• facebook
  • whatsapp
  • telegram

  ఆర్థిక వ్యవస్థకు అతి పెద్ద ముప్పు

* సంక్షోభం మరింత తీవ్రతరం
* లాక్‌డౌన్‌ దుష్ప్రభావం పేదలపై అధికం
* అంతత్వరగా కోలుకోలేం

* ప్రొఫెసర్‌ సంజయ్‌ జి.రెడ్డితో ఇంటర్వ్యూ

     ‘గతంలో వచ్చిన ఎన్నో సంక్షోభాల కన్నా ప్రస్తుత కొవిడ్‌-19 ముప్పు పెద్దది. దీని ప్రభావంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంత త్వరగా కోలుకొనే పరిస్థితి లేదు. వృద్ధిరేటు మందగించడమే కాదు- తగ్గిపోయే అవకాశమూ ఉంది’ అని అమెరికాలోని న్యూస్కూల్‌ యూనివర్సిటీ ఆర్థికశాస్త్ర ఆచార్యులు సంజయ్‌.జి.రెడ్డి అభిప్రాయపడ్డారు. గతంలో ఎప్పుడూ లేనంతగా నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంటుందన్నారు. భారత ప్రభుత్వం రాష్ట్రాలకు అవసరమైన నిధులు సమకూర్చడం, మార్గదర్శకాలను నిర్దేశించడంవరకే పరిమితం కావాలి తప్ప- విధానాలు రూపొందించి అమలు చేయాలని కోరడం సరైంది కాదన్నారు. సంజయ్‌ మొదట కొలంబియా విశ్వవిద్యాలయంలో పని చేశారు. ఐక్యరాజ్య సమితి ‘2030 నాటికి సుస్థిరాభివృద్ధి’ కోసం నియమించిన స్వతంత్ర సలహాదారుల్లో ఆయన ఒకరు. ప్రపంచ వినియోగం-ఆదాయం ప్రాజెక్టుకు సహవ్యవస్థాపకులుగా వ్యవహరిస్తున్నారు. కొవిడ్‌ ప్రపంచ ఆర్థిక రంగంపై చూపే ప్రభావం గురించి ఆయన ‘ఈనాడు ప్రత్యేక ప్రతినిధి’ ఎం.ఎల్‌.నరసింహారెడ్డికి ఇచ్చిన ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు...


భారత్‌, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను చూసినప్పుడు కొవిడ్‌కు ముందు, ప్రస్తుతం, తరవాత ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండబోతోంది?
     ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంత త్వరగా కోలుకొనే పరిస్థితి లేదు. భారతదేశంలో వృద్ధిరేటు తగ్గడమే కాదు, ఆర్థిక కుదింపునకు గురయ్యే అవకాశమూ ఉంది. ఈ సంక్షోభంకన్నా ముందే భారత, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు బలహీనంగానే ఉండేవి. దేశంలో అప్పటికే అప్పులు పెరిగాయి. వినియోగం, పెట్టుబడి శక్తి మందగించింది. విదేశీ ధనం స్వదేశానికి రావడం క్షీణించడాన్ని గమనించవచ్చు. అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న ఇతర దేశాల్లోనూ ఇలాంటివి కనిపించేవి. అప్పట్లో దీన్ని చక్రీయ పతనం(సైక్లికల్‌ డౌన్‌టర్న్‌) అని భావించారు. ప్రపంచీకరణ వెనకంజ వేస్తున్నట్లు కనిపించినప్పుడే ట్రంప్‌ విధానాలూ తోడయ్యేసరికి అమెరికాలో వాతావరణం మారింది. ఇంతలో ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ వచ్చిపడింది. ఇలాంటప్పుడు ఆర్థిక మందగమనం నుంచి ఆర్థిక మాంద్యానికి మారడానికి ఎక్కువ కాలంపట్టదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దీని నుంచి బయటపడాలంటే లాక్‌డౌన్‌ ఎత్తేసి, యథావిధిగా జీవితం నడిచే పరిస్థితి రావాలి.


ప్రస్తుత సంక్షోభం వల్ల అమెరికాలోని ప్రజారోగ్య, ఆర్థిక వ్యవస్థలో ఎలాంటి మార్పులు వస్తాయి?
     ప్రజారోగ్యంపై ఎలాంటి ప్రభావం ఉంటుందనేది ఇప్పుడే చెప్పలేం. మొదట్లో అంచనా వేసినంతగా మరణాలు ఉండకపోవచ్చు. 60వేలకు పరిమితం కావచ్చు. మొదటి, తాజా అంచనాల మధ్య తేడానుబట్టి అనిశ్చితి స్పష్టమవుతోంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ మీద మాత్రం దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. మునుపెన్నడూ లేనంతగా మొదటి మూడు వారాల్లో నిరుద్యోగ బీమా కోసం కోటి 70 లక్షల పిటిషన్లు దాఖలయ్యాయి. ఇది అమెరికాలోని ‘వర్క్‌ఫోర్స్‌’ కంటే పదిశాతం ఎక్కువ. ‘గ్రేట్‌ డిప్రెషన్‌’కన్నా కూడా నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంటుందని, నాటితో పోలిస్తే ఇప్పుడు 25 శాతం ఎక్కువే ఉండొచ్చని అంచనా. ఈ సంక్షోభం వల్ల సంపాదన, ఉపాధిపై ప్రభావం పడటంవల్ల కుటుంబ వ్యవస్థ మొత్తం దెబ్బతింటుంది. యూఎస్‌లో సహాయ కార్యక్రమాలు కొంత ఉపయోగపడినప్పటికీ వ్యాపారాలు మూతపడి ఉద్యోగాలు పోతున్న సందర్భంలో అవి సరిపోవు. రాబోయే రోజుల్లో ఇళ్లు లేనివారు, పేదరికం, సామాజిక సమస్యలు లాంటివి గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే పెద్దయెత్తున ఉన్న నిరుద్యోగం ఎంత తీవ్రమవుతుందో తెలుసుకోవడానికి ఇంకొన్ని నెలలు పడుతుంది. అమెరికాలో అవకాశాలు కచ్చితంగా తగ్గిపోతాయి. తక్కువ వేతనాలకు పనిచేస్తున్న భారతీయులు బాగా కష్టపడతారు. భారతదేశానికి చెందిన వృత్తి నిపుణులు, మేనేజర్ల వంటివారూ ప్రభావానికి లోనవుతారు. ప్రయాణాలపై ఉన్న నిషేధంవల్ల అమెరికాకు వెళ్లి చదుకొనే అవకాశాలు దెబ్బతింటాయి. ఇప్పుడున్న సందిగ్ధంలో అంతర్జాతీయ విద్యార్థులు ఎలా వస్తారన్నది వారి ముందున్న పెద్ద ప్రశ్న.

 

కొవిడ్‌ తరవాత ఆర్థిక మాంద్యం ప్రభావం ఎవరిపై ఎక్కువగా ఉంటుంది?
     పేదరికంలో ఉన్నవారిపై ఎక్కువగా ఉంటుంది. భారత్‌లో రోజువారీ పనులు చేసే కూలీలు, పాశ్చాత్య దేశాల్లో ‘గిగ్‌’ ఎంప్లాయిస్‌గా పిలిచేవారు... ఇలా అందరిపై ఉంటుంది. వ్యాపారాలు క్షీణించడం వల్ల భద్రతతో ముడివడిన పనులు చేసే వారిమీద, పెట్టుబడి పెట్టాలనుకొన్నవారిపైన తీవ్ర ప్రభావం పడింది. ఆంక్షలు ఎత్తేసినా తిరిగి పాత పద్ధతికి వెళ్లడం అంత సులభం కాదు. ఒత్తిడికి కొన్ని సంస్థలు శాశ్వతంగా మూతపడతాయి. ఇది ఆందోళనకర అంశం. ఈ పరిస్థితిని నివారించాలంటే సత్వరం పరిస్థితుల్ని దారిలోకి తీసుకురావాలి. అదే సమయంలో వ్యాధిని అరికట్టడానికి అవసరమైన చర్యలు చేపట్టాలి. వేతనాలు తిరిగి యథావిధిగా ఉండేలా చూడాలి. రకరకాల వ్యాపారులను అదుకోవడానికి ప్రభుత్వాలు ప్రయత్నించాలి. ఈ రకంగా భారత ప్రభుత్వం యోచిస్తుందో లేదో ఇంకా స్పష్టత రాలేదు. ఈ పనులు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు అవసరమైన నిధులు, సదుపాయాలు ఉన్నాయో లేవో కూడా చెప్పడం కష్టం. అయితే ప్రస్తుత సంక్షోభ భారాన్ని కేంద్రమూ భరించాలి. కొవిడ్‌ వ్యాధిని నిలువరించడానికి రాష్ట్రాలు తీసుకొనే చర్యలు అందరికీ మంచివే. అయితే కొందరు ఎక్కువ భారాన్ని మోయాల్సి వస్తుంది. ప్రభుత్వాల ద్వారా వ్యాపారులు, రైతులు, చిన్న వృత్తులు చేసుకొనేవారికి సాయం అందాలి. సాధారణ ప్రజల ఆర్థిక, జీవనోపాధి మెరుగుపడటానికి సత్వరం తగిన విధానాలను ప్రకటించాలి. భారత ప్రభుత్వ ప్యాకేజీ ఆహ్వానించదగినదే కానీ సరిపోదు. లాక్‌డౌన్‌ వల్ల కలిగే నష్టాన్ని ప్రభుత్వం ముందుగా అంచనావేసినట్లు లేదు. అందుకే ప్రభుత్వ చర్యలు అప్పటికప్పుడు తీసుకొన్న దిద్దుబాటు చర్యలుగా కనిపిస్తాయి. వలస కార్మికులు కాలినడకన స్వస్థలాలకు వెళ్లాల్సి రావడం ఇలాంటి సమస్యే. ఎంతో మంది పేదలకు ఆహారం అందించే విషయంలోనూ సమస్యలు ఎదురయ్యాయి. నగదు బదిలీ వంటి నిర్ణయాల వల్ల అందరికీ మేలు జరగలేదు. పైగా ఆ మొత్తం ఎంత మాత్రం సరిపోదు. ఉదాహరణకు కేరళ రాష్ట్రం ప్రజల సమస్యలను ముందుగానే పసిగట్టి దానికి అనుగుణంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకొంది.

 

1918నాటి స్పానిష్‌ ప్లూ, 2008 ఆర్థిక మాంద్యంతో ప్రస్తుత పరిస్థితిని పోల్చుతున్నారు. ఇది సరైనదేనా?
     కొన్ని పోలికలు లేకపోలేదు. అదే సమయంలో విభిన్నమైన అంశాలూ ఉన్నాయి. 2008లో ఆర్థిక మాంద్యం డిమాండ్‌ సన్నగిల్లడం వల్ల వచ్చిన సంక్షోభం. పెట్టుబడిదారుల్లో విశ్వాసం సన్నగిల్లి ఆర్థిక మార్కెట్లు కుప్పకూలిపోయాయి. స్పానిష్‌ ప్లూ ప్రధానంగా ఆరోగ్య సంక్షోభం. ఇది మనదేశానికి ఎంతో నష్టం కలిగించింది. ప్రపంచ జనాభాలో దాదాపు రెండుశాతం ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అప్పుడూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దిగజారింది. కానీ దాని ప్రభావం ఎక్కువ కాలం కొనసాగలేదు. నాటి పరిస్థితితో పోలిస్తే ఇప్పుడు తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి రావచ్చు. అప్పుడు ఎక్కువమంది ప్రాణాలు కోల్పోయారు, ఇప్పుడు ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయి ఎక్కువ మంది ఇబ్బంది పడతారు. అందువల్ల గతంలోకన్నా ప్రస్తుత సవాలు ఎంతో పెద్దది!

Posted Date: 24-06-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం