• facebook
  • whatsapp
  • telegram

అమ్ములపొదిలో కొత్త అస్త్రాలు

* భారత రక్షణ దళం బలోపేతం

ఆంధ్రా తీరంలో జలాంతర్గత బల్లకట్టు నుంచి విజయవంతంగా క్షిపణిని ప్రయోగించడం ద్వారా భారతదేశం భూ, ఆకాశ, సముద్ర తలాల్లో తన పోరాటపటిమను ప్రదర్శించింది. ఈ నెల 19న ఈ క్షిపణికి కె-4 అని నామకరణం చేశారు. అది 3,500 కిలోమీటర్ల దూరంలోని శత్రులక్ష్యాలను ఛేదించగలదు. జలాంతర్గామి నుంచి ప్రయోగించే ఈ క్షిపణి ఎస్‌ఎల్‌బీఎం తరగతికి చెందినది. శత్రు స్థావరాన్ని గురిచూసి కొట్టడంలో కె-4 క్షిపణి చైనా క్షిపణులకన్నా మేలైనది. అలాగని దీని సత్తా గురించి మరీ అతిగా చెప్పుకోవడం అభిలషణీయం కాదని భారత ప్రభుత్వం భావిస్తోంది. అందుకే కె-4 ప్రయోగం గురించి అధికార ప్రకటనను విడుదల చేయలేదు. అధికార వర్గాలు మాత్రం దీన్ని ధ్రువీకరించాయి. ఈ విజయానికి రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ)ను, సంబంధిత ప్రభుత్వ సంస్థలను అభినందించాలి. జలాంతర్గామి నుంచి ప్రయోగించే ఎస్‌ఎల్‌బీఎం క్షిపణుల తయారీకి భారతదేశం కొత్త. అమెరికా, సోవియట్‌ యూనియన్‌ (రష్యా)లు ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో, అంటే 1980లలోనే అణ్వస్త్ర సహిత ఎస్‌ఎల్‌బీఎమ్‌లను మోహరించాయి. ఆ క్షిపణులు 12,000 కిలోమీటర్ల దూరం మేర ఖండాలను దాటుకుంటూ వెళ్లి లక్ష్యాలను ఛేదించే సత్తా కలిగినవి. ఎంచుకున్న లక్ష్యానికి 100 మీటర్ల సమీపంలో పేలి విధ్వంసం సృష్టించే సామర్థ్యం వాటి సొంతం. ఇలా గురిచూసి కొట్టడంలో చైనాకన్నా కె-4 క్షిపణే మేలైనదని భారతీయ వర్గాలు వివరించాయి.

శక్తిమంతమైన ‘మలి అడుగు’
బ్రిటన్‌, ఫ్రాన్స్‌లు సముద్రగర్భ పోరాట సామర్థ్యంలో అమెరికాతో జత కట్టాయి. 1964లో అణ్వస్త్రాలను సమకూర్చుకున్న చైనా 1982లో మొట్టమొదటి ఎస్‌ఎల్‌బీఎం పరీక్ష జరిపింది. అప్పట్లో జలాంతర్గామి నుంచి చైనా ప్రయోగించిన జెఎల్‌-1 ఎస్‌ఎల్‌బీఎం క్షిపణికి 1,700 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే సత్తా ఉంది. ఆ తరవాత చైనా జలాంతర్గామి బలగాన్ని, ఎస్‌ఎల్‌బీఎమ్‌లనూ పెంచుకోవడంపై దృష్టి పెట్టింది. 2018 నవంబరులో ఆ దేశం 9,000 కిలోమీటర్ల దూరం పయనించగల జేెఎల్‌-3 క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది. 2025కల్లా ఈ క్షిపణిని చైనీస్‌ జలాంతర్గాముల్లో అమర్చుతారు. ఈ పూర్వ రంగంలో భారతదేశం తానూ జలాంతర్గామి నుంచి ప్రయోగించే క్షిపణులను అభివృద్ధి చేసుకోవాలని నిశ్చయించింది. భారత్‌ వద్ద డీజిల్‌తో నడిచే జలాంతర్గాములు చాలానే ఉన్నా దీర్ఘకాలం సముద్రగర్భంలో సంచరించగలిగే అణుశక్తి చోదిత జలాంతర్గామిని సమకూర్చుకోవడం అవసరమని గుర్తించింది. ఒకవేళ శత్రుదేశాల అణ్వస్త్ర దాడిలో సైనిక, నౌకా, వైమానిక స్థావరాలు ధ్వంసమైనా, సముద్ర గర్భంలోని అణుశక్తి చోదిత జలాంతర్గామి (ఎస్‌ఎస్‌బీఎన్‌) నుంచి ప్రతిదాడి చేయవచ్ఛు అందుకు వాటిలో ఎస్‌ఎల్‌బీఎమ్‌లను అమర్చడం తప్పనిసరి. భారత్‌ సమకూర్చుకున్న అణు జలాంతర్గామికి అరిహంత్‌ అని నామకరణం చేశారు. దీని గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2018 నవంబరులో ప్రపంచానికి వెల్లడించారు. ఎస్‌ఎస్‌బీఎన్‌కు, అరిహంత్‌కు 750 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కొట్టే క్షిపణిని అమర్చారు. దీనికన్నా శక్తిమంతమైన క్షిపణులను సమకూర్చుకునే కృషిలో మలి అడుగే 3,500 కిలోమీటర్లు దూసుకెళ్లే కె-4 క్షిపణి. దీన్ని మరింత శక్తిమంతమైన ఎస్‌ఎస్‌బీఎన్‌ జలాంతర్గాములకు అమర్చడం ద్వారా భారత్‌ సముద్ర గర్భం నుంచి శత్రువును చిత్తుచేసే సత్తాను సంతరించుకోనుంది.

ఇంతవరకు భూతల, గగనతల అణ్వస్త్ర బలగాలను సమకూర్చుకున్న భారత్‌, సముద్ర గర్భం నుంచి దూసుకెళ్లే అణ్వస్త్రాన్ని సైతం సముపార్జించడం, దాన్ని ప్రయోగించగల ఎస్‌ఎల్‌బీఎం క్షిపణి కె-4ను తన అమ్ములపొదిలో చేర్చుకోవడం విశేష పరిణామాలని మాజీ నౌకాదళాధిపతి అడ్మిరల్‌ అరుణ్‌ ప్రకాశ్‌ వివరించారు. సముద్ర గర్భంలో దాగి దీర్ఘకాలం సంచరించే అరిహంత్‌ తరహా అణు జలాంతర్గాములను శత్రువు పసిగట్టలేడు కాబట్టి యుద్ధ సమయాల్లో వీటి నుంచి అణు క్షిపణులను ప్రయోగించి శత్రు దేశాలను తుత్తునియలు చేయడం సులువని కూడా ఆయన వివరించారు.

అయితే నీటి అడుగు నుంచి దూర లక్ష్యాలను ఛేదించే ఖండాంతర క్షిపణిని ప్రయోగించడమనేది పెద్ద సవాలు. భూమి మీద నుంచి ప్రయోగించే ఖండాంతర క్షిపణి భూ వాతావరణాన్ని చీల్చుకుంటూ అంతరిక్షంలోకి ఎగిరి, మళ్ళీ అక్కడి నుంచి శత్రు భూభాగంలోకి దూసుకొస్తుంది. అంటే అది భూ, గగన తలాలు రెండింటిలో పయనిస్తే చాలు. అదే జలాంతర్గామి నుంచి ప్రయోగించే క్షిపణి మొదట నీటిలో నుంచి పైకి లేచి, భూవాతావరణం ద్వారా రోదసిలోకి చేరుతుంది. అక్కడ వేల మైళ్లు పయనించి- మళ్ళీ భూవాతావరణంలోకి ప్రవేశించి శత్రులక్ష్యంపై పడుతుంది జలాంతర్గత (ఎస్‌ఎల్‌బీఎం) క్షిపణి ఇలా మూడు తలాల ద్వారా దూసుకెళ్లాలి. దాన్ని సాధించడానికి అధునాతన, సునిశిత సాంకేతిక పరిజ్ఞానం కావాలి. దీన్ని భారతదేశం స్వయంకృషితో సాధించుకోవడం ప్రశంసనీయం. కె4 ప్రయోగంలో విజయం సాధించిన భారత్‌, వీటిని పెద్దసంఖ్యలో తయారుచేసి జలాంతర్గాములకు అమర్చాలంటే మరికొంత వ్యవధి పడుతుంది.

‘కూటమి’ ఏర్పాటుతో మున్ముందుకు
తమిళనాడులోని తంజావూరులో సుఖోయ్‌-30 యుద్ధవిమానాల స్థావర ఏర్పాటు గురించి కూడా ఇక్కడ ప్రస్తావించాలి. జలాంతర్గాములు, యుద్ధనౌకలు, యుద్ధ విమానాలతో హిందూ, పసిఫిక్‌ మహాసముద్రాల్లో తన ప్రయోజనాలను రక్షించుకునే సత్తాను భారత్‌ సమకూర్చుకొంటోంది. ఇవే జలాల్లో చైనా నౌకల సంచారం పెరుగుతున్నందున, వాటిని ఎదుర్కోవడానికి భారత్‌, అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియాలు ఇండో-పసిఫిక్‌ కూటమిని ఏర్పాటు చేసుకున్నాయి. ఒన్‌ బెల్ట్‌ ఒన్‌ రోడ్‌ ప్రాజెక్టు (ఒబొర్‌) కింద చైనా కార్యకలాపాలకు దీటుగా స్పందించే సత్తాను సాధించడానికీ ఈ కూటమి నడుంకట్టింది. ఒబొర్‌ కోసం చైనా జిబూటీలో స్థావరమేర్పరచుకుని, పాకిస్థాన్‌లో గ్వాడర్‌ రేవును అభివృద్ధి చేస్తోంది. మియన్మార్‌లో క్యౌక్‌ ప్యు రేవును నిర్మిస్తోంది. శ్రీలంకలో ఇప్పటికే అది హంబాన్‌తోట రేవును నిర్మించిన సంగతి తెలిసిందే. దీనికి పోటీగా భారత్‌ మియన్మార్‌లో సిట్వే రేవును నిర్మించగా, జపాన్‌ బంగ్లాదేశ్‌లో మాటర్బారీ రేవును నిర్మిస్తోంది. ఇండో-పసిఫిక్‌ కూటమిలో తనవంతు పాత్ర పోషించడానికి కె-4, సుఖోయ్‌లు భారత్‌కు తోడ్పడతాయి.

- సి.ఉదయ్‌ భాస్కర్‌
(రచయిత- రక్షణ రంగ నిపుణులు)

Posted Date: 11-04-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

సైన్స్ & టెక్నాలజీ

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం