• facebook
  • whatsapp
  • telegram

ఆర్థిక పునరుజ్జీవమే అజెండా

నీతి ఆయోగ్‌ సమావేశం నేడు

నీతి ఆయోగ్‌ పాలక మండలి నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమవుతోంది. కరోనా వైరస్‌ తెచ్చిపెట్టిన అస్తవ్యస్తత కారణంగా ఏడాది ఆలస్యంగా జరుగుతున్న ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్‌ గవర్నర్లు, సీనియర్‌ మంత్రులు పాల్గొంటారు. ఆర్థిక వ్యవస్థకు పునరుత్తేజం కలిగించడం, కార్మిక సంస్కరణలు, ఆరోగ్య రంగ పటిష్ఠత, కొవిడ్‌ టీకాల కార్యక్రమాన్ని దేశ జనాభా అంతటికీ విస్తరించడం వంటి కీలకాంశాలపై ఈ సమావేశం చర్చించి నిర్ణయాలు తీసుకుంటుంది. కరోనా వైరస్‌ దెబ్బకు ఆర్థిక వ్యవస్థ కుదేలై, సంక్షోభం ఏ సమయంలో ఏ మలుపు తిరుగుతుందో తెలియని సందర్భంలో నీతి ఆయోగ్‌ సమావేశమవుతోంది. ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి, ఆ స్థానంలో ఏర్పరచిన నీతి ఆయోగ్‌ కొత్తగా ఏమైనా సాధించిందా అంటే, అది ఇంతవరకు మిశ్రమ ఫలితాలను మాత్రమే చూపగలిగిందని చెప్పుకోవలసి వస్తోంది. అత్యాధునిక సాంకేతికతలను ప్రోత్సహిస్తానని, ఎలెక్ట్రిక్‌ వాహనాల వాడకాన్ని సర్వవ్యాప్తం చేస్తానని ఆర్భాటంగా ప్రకటించినా; ఆచరణలో అవేవీ పెద్దగా నెరవేరినట్లు లేదు. పర్యావరణ హితకరమైన ప్రాజెక్టుల మదింపునకు ప్రస్తుతం అనుసరిస్తున్న పద్ధతులు పెద్దగా ప్రయోజనం అందించడం లేదు. కొత్త తరహా మదింపు, పెట్టుబడుల సమీకరణకు కార్యాచరణ చురుకందుకోవాలి.

తక్షణ కర్తవ్యం... అందరికీ టీకా!

భారత ఆర్థిక రథం జోరుగా పరుగెత్తాలంటే మొదట జనాభాలో ఎక్కువ మందికి కొవిడ్‌ టీకాలు వేయాలి. అది జరిగినప్పుడు సామూహిక వ్యాధి నిరోధక శక్తి (హెర్డ్‌ ఇమ్యూనిటీ) వృద్ధి చెంది, ప్రజలు ధైర్యంగా బయటికొస్తారు. పరిశ్రమలు, వ్యాపారాలు మళ్ళీ జోరందుకుని ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. వస్తుసేవలకు గిరాకీ అధికమై ఆర్థికాభివృద్ధి పుంజుకొంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం జులైకల్లా 25 కోట్లమంది ప్రజలకు కొవిడ్‌ టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకొంది. నెలకు అయిదు కోట్లమందికి టీకాలు వేస్తే కానీ, ఆ లక్ష్యాన్ని అందుకోలేం. పౌరులు, పరిశ్రమలు సులభంగా వ్యాపారాలు చేపట్టి ముందుకెళ్ళే వాతావరణాన్ని కల్పించడానికి ప్రభుత్వం, నీతి ఆయోగ్‌ కొన్ని చర్యలు తీసుకున్నా- వ్యాపార కార్యకలాపాలకు అడ్డుతగులుతున్న అంశాలు ఇంకా ఉన్నాయి. కొత్త ఆటంకాలు పుట్టుకొస్తున్నాయి. వీటిని తొలగించడంపై నీతి ఆయోగ్‌ సమావేశం దృష్టిపెట్టాలి. డిజిటల్‌ సంతకంతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడాన్ని ప్రభుత్వం, ప్రభుత్వ సంస్థలు తప్పనిసరి చేయాలి. దీనివల్ల ప్రజలు చిన్న పనికి, పెద్ద పనికి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ, ఈ-సేవ కేంద్రాల చుట్టూ తిరుగుతూ ‘స్కాన్‌’ చేసిన కాపీలను సమర్పించడానికి తంటాలు పడాల్సిన అగత్యం తప్పుతుంది. ఆధార్‌, మొబైల్‌ విస్తృతంగా అందుబాటులో ఉన్న ఈ రోజుల్లో ఆదాయపన్ను శాఖలా భారీగా ఆటొమేషన్‌ చేపడితే ప్రభుత్వ కార్యాలయాల్లో రద్దీ తగ్గి పనులు వేగవంతమవుతాయి. వ్యాపారం నిజంగా సులభతరమవుతుంది!

మౌలిక వసతులపై దృష్టి

నీతి ఆయోగ్‌ వేగంగా పరిష్కరించాల్సిన అంశాలు నాలుగు ఉన్నాయి. ప్రభుత్వ సిబ్బంది తమకు ఏ చట్టాలూ వర్తించవన్నట్లు ఇష్టారాజ్యంగా ప్రవర్తించే పద్ధతి పోవాలి. కొన్నిసార్లు సర్కారీ సిబ్బంది చట్టాలను అతిక్రమించడమూ చూస్తున్నాం. కేంద్ర, రాష్ట్ర, స్థానిక సంస్థల స్థాయుల్లో ఈ ధోరణి కనిపిస్తోంది. ఇది మన ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. అందుకే చట్టాలను తు.చ. తప్పకుండా పాటించడమే కాదు, చట్టాల స్ఫూర్తినీ దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాలని సుప్రీంకోర్టు ఉద్ఘాటించింది. రెండో అంశం- వివాదాల పరిష్కారానికి సమర్థ యంత్రాంగాన్ని సులభతర వాణిజ్యానికి ముఖ్యమైన ప్రాతిపదికగా ప్రభుత్వం గుర్తించాలి. వ్యక్తులు, వ్యాపార సంస్థలు వివాద పరిష్కారం కోసం మొదట ఆశ్రయించేది- దిగువ కోర్టులనే. కానీ, ప్రజల అవసరాలకు తగ్గట్టు కోర్టు గదులను, ఇతర మౌలిక వసతులను ప్రభుత్వం నిర్మించలేకపోయింది. ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్త చట్టాలను తీసుకొస్తున్నా దానికి తగ్గ స్థాయిలో మౌలిక వసతులను విస్తరించకపోవడం వల్ల మన న్యాయస్థానాలపై విపరీతంగా పని ఒత్తిడి పెరిగి, పెండింగ్‌ కేసులు పేరుకుపోతున్నాయి.

రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కొత్త కోర్టు గదులను, మౌలిక వసతులను నిర్మించడానికి, అదనపు సిబ్బంది నియామకానికి నీతి ఆయోగ్‌ ప్రత్యేక ప్యాకేజీ ప్రతిపాదించాలి. వ్యక్తులు, సంస్థలు కుదుర్చుకునే కాంట్రాక్టులను పకడ్బందీగా అమలుచేసేలా వ్యవస్థాగత ఏర్పాట్లు చేయడం సాటించాల్సిన మూడో కీలక అంశం. ఇది వ్యాపారాలకే కాదు, ప్రభుత్వానికీ వర్తిస్తుంది. నాలుగో అంశమేమంటే- ప్రభుత్వం ఏదైనా కాంట్రాక్టును గౌరవించలేకపోయినా, ఏదైనా కోర్టు కేసులో ఓడిపోయినా బాధ్యత నుంచి తప్పించుకోవడానికి చట్టాలనే మార్చేస్తోంది. లేదా కొత్త చట్టాలు చేస్తోంది. వొడాఫోన్‌, కెయిర్న్‌ ఎనర్జీ కేసుల్లో జరిగింది ఇదే. సుపరిపాలనకు ఏమాత్రం అనువుకాని ఈ ధోరణిని అరికట్టడానికి నీతిఆయోగ్‌ నడుం బిగించాలి. ప్రభుత్వమే కాంట్రాక్టు బాధ్యతలు నెరవేర్చకపోతే భారీ కార్పొరేట్‌ సంస్థలు పౌరులతో, చిన్న వ్యాపారులతో కుదుర్చుకున్న ఒప్పందాలను అమలు చేస్తాయా? ఈ వాతావరణంలో చిన్న మదుపరుల నుంచి పెట్టుబడులు సేకరించడం అసాధ్యమవుతుంది. ఈ పరిస్థితిని మారిస్తే కానీ ప్రైవేటీకరణ ఊపందుకోదు. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని నీతి ఆయోగ్‌ పటిష్ఠ కార్యాచరణతో ముందుకు రావాలి.
పెట్టుబడులు ఇనుమడించాలి

దేశ యువతకు వేగంగా భారీగా ఉపాధి అవకాశాలు కల్పించడం ఒక్క ప్రభుత్వ రంగం వల్లనే సాధ్యం కాదని, ఈ విషయంలో ప్రైవేటు రంగ పాత్రా ముఖ్యమన్న వాస్తవాన్ని నీతి ఆయోగ్‌ గుర్తించడం విశేషం. ఇది వాస్తవ రూపు ధరించాలంటే పారిశ్రామికోత్పత్తి రంగంలో భారీగా ప్రైవేటు పెట్టుబడులు వెల్లువెత్తాలి. అలా జరిగినప్పుడు మాత్రమే భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి పథంలో రివ్వున దూసుకెళ్ళగలుగుతుంది. పర్యావరణ హితకరమైన ప్రాజెక్టుల కోసం కొత్త పద్ధతుల్లో పెట్టుబడుల సమీకరణకు నీతి ఆయోగ్‌ కృషి చేయాలి.
 

Posted Date: 20-02-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం