• facebook
  • whatsapp
  • telegram

  ఆర్థిక సూచీలు నేలచూపులు

* ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా

     ప్రపంచాన్ని కరోనా వణికిస్తోంది. ఎన్నోదేశాలు క్రీడోత్సవాలకు స్వస్తి చెప్పాయి. సామూహిక సమావేశాలకు చెల్లు చీటీ రాసేస్తున్నాయి. విశాలమైన బహుళ అంతస్తుల వాణిజ్య భవనాలు వెలాతెలాపోతూ కనిపిస్తున్నాయి. స్టాక్‌ మార్కెట్లు ప్రతి రోజూ కొత్త పాతాళపు లోతులకు దిగజారుతున్నాయి. ప్రపంచాన్ని కొవిడ్‌-19 మాంద్యం కమ్మేసింది. కరోనా వైరస్‌ ప్రభావం కేవలం చైనాకే పరిమితమవుతుందని నెల రోజుల క్రితం వరకు ఎందరో భావించారు. ఒకవేళ కరోనా వల్ల చైనా ఆర్థిక వ్యవస్థ కుంగిపోయి ఆ ప్రభావం మిగిలిన దేశాలమీద పడితే- కాస్తో కూస్తో కష్టపడితే, కేంద్ర బ్యాంకుల నిబంధనలను ఒకింత సడలిస్తే ఆ సమస్య నుంచి బయటపడటం కష్టం కాదని అంతర్జాతీయ సమాజం భావించింది. సమస్య చైనాకు మాత్రమే పరిమితం కాదని, ప్రపంచ దేశాలన్నింటినీ కరోనా చుట్టేయనుందని స్పష్టమైన తరవాత ఆర్థిక ప్రభావాలకు సంబంధించిన అంచనాలను ఒక్కో దేశం సవరించుకోవడం ప్రారంభించింది. కరోనా ప్రభావం స్వల్పకాలంలో తీవ్రంగా ఉంటుందని, ఆ తరవాత ఆర్థిక వ్యవస్థలన్నీ నేలకు కొట్టిన బంతిలా తిరిగి యథాస్థితికి చేరుకుంటాయని వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు, ఆర్థిక మంత్రులు, స్వతంత్ర ఆర్థికవేత్తలు అంచనా వేశారు. మహమ్మారిలా ప్రపంచంపై విరుచుకుపడిన కరోనా ప్రభావం అందరి అంచనాలనూ దెబ్బతీస్తూ దేశాల ఆర్థిక వ్యవస్థలను తలకిందులు చేస్తోంది.
పలు దేశాలపై ప్రభావం
     దేశదేశాల్లో వాణిజ్య కార్యకలాపాలు స్తంభించిపోయిన ప్రస్తుత నేపథ్యంలో ప్రపంచం ఇప్పటికే మాంద్యం గుప్పిట్లోకి జారుకుందని ఆర్థిక వేత్తలు హెచ్చరిస్తున్నారు. చైనా ఇటీవల విడుదల చేసిన ఆర్థిక గణాంకాలు దిగ్భ్రాంతపరుస్తున్నాయి. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో చైనాలోని ప్రతి రంగమూ కరోనా దెబ్బకు కుంగి కుదేలైన విషయాన్ని ఆ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. నిరుడు తొలి రెండు నెలల కాలంతో పోలిస్తే ఈ సంవత్సరం అదే కాలంలో చైనాలో రీటైల్‌ అమ్మకాలు 20.5 శాతం దెబ్బతిన్నట్లు తేలింది. పారిశ్రామిక ఉత్పత్తి 13.5 శాతం కోసుకుపోయినట్లు, స్థిరాస్తి పెట్టుబడులు పాతికశాతం తగ్గిపోయినట్లు జాతీయ గణాంకాల బ్యూరో వెల్లడించింది. ప్రపంచ ఆర్థికంలో 17శాతం వాటా కలిగిన చైనా పరిస్థితి ఈ రకంగా తలకిందులు కావడం వివిధ దేశాల మీదా ప్రభావాన్ని కనబరుస్తోంది. ఈ ఏడాది ప్రపంచ ఆర్థికాభివృద్ధి గతంలో ఊహించినట్లుగా 2.9 శాతం కాక- 2.4శాతానికి పరిమితమవుతుందని ‘ఓఈసీడీ’ దేశాల కూటమి అంచనా వినిపించింది. ప్రపంచ ఆర్థికాభివృద్ధి రేటు 2.5 శాతానికంటే తక్కువగా ఉంటే దాన్ని మాంద్యంగా పరిగణిస్తారు. ఒకవేళ కరోనా వైరస్‌ ఉద్ధృతి ఇలాగే కొనసాగితే ఆర్థిక వ్యవస్థలు మరింత అడుగంటి అభివృద్ధి రేటు 1.5 శాతానికి చేరినా ఆశ్చర్యపోనవసరం లేదని ఓఈసీడీ కూటమి వ్యాఖ్యానిస్తోంది. కొన్ని వారాలుగా ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు పతనం అవుతున్న తీరు గమనిస్తే ‘ఓఈసీడీ’ భయాలు నిజమయ్యే అవకాశాలూ ఉన్నాయనిపిస్తోంది. ఈ మహమ్మారిని ఎదుర్కొనే క్రమంలో ఉత్తర అమెరికా, ఐరోపా దేశాల్లోని ప్రభుత్వాలు, కేంద్ర బ్యాంకులు పెద్దయెత్తున దిద్దుబాటు చర్యలు చేపడుతున్నాయి. ఆసియా దేశాల ఆర్థిక వ్యవస్థలూ తీవ్ర ఒడుదొడుకుల్లో ప్రస్థానిస్తున్నాయి. ‘సాధారణ స్థితికి చేరుకోవడానికి చైనా ఇప్పటికీ ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ తరుణంలో ఐరోపా, అమెరికాల్లో పరిస్థితులు మరింత దిగజారడం ఖాయంగా కనిపిస్తోంది. 24వేల కరోనా కేసులతో చైనా తరవాతి స్థానంలో ఇటలీ కొనసాగుతుండగా, తొమ్మిది వేల కేసులతో స్పెయిన్‌, నాలుగు వేల కేసులతో అమెరికా కరోనా ముప్పును ఎదుర్కొంటున్నాయి. కొనుగోళ్లు త్గœడం, వస్తు సరఫరాకు విఘాతం ఏర్పడటం, జనం దాదాపుగా ఇళ్లకు పరిమితం కావడం వంటి కారణాల వల్ల ఈసారి అమెరికా జీడీపీ వృద్ధిరేటు బాగా తగ్గుతుందని ‘గోల్డ్‌మ్యాన్‌ శాచ్స్‌’ అభిప్రాయపడుతోంది. గతంలో ఊహించిన విధంగా 1.2 శాతం కాకుండా వృద్ధి రేటు ఈసారి 0.4శాతానికే పరిమితం కానుందని ఆ సంస్థ అభిప్రాయపడింది. ఇదే పరిస్థితి కొనసాగితే 2008 నాటి మాంద్యం పరిస్థితులు పునరావృతమై అమెరికా ఆర్థిక వ్యవస్థ రెండో త్రైమాసికంలో ఎనిమిది శాతం మేర కుంగిపోనుందన్నది ఆర్థిక వేత్తల అభిప్రాయం.
     ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు రెండు లక్షలకు పైబడటంతో అన్ని దేశాల్లో కర్ఫ్వూ వాతావరణం కనిపిస్తోంది. అమ్మకాలు, కొనుగోళ్లు క్షీణముఖం పట్టడంతో ఆ ప్రభావం స్టాక్‌ మార్కెట్లపై ప్రసరిస్తోంది. చిన్నపాటి ప్రతికూల వార్తకే తల్లడిల్లే స్టాక్‌ విపణులకు కరోనా ఒకరకంగా కోలుకోలేని దెబ్బే. ప్రపంచవ్యాప్త స్టాక్‌ మార్కెట్లలో కొనుగోళ్లు, అమ్మకాలను అంచనా వేయలేని పరిస్థితి ఏర్పడింది. ఏ ధర వద్ద ఏ స్టాక్‌ కొనాలో, ఎందుకు కొనాలో అంచనా దొరకని అనిశ్చితి రాజ్యమేలుతోంది. ఈ ప్రభావం దేశాల ఆర్థిక వ్యవస్థలను కుంగదీస్తోంది. వేగంగా నగదు నిల్వలు కరిగిపోతుండటంతో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడమూ వ్యాపార సంస్థలకు కనాకష్టంగా మారుతోంది. నెల రోజుల క్రితం అమెరికా స్టాక్‌ మార్కెట్‌ సూచీ రికార్డు స్థాయులకు ఎగబాకింది. కానీ ముప్ఫై రోజుల వ్యవధిలోనే అమెరికన్‌ స్టాక్‌ మార్కెట్‌ 27 శాతం కోసుకుపోయింది. ఈ పరిణామాల కారణంగా స్వల్పకాలిక రుణ వితరణ వ్యవస్థల పరిస్థితి గందరగోళంగా మారిందని ఫెడరల్‌ రిజర్వ్‌ బోర్డ్‌ పరిశోధన-గణాంక విభాగం మాజీ అధిపతి డేవిడ్‌ విల్‌కాక్స్‌ ఆందోళన వ్యక్తం చేశారు. యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లను మట్టానికి తెగ్గోసింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ బ్యాంకులు అతి తక్కువ వ్యయంతోనే అమెరికన్‌ డాలర్లు కొనుగోలు చేయడానికి వీలుగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. లావాదేవీలకు చురుకు పుట్టించేందుకు అనువుగా న్యూయార్క్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ సైతం 500 బిలియన్‌ డాలర్లను మార్కెట్లలోకి విడుదల చేయనున్నట్లు తాజాగా ప్రకటించింది. స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలితే నగదు నిల్వలు హరించుకుపోయి లావాదేవీలపై ప్రభావం పడుతుంది. వినియోగమూ అడుగంటుతుంది. ఫలితంగా తయారీ, సేవా రంగాలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతాయి.

విధానాల పునస్సమీక్ష
     అమెరికన్‌ మార్కెట్లతోపాటు ప్రపంచవ్యాప్త విపణులన్నీ కరోనా దెబ్బను కాచుకోలేక విలవిల్లాడుతున్నాయి. ఆర్థిక వ్యవస్థలను మాంద్యం వణికిస్తోంది. డిమాండు, సరఫరా వ్యవస్థలు పడకేయడంతో ప్రపంచాన్ని మాంద్యం కమ్ముకుంటోంది. అమెరికన్‌ కేంద్ర బ్యాంకుతోపాటు; జీ-7 దేశాల ప్రభుత్వాలన్నీ వడ్డీరేట్లను అనూహ్యంగా తగ్గించి డిమాండుకు తద్వారా పారిశ్రామిక ఉత్పత్తికి చురుకు పుట్టించే విధంగా విధానాలను పునస్సమీక్షించుకుంటున్నాయి. కొవిడ్‌-19 వణికిస్తున్న ప్రస్తుత తరుణంలో ఆర్థిక వ్యవస్థల పునరుజ్జీవనం అంత సులభ సాధ్యం కాదు. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు మూడు రకాలుగా స్పందించే అవకాశాలున్నాయి. ఒకటి- ఉత్పత్తి రంగానికి చురుకు పుట్టించే విధానాలను రూపొందించి, దీర్ఘకాలంలో వాటిని స్థిరంగా అమలు చేసినట్లయితే కరోనా విసిరిన సవాలును ఎదుర్కొనే అవకాశాలు కొట్టిపారేయలేనివి. రెండు- తాత్కాలికంగా వృద్ధి రేట్ల పునరుద్ధరణ సాధ్యమవుతుంది. కానీ, ఉత్పత్తి రంగంపై ఏదో స్థాయిలో శాశ్వతంగా ప్రతికూల ప్రభావం పడుతుంది. మూడు- ఆర్థిక వ్యవస్థలపై కోలుకోలేని దెబ్బపడుతుంది. కార్మిక విపణులు, పెట్టుబడులు, ఉత్పాదకత చిందరవందర కావడంతో పంపిణీ వ్యవస్థలు గాడితప్పుతాయి.
     ప్రపంచ దేశాలన్నీ కరోనా వైరస్‌పై ఉమ్మడి పోరు సాగించాల్సిన తరుణమిది. శాస్త్ర పరిశోధనలకు పదునుపెట్టి కొవిడ్‌-19 విస్తృతిని అడ్డుకునేందుకు అనువైన టీకాలను వెంటనే అందుబాటులోకి తీసుకురావాలి. ఆర్థిక రంగంలోనూ వివిధ దేశాలు సమన్వయంతో అడుగు ముందుకు వేయాలి. అమెరికా-చైనాల మధ్య వాణిజ్య యుద్ధం కొంతకాలం క్రితం వరకు జోరుగా సాగింది. ఈ పరిస్థితుల్లో ప్రపంచ దేశాల మధ్య ఆశించిన స్థాయి సహకార, సమన్వయాలు సాధ్యమా అంటే సందేహమే. వృద్ధి సాధనకు ఆర్థిక ఉద్దీపన పథకాలే శరణ్యమనే పరిస్థితి దిశగా మనం అడుగులు వేస్తున్నాం. దాదాపు ప్రపంచ దేశాలన్నీ తీవ్రమైన రుణ భారాన్ని నెత్తిన మోస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఒక పరిమితికి మించి, అహేతుకంగా ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటించినా అవి వికటించే ప్రమాదమూ కొట్టిపారేయలేనిది. కాబట్టి ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీలను జాగ్రత్తగా అమలు చేయాలి. మౌలిక సౌకర్యాల కోసం, ఉత్పాదకతను పెంచే రంగాల కోసం ఉద్దీపన ప్యాకేజీలను తెలివిగా వినియోగించాలి. ఒక్క ముక్కలో, కరోనా ముప్పు పెరిగి ఆర్థిక మాంద్యం ముమ్మరించే కొద్దీ- ప్రపంచ దేశాల మధ్య సహకార సమన్వయాలు పెరగాల్సిన అవసరం ఉంది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు ఓ వైరస్‌ సవాలుగా నిలిచిన దశలో- ప్రపంచ దేశాల నాయకులు ఒక్క తాటిపైకి వచ్చి, ఉమ్మడిగా ముందుకు సాగి వ్యవస్థలను గాడినపెడతారా లేదా అన్నదే ఇప్పుడు ఆసక్తికరం.

ఉత్పత్తి రంగానికి పెద్ద దెబ్బ
     వస్తు సేవల సరఫరాకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్న పరిస్థితుల్లో సహజంగానే ఆ ప్రభావం ఉత్పత్తి రంగంపై పడుతుంది. ఉత్పత్తి రంగానికి ఆయువు పట్టయిన తూర్పు ఆసియాపై కరోనా ప్రభావం ప్రబలంగా ఉంది. క్రమంగా కొవిడ్‌-19 ప్రభావం అమెరికా, జర్మనీ వంటి పారిశ్రామిక దిగ్గజాలకూ విస్తరిస్తోంది. దీనివల్ల ప్రపంచ ఉత్పత్తి రంగం తాత్కాలికంగానైనా చతికిలపడుతుందనే చెప్పాలి. ముడివనరుల వ్యవస్థలు చెల్లాచెదురు కావడంతో కరోనా ప్రభావం తక్కువ ఉన్న దేశాల్లో పారిశ్రామిక కార్యకలాపాల కొనసాగింపునకూ అడ్డంకి ఏర్పడుతోంది. ప్రపంచవ్యాప్తంగా వినియోగం, పారిశ్రామిక పెట్టుబడులు తగ్గడమూ ఉత్పత్తి కార్యకలాపాలను దెబ్బతీస్తోంది. హోటళ్లు, సినిమా థియేటర్లు, వ్యాపార సముదాయాలు మూతపడటంతో సేవల రంగంపైనా భారీ ప్రభావం పడింది. ప్రధానంగా కరోనా దెబ్బ మాత్రం ఉత్పత్తి రంగానికే గట్టిగా తగిలింది.
 

- డాక్టర్‌ రాధా రఘురామపాత్రుని
(రచయిత్రి- అంతర్జాతీయ వాణిజ్య రంగ నిపుణులు)

Posted Date: 15-06-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం