• facebook
  • whatsapp
  • telegram

  అంచనాలను అందుకోలేక...

* మాంద్యానికి ఏదీ మందు?

ఆర్థిక వ్యవస్థను వేధిస్తున్న మందగమనాన్ని దీటుగా ఎదుర్కొనేందుకు అవసరమైన అస్త్రశస్త్రాలన్నీ సంధిస్తారనే అంచనాల నడుమ 2020 బడ్జెట్‌ మన ముందుకొచ్చింది. కాకపోతే, అలాంటి భారీ అంచనాలను అందుకునే విషయంలో అది కొంత దూరంలోనే ఆగిపోయిందని చెప్పుకోవాలి. ఆర్థిక మాంద్యం తరహా పరిస్థితులను ఎదుర్కొంటూ, ఉపశమనం కోసం ఎదురు చూస్తున్న చాలా మందికి ప్రస్తుత బడ్జెట్‌ ఎంతోకొంత నిరాశ మిగిల్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం వనరుల కొరతతో కొట్టుమిట్టాడుతోందన్న సంగతి తెలిసినా, వాణిజ్య వర్గాలు, కుటుంబాలు తమ వినియోగ శక్తిని పెంచే దిశగా బడ్జెట్‌ ఏదో ఒక స్థాయిలో తోడ్పాటును అందిస్తుందని ఆశించాయి. సబ్సిడీ చెల్లింపుల వాయిదా, వచ్చే ఏడాది భారీ స్థాయిలో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ ద్వారా అసాధారణ రీతిలో వనరుల సమీకరణ తదితర మార్గాల్ని ఆవిష్కరించినా బడ్జెట్‌ ద్రవ్యపరమైన ఉత్తేజాన్ని కల్పించలేకపోయింది. కేవలం ద్రవ్యలోటు సంకోచాన్ని మాత్రమే పరిహరించగలిగింది.

కొన్ని నెలల క్రితం కార్పొరేట్‌ సంస్థలకు అందించిన తరహాలోనే తమకూ కొంత ఉపశమనం లభిస్తుందని ఆదాయ పన్ను చెల్లింపుదార్లు ఆశలు పెట్టుకున్నారు. అయితే కొత్త శ్లాబులు, పన్ను రేట్లను తీసుకొచ్చినా... ఈ విధానంలో మినహాయింపులు పొందే అవకాశం మాత్రం కనిపించడం లేదు. ఉద్యోగులు శ్లాబుల్లో మార్పులు ప్రతిపాదించిన కొత్త విధానాన్నిగానీ, పాత పద్ధతినిగానీ రెండింట్లో ఏదో ఒకదానిని ఎంచుకోవచ్చు. వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు పలు మినహాయింపుల్ని, తగ్గింపుల్ని వదులుకోవడం ద్వారా కొత్త రేట్లకు మారాల్సి ఉంటుంది. భత్యాలు, గృహరుణంపై వడ్డీ తదితర ముఖ్యమైన మినహాయింపుల్ని వదులుకోవాల్సి ఉంటుంది. డిమాండ్‌ను పెంచే విషయంలో ఈ చర్యలు వెనువెంటనే ప్రభావం చూపించే అవకాశం లేకపోవచ్చు. ఆదాయ పన్ను విషయంలో చెల్లింపుదార్లు కొంతమేర జాగ్రత్తగా ఉంటూ, పాత, కొత్త పద్ధతుల్లో ఒకదానిని ఎంచుకునే విషయంలో తమ తుది వినియోగ ఆదాయంపై పడే ప్రభావాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. ఈ విషయంలో నికర ఫలితాలు తేటతెల్లమయ్యేందుకు కొంత ఎక్కువ కాలమే పడుతుంది. కేంద్ర ఆర్థిక మంత్రి ఎంత సోదాహరణంగా వివరించినప్పటికీ రెండింటిలో ఏది ఎంచుకున్నా దాని ఫలితం చాలావరకు పన్ను ఆదాకు దారితీయకపోవచ్చు.

ఉద్యోగ కల్పన దిశగా బడ్జెట్‌లో కొన్ని ప్రయత్నాలు జరిగాయి. ఇకపై ఇంజినీరింగ్‌ పట్టాదారులకు పట్టణ స్థానిక సంస్థలు కూడా ‘ఇంటర్న్‌షిప్‌’ అవకాశాల్ని అందిస్తాయి. గత ఏడాది డిసెంబరులో ప్రకటించిన జాతీయ మౌలిక సదుపాయాల కార్యక్రమం కోసం జాతీయ ప్రాజెక్టు నిర్వహణ ఏజెన్సీని ఏర్పాటు చేస్తారు. ఇందులో ప్రభుత్వేతర భాగస్వాములు కూడా పెద్దసంఖ్యలో తమ నైపుణ్య సేవల్ని అందజేస్తారు. ఉపాధ్యాయులు, నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది, ఆరోగ్య సంరక్షకుల్లో నైపుణ్యాల్ని పెంచడం ద్వారా వారిని విదేశీ ప్రమాణాలకు దీటుగా తీర్చిదిద్ది, అక్కడి ఉద్యోగావకాశాల్ని ఒడిసిపట్టడంలో సహాయపడతారు. మెరుగైన ఆర్థిక అవకాశాల కోసం విదేశాలకు వలస వెళ్లాలనుకునే వారికిది ఆనందకరమే. ప్రభుత్వం వృద్ధిని పునరుద్ధరించేందుకు మౌలిక సదుపాయాల కల్పనపైనే ఆధారపడుతోంది. గడచిన అయిదేళ్ల కాలంలో రహదారులు, జాతీయ రహదారుల నిర్మాణ వేగాన్ని పరిశీలిస్తే, భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ) తీవ్ర అప్పుల ఊబిలో చిక్కుకుంది. కానీ, ఆశించిన ఫలితాల్ని, ఊహించిన వృద్ధి ఫలాల్ని మాత్రం సాధించలేదు. ఇది ఏ మాత్రం ఆశాజనకం కాదు. మరోవైపు, మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాని(ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ)కి కేటాయింపుల్ని 13.4 శాతం మేర తగ్గించారు. పీఎం-కిసాన్‌ కార్యక్రమానికి గత ఏడాది తరహాలోనే కేటాయింపులు చేశారు. అయితే, 2020 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకానికి ఉద్దేశించిన నిధుల్ని పూర్తిగా ఖర్చు చేయనేలేదు. షెడ్యూల్డు తరగతుల అభివృద్ధికి సంబంధించిన పథకానికి, ఇతర వర్గాల పథకాలకు కేటాయింపుల్ని పెంచారు. వ్యవసాయం, సాగు, జీవనోపాధి, గ్రామీణాభివృద్ధి రంగాల గురించి ఎంతో చర్చ జరిగినా, వీటి విషయంలో రాష్ట్రాలను ప్రోత్సహించే విషయంలో మాత్రం పెద్దగా ఫలితం కనిపించలేదు. మొత్తంగా... బడ్జెట్‌లో అలసట, నిస్సత్తువ లక్షణాలు కనిపించాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం వద్ద డబ్బులు లేవన్న మాట వాస్తవమేగానీ, ఆలోచనలు, పరిష్కారాలకు కొదవ లేదు కదా!

- రేణుకోహ్లి
(రచయిత్రి- ఆర్థిక నిపుణులు)

Posted Date: 21-03-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం