• facebook
  • whatsapp
  • telegram

  దేశార్థిక ఆరోగ్యానికీ వైరస్

* సమష్టి పోరుతోనే విజయం

     కృతి, ప్రపంచీకరణ రెండూ కలిసి ఆధునిక మానవాళికి కరోనా వైరస్‌ రూపంలో అగ్నిపరీక్ష పెడుతున్నాయి. వైరస్‌ వాప్తిని కట్టడి చేసి, ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు విధించిన లాక్‌డౌన్‌, భారత ఆర్థిక వ్యవస్థకు గోరుచుట్టుపై రోకలిపోటు లాంటి దెబ్బ. వ్యవసాయం, తయారీ, నిర్మాణం, రవాణా, ఆహార, ఆతిథ్యం, పర్యాటకం వంటి కీలక రంగాలు పూర్తిగా పడకేస్తున్నాయి. జాతీయ, అంతర్జాతీయ వర్తక వ్యాపారాలు స్తంభించిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన వస్తు సరఫరా గొలుసు తెగిపోయింది. ఫలితంగా ఉపాధి, ఆదాయాలు ఆగిపోయాయి. వస్తుసేవల గిరాకీ అమాంతంగా పతనమైంది. మొత్తం ఆర్థిక వ్యవస్థే స్తంభించింది. కరోనా లాక్‌డౌన్‌ వల్ల దేశ ఆర్థిక వృద్ధిరేటు 2019-20లో అయిదు శాతం నుంచి 4.8 శాతానికి పడిపోతుందని తొలుత అంచనాలు వినిపించాయి. అనంతరం అది ఇంకా పతనం కావచ్చని నిపుణులు భావించారు. లాక్‌డౌన్‌ ఇంకా కొనసాగితే అనేక సూక్ష్మ చిన్న పరిశ్రమలు మూతపడతాయి. అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) లెక్కల ప్రకారం అసంఘటిత రంగంలో పనిచేసే 40 కోట్లమంది పేదరికం కోరల్లో చిక్కుకుంటారు. గత రెండువారాల్లోనే గ్రామీణ నిరుద్యోగిత గణనీయంగా పెరిగింది. భయం కారణంగా అధిక శాతం వలస కార్మికులు ఇళ్లబాట పట్టారు. ఫలితంగా అత్యవసర వస్తువుల ఉత్పత్తి కూడా నిలిచిపోయింది. రవాణా నిలిపివేతవల్ల, కొద్దిపాటి తయారైన వస్తువుల సరఫరా ఆగిపోయింది. దీంతో వాటి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. లాక్‌డౌన్‌ వల్ల సంభవిస్తున్న ఆర్థిక సంక్షోభాన్ని నివారించకపోతే దేశం మరింత ప్రమాదంలో పడనుంది. కరోనా వ్యాధి వ్యాప్తిని కట్టడి చేస్తూ, ఆర్థిక వ్యవస్థ దీపం కొడిగట్టకుండా ప్రభుత్వం కాచుకోవాలి.

నిత్యావసరాల సరఫరా కీలకం
     ఆరోగ్యరంగం అస్తవ్యస్తమైతే ఆర్థిక రంగానికి ఎంతగా చేటు కలుగుతుందో కరోనా మహమ్మారి విస్పష్టంగా తెలియజేసింది. ఆరోగ్యమే మహాభాగ్యమన్న నానుడి కుటుంబాలకే కాదు- దేశాలకు, ప్రపంచానికి సైతం వర్తిస్తుందని ఇప్పుడు రుజువైంది. ప్రజారోగ్యం బాగుంటే ఆర్థిక వ్యవస్థకు ఎంతో మేలు జరుగుతుంది. కనుక ఈ రంగానికి కేటాయింపులను భారీగా పెంచాలి. దీనిలో అధిక భాగం ప్రాథమిక ఆరోగ్యంపై వెచ్చించాలి. లాక్‌డౌన్‌ ప్రభావాన్ని ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం రూ.1.70లక్షల కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. ఇది జీడీపీలో కేవలం 0.85 శాతం మాత్రమే. మిగతా దేశాలతో పోలిస్తే చాలా తక్కువ. జీడీపీలో కనీసం అయిదు నుంచి ఆరు శాతానికి సమానమైన నిధులతో ప్రభుత్వ ప్యాకేజి ఉండాలి. ప్రభుత్వాలు ఇచ్చిన నగదు సహాయం కేవలం ధరలు పెరిగిన నిత్యావసర వస్తువుల కొనుగోలుకే సరిపోతున్నాయి. అందువల్ల నగదు బదులు ప్రభుత్వాలే నిత్యావసర వస్తువులు సరఫరా చేస్తే మేలు.
 

వ్యవస్థల్ని గాడిలో పెడితేనే...
     లాక్‌డౌన్‌వల్ల ప్రభుత్వాలకు పన్ను, పన్నేతర ఆదాయాలు పడిపోతున్నాయి. అప్పులు కూడా ఎక్కువ సేకరించలేని పరిస్థితి. అలాంటప్పుడు నిధులు ఎక్కడ నుంచి వస్తాయనేది పెద్ద ప్రశ్న. ప్రభుత్వ ద్రవ్యలోటు కింద కొత్త నగదును ముద్రించి నిధులు సమకూర్చడం ఒక పరిష్కార మార్గం. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం కింద ద్రవ్యలోటు జీడీపీలో అయిదు నుంచి ఆరు శాతం వరకు పెంచాలి. ఇప్పటికే ద్రవ్యలోటు అధికంగా ఉంది. కనుక అదనంగా ముద్రించే నగదు ప్రాధాన్య క్రమంగా గిరాకీ-సరఫరా శక్తులకు ఒకేసారి రెక్కలు కల్పించేలా ఖర్చు పెట్టాలి. లేకుంటే ధరలు అమాంతంగా పెరిగి ద్రవ్యోల్బణానికి దారితీయగలదు. ఇలాంటి చర్యల ద్వారా ఆర్థిక వ్యవస్థ వీలైనంత సజావుగా కొనసాగేలా చూడాలి. ఆపై ఎక్కడికక్కడ దిద్దుబాటు చర్యలతో ఆర్థిక వ్యవస్థను తిరిగి వృద్ధి బాట పట్టించే అవకాశం ఉంటుంది. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి లాక్‌డౌన్‌ అనేది తాత్కాలిక, స్వల్పకాల ఆయుధమే. దీర్ఘకాలంలో ఆర్థిక వ్యవస్థల్ని గాడిలో పెట్టడానికి నిపుణుల కమిటీ సలహాలతో ప్రణాళికలు రూపొందించాలి. ఆర్థికశాస్త్రంలో నోబెల్‌ పురస్కార గ్రహీత అమర్త్యసేన్‌ అన్నట్లు- యుద్ధంలో పోరాటం కన్నా ఆపై ఎదురయ్యే సామాజిక సంక్షోభాలను ఎదుర్కోవడం ఎంతో కష్టం. సమయానుకూల నిర్ణయాలు కొరవడితే అది పెను సంక్షోభానికి దారి తీస్తుంది. నిర్ణయాల్లో జాప్యం జరిగినా అది జాతి పాలిట శాపమవుతుంది. ఒక సమస్య పరిష్కరించాలనుకుంటే కొత్తవి పుట్టుకొస్తుంటాయి. అందువల్లే కరోనా విసరిన పెను సవాలును ఎదుర్కోవడంలో ప్రభుత్వాలు ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ప్రతిపక్షాలు, ఆయా రంగాల నిపుణులు, సామాజికవేత్తల అభిప్రాయాలకూ ప్రాధాన్యం ఇవ్వాలి. రాజకీయాలకు అతీతంగా స్పందించాల్సిన సమయమిది. అందరి అభిప్రాయాలను మన్నించాలి. అప్పుడే ఇది సమష్టి పోరాటమన్న విశ్వాసం ప్రజల్లో కలుగుతుంది.
 

ద్రవ్యలభ్యత పెరగాలి
     ఆర్థిక వ్యవస్థలో నగదు, పెట్టుబడులు పెంచడానికి రిజర్వు బ్యాంక్‌ వడ్డీ రేట్లు తగ్గించింది. కానీ, దేశంలో గిరాకీ లోటువల్ల నెలకొన్న స్తబ్ధత కారణంగా, వ్యాపార సంస్థలు బ్యాంకుల వద్దనుంచి రుణాలు పొందటానికి ఆసక్తి చూపించడంలేదు. కాబట్టి వ్యవస్థలో ద్రవ్య లభ్యత పెంచడానికి వ్యక్తిగత రుణాలను మరింత సరళీకరించి ఇవ్వాలి. అత్యధికంగా ఉద్యోగ ఉపాధి కల్పించే సూక్ష్మ చిన్న పరిశ్రమలు, అసంఘటిత రంగానికి ప్రత్యేక ప్యాకేజి, రాయితీతో కూడిన రుణాలు అందించడం అవసరం. గరిష్ఠంగా ఖర్చు పెట్టగలిగే పేదల చేతికి ఏదోవిధంగా ద్రవ్యం అందించాలి. కరోనా ప్రభావం ఆర్థిక వ్యవస్థపై ఎన్నాళ్లు ఉంటుందో తెలియదు. ఈ అనిశ్చిత పరిస్థితుల్లో తాత్కాలికంగా ప్రభుత్వాలే తమ ఖర్చును పెంచడం ద్వారా స్తంభించిన ఆర్థికవ్యవస్థకు జవసత్వాలు నింపాలి.


 

- డాక్టర్‌ చీరాల శంకర్‌రావు
(రచయిత- ఆర్థిక రంగ నిపుణులు)

Posted Date: 24-06-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం