• facebook
  • whatsapp
  • telegram

  పెట్టుబడులకే పెద్దపీట

* ప్రధాన ఆర్థిక సలహాదారుతో ముఖాముఖి

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సమర్పించిన రెండో బడ్జెట్‌లో కార్పొరేట్‌ సంస్థలకు గణనీయ రాయితీలివ్వడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు మళ్ళీ ఊపు వస్తుందని భారత ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) కృష్ణమూర్తి సుబ్రమణియన్‌ ఉద్ఘాటించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి హెచ్చు నిధులు కేటాయిస్తే పల్లె పేదల చేతిలో ఎక్కువ డబ్బు మిగిలి, వస్తు వినియోగం పెరుగుతుందని నోబెల్‌ బహుమతి గ్రహీత అభిజిత్‌ బెనర్జీ వంటి ఆర్థికవేత్తలు చేసిన సిఫార్సును బడ్జెట్‌లో పాటించకపోవడాన్నీ ఆయన సమర్థించారు. ఈటీవీ భారత్‌ ప్రతినిధి కృషానంద్‌ త్రిపాఠీకిచ్చిన ఇంటర్వ్యూలో విశేషాంశాలు...

ప్ర: దేశ ఆర్థికాభివృద్ధి రేటు ఆరేళ్లలో ఎన్నడూ లేనంత తక్కువ స్థాయికి పడిపోయిన సమయంలో 2020-21 బడ్జెట్‌ వచ్చింది. అందులో ప్రధానాంశం ఏమిటి?
జ: విత్తలోటు అదుపు తప్పకుండా అభివృద్ధికి ఊతమివ్వడానికి బడ్జెట్‌ ప్రాధాన్యమిచ్చింది. అభివృద్ధి సాధించాలంటే మార్కెట్‌లో ప్రభుత్వం పట్ల నమ్మకం పాదుగొల్పాలని, దాంతోపాటు పారదర్శకత పాటించాలనీ గ్రహించింది. బడ్జెట్‌ను నడిపించింది ఈ రెండు ప్రధానాంశాలే. 10 శాతం అభివృద్ధి రేటు సాధిస్తామని బడ్జెట్‌ నమ్మకం కలిగిస్తూ, పన్ను వసూళ్లపై వాస్తవిక అంచనాలను వెలువరించింది. ప్రభుత్వానికి సక్రమంగా పన్నులు చెల్లించాల్సిన బాధ్యత ప్రజలు, సంస్థలపై ఉందని, అదే సమయంలో వారికి హక్కులూ ఉంటాయని సర్కారు అంగీకరిస్తోంది. ఈ విధంగా పారదర్శకతకు పెద్దపీట వేసి, పన్ను చెల్లింపుదారులనమ్మకం చూరగొంది. పారదర్శకతతోపాటే పెట్టుబడులు ప్రవహిస్తాయి. బాండ్లు, ఈక్విటీల రూపంలో పెట్టుబడుల సమీకరణపై దృష్టి కేంద్రీకరించింది.

ప్ర: గత సెప్టెంబరులో ఆర్థిక మంత్రి సీతారామన్‌ కార్పొరేట్‌ పన్నును ఎన్నడూ లేనంతగా తగ్గించారు. తాజా బడ్జెట్‌లోనూ కార్పొరేట్‌ రంగానికి భారీ రాయితీలు ఇచ్చారు. వీటి ప్రభావం ఎలా ఉంటుంది?
జ: పన్నురేట్ల తగ్గింపుతోపాటు ప్రభుత్వ సెక్యూరిటీలు (బాండ్లు) ఆర్థికాభివృద్ధికి చోదక శక్తులు కానున్నాయి. బాండ్‌, ఈక్విటీ మార్కెట్లకు తాజా బడ్జెట్‌ ప్రాముఖ్యమిచ్చింది. ప్రభుత్వం కొత్తగా సెక్యూరిటీలు విడుదల చేస్తుందని, వాటిని మదుపరులు ఎటువంటి సంకోచాలు లేకుండా కొనుగోలు చేయవచ్చని ఆర్థిక మంత్రి తెలియజేశారు. దీనివల్ల ప్రైవేటు పెట్టుబడులు పెద్దయెత్తున ప్రవహిస్తాయి. కంపెనీలు చెల్లించే డివిడెండ్లపై పన్ను (డివిడెండ్‌ పంపిణీ పన్ను- డీడీటీ) రద్దు చేయడం కార్పొరేట్లకు పెద్ద ఊరట. ప్రస్తుతం భారతదేశంలో కంపెనీలు 20.5 శాతం డివిడెండ్‌ పన్ను చెల్లిస్తున్నాయి. ఇది అవి చెల్లించే కార్పొరేట్‌ పన్నుకు అదనం. డీడీటీ రద్దు మూలంగా వాటాదారులే తమకు కంపెనీలు ఇచ్చే డివిడెండ్లపై పన్ను కట్టాల్సి ఉంటుంది. ఇకపై కంపెనీలు తమ లాభాల్లో వాటాదారులకు ఎక్కువ డివిడెండ్‌ చెల్లించవచ్చు లేదా తక్కువ చెల్లించి మిగతా లాభాలను వ్యాపార విస్తరణకు ఉపయోగించవచ్చు. దానివల్ల ఆర్థికాభివృద్ధి ఊపు అందుకొంటుంది.

ఇంతకాలం డీడీటీ వల్లనే విదేశీ సార్వభౌమ నిధులు, బీమా నిధులు, పింఛను నిధులు భారతదేశంలో పెట్టుబడి పెట్టడానికి ముందుకురావడం లేదు. ఈ నిధులపై వాటి స్వదేశాల్లో పన్నులు విధించడం లేదు కాని, అవి భారతదేశంలో పెట్టుబడి పెడితే డీడీటీ రూపంలో పన్నులు కట్టాల్సి వస్తోంది. ఇకనుంచి ఇక్కడ మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టే సార్వభౌమ నిధులకు పన్నుల నుంచి పూర్తి మినహాయింపు ఇస్తామని బడ్జెట్‌ ప్రకటించింది. పెన్షన్‌, సార్వభౌమ నిధులు భారతీయ కంపెనీల్లో దీర్ఘకాల ఈక్విటీ పెట్టుబడులు పెడితే గతంలోకన్నా ఎక్కువ లబ్ధి చేకూరుతుంది.

ప్రస్తుత బడ్జెట్‌లో డీడీటీని ఎత్తివేయడం వల్ల సదరు నిధుల నుంచే కాక బాండ్‌ మార్కెట్‌ నుంచీ దీర్ఘకాల పెట్టుబడులు వస్తాయి. విదేశీ ప్రభుత్వాల సార్వభౌమ నిధులు, విదేశీ బీమా, పెన్షన్‌ నిధుల్లో లక్షల కోట్ల డాలర్లు ఉన్నాయి. బాండ్‌ మార్కెట్‌లో 87 లక్షల కోట్ల డాలర్లకు పైగా నిధులున్నాయి. బాండ్‌ మార్కెట్‌ అంటే ప్రపంచంలో అతి పెద్ద సెక్యూరిటీల మార్కెట్‌. బాండ్‌ సూచీల్లో భారత్‌ భాగస్వామిగా మారితే, పై నిధుల నుంచి భారీగా పెట్టుబడులను ఆకర్షించగలుగుతుంది.

ప్ర: కార్పొరేట్లకు పన్ను తగ్గించేకన్నా గ్రామీణ ఉపాధి హామీ పథకానికి హెచ్చు నిధులు కేటాయించి, ఆ పథకాన్ని పట్టణాలకూ విస్తరించడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది కదా? దీనివల్ల గ్రామీణ, పట్టణ పేదల చేతిలో డబ్బు ఆడి వస్తుసేవలు కొనుగోలు చేయగలుగుతారు. ఫలితంగా గిరాకీ పెరిగి పారిశ్రామికోత్పత్తీ ఊపు అందుకొంటుందనే వాదన ఉంది. ఇలా కాకుండా పారిశ్రామికోత్పత్తి పెంచడానికి కంపెనీలకు పన్నులు తగ్గించే మార్గాన్ని ప్రభుత్వం ఎందుకు ఎంచుకుంది? గతేడాదికన్నా ఈ ఏడాది గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధులు ఎందుకు తగ్గించారు ?
జ: ఆర్థికాభివృద్ధి సాధించడానికి వినియోగం పెంచాలా, పెట్టుబడులు పెంచాలా అనే చర్చ ఈనాటిది కాదు. పేదల చేతికి డబ్బు ఇచ్చి వినియోగం పెంచడమనేది ఎంతో కాలం కొనసాగించలేం. బలహీనంగా ఉన్న రోగగ్రస్త వ్యక్తికి స్టెరాయిడ్లు ఇస్తే అతడు ఒక వారం రోజులపాటు హుషారుగా తిరగగలుగుతాడు. స్టెరాయిడ్ల ప్రభావం తగ్గిపోగానే పాత రోగం మళ్ళీ చుట్టుకొంటుంది. అలాగే పెట్టుబడులు పెంచకుండా వినియోగాన్ని పెంచుకుంటూ పోవడం వల్ల లాభం ఉండదు. ప్రైవేటు పెట్టుబడులు కార్పొరేట్ల ద్వారానే ప్రవహిస్తాయి కాబట్టి, వాటికి పన్నులు తగ్గించి ప్రోత్సహించాలి.

బడ్జెట్‌లో 16 సామాజిక సంక్షేమ పథకాల గురించి ఆర్థిక మంత్రి ప్రస్తావించారు. వీటితోపాటు వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాలకు, గ్రామీణాభివృద్ధికి మొత్తం రూ.2.83 లక్షల కోట్లు కేటాయించారు. ఇది గణనీయ మొత్తమే. వివిధ పథకాల ద్వారా కేవలం జనం ఖర్చు పెట్టడానికే నిధులు అందిస్తే, దానివల్ల ఉత్పత్తి పెరగదు. ఉదాహరణకు ప్రధానమంత్రి కిసాన్‌ పథకాన్ని తీసుకుంటే, రైతులకు ఉత్పత్తి వ్యయం తగ్గించడానికి ఆ పథకం ద్వారా నిధులు అందిస్తున్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, ప్రధానమంత్రి కిసాన్‌ పథకాలను పోల్చుకుంటే కిసాన్‌ పథకం ద్వారానే హెచ్చు ప్రయోజనం చేకూరుతుంది. పట్టణాలతో పోలిస్తే గ్రామాల్లో ద్రవ్యోల్బణం తక్కువగా ఉందని ఆర్థిక సర్వే తెలిపింది. గ్రామీణ ఆదాయాలు పెరగకపోవడం వల్ల గిరాకీ పడిపోయి ద్రవ్యోల్బణం అక్కడ తక్కువగా ఉంది. పల్లెవాసుల ఆదాయాలు పెంచడానికి వివిధ పథకాల పేరుతో డబ్బు అందించేకన్నా ప్రధానమంత్రి కిసాన్‌ పథకం ద్వారా ఉత్పత్తి పెంచడం ఎంతో అభిలషణీయం. దీనివల్ల రైతులు ఇతర గ్రామీణుల ఆదాయాలు పెరుగుతాయి. తద్వారా గిరాకీ పెరిగి, దాన్ని తీర్చడానికి ఉత్పత్తి ఊపందుకొంటుంది.

Posted Date: 21-03-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం