• facebook
  • whatsapp
  • telegram

  ఆర్థిక సంక్షోభానికి ‘బహుముఖ’ కళ్లెం

* కొవిడ్‌ ప్రకంపనల మధ్య కేంద్రం కసరత్తు

     ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌-19 మహమ్మారి సృష్టిస్తున్న ఆరోగ్య, ఆర్థిక ఉత్పాతానికి దేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమవుతోంది. ఆరోగ్యపరంగా మానవాళిని భయకంపితుల్ని చేసిన కరోనా- కనీవినీ ఎరుగని రీతిలో ప్రపంచాన్ని ఒక ‘ఐసోలేషన్‌’ విభాగంగా మార్చేసింది. వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 21 రోజుల (ఏప్రిల్‌ 14 వరకు) లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థ అష్టదిగ్బంధంలో పడింది. ఉత్పత్తి నిలిచిపోయింది. కర్మాగారాలు మూతపడ్డాయి. సరఫరా గొలుసు స్తంభించింది. ఫలితంగా దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలై జీడీపీ వృద్ధిరేటు అనూహ్యంగా పడిపోయే ప్రమాదాన్ని సూచిస్తోంది. ఈ నేపథ్యంలో- ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచే ప్రయత్నంలో భాగంగా గతవారం ఆర్‌బీఐ పెద్దయెత్తున ద్రవ్య విధానపరమైన చర్యలకు తెరతీసింది.


అస్త్రాలను సంధించిన ఆర్‌బీఐ
     కొవిడ్‌ సృష్టిస్తున్న ఆర్థిక సునామీని ఎదుర్కొని దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచే ప్రయత్నంలో ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ మున్నెన్నడూ లేనివిధంగా ద్రవ్య విధాన అమ్ముల పొదిలో ఉన్న అస్త్రాలను ఒక్కసారిగా సంధించారు. వ్యవస్థలో నిధులు పుష్కలంగా ఉండే వెసులుబాటు కల్పించారు. రేపో రేటు (బ్యాంకులకిచ్చే స్వల్పకాలిక రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీ)ని ఏకంగా 75 బేసిస్‌ పాయింట్లు (0.75 శాతం) తగ్గించి 4.4శాతానికి పరిమితం చేశారు. అంతేకాక అవసరాన్నిబట్టి రెపోరేటును మరింత తగ్గించేందుకు రిజర్వు బ్యాంకు సిద్ధంగా ఉందన్న సంకేతాన్నీ ఇచ్చారు. రెపోరేటు తగ్గింపుతో బ్యాంకులు ఈ రెపోరేటుకు అనుసంధానమైన వడ్డీ రేటు (రెపో లింక్డ్‌ లెండింగ్‌ రేటు)పై ఇచ్చిన రుణాల వడ్డీ రేట్లను తగ్గించాల్సి ఉంది. అయితే, గతంలో ఆర్‌బీఐ రెపోరేటును తగ్గించిన సందర్భాల్లో బ్యాంకులు వడ్డీ రేట్ల తగ్గింపు ప్రయోజనాన్ని రుణగ్రహీతలకు పూర్తి స్థాయిలో అందించకుండా అరకొర తగ్గింపులతోనే సరిపెట్టాయి. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో రిజర్వు బ్యాంక్‌ అత్యవసరంగా చేపట్టిన రెపోరేటు తగ్గింపును యథాతథంగా రుణగ్రహీతలకు అందజేయాల్సిన బాధ్యత అన్ని బ్యాంకులపై ఉంది.


పొంచి ఉన్న మహావిపత్తు
     కరోనా వైరస్‌ ప్రభావంతో ప్రపంచ దేశాలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. పలు అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థలు మాంద్యంలోకి జారుతున్నాయి. ఐరోపా దేశాల ఆర్థిక వ్యవస్థలు ఇప్పటికే మాంద్యంలోకి కుంగిపోతున్నాయి. ఈ ఏడాది జులై నాటికి అమెరికా, ఐరోపా దేశాల ఆర్థిక వ్యవస్థలు మాంద్యం బారినపడే ప్రమాదముందని ప్రముఖ అంతర్జాతీయ ఆర్థిక సంస్థ జేపీ మోర్గాన్‌ ఒక నివేదికలో పేర్కొంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి ప్రవేశించిందని, ఇది 2009నాటి ఆర్థిక సంక్షోభం కంటే మరింత తీవ్రంగా ఉంటుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్‌ఎఫ్‌) అధినేత్రి క్రిస్టాలినా జార్జివా అభిప్రాయపడ్డారు. దేశంలో లాక్‌డౌన్‌ వల్ల ఉత్పన్నమైన ఆత్యయికస్థితి దేశ ఆర్థిక వ్యవస్థను మరింత సంక్షోభంలోకి దింపుతోంది. దేశవ్యాప్తంగా నిత్యావసర వస్తువులు మినహా మిగిలిన వ్యాపార కార్యకలాపాలు పూర్తిగా స్తంభించాయి. 80 శాతం పైగా ఉత్పత్తి నిలిచిపోయింది. మూడు వారాల లాక్‌డౌన్‌ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు దాదాపు రూ.6.3లక్షల కోట్ల నుంచి రూ.7.2లక్షల కోట్ల దాకా నష్టం వాటిల్లుతుందని తాజాగా కేర్‌ రేటింగ్‌ సంస్థ అంచనా వేసింది. 2019-20 ఆర్థిక సంవత్సరపు వృద్ధిరేటు అంచనాలన్నీ తలకిందులవుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి - మార్చి)లో జీడీపీ వృద్ధిరేటు 1.5 నుంచి 2.5 శాతానికే పరిమితం కావచ్చన్న అంచనాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. ఒకవైపు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర మాంద్యానికి దరిదాపుల్లో ఉంది. మరోవైపు జీడీపీ వృద్ధిరేటు అనూహ్యంగా దిగజారుతోంది. ప్రస్తుతం నెలకొన్న సంక్లిష్టతల మధ్య 2020-21 ఆర్థిక సంవత్సర వృద్ధి అంచనాలను ప్రకటించడానికి ఆర్‌బీఐ వెనకడుగు వేసిందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్ఛు కొవిడ్‌ ప్రభావం కారణంగా 2020లో భారత్‌ జీడీపీ వృద్ధిరేటు 2.5శాతం (గత అంచనా 5.3శాతం) ఉంటుందని మూడీస్‌ రేటింగ్‌ సంస్థ అంచనా వేసిందంటే పరిస్థితి తీవ్రత బోధపడుతోంది.
     బ్యాంకింగ్‌ వ్యవస్థలో నిధుల లభ్యతను మరింతగా పెంచి వివిధ రంగాలకు అవసరమైన మేర రుణ వితరణ సజావుగా సాగేందుకు రిజర్వు బ్యాంకు సీఆర్‌ఆర్‌ (క్యాష్‌ రిజర్వ్‌ రేషియో- నగదు నిల్వల నిష్పత్తి)ని 100 బేసిస్‌ పాయింట్లు (ఒక శాతం) తగ్గించి, మూడు శాతానికి పరిమితం చేసింది. ఫలితంగా బ్యాంకులకు అదనంగా రూ.1.37లక్షల కోట్లు అందుబాటులోకి వస్తాయి. ప్రస్తుతం లాక్‌డౌన్‌ నేపథ్యంలో రుణ గిరాకీ స్తబ్దుగా ఉన్నప్పటికీ- ఒక్కసారి లాక్‌డౌన్‌ ఎత్తేసిన తరవాత రుణ గిరాకీ అనూహ్యంగా పెరిగి నిధుల కొరత ఏర్పడే అవకాశముంది. అందువల్ల బ్యాంకింగ్‌ వ్యవస్థ ఎటువంటి పరిస్థితుల్లోనూ నిధుల కొరతను ఎదుర్కొనకుండా ఆర్‌బీఐ ముందస్తు చర్యలు చేపట్టింది. 21 రోజుల లాక్‌డౌన్‌తో దేశ ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా స్తంభించింది. జన జీవనం అతలాకుతలమైంది. అసంఘటిత రంగంలో కోట్లాదిమంది ఉపాధి కోల్పోయారు. మధ్యతరగతి ప్రజలు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నారు. ఈ నేపథ్యంలో అటు బ్యాంకులకు, ఇటు రుణగ్రహీతలకు తాత్కాలిక ఉపశమనాన్నిచ్చే దిశలో ఆర్‌బీఐ చర్యలు చేపట్టింది. వాణిజ్య బ్యాంకులు, సహకార బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, గృహ రుణసంస్థలు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న రిటైల్‌ (గృహ, వాహన, విద్య, వ్యక్తిగత) రుణాల వాయిదాల చెల్లింపు(ఈఎమ్‌ఐ)లపై మూడు నెలల విరామం ప్రకటించింది. అదేవిధంగా వ్యాపార, వాణిజ్య సంస్థలకు క్యాష్‌ క్రెడిట్‌, ఓవర్‌ డ్రాఫ్ట్‌ల రూపంలో వచ్చిన వర్కింగ్‌ క్యాపిటల్‌ రుణాలపై మూడు నెలల వరకు వడ్డీ చెల్లింపును వాయిదా వేసే వెసులుబాటు కల్పించింది. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఆర్‌బీఐ అసాధారణ రీతిలో ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలోకి జారకుండా పలు చర్యలు చేపట్టింది. బ్యాంకులు కూడా ఈ సంక్షుభిత సమయంలో దీటుగా స్పందించి, రెపోరేటు తగ్గింపును రుణగ్రహీతలకు పూర్తి స్థాయిలో బదిలీ చేయడంతోపాటు రుణ వితరణ పెంచేందుకు కృషిచేయాల్సిన అవసరం ఉంది. సూక్ష, చిన్న, మధ్యతరహా సంస్థ(ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ)లకు మరింత ఆర్థిక సాయాన్ని అందించే దిశగా ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై పెద్దయెత్తున ఖర్చు చేయడంతోపాటు వ్యవసాయరంగాన్ని ఆదుకునేందుకు ప్రాధాన్యమివ్వాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం ద్రవ్యలోటు గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కేవలం మూడు నెలల రుణ చెల్లింపుల విరామంతో సమస్య తీరదు. పైగా ఈ నిబంధనవల్ల బ్యాంకులు, బ్యాంకేతర ఆర్థిక సంస్థల మొండిబకాయిలు కుప్పలు తెప్పలుగా పెరిగే ప్రమాదం ఉంది. మూడు నెలల అనంతరం పరిస్థితి మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం ఉన్నందున దేశ ఆర్థికరంగాన్ని ఆదుకునేందుకు ఆర్‌బీఐ గవర్నర్‌ సాహసోపేత నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

 

యుద్ధప్రాతిపదికన చర్యలు అవసరం
     భారత్‌లో కొవిడ్‌ మహమ్మారి ఉద్ధృతి మరింత తీవ్రమై లాక్‌డౌన్‌ ఏప్రిల్‌ 14 తరవాత మరి కొంతకాలం కొనసాగితే దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభానికి గురవుతుంది. పరిశ్రమలు మూతపడటంతోపాటు కార్పొరేట్‌ సంస్థల సంక్షోభం మరింత ముదురుతుంది. బ్యాంకుల నిరర్థక ఆస్తులు అనూహ్యంగా పెరుగుతాయి. దేశ కార్పొరేట్‌ రంగంలో దివాలాలు పెరుగుతాయి. నిరుద్యోగం ఎక్కువవుతుంది. దివాలా స్మృతి (ఐబీసీ) ద్వారా ప్రస్తుతం సాగుతున్న మొండిబకాయిల పరిష్కార ప్రక్రియ కుంటువడుతుంది. మొత్తంమీద దేశ ఆర్థిక వ్యవస్థ మరో మహా ఉత్పాతాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. రాబోయే ఆర్థిక సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు అటు ప్రభుత్వం, ఇటు రిజర్వు బ్యాంకు బహుముఖ వ్యూహంతో సిద్ధమవుతున్నాయి. లాక్‌డౌన్‌వల్ల తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న బడుగు వర్గాలకు ఊరటనిచ్చేందుకు ప్రభుత్వం రూ.1.70లక్షల కోట్ల ఉద్దీపన పథకాన్ని ప్రకటించింది. అయితే, కరోనా వ్యాప్తి వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యం బారినపడే ప్రమాదమున్న దృష్ట్యా ఆ ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్రంగా ఉంటుంది. అందువల్ల పరిస్థితిని సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం పలు రంగాలకు ఉద్దీపన పథకాలను అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే విమానయానం, పర్యాటక రంగాలతోపాటు టెలికాం, విద్యుత్‌ వంటివీ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. సకాలంలో ఈ రంగాలను ఆదుకొనేందుకు ఆర్థిక ఉద్దీపనలు అందకపోతే సంక్షోభం మరింత తీవ్రమవుతుంది. ఈ ఆర్థిక సునామీని అడ్డుకోవాలంటే ప్రభుత్వం, రిజర్వు బ్యాంకు మరింత సమన్వయంతో యుద్ధప్రాతిపదికపై చర్యలు చేపట్టాలి. ప్రభుత్వం సంక్షేమ పథకాలపై పెద్దయెత్తున ఖర్చుచేయడంతోపాటు వ్యవసాయ రంగాన్ని ఆదుకొనేందుకు చర్యలు చేపట్టాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం ద్రవ్యలోటు గురించి పెద్దగా పట్టించుకోనవసరం లేదు. ఇది ఆర్థిక సూత్రాలను తిరగరాయాల్సిన సమయం. దేశ ఆర్థిక వ్యవస్థను మాంద్యం బారిన పడకుండా చూడటానికి ప్రభుత్వం; ఆర్‌బీఐ ద్రవ్య విధానపరమైన చర్యలతో మరింత వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. నిరర్థక ఆస్తుల నిబంధనలను సరళతరం చేయడంతోపాటు రుణ పునర్‌వ్యవస్థీకరణ పథకాల అమలుకు సిద్ధపడాలి.

- తుమ్మ‌ల కిశోర్‌
ర‌చ‌యిత‌, బ్యాంకింగ్ రంగ నిపుణులు

Posted Date: 24-06-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం