణాంకాలతో పోల్చితే ఇది చాలా ఎక్కువ. 2016లో 21.04% వరకు ఉన్న వృథా 2020లో 20.66 శాతానికి తగ్గినా, ఇంకా జరగాల్సిన కృషి ఎంతో ఉంది.
ఎన్నో ఏళ్ల ఆనవాయితీ..!
బడ్జెట్‌ కన్నా ముందురోజే ఆర్థిక సర్వేను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడం ఎన్నో ఏళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. మొట్టమొదటిసారిగా ఈ ఆర్థిక సర్వేను 1950-51 ఆర్థిక సంవత్సరంలో పార్లమెంటులో ప్రవేశపెట్టారు. 1964 వరకు సాధారణ బడ్జెట్‌తోనే కలిపి ప్రవేశపెట్టేవారు. కానీ, 1964 నుంచి దీన్ని బడ్జెట్‌ కన్నా ముందురోజే ప్రత్యేకంగా ప్రవేశపెడుతున్నారు. కేంద్ర బడ్జెట్‌లో కేటాయింపుల ప్రతిపాదనలను తేలికగా అర్థం చేసుకోవడం కోసమే ఆర్థిక సర్వేను ప్రత్యేకంగా విడుదల చేస్తున్నారు. రెండు విభాగాల్లో ప్రవేశపెట్టే ఈ సర్వేలో.. తొలి విభాగంలో భారత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రముఖంగా ప్రస్తావించగా, రెండో విభాగంలో మాత్రం గత ఏడాదికి సంబంధించిన దేశ ఆర్థిక పనితీరును సవివరంగా పొందుపరుస్తారు.

ఆర్థిక స‌ర్వే Volume -1 PDF 

ఆర్థిక స‌ర్వే  Volume -2 PDF 

ఆర్థిక సర్వే E-Book కోసం క్లిక్‌ చేయండి..

Posted Date: 30-01-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం