• facebook
  • whatsapp
  • telegram

  అయిదోతరం... అపార ప్రయోజనం!

* భారత్‌లో 5జి సేవలకు సన్నాహాలు

అయిదోతరం (5జి) వైర్‌లెస్‌ కమ్యూనికేషన్‌ సేవల చలవతో 21వ శతాబ్ది జన జీవితం సమూలంగా మారిపోనున్నది. స్మార్ట్‌ నగరాల నుంచి హైటెక్‌ పరిశ్రమల వరకు; సామాజిక సంబంధాలు మొదలుకొని దేశ భద్రత వరకు అన్ని రంగాలు 5జి వల్ల రూపాంతరం చెందనున్నాయి. చైనీస్‌ కంపెనీ హువావై ఈ సాంకేతిక విప్లవానికి ప్రధాన సారథిగా నిలుస్తోంది. 5జి సాంకేతికతను, దానికి కావలసిన కమ్యూనికేషన్‌ పరికరాలను కారు చౌకగా అందించడంలో హువావైకి దీటైన కంపెనీ మరొకటి లేదు. కానీ, ఈ చౌక సేవలకు పరోక్షంగా భారీ మూల్యం చెల్లించుకోవలసి వస్తుందన్న భయాలున్నాయి. హువావై... ఆ మాటకొస్తే ఏ చైనా కంపెనీ అయినా విదేశాల్లో వ్యాపారం చేసేటప్పుడు అక్కడి సమాచారాన్ని సేకరించి చైనా ప్రభుత్వానికి అందించాలని ఆ దేశ చట్టాలు నిర్దేశిస్తున్నాయి. ఇది తమ దేశ భద్రతకు ప్రమాదకరమని అమెరికా ప్రభుత్వం గుర్రుగా ఉంది. అందుకే అమెరికాలో హువావైకి ప్రభుత్వ సేవల కాంట్రాక్టులు ఇవ్వరాదంటూ నిషేధం విధించారు. ఆస్ట్రేలియా, జపాన్‌ కూడా హువావైని కట్టడి చేశాయి. త్వరలో కెనడా, న్యూజీలాండ్‌ కూడా అదే పని చేయనున్నాయి.

అంతర్జాతీయ వేదికలపై కశ్మీర్‌ సమస్యతో పాటు, ఇతర అంశాల్లో భారతదేశంతో విభేదిస్తూ, పాకిస్థాన్‌ కొమ్ముకాస్తున్న చైనాతో 5జి రంగంలో పొత్తు పెట్టుకోవడం శ్రేయస్కరం కాదని నిపుణులు హెచ్చరిస్తూ వచ్చారు. హువావై టెలికాం పరికరాల్లో గూఢచర్యానికి ఉపకరించే ‘బ్యాక్‌ డోర్స్‌’ ఉన్నాయని అమెరికా హెచ్చరిస్తోంది. ఐరోపా దేశాల్లో హువావై నిర్మించిన విస్తృత టెలికమ్యూనికేషన్‌ యంత్రాంగాల నిండా చైనా నిఘానేత్రాలున్నాయని తెలిపింది. ఇటలీలో తన వ్యవస్థ విస్తరణకోసం హువావై సరఫరా చేసిన పరికరాల్లో బ్యాక్‌ డోర్స్‌ను కనిపెట్టినట్లు వోడాఫోన్‌ సంస్థ వెల్లడించడం అమెరికా హెచ్చరికను రూఢి చేసింది. అయినా జర్మనీ, స్విట్జర్లాండ్‌, స్పెయిన్‌ తదితర ఐరోపా దేశాలు హువావై 5జి పరికరాలను వినియోగిస్తూనే ఉన్నాయి. 2019 డిసెంబరునాటికి ప్రపంచవ్యాప్తంగా 5జి టెలికాం యంత్రాంగాల నిర్మాణానికి హువావై మొత్తం 65 కాంట్రాక్టులు పొందగా, వాటిలో సగం ఐరోపా దేశాల్లోనే లభించాయి. హువావై 5జి పరికరాల్లో బ్యాక్‌ డోర్స్‌ లేవని తనిఖీలో తేల్చామని, వాటిని ఉపయోగించడానికి అనుమతించాలని బ్రిటిష్‌ టెలికాం, వోడాఫోన్‌ కంపెనీలు ప్రధాని బోరిస్‌ జాన్సన్‌కు విన్నవించదలిచాయి. భారత్‌ మాత్రం ప్రయోగాత్మక 5జి సేవలకు హువావైని అనుమతిస్తామని గత ఏడాది డిసెంబరు 30న ప్రకటించింది. అమెరికాకు చెందిన సిస్కో, స్వీడన్‌కు చెందిన ఎరిక్సన్‌, ఫిన్లాండ్‌కు చెందిన నోకియా, దక్షిణ కొరియాకు చెందిన సామ్‌సంగ్‌తోపాటు దేశవిదేశీ సంస్థలు ఇందుకు పోటీపడవచ్చని ప్రకటించింది. దిల్లీలో 5జి ప్రయోగాలకు వోడాఫోన్‌-ఐడియాతో, బెంగుళూరులో భారతీ ఎయిర్‌టెల్‌తో హువావై జట్టుకట్టింది. ఈ ఏడాది జనవరి-మార్చి మధ్య కాలంలో 5జి ప్రయోగాలను నిర్వహించి 2021లో పూర్తిస్థాయి 5జి వ్యవస్థలను ప్రారంభించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది.

పదేళ్లలో అయిదు శాతం వాటా
జపాన్‌ ఈ ఏడాది టోక్యోలో జరిగే వేసవి ఒలింపిక్స్‌లో 5జి సాంకేతికతను ప్రదర్శించనున్నది. నిజానికి జపాన్‌ ఈ సాంకేతికతతో తయారుచేసిన ప్రత్యేక కళ్లద్దాలను గత ఏడాది డిసెంబరు 14-17 మధ్య గువాహటిలో ప్రదర్శించాలనుకుంది. ఆ తేదీల్లో అక్కడ జరగాల్సిన శిఖరాగ్ర సభలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్‌ ప్రధాని షింజో అబే 5జి కళ్లద్దాలను ఉపయోగించి బ్రహ్మపుత్ర నదిని వీక్షించాలనుకున్నారు. ఆగ్మెంటెడ్‌ రియాలిటీ (ఏఆర్‌) అప్లికేషన్స్‌ సాయంతో నదీ వీక్షణానికి తోడ్పడే కళ్లద్దాలవి. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా అసోమ్‌లో ఆందోళన పెచ్చరిల్లడంతో టోక్యో విజ్ఞప్తిపై మోదీ-అబే సమావేశం వాయిదాపడింది. 2025కల్లా ప్రపంచంలోని 5జి మొబైల్‌ చందాదారుల్లో సగానికి పైగా జపాన్‌, అమెరికా, చైనా, దక్షిణ కొరియాల్లోనే ఉంటారు. ఈ రంగంలో స్వీడన్‌, ఫిన్లాండ్‌ తదితర స్కాండినేవియా దేశాలూ అగ్రగాములుగా ఉన్నాయి. వచ్చే పదేళ్లలో ప్రపంచ 5జి మార్కెట్‌లో అయిదు శాతం వాటాను (రూ.7 లక్షల కోట్లను) కైవసం చేసుకోవాలని లక్షిస్తోంది కాబట్టి, భారత్‌ పలు దేశాల టెలికాం సంస్థలను 5జి ప్రయోగాలకు బిడ్‌ చేయవలసిందిగా ఆహ్వానిస్తోంది. తన పరికరాల్లో నిఘా కళ్లు ఉన్నాయనే ఆందోళనను హువావై సంస్థ కొట్టివేస్తోంది. ఇతర దేశాల సమాచారాన్ని చైనా ప్రభుత్వానికి అందించేది లేదని భరోసా ఇచ్చింది. అందుకే అనేక ఐరోపా దేశాలతోపాటు భారతదేశమూ ఆ సంస్థను అనుమతిస్తోంది. చిప్‌ సెట్స్‌ మొదలుకొని 5జి ఫోన్లు, టెలికాం పరికరాలను హువావై చాలా చౌక ధరలకు అందిస్తోంది. అదీకాక ఇప్పటికే భారత్‌ వినియోగిస్తున్న టెలికాం పరికరాల్లో 90 శాతం హువావై, నోకియా, ఎరిక్సన్‌ వంటి విదేశీ సంస్థల నుంచి దిగుమతి చేసుకున్నవే కాబట్టి, సమాచార చౌర్య ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. అందువల్ల భారత్‌ విదేశీ టెలికాం పరికరాలను నిరంతరం శల్యపరీక్ష చేస్తూనే ఉండకతప్పదు. మనకున్న సువిశాల మొబైల్‌ మార్కెట్‌లో ప్రవేశం కల్పించినందుకు ఇతర దేశాల నుంచి భారీ ప్రతిఫలం పొందాలి. మన వాణిజ్య లోటును తగ్గించుకోవడానికి దాన్ని ఉపయోగించుకోవాలి.

గత సంవత్సరం చెన్నై సమీపంలోని మహాబలిపురంలో నరేంద్ర మోదీ- చైనా అధ్యక్షుడు షీ జిన్‌ పింగ్‌ల అనధికార శిఖరాగ్ర సమావేశం జరిగిన దరిమిలా హువావైని 5జి ప్రయోగాల్లో పాల్గొనడానికి అనుమతించాలని భారత్‌ నిర్ణయించింది. రాబోయే కృత్రిమ మేధ, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ యుగానికి 5జి వ్యవస్థలే ప్రాతిపదిక కాబట్టి, ఈ పోటీలో తాను వెనుకబడకూడదని భారత్‌ నిశ్చయించింది. మరో అయిదేళ్లలో చైనాలో 60 కోట్ల మందికి 5జి మొబైల్‌ కనెక్షన్లు ఉంటే దక్షిణ కొరియాలో 66 శాతం, అమెరికాలో 50 శాతం, జపాన్‌లో 49 శాతం మంది చొప్పున ప్రజలకు ఆ కనెక్షన్లు ఉండబోతున్నాయి. ఆ స్థాయికి భారత్‌ చేరుకోవాలంటే ఇప్పటి నుంచే విస్తృత వ్యవస్థను నిర్మించుకోకతప్పదు. అందుకే హువావై చౌక పరికరాలతో తన 5జి యంత్రాంగాన్ని నిర్మించుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలో హువావైపై ఉన్న గూఢచర్య ఆరోపణలు నిజమో కాదో తేల్చుకోవచ్చు కూడా. కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ ఇప్పటి నుంచే ఆ పని చేస్తానంటోంది. భద్రతాపరంగా ఎటువంటి సమస్యలు లేవని నిర్ధరించుకున్న తరవాతే ఏ విదేశీ కంపెనీనైనా 5జి ప్రయోగాల్లోకి అనుమతిస్తామని ప్రకటించింది. ఈ పరీక్షలో హువావై నెగ్గకపోతే దానికి ఇచ్చిన అనుమతిని భారత్‌ ఉపసంహరించుకుంటుంది.

పోటీలో నిలవాలంటే సవాళ్లెన్నో...
ఒక విషయం మాత్రం నిజం. 5జి సాంకేతికతలో హువావై తన పోటీదారులకన్నా కనీసం ఏడాది ముందున్నది. ముందే చెప్పుకున్నట్లు దాని పరికరాలు కూడా సరసమైన ధరలకు లభిస్తాయి. 5జి ప్రయోగాల నుంచి హువావై, ఇతర చైనా కంపెనీలను తప్పిస్తే భారత్‌కు వ్యయం పెరగడమే కాక, డిజిటల్‌ ఇండియా కార్యక్రమ వేగం మందగించవచ్చు. 5జి లేకుండా డిజిటల్‌ ఇండియా పట్టాలకెక్కలేదు. ప్రపంచంలో 87 దేశాల్లోని 211 మంది ఆపరేటర్లు 5జి సేవల్లో పెట్టుబడులు పెట్టారు. గతేడాది మార్చినాటికే 15 ఆపరేటర్‌ సంస్థలు వాణిజ్య ప్రాతిపదికపై 5జి సేవలు అందిస్తున్నాయి. భారతదేశం ఇప్పటికైనా కళ్లుతెరచి 5జి ప్రయోగాలకు అనుమతించడం ఊరట కలిగిస్తోంది. భారత్‌లో పూర్తిస్థాయిలో 5జి సేవలను ప్రవేశపెట్టాలంటే, మొదట ఆరు నెలల నుంచి ఏడాది వరకు ప్రయోగాలు నిర్వహించాలి. ఆ తరవాత ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌లు, టవర్లు, లక్షలాది 5జి వైఫై హాట్‌స్పాట్‌లను నెలకొల్పాలి. వాణిజ్య ప్రాతిపదికపై 5జి సేవలు ప్రారంభించాలంటే ఇవన్నీ ఏర్పడాలి. దీనంతటికీ రూ.5 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టాల్సి ఉంటుందని డిలాయిట్‌ సంస్థ అంచనా. ఇప్పటికే రూ. 4.2 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్న భారతీయ టెలికాం సర్వీస్‌ ప్రొవైడర్లు కొత్త పెట్టుబడులను ఎక్కడి నుంచి తెస్తాయో అర్థం కావడం లేదు. హువావై పరికరాలు చౌక కాబట్టి ఈ వ్యయాలను కొంతవరకు తగ్గించుకోవచ్చు. ఇంకా 5జి స్పెక్ట్రమ్‌ను వేలం వేసేటప్పుడు ధరలను తక్కువగా నిర్ణయించాలి. ప్రస్తుతం భారత్‌లో స్పెక్ట్రమ్‌ ధరలు ప్రపంచంలోనే ఎక్కువగా ఉన్నాయి. సింగపూర్‌ ప్రభుత్వం అసలు స్పెక్ట్రమ్‌ రుసుములే వసూలు చేయడం లేదు. దీనివల్ల ఆపరేటర్లకు, వినియోగదారులకు ఖర్చులు తగ్గి, ఆధునిక సాంకేతికతలను సులువుగా, వేగంగా ప్రవేశపెట్టే సౌలభ్యం ఏర్పడుతుంది. ఇంకా టెలికాం సాధనాలు, సేవలు, మొబైల్‌ పరికరాలపై పన్నులు తగ్గించడం ద్వారా 5జి రంగాన్ని పెట్టుబడులకు ఆకర్షణీయంగా మార్చాలి. 5జి సాయంతో డిజిటల్‌ ఇండియా, స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టులు ఆర్థికంగా అపార ప్రయోజనాలను అందిస్తాయని గుర్తుంచుకోవాలి. ఉదాహరణకు పుణే నగరాన్ని స్మార్ట్‌ నగరంగా మారిస్తే ఆరేళ్లలో రూ.80,000 కోట్ల ఆర్థిక లబ్ధి చేకూరుతుందని ఒక అధ్యయనంలో తేలింది. పుణే నగరం కేవలం 331 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 35 లక్షల జనాభాకు ఆవాసంగా ఉంది. ఈ ఒక్క నగరంలో డిజిటల్‌ సేవల విస్తరణ వల్ల అన్ని వేల కోట్ల లబ్ధి చేకూరితే, మొత్తం దేశం జీడీపీ ఏ మేరకు వృద్ధి చెందుతుందో అంచనా వేసుకోవచ్చు.

కృత్రిమ మేధకు వెన్నెముక
స్వయంచాలిత కార్లు మొదలుకొని స్మార్ట్‌ కళ్లద్దాల వరకు రేపటి జీవితంలో అన్ని పార్శ్వాల్లోకి చొచ్చుకెళ్లే సత్తాను కృత్రిమ మేధ(ఏఐ)కి అందించేది 5జి వ్యవస్థలే. కృత్రిమ మేధ వినియోగానికి 5జి యంత్రాంగాలు వెన్నెముక కానున్నాయి. వీటికి కావలసిన పరికరాల ప్రధాన సరఫరాదారుగా హువావై ఆవిర్భవించింది. ప్రపంచ 5జి విపణిలో 28 శాతం వాటాను ఈ సంస్థే చేజిక్కించుకుంది. దీని తరవాతి స్థానాలను ఆక్రమిస్తున్న రెండు టెలికాం సంస్థల వాటాలను కలిపినా 28 శాతానికి మించదు. 5జి మూల పేటెంట్లలో అమెరికా కంటే రెట్టింపు చైనాకు ఉన్నాయి. ఆపిల్‌ కన్నా ఒక సంవత్సరం ముందే హువావై 5జి ఫోన్‌ మార్కెట్‌లోకి రానున్నది. ఈ కారణాలవల్లనే ప్రపంచ దేశాలు అమెరికా హెచ్చరికలను ఖాతరు చేయకుండా హువావై వైపు చూస్తున్నాయి.

- ఏఏవీ ప్రసాద్‌
 

Posted Date: 11-04-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

సైన్స్ & టెక్నాలజీ

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం