• facebook
  • whatsapp
  • telegram

  అంపశయ్యపై అసంఘటిత రంగం

* ఆర్థికాన్ని గాడినపెట్టే చొరవే ముఖ్యం

     కొన్నేళ్ల ముందు అత్యంత వేగంతో దూసుకుపోయిన భారత ఆర్థిక వ్యవస్థ నేడు మందగమనంలో పడింది. వార్షిక వృద్ధిరేటు 2018-19 ఆర్థిక సంవత్సరంలో 6.8 శాతానికి పడిపోయింది. ప్రస్తుతం లభిస్తున్న త్రైమాసిక గణాంకాల ప్రకారం, 2019-20 ఆర్థిక సంవత్సరానికి వృద్ధిరేటు అయిదు శాతంలోపే ఉండవచ్చని అంచనా. మాంద్యానికి తోడు ఇటీవల దేశంలో నెలకొన్న సామాజిక అభద్రత, కరోనా వైరస్‌ ప్రకంపనలు వంటి పరిణామాల నేపథ్యంలో భవిష్యత్తులోనూ ఆర్థిక వృద్ధిరేటు ఆశాజనకంగా ఉండే పరిస్థితి కనిపించడంలేదు. మరోవైపు ప్రస్తుతం ప్రపంచదేశాల మధ్య వాణిజ్య యుద్ధాలు, కోవిద్‌-19 వ్యాప్తి కారణంగా సంభవించిన ప్రపంచ ఆర్థిక మందగమనం వల్ల భారత ఆర్థిక వ్యవస్థ మరింత ప్రమాదంలో పడే అవకాశం ఉంది. భారత ఆర్థికరంగం ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేని విధంగా ‘స్తంభన ద్రవ్యోల్బణం’ (స్టాగ్‌ఫ్లేషన్‌) అనే విష వలయంలో చిక్కుకుంది. ఫలితంగా గడచిన 45 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా అధిక నిరుద్యోగం, మరోవైపు గత ఏడేళ్లలో లేని స్థాయిలో అధిక ద్రవ్యోల్బణం ముమ్మరించాయి. స్తంభించిన ఆర్థిక వృద్ధి ఒకవైపు, అధిక ద్రవ్యోల్బణం మరోవైపు ఉన్న ఈ ప్రత్యేకమైన స్థితిని అర్థశాస్త్రంలో ‘స్తంభన ద్రవ్యోల్బణం’ అంటారు. ఈ స్థితిలో ప్రజల కొనుగోలు శక్తి క్షీణించి, వస్తువుల గిరాకీ పడిపోయి, పెట్టుబడులు తగ్గుతాయి. నిరుద్యోగం పెరిగి ఆర్థిక వ్యవస్థలో మందకొడితనం నెలకొంటుంది. గతంలో తీసుకున్న పెద్ద నోట్ల రద్దు, వస్తు సేవల పన్ను అమలు వంటి నిర్ణయాల ఫలితమే ఇప్పటి ఈ ఆర్థిక దుస్థితి అని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
 

క్రియాశీల చర్యలు కీలకం
     పాశ్చాత్య దేశాల్లో మాదిరి భారత ఆర్థిక వ్యవస్థను పూర్తిగా అర్థశాస్త్రపరంగా, వాణిజ్య సంబంధిత లాభ నష్టాల కోణంలో చూడరాదు. భారత్‌లో ఆర్థిక కార్యకలాపాలు అసంఘటితంగా ఉంటాయి. ఇవి అనేక రకాలైన సామాజిక, సాంస్కృతిక అంశాలతో పెనవేసుకొని ఉంటాయి. ఎక్కువ శాతం ఆర్థిక కార్యకలాపాలు కేవలం లాభాల కోసమే కాకుండా, ప్రజల జీవన విధానంలో భాగంగా ఉంటాయి. వ్యవసాయ, కుటీర, చేతివృత్తి పరిశ్రమలు, సూక్ష్మ-చిన్న పరిశ్రమలు, సేవల సంస్థలు మొదలైనవి అసంఘటిత రంగంలోకి వస్తాయి. కానీ, ఈ అసంఘటిత రంగమే భారత ఆర్థిక వ్యవస్థకు గుండెకాయ వంటిది. ప్రభుత్వ గణాంకాల ప్రకారమే ప్రస్తుతం దేశంలో 90 శాతం పైగా ఉద్యోగాలు అసంఘటిత రంగంలో ఉన్నాయి. అసంఘటిత రంగంలో అనేక సమస్యలు ఉన్నాయి. అధిక శాతం అసంఘటిత రంగ సంస్థలు ప్రభుత్వ నిబంధనలను పాటించడంలేదు. వాటికి లెక్కల ఖాతాలు సరిగ్గా ఉండవు. ఎక్కువ శాతం సంస్థలు పన్నులు కట్టవు. నల్ల ధనం ప్రవాహం ఎక్కువ. పెట్టుబడులమీదా నల్లధన ప్రభావం ఉంటుంది. ఈ రంగాన్ని నియంత్రించి, దీన్ని అధిక శాతం పన్నులు కట్టే సంఘటిత రంగంగా మార్చాలనేది ప్రభుత్వ విధానం. ఆర్థిక సిద్ధాంతపరంగా అసంఘటిత రంగాన్ని సంఘటిత రంగంగా మార్చాలి. దీనివల్ల ఉద్యోగులకు భద్రత ఉంటుంది. ప్రభుత్వానికి పన్నుల రాబడీ పెరుగుతుంది. భారత దేశ ఆర్థిక వ్యవస్థలో అసంఘటిత రంగాన్ని సంఘటితంగా మార్చడం అనేది చాలా క్లిష్టమైన ప్రక్రియ. ఇది అధికశాతం ప్రజల ఆదాయ జీవనోపాదులతో కూడిన సమస్య. ఈ క్రమంలో నిర్ణయాల వల్ల మొదటికే మోసం వస్తుంది. ఒకరకంగా ఇది ముళ్ల కంచె మీద పడిన వస్త్రాన్ని లాగటం వంటిది. తొందరపడి లాగేస్తే మొత్తం వస్త్రమే చిరిగిపోతుంది. అసంఘటిత రంగాన్ని సంఘటిత రంగంగా మార్చడానికి ప్రభుత్వాలు హేతుబద్ధ నిర్ణయాలు చెయ్యాలి. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పెద్ద నోట్ల రద్దు, వస్తు సేవల పన్ను విధానం అమలు లాంటి అనాలోచిత నిర్ణయాలు అసంఘటిత రంగంలో మొదటికే మోసం తెచ్చాయి. పెద్ద నోట్ల రద్దు వల్ల ఈ రంగానికి ద్రవ్య సమస్య ఏర్పడింది. పెట్టుబడులు తగ్గిపోయాయి. రుణాలిచ్చేవారు కరవయ్యారు. ఇప్పటికే సంక్షోభంలో చిక్కుకున్న బ్యాంకులు, బ్యాంకేతర విత్తసంస్థలు కూడా అసంఘటిత రంగానికి ఉదారంగా రుణాలివ్వడంలో చేతులెత్తేశాయి. మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లు, అప్పటికే ద్రవ్య కొరతతో సతమతమవుతున్న అసంఘటిత రంగంపై అదనంగా వచ్చిన వస్తు సేవల పన్ను విధానం తీవ్ర ప్రతికూల ప్రభావం చూపి, ఈ రంగం చతికిలపడేలా చేసింది. జీఎస్‌టీ విధానంలో, సంస్థలు తాము కొనే ముడి సరకులపై ముందే పన్ను చెల్లించాలి. వస్తువులు తయారైన తరవాత ముందు కట్టిన పన్నులను ప్రభుత్వం నుంచి తిరిగి వసూలు చేసుకోవాలి. ఈ కార్యక్రమం మొత్తం ఆన్‌ లైన్‌లోనే చెయ్యాలి. సాఫ్ట్‌వేర్‌ సమస్యల కారణంగా, ప్రభుత్వం పన్నుల మొత్తం తిరిగి చెల్లించడంలో విపరీతమైన జాప్యం చేయడంవల్ల, అసంఘటిత రంగ సంస్థలు నష్టపోతున్నాయి. ఇప్పటి వరకు, పన్నుల పరిధిలోకి రాకుండా కొనసాగుతున్న అసంఘటిత సంస్థలు, ఆకస్మికంగా వచ్చిన పన్నుల విధానంలో మనుగడ సాగించలేక పోతున్నాయి. ఫలితంగా మొత్తం ఆర్థిక కార్యకలాపాలే కుంటుపడి, వాటిపై ఆధారపడి బతికే అధికశాతం కుటుంబాల ఆదాయాలకు గండి పడింది. దీంతో అప్పటివరకు అధిక వేగంతో దూసుకుపోతున్న ఆర్థిక వృద్ధిరేటు మందగించింది.
 

పెట్టుబడులకు భరోసా అవసరం
     ప్రపంచ ఆర్థిక మందగమనం వల్ల భారత ఆర్థిక వ్యవస్థ పరిస్థితి పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డట్లయింది. విదేశీ ఎగుమతులు తగ్గిపోయి వాటి మీద ఆధారపడే రంగం కుంటుపడింది. ఇప్పుడు ప్రపంచ దేశాలను బాధిస్తున్న కరోనా వైరస్‌ ప్రభావంతో మొత్తం విదేశీ వాణిజ్య రంగమే ఇబ్బందుల్లో పడింది. దీనికితోడు ప్రస్తుతం దేశంలో నెలకొన్న సామాజిక, మతపరమైన అభద్రతల నుంచి తలెత్తిన ఉద్యమాలు ఆర్థిక రంగాన్ని మరింత అతలాకుతలం చేస్తున్నాయి. ఫలితంగా నూతన ప్రైవేటు పెట్టుబడులు చాలావరకు తగ్గాయి. నూతన పెట్టుబడి అనేది ఆర్థికవృద్ధికి మొట్టమొదటి మెట్టు. కానీ, ఒక ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులు రావాలంటే ముందుగా సామాజిక సుహృద్భావన, భద్రత అవసరం. దేశంలో ప్రస్తుతం అవి లోపించాయని ఇటీవల మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ వాపోవడం గమనార్హం.
 

సంక్షోభం రాకముందే మేలుకోవాలి
     మందగించిన భారత ఆర్థిక వ్యవస్థ మున్ముందు సంక్షోభంలోకి జారిపోకుండా తక్షణ చర్యలు అవసరం. కేంద్ర బడ్జెట్లో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే చర్యలు అరకొరగానే ఉన్నాయి. కనీసం ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉందని గుర్తించే సాహసం కూడా చెయ్యలేకపోయింది. ఇది రోగి రోగాన్ని గుర్తించకుండా మందులిచ్చే అనాలోచిత చర్య వంటిది. పూర్తిగా ప్రైవేటు కార్పొరేట్‌ సంస్థల సంపద పెంచడం ద్వారానే భారత దేశంలో ఆర్థిక అభివృద్ధి జరుగుతుందన్న తరహా దోరణి ప్రస్ఫుటమవుతుంది. అధిక శాతం ఉద్యోగ ఆదాయాలు సమకూర్చే అసంఘటిత రంగాన్ని కేంద్రం విస్మరించింది. దాన్ని గాడిలో పెట్టే ప్రయత్నాలేవీ కనుచూపు మేరలో లేకపోవడం బాధాకరం. భారత దేశ ఆర్థిక వ్యవస్థ ఆత్మ ఇప్పటికీ అసంఘటిత రంగంలోనే ఉంది. కాబట్టి, ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉన్న అసంఘటిత రంగాన్ని గాడిలో పెట్టడానికి తక్షణ చర్యలు అవసరం. ఇందుకోసం మొదట ప్రభుత్వం ఈ రంగంపై విశ్వాసం ఉంచి, ఉదార చర్యలతో ముందుకు రావాలి. వారి పెట్టుబడులకు భరోసా కల్పించాలి. పన్ను రేట్లను సరళీకరించాలి. పన్నుల పేరిట వేధింపులూ తగ్గాలి. ఉదారంగా రుణాలు అందే విధంగా బ్యాంకులు, ఇతర విత్త సంస్థలను ప్రోత్సహించాలి. ఈ రంగంలో పనిచేసే ఉద్యోగులందరికీ సామాజిక, ఆరోగ్య భద్రత కల్పించాలి. దీర్ఘ కాలంలో క్రమబద్ధంగా అసంఘటిత రంగాన్ని సంఘటితంగా మార్చాలి.
     స్తంభన ద్రవ్యోల్బణ స్థితిలో చిక్కుకున్న ఆర్థిక వ్యవస్థను వృద్ధి పథం వైపు నడిపించాలంటే ద్విముఖ వ్యూహం అవసరం. గిరాకీ, సరఫరా (డిమాండ్‌, సప్లయ్‌) రెండింటినీ పెంచాలి. సరఫరా పెరగాలంటే పెట్టుబడులు రావాలి. ఇందుకోసం పెట్టుబడి దారుల్లో ఉత్సాహం కలిగించాలి. పెట్టుబడికి అనుకూలమైన సహేతుక సామాజిక రాజకీయ ఆర్థిక వాతావరణం కల్పించాలి. గిరాకీని విస్తరించాలంటే ముందుగా ప్రభుత్వమే వ్యయాన్ని పెంచాలి. విద్య, వైద్య, సామాజిక భద్రత, మౌలిక సదుపాయాలపై ప్రభుత్వ వ్యయాన్ని గణనీయంగా పెంచాలి. అవసరమైతే స్వల్పకాలంలో విత్తలోటు పరిధిని దాటీ ప్రభుత్వం వ్యయాన్ని చేపట్టవచ్చు. దానివల్ల పేద, దిగువ స్థాయి ప్రజల ఆదాయం పెరిగి అధిక గిరాకీ కల్పించగలుగుతారు. ఈ చర్యలవల్ల ఒకవైపు వస్తుసేవల ఉత్పత్తి పెరిగి, ఆర్థిక వృద్ధిరేటు ఇనుమడిస్తుంది. ఉద్యోగ సృష్టి పెరిగి నిరుద్యోగం తగ్గుతుంది. ధరల పెరుగుదలనూ అరికట్టవచ్చు. ఈ చర్యల వల్ల మందగమనంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ మళ్ళీ ప్రగతి పథంలో పరుగులు పెట్టగలదు.

 

- డాక్టర్‌ చీరాల శంకర్‌ రావు
(రచయిత- ఆర్థిక రంగ నిపుణులు)

Posted Date: 15-06-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం