• facebook
  • whatsapp
  • telegram

  సంక్షోభంలో గ్రామీణ ఆర్థికం

* నెరవేరని ఉపాధి హామీ

     నిరుద్యోగిత, ఆర్థిక మందగమనం తీవ్రస్థాయిలో కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో 2020-21 కేంద్ర బడ్జెట్‌ గ్రామీణ రంగంలో ఎలాంటి ఉత్సాహాన్నీ తీసుకురాలేకపోయింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ) పథకం, ఇతర అంశాల్లో గ్రామీణ రంగానికి సంతృప్తికరమైన కేటాయింపులు దక్కలేదు. ఒకవైపు ఆర్థిక మందగమనం మరింత వ్యవస్థీకృతమైనట్లు కనిపిస్తోంది. ప్రస్తుత మందగమనం తలెత్తడానికి ప్రధాన కారణాల్లో గిరాకీ తగ్గడమే ముఖ్యమైనది. ఈ సమస్య గ్రామీణ భారతంలో మరింత అధికంగా ఉంది. భూమి, కూలీలు, వ్యవసాయ మార్కెటింగ్‌ వంటి ఎన్నో ఇబ్బందులున్నాయి. వీటన్నింటినీ పరిష్కరించాల్సి ఉంది. మామూలుగానే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పలు సమస్యలతో సతమతమవుతోంది. పేదరికం, నిరుద్యోగిత, మౌలిక సౌకర్యాల లేమి, అంతంతమాత్రంగానే ఉన్న జీవన నాణ్యత వేధిస్తున్నాయి. రైతుల తలసరి భూకమతం తగ్గుతూ వస్తోంది. ఇది 1971లో 2.28 హెక్టార్లు ఉండగా, ప్రస్తుతం 1.15 హెక్టార్లు మాత్రమే. గ్రామీణ రంగం కష్టాలకు ఇదీ ఓ కారణంగా నిలుస్తోంది. ఇతర రంగాల్లోని ఆదాయాలతో పోలిస్తే, తలసరి వ్యవసాయ ఆదాయం స్థిరంగా తగ్గుతోంది. కొన్నేళ్లుగా వ్యవసాయ ఆదాయానికి, ఇతర కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయానికి మధ్య తేడా గణనీయంగా పెరిగిపోయింది. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని రెండేళ్ల క్రితం ప్రధానమంత్రి హామీ ఇచ్చారు. ఈ క్రమంలో పలు వ్యవసాయోత్పత్తులకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)ని పెంచుతూ వచ్చారు. కొన్ని ఉత్పత్తులకైతే 50 శాతానికిపైగానే పెంచారు. అయినప్పటికీ, ప్రభుత్వం వ్యవసాయ దిగుబడిలో కొంత భాగాన్ని మాత్రమే కొనుగోలు చేయగలుగుతోంది. సరైన నిల్వ సదుపాయాలు లేకపోవడంతో అందులో చాలావరకు వృథా అవుతోంది. పటిష్ఠమైన ఎగుమతి, ఆహార నిర్వహణ విధానం ఉంటేనే వృథాను అరికట్టడం సాధ్యమవుతుంది. అంతేకాదు, రైతులకు దిగుబడికి తగిన ధర దక్కేలా చేయడంలోనూ తోడ్పడుతుంది. తోచిన ఎంఎస్‌పీని నిర్ణయించడంకన్నా, రైతులు తమ దిగుబడిని అమ్ముకోవడంలో తోడ్పాటు అందించడం ముఖ్యం. అన్నదాతలు సరైన పంటల సాగును ఎంచుకునేలా ప్రోత్సహించడం, గ్రామాల అనుసంధానతను మెరుగుపరచడం వంటి చర్యల వల్ల అద్భుతమైన ఫలితాల్ని సుసాధ్యం చేయవచ్చు. భూ సమీకరణకు ప్రోత్సాహకాలు, మెరుగైన వ్యవసాయ పద్ధతుల విషయంలో అవగాహన కల్పించడం, మార్కెట్లతో రైతుల అనుసంధానాన్ని పెంచడం అవసరం. రుణాలు, వ్యవసాయ పరపతి ఇనుమడించాలి. గ్రామీణ రహదారులను అభివృద్ధి చేయాలి. మెరుగైన మార్కెటింగ్‌ కల్పించడం, పంట ఉత్పత్తుల నిల్వ సౌకర్యం వంటివాటిని పెంచడం అత్యవసరం.
 

వినిమయం పెంపుదలే లక్ష్యం కావాలి
     ఇటీవలి నీల్సన్‌ నివేదిక ప్రకారం- వ్యవసాయ సంక్షోభం, గిట్టుబాటు ధరలు తక్కువగా ఉండటం, కూలిరేట్లు తగ్గడం వంటివన్నీ వినియోగ డిమాండును దెబ్బతీశాయి. గత త్రైమాసికంలో గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం అయిదు శాతానికి పెరిగింది. అదే పట్టణ ప్రాంతంలో, ఎనిమిది శాతం పెరుగుదల నమోదైంది. గ్రామీణ భారత్‌లో రెండంకెల వృద్ధి సాధించే సామర్థ్యం ఉంది. ఈసారి మంచి వర్షాలతో రికార్డు స్థాయిలో దిగుబడులు వచ్చినా, గ్రామీణ వినియోగంలో పెరుగుదల సాధించడంలో మాత్రం వైఫల్యం ఎదురైంది. గ్రామీణ సంక్షోభం, ఇతర పరిస్థితులే ఇందుకు కారణంగా నిలిచాయి. ఆదాయాల్లో మందగమనం కొనసాగుతున్న క్రమంలో గ్రామీణ సంక్షోభాన్ని పరిష్కరించే దిశగా బడ్జెట్‌లో ద్రవ్యపరమైన చర్యలు, విధానాల్లో మార్పులు ఉంటాయని ఆశించారు. గ్రామీణ సంక్షోభాన్ని, తీవ్రస్థాయిలో పెరుగుతున్న నిరుద్యోగాన్ని నిక్కచ్చిగా అంచనా వేయడంలో ప్రభుత్వం విఫలమైందనే విమర్శలున్నాయి. ప్రస్తుత నిరుద్యోగిత రేటు 45 ఏళ్ల అత్యధిక స్థాయిలో ఉంది. ముంబయికి చెందిన ప్రైవేటు మేధా సంస్థ ‘భారత ఆర్థిక వ్యవస్థ పర్యవేక్షక కేంద్రం (సీఎంఐఈ)’ విడుదల చేసిన గణాంకాలు ఆర్థిక వ్యవస్థలో మందగమనం ప్రభావాన్ని ప్రతిబింబిస్తున్నాయి. భారత ఆర్థిక వ్యవస్థ విస్తరణ 2019 చివరి మూడునెలల్లో అత్యంత నెమ్మదిగా సాగింది. గత ఆరేళ్ల కాలంలో ఎప్పుడూ ఇంతటి మందగమనం లేదు. భారత ఆర్థికవ్యవస్థను- ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తున్న కరోనా వైరస్‌ మరింతగా నెమ్మదింపజేస్తుందని విశ్లేషకుల అంచనా. గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగిత రేటు ఫిబ్రవరిలో 7.37 శాతానికి పెరిగింది. అంతకుముందు నెలలో 5.97 శాతంగా ఉంది. పట్టణ ప్రాంతాల్లో అది 9.70 శాతం నుంచి 8.65 శాతానికి తగ్గింది. కార్మిక శక్తి భాగస్వామ్యం కూడా ఆందోళనకర స్థాయిలో 46.5 శాతంగా నమోదైంది. చాలామంది ఉద్యోగులైన శ్రామికులూ తక్కువ వేతనాలు పొందుతూ- పేదరికంలో మగ్గుతున్నారు. పెట్టుబడులు, వినియోగాలకు సంబంధించిన గిరాకీ తగ్గిపోవడం కారణంగానే ఆర్థిక మందగమనం తలెత్తిందని చెప్పేందుకు ఎన్నో ఆధారాలున్నాయి. సగటు పెట్టుబడులు జీడీపీలో 30 శాతంకన్నా తక్కువకు పడిపోయాయి. ఇది 15 సంవత్సరాల సగటుకన్నా చాలా తక్కువ. తాజాగా, ప్రైవేటు వినియోగం కూడా తగ్గింది. అందుకని, అన్నింటికన్నా ముందు తొలి చర్యగా, బడ్జెట్లో గిరాకీని పునరుద్ధరించడంపైనే దృష్టి పెట్టి ఉండాల్సింది. గ్రామీణ భారతంలోని చిన్న, సన్నకారు రైతులు, భూమిలేని కూలీలు తమ ఆదాయంలోని ఎక్కువ భాగం పలురకాల వస్తువులు, సేవలపైనే ఖర్చు పెడతారు. కాబట్టి, ఉపాధి హామీ పథకం ద్వారా డబ్బుల పంపిణీ జరిగితే ప్రస్తుత సమయంలో డిమాండుకు అత్యంత అవసరమైన ఉద్దీపన అందేది. సాగునీరు, పల్లె రోడ్లు, శీతల గిడ్డంగులు, రవాణా వ్యవస్థల్లో ప్రభుత్వ వ్యయాల్ని పెంచడం ద్వారా గ్రామీణ నిరుద్యోగితను తగ్గించవచ్చు. ఇలాంటి సౌకర్యాలతోపాటు విస్తృత రీతిలో పంట బీమాను అందించడం వల్ల వ్యవసాయ ఉత్పాదకత, ఆదాయాలు గణనీయంగా పెరుగుతాయి.
 

పథకానికి దూరంగా ఎందరో!
     ఉపాధి హామీ పథకం కింద కూలీలు అందుకునే వేతనాల తీరును పరిశీలించే జాతీయ శాంపిల్‌ సర్వే కార్యాలయం (ఎన్‌ఎస్‌ఎస్‌ఓ) నివేదిక ప్రకారం ఈ పథకం అమలులో రెండో ఏడాదైన 2007-08లో గ్రామీణ ప్రాంతాల్లోని పురుష కూలీలకు మార్కెట్‌లో లభించే కూలి కన్నా ఈ పథకంలో అయిదు శాతం అధికంగానే దక్కగా, మహిళా కూలీలకు ఏకంగా 58 శాతం కూలి అధికంగా లభించింది. అయితే, 2017-18లో ‘పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌’ సర్వే ప్రకారం ప్రైవేటు విపణిలో పురుష కూలీలకు బయట వేతనాలు ఉపాధి హామీ పథకం కన్నా 74 శాతం ఎక్కువగా ఉన్నట్లు తేలింది. మహిళా కూలీల వేతనాలు 21 శాతం అధికంగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఏ పురుష కూలీ కూడా ఉపాధి హామీ పథకంలో పని కావాలని కోరుకునే పరిస్థితి లేదనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే, అంతే శ్రమతో బయట ఎలాంటి పని చేసుకున్నా అంతకన్నా ఎక్కువగా రోజువారీ కూలి లభిస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లోని మహిళలు మాత్రం ఉపాధి హామీ పథకం పని కోసం డిమాండ్‌ చేస్తూనే ఉన్నారు. మార్కెట్లో కూలి ఎక్కువగా ఉన్నా వీరు ఇక్కడే డిమాండ్‌ చేయడానికి కారణం బయట పని దొరక్కపోవడమే. ప్రైవేటు రంగంలో దుర్విచక్షణలు, పట్టించుకోకపోవడం వంటివీ కారణాలే. గుజరాత్‌ సహా చాలా రాష్ట్రాలు 2017-18లో ఉపాధి హామీ కింద ఎలాంటి పనుల్నీ నమోదు చేయలేదు. కేంద్ర ప్రభుత్వం వద్ద తగిన నిధులు అందుబాటులో లేకపోవడం, కూలి తక్కువగా చెల్లిస్తుండటం వంటి కారణాలతో ఉపాధి హామీ పథకంలో ఉద్యోగ కల్పన ప్రక్రియకు విఘాతం కలుగుతోంది. ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజాన్ని అందించేందుకు ఉపాధి హామీ ద్వారా గ్రామీణ వినియోగదారుల చేతుల్లో డబ్బులు ఆడేలా చూడాలని చాలామంది ఆర్థికవేత్తలు సిఫార్సు చేస్తున్నారు. తొలి అడుగుగా, ఉపాధి హామీ పథకం ద్వారా తగిన మౌలిక సదుపాయాల్ని రూపకల్పన చేయాల్సి ఉంది. గ్రామాల్లో ఉద్యోగాల్ని సృష్టించే శక్తి ఈ పథకానికి ఉంది. అదే గ్రామీణ సంక్షోభం నుంచి మనల్ని కాపాడగలిగేది!
 

తగ్గుతున్న కేటాయింపులు
     ఉపాధి హామీ పథకానికి 2020-21లో బడ్జెట్‌ కేటాయింపులు చాలా తక్కువగా రూ.60 వేల కోట్ల నుంచి రూ.61,500 కోట్లకు పెంచారు. ఈ పెరుగుదలా 2019-20 నాటి సవరణ అంచనాలతో పోలిస్తే వచ్చిందే. ఈ పథకానికి చేస్తున్న కేటాయింపులు క్రమంగా తగ్గుతూ వస్తుండటం గమనార్హం. ఉపాధి హామీలో ప్రతి గ్రామీణ కుటుంబానికి చెందిన వయోజనులకు కనీసం 100 రోజుల ఉపాధి కల్పిస్తామనే హామీ ఇచ్చారు. గ్రామీణ ఉపాధి పథకంపై ఆధార పడుతున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ పథకాన్ని నడిపించేందుకు కేంద్రం నిధుల్ని ఖర్చు పెట్టే పరిస్థితి కనిపించడం లేదు. ఉపాధి హామీపై ఇటీవల విడుదల చేసిన ఆర్థిక నివేదిక ప్రకారం 15 రాష్ట్రాల్లో పరిస్థితి బాగాలేదు. గత బడ్జెట్‌ ద్వారా కేటాయించిన నిధుల్లో 96 శాతానికిపైగా ఇప్పటికే ఖర్చు చేసి ఉండాలి. లేదా బకాయిలైనా చెల్లించి ఉండాలి. మొన్న ఫిబ్రవరి నాటి అంచనాల ప్రకారం రూ.10 వేల కోట్లకు పైగా బకాయిలను 2019-20 ఆర్థిక సంవత్సరానికిగాను రాష్ట్రాలకు చెల్లించాల్సి ఉంది. ఇందులో కూలి, సామగ్రి వ్యయాలు, పాలనపరమైన ఖర్చులూ ఉన్నాయి. రాష్ట్రాలకు వేతనాల చెల్లింపుల్ని ఆలస్యం చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం తన ద్రవ్యలోటును సర్దుబాటు చేసుకుంటోంది. ఫలితంగా గ్రామీణ కూలీలపై తీవ్ర ప్రభావం పడుతోంది. వారు పలు సందర్భాల్లో పని దొరక్క ఇక్కట్ల పాలవుతున్నారు.
 

- నీరజ్‌కుమార్‌

Posted Date: 15-06-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం