• facebook
  • whatsapp
  • telegram

  ఆర్థిక బలం బ్యాంకులకు ఊతం

     దేశంలోని పది ప్రభుత్వరంగ బ్యాంకులను నాలుగు బ్యాంకుల్లో విలీనం చేయబోతున్నట్లు నిరుడు ఆగస్టులో భారత ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ఏప్రిల్‌ ఒకటో తేదీ (నేటి) నుంచి అమలులోకి రానున్న విలీన ప్రతిపాదనలకు కేంద్ర మంత్రిమండలి కొన్ని రోజుల క్రితం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. 2017లో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు చెందిన వివిధ అనుబంధ శాఖలు ఎస్‌బీఐలో విలీనమయ్యాయి. ఆ తరవాత దేనా బ్యాంక్‌, విజయ బ్యాంక్‌ నిరుడు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో కలిసిపోయాయి. ప్రభుత్వ రంగ బ్యాంకు(పీఎస్‌బీ)ల విలీనం జరుగుతుందన్న సంకేతాలే ప్రభుత్వంనుంచి అందుతున్నాయి. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌, యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలు కలిసిపోయి రూ.18 లక్షల కోట్ల వ్యాపార విలువ కలిగిన ఏకరూప వ్యవస్థగా, ఎస్‌బీఐ తరవాత అత్యధిక బ్రాంచీలున్న రెండో అతిపెద్ద బ్యాంకుగా ఆవిర్భవించనున్నాయి. సిండికేట్‌ బ్యాంకులో కెనరా బ్యాంక్‌ విలీనంవల్ల రూ.15.2 లక్షల కోట్ల వ్యాపార విలువతో దేశంలోనే నాలుగో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఏర్పడనుంది. బ్యాంకు శాఖల ప్రాతిపదికన ఈ పీఎస్‌బీ దేశంలో మూడో స్థానంలో నిలువనుంది. యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఆంధ్రా బ్యాంక్‌, కార్పొరేషన్‌ బ్యాంకులు కలిసి- రూ.14.6 లక్షల కోట్ల వ్యాపారంతో దేశంలోనే మూడో అతిపెద్ద విలీనం ఆవిష్కారం కానుంది. అత్యధిక బ్యాంకు శాఖలున్న నాలుగో పీఎస్‌బీగానూ ఇది అవతరించనుంది.
 

గ్రామీణ ప్రజలకు చేరువగా...
     భారత్‌లో 2019 సెప్టెంబరు చివరినాటికి అన్ని రకాల షెడ్యూల్డ్‌ వాణిజ్య బ్యాంకు(ఎస్‌సీబీ)లకు పాలన కార్యాలయాలను మినహాయిస్తే మొత్తం 1,47,903 బ్రాంచీలున్నాయి. 2006 మార్చి 31న ఈ బ్రాంచీల సంఖ్య 69,330గా ఉంది. పదమూడేళ్ల నాటితో పోలిస్తే వివిధ బ్యాంకుల బ్రాంచీలు దేశవ్యాప్తంగా ఇబ్బడిముబ్బడిగా విస్తరించాయి. మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, పశ్చిమ్‌ బంగ, కేరళల్లో బ్యాంకు శాఖలు రెట్టింపయ్యాయి. గ్రామాల్లోని బ్యాంకు శాఖల సంఖ్య 52,489గా ఉంది. 2019 మార్చి నాటికి భారతీయ బ్యాంకింగ్‌ రంగంలో మొత్తం ఆస్తుల విలువ రూ.1,66,01,224 కోట్లు; డిపాజిట్లు రూ.1,28,87,262. రుణాలు, అడ్వాన్సుల రూపంలో తీసుకున్న మొత్తం రూ.97.09 లక్షల కోట్లు. గడచిన ఏడేళ్ల కాలంలో బ్యాంకుల ద్వారా దేశంలోని పౌరులకు చెల్లించిన రుణాల సగటు విలువ రెట్టింపయింది. నిరర్థక ఆస్తుల సమస్యవల్ల 2019లో భారతీయ బ్యాంకింగ్‌ వ్యవస్థకు రూ.23,397కోట్లు వచ్చాయి. ఎక్కడికక్కడ బ్యాంకుల ఏర్పాటుతోపాటు అన్ని ప్రాంతాలకూ ఏటీఎమ్‌లు విస్తరించడంతో బ్యాంకింగ్‌ వ్యవస్థ ప్రజలకు బాగా చేరువయింది. రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గణాంకాల ప్రకారం దేశంలోని అన్ని ఎస్‌సీబీలకు 2019 మార్చి నాటికి కలిసి మొత్తం 2,00,532 ఏటీఎమ్‌లు ఉన్నాయి. 2006 మార్చిలో దేశంలోని ఏటీఎమ్‌ల సంఖ్య 21,147 మాత్రమే! 2006 నుంచి భారత్‌లో బ్యాంకింగ్‌ విస్తరణ కొత్త పుంతలు తొక్కింది. దేశంలో ప్రస్తుతం 5.41 లక్షల విభాగాలున్నాయి. ఇవి చాలావరకు చిన్న పట్టణాలు, గ్రామాల్లో అధికంగా ఉండటం గమనార్హం.
     విలీనం వల్ల 2017లో 27గా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 12కు కోసుకుపోనుంది. మరోవంక పీఎస్‌బీల విలీనంతో ఒక్కో బ్యాంకు బ్యాలెన్స్‌ షీట్‌ పరిమాణం బాగా పెరగనుంది. ఫలితంగా 12 పీఎస్‌బీల్లో ఏడింట ఎనిమిది లక్షల కోట్లు లేదా అంతకంటే ఎక్కువ వ్యాపారం చోటుచేసుకోనుంది. విలీనాల ద్వారా బ్యాంకుల స్థిరీకరణ జరుగుతున్న తీరు అనేక కీలక ప్రశ్నలకు తెర తీస్తోంది. దీనివల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు మంచి జరుగుతుందా; ఉద్యోగాలకు పెద్దయెత్తున కోతపడే ప్రమాదం ఉందా, దేశంలోని బ్యాంకు శాఖలు గణనీయంగా తగ్గిపోతాయా; దీనివల్ల సేవల నాణ్యత ఇనుమడించనుందా లేక దారుణంగా దెబ్బతిననుందా... వంటి అనేక ప్రశ్నలకు జవాబులు అన్వేషించాల్సి ఉంది. ఈ తరహా విలీనాలు చాలాసార్లు జవాబులకన్నా ప్రశ్నలనే ఎక్కువగా మిగులుస్తుంటాయి. ఈ విలీనంవల్ల ఉద్యోగులకు ఎలాంటి ముప్పూ ఉండదని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ భరోసా ఇచ్చారు. విలీనాల ద్వారా పీఎస్‌బీల పరిమాణం పెరగడంతోపాటు- వాటి బ్యాలెన్స్‌ షీట్‌ ఇనుమడిస్తుందని, దానివల్ల పెట్టుబడి అవసరాలను నెరవేర్చుకోవడానికి సంబంధించి వెసులుబాటు లభిస్తుందని తద్వారా ప్రస్తుత ఆర్థిక వ్యవస్థలో పోటీ వాతావరణాన్ని తట్టుకుని నిలబడటం సాధ్యపడుతుందని ఈ చర్యను సమర్థించేవారు వాదిస్తున్నారు. విలీనాల ద్వారా భారీ పీఎస్‌బీల ఆవిష్కరణవల్ల ‘షేర్‌ హోల్డర్‌’ విలువ ఇనుమడిస్తుందని, భవిష్యత్తులో ఎప్పుడైనా పెట్టుబడుల ఉపసంహరణకు వెళ్లినా ప్రయోజనం చేకూరుతుందని విధాన రూపకర్తల ఆలోచన.
     భారత్‌ వంటి దేశానికి బ్యాంకులు విరివిగా ఉండాలి. పరిమాణంపరంగా పెద్ద బ్యాంకులు ఉంటే సరిపోదు. మరీ ముఖ్యంగా దేశంలో పెద్దయెత్తున బ్యాంకు శాఖలను విస్తరించాల్సిన అవసరం ఉంది. భారత జనాభాలో అటు ఇటుగా నాలుగోవంతు ఉన్న అమెరికాలో- ఎఫ్‌డీఐసీ వద్ద బీమా చేయించుకున్న 77వేల వాణిజ్య బ్యాంకులున్నాయి. భారత్‌ పెట్టుబడులపరంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న దేశం కాబట్టి, మదుపుదారుల నుంచి డబ్బు సేకరించి కావలసినవారికి ఆ మొత్తాన్ని రుణంగా ఇచ్చేందుకు బ్యాంకులను మించిన సాధనాలు లేవు. దేశంలో ఇప్పుడు సగటున 8,700 జనాభాకు ఒక బ్యాంకు శాఖ ఉంది. 1969లో సగటున 64వేల మందికి ఒక బ్యాంకు శాఖ ఉండేది. అయిదు దశాబ్దాల్లో దేశ జనాభా కనీసం మూడు రెట్లు పెరిగింది.


సవాలు కానున్న కరోనా సంక్షోభం
     భారీ బ్యాంకులు విలీనమైతే ప్రజలకు పెద్దయెత్తున ప్రయోజనం చేకూరుతుందనడానికి అంతర్జాతీయంగా చెప్పుకోదగిన దాఖలాలు లేవు. ఎస్‌బీఐ అనుభవం భిన్నమైన దృక్కోణాలను ఆవిష్కరిస్తోంది. దేశవ్యాప్తంగా బ్యాంకుల్లో పనిచేసే సిబ్బందిపై ఎలాంటి వేటు పడకపోయినా- శాఖలు మాత్రం భారీగా తగ్గినట్లు ఎస్‌బీఐ విలీనాన్ని గమనిస్తే తేటపడుతుంది. తక్కువ బ్యాంకులు ఉంటే అవి సంక్షోభంలో చిక్కుకున్నప్పుడు ఉద్దీపన ప్యాకేజీ పేరిట ప్రభుత్వం భరించాల్సిన ఖర్చు తగ్గుతుందనుకోవడమూ సరికాదు. 2008 మాంద్యంలోనూ, ఇటీవల యెస్‌ బ్యాంకు ఇబ్బందుల్లో కూరుకుపోయినప్పుడూ ప్రభుత్వమే రంగంలోకి దిగి ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించాల్సి వచ్చింది. కాబట్టి, ప్రభుత్వ బ్యాంక్‌ అయినా ప్రైవేటు బ్యాంక్‌ అయినా సంక్షోభంలో పడితే చివరికి ఖర్చు సర్కారే భరించాల్సి ఉంటుందన్నది వాస్తవం. కరోనా విసిరిన సవాలుతో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలయింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు నేలచూపులు చూస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉంది. 2008 నాటి మాంద్యం తరవాత దేశం ఎన్నో ఆర్థిక సవాళ్లను, సమస్యలను ఎదుర్కొంది. పదేళ్ల కాలంలో ఈ సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టకుండా ప్రభుత్వం ఎప్పటికప్పుడు వాటిని వాయిదా వేస్తూ వచ్చిన ఫలితంగా సంక్షోభం తీవ్రతరమైంది. కరోనా కారణంగా మారిన పరిస్థితుల్లో బ్యాంకుల స్థిరీకరణ పేరిట విలీనానికి తొందరపడకుండా ఆర్థికంగా దెబ్బతిన్న అనేక రంగాలకు ప్రాణవాయువులు ఊదేందుకు ప్రభుత్వం ప్రాధాన్యమివ్వాలి. పతనోన్ముఖమైన ప్రభుత్వ రంగ వ్యవస్థలను పునర్‌నిర్మించి, వాటికి సహేతుక దిశానిర్దేశం చేయడమే కేంద్ర సర్కారు లక్ష్యం కావాలి. అమెరికా తరహాలో బ్రహ్మాండంగా అభివృద్ధి చెందిన బాండ్‌ మార్కెట్‌ భారత్‌లో లేదు. కాబట్టి బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు మాత్రమే ఆర్థిక పునర్నిర్మాణంలో కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. ఈ బృహత్తర బాధ్యతను ప్రైవేటు రంగం నిర్వహించలేదు. భారత్‌వంటి అనేక సంక్లిష్టతలున్న దేశంలో తలెత్తే భిన్నమైన సమస్యలను ప్రైవేటు బ్యాంకింగ్‌ రంగం పరిష్కరించలేదు. గ్రామీణ భారతావనికి బ్యాంకింగ్‌ రంగాన్ని విస్తరించడమూ ప్రభుత్వ రంగ బ్యాంకులవల్లే సాధ్యం. చిన్న పట్టణాలు, గ్రామాల్లోకి సాధ్యమైనంత ఎక్కువ సంఖ్యలో బ్యాంకు శాఖలను విస్తరించాల్సి ఉంది. ప్రజల కొనుగోలు శక్తిని పెంచడం, మార్కెట్‌ విస్తరణ వంటి కీలక కార్యక్రమాలనూ ప్రభుత్వమే నిర్వహించాల్సి ఉంటుంది. మౌలిక సౌకర్యాల విస్తరణపై దృష్టిపెట్టకుండా- ఓటు బ్యాంకులను సంతృప్తి పరచడంకోసం ప్రజాకర్షక పథకాలకు విచ్చలవిడిగా డబ్బు ఖర్చుపెట్టిన ఫలితంగానే దేశం ఇప్పుడు ఆర్థికంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వం రెండు ముఖ్యమైన పనులు చేయాలి. 1. బ్యాంకుల స్థిరీకరణ కార్యక్రమాన్ని కొంతకాలం వాయిదా వేయడం లేదా నిలిపివేయడం. 2. బ్యాంకులకు భారీగా ఆర్థిక పరిపుష్టి చేకూర్చి, కరోనా వైరస్‌ వల్ల తలెత్తే సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొనేందుకు వాటిని సన్నద్ధం చేయాలి. ఈ కీలక చర్యలపై దృష్టిపెట్టని పక్షంలో 8-10శాతం వృద్ధి రేటును నిజం చేయడానికి ప్రభుత్వానికి మరెన్నో దశాబ్దాలు పట్టవచ్చు.


అండగా నిలిచిన సర్కారు
     బ్యాంకింగ్‌ రంగ విస్తరణను ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యాంశంగా పరిగణించి, పెద్దయెత్తున పెట్టుబడులు వెచ్చించి ప్రోత్సహించింది. దానివల్లే నేడు దేశమంతటా బ్యాంకింగ్‌ వ్యవస్థలు శాఖోపశాఖలుగా విస్తరించాయి. బ్యాంకులకు ప్రభుత్వం వైపు నుంచి దన్ను పెరిగింది. బ్యాంకులు ఏమాత్రం ఆర్థికంగా ఒడుదొడుకులు ఎదుర్కొన్నా ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగి నష్టనివారణ చర్యలు తీసుకుంటోంది. 1969కి ముందు ఈ పరిస్థితి లేదు. బ్యాంకులు తరచూ గాడి తప్పేవి. నిర్వహణ సమస్యలతో పెద్దయెత్తున బ్యాంకులు మూతపడ్డాయి. బ్యాంకు డిపాజిట్లకు ప్రభుత్వ రక్షణలు పెరుగుతున్నాయి. ప్రభుత్వం పూర్తిస్థాయిలో మద్దతు పలికినా గడచిన 20 ఏళ్ల కాలంలో కొన్ని బ్యాంకులు విఫలమైన సందర్భాలూ లేకపోలేదు. గ్లోబల్‌ ట్రస్ట్‌ బ్యాంక్‌, యెస్‌ బ్యాంకులు దారుణంగా దెబ్బతిన్నాయి. ఈ బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసిన వారికి ఏ చిన్న సమస్యా తలెత్తకపోవడం గుర్తించాల్సిన అంశం.

- డాక్టర్ ఎస్. అనంత్ 
రచయిత, ఆర్థికరంగ విశ్లేషకులు

Posted Date: 24-06-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం