• facebook
  • whatsapp
  • telegram

   ఉగ్రవాద అంతరజాలం

* ప్రపంచశాంతికి సరికొత్త సవాలు

అంతర్జాల విస్తరణతో ప్రపంచంలో సమాచార ప్రసార రంగం విప్లవాత్మక మార్పులు సంతరించుకుంది. ఈ సాంకేతికతను ఉగ్రమూకలూ వినియోగించుకుంటూ దేశ రక్షణకు సవాలు విసరుతున్నాయి. గతంలో సమాజానికి ఉగ్రవాదులు పంపే సందేశాలు, ఉగ్రదాడుల సమాచారం మిగతా ప్రపంచానికి తెలిసేందుకు సమయం పట్టేది. వాటిలోని నిజానిజాలను విశ్లేషించిన తరవాత వార్తా సంస్థలు ప్రజలకు చేరవేసేవి. సామాజిక మాధ్యమాలు వ్యాప్తి చెందడంతో ప్రస్తుతం ప్రపంచంలోని ఏ మూల చిన్న ఘటన జరిగినా క్షణాల్లో లోకానికి వెల్లడవుతోంది. దీన్ని ఉగ్రవాదులు తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు.

ఇస్లామిక్‌ స్టేట్‌ ఇన్‌ ఇరాక్‌, సిరియా (ఐసిస్‌) తన కార్యకలాపాల విస్తరణకు సామాజిక మాధ్యమాలను ఎలా దుర్వినియోగం చేసిందో అందరికీ తెలిసిన అంశమే. శ్రీలంక ఈస్టర్‌ బాంబుపేలుళ్లలో కీలక సూత్రధారి జహ్రాన్‌ హషీం సామాజిక మాధ్యమాల ద్వారానే యువతను ఉగ్రవాదం వైపు మళ్ళించాడు. ఇరాక్‌, సిరియాలకే పరిమితమైన ఐఎస్‌ కార్యకలాపాలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయి. పలు దేశాల్లోని తన సానుభూతిపరులను ఆకర్షించేందుకు ‘ఐసిస్‌’ వివిధ వ్యూహాలను అనుసరించింది. అంతర్జాల సేవలు అంతంతమాత్రంగా ఉన్న అభివృద్ధి చెందని దేశాల నుంచి సందేశాలను పంపుతోంది. వాటిని విస్తృతంగా పంచుకునేందుకు (రీట్వీట్‌, షేరింగ్‌లకు) అత్యాధునిక అంతర్జాల సేవలందించే దేశాలను ఎంచుకొంటోంది. దీంతో సామాజిక మాధ్యమాల్లో మొదట పోస్ట్‌ చేసే ప్రాంతాల్లో భద్రతాదళాలు గాలింపు చర్యలు చేపట్టినా, అసలు వ్యూహకర్తలను పట్టుకోలేకపోతున్నారు. ఈ ప్రచారంతో పెద్దయెత్తున యువకులు ఆకర్షితులై ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొనేందుకు సిరియా చేరుకున్నారు. అక్కడ జరిగిన పోరాటంలో వేలమంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఫోన్‌, కంప్యూటర్లు అంతర్జాలంతో అనుసంధానమై ఉంటే ఎలాంటి ప్రతిబంధకాలు లేకుండా సామాజిక మాధ్యమాలను వినియోగించుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు పంపే చిన్న సందేశమైనా ఆయాదేశాల భద్రతపై, అంతర్జాతీయ శాంతిపై ప్రభావం చూపే ప్రమాదముంది.

ఈ ఏడాది మార్చిలో న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్‌ నగర మసీదుల్లో నిరాయుధులపై ఓ శ్వేతజాతీయుడు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 51 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిని దుండగుడు సామాజిక మాధ్యమంలో తన ఖాతా ద్వారా ప్రత్యక్షంగా చూపించడంతో ప్రపంచం నివ్వెరపోయింది. ఈ తరహా నేరాల నియంత్రణకు న్యూజిలాండ్‌ ప్రధాని జసిందా అర్డర్న్‌, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మేక్రాన్‌లు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమాన్నే ‘క్రైస్ట్‌చర్చ్‌ పిలుపు’గా వ్యవహరిస్తారు. అంతర్జాలంలో ఉగ్రవాద, అతివాదానికి సంబంధించిన సమాచారాన్ని నిర్మూలించాలన్న ఒప్పందంపై తొలుత 17 దేశాలు సంతకాలు చేశాయి. అనంతరం 31 దేశాలు అంగీకారం తెలిపాయి. ఫేస్‌బుక్‌, మైక్రోసాఫ్ట్‌, ట్విట్టర్‌, యూట్యూబ్‌ సంస్థలు సంయుక్తంగా ‘ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు ప్రపంచ అంతర్జాల వేదిక’ (గ్లోబల్‌ ఇంటర్నెట్‌ ఫోరం టు కౌంటర్‌ టెర్రరిజం- జీఐఎఫ్‌సీటీ)ని నెలకొల్పాయి. ఈ వేదిక ఉగ్రవాద సంస్థల అతివాద ప్రచారాన్ని అడ్డుకుంటుంది. హింసాత్మక చర్యలకు సంబంధించిన సమాచారం, చిత్రాలు, వీడియోలను ప్రసారం చేయకుండా ముందస్తు చర్యలు చేపడుతుంది. ఇది ఐక్యరాజ్య సమితిలోని ఉగ్రవాద వ్యతిరేక సంస్థతో కలిసి పనిచేస్తోంది. జీఐఎఫ్‌సీటీ నాలుగు లక్ష్యాలతో అంతర్జాలంలో ఉగ్రవాద ప్రచార నిరోధానికి అడుగులేస్తోంది. ఇందులో భాగంగా పెద్ద టెక్‌ కంపెనీలను ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలోకి తీసుకొస్తోంది. పౌరసమాజంతో ‘ఆన్‌లైన్‌’ చర్చావేదికలు, ఉగ్రవాదుల కార్యకలాపాలను ముందుగానే తెలుసుకొని ఆన్‌లైన్‌లో హెచ్చరికలు చేయడం, వీలైనంత ఎక్కువమంది నెటిజన్లను ఉగ్రవాద వ్యతిరేక ప్రచారంలో పాల్గొనేట్లు చేయడం తదితర అంశాలు ఉన్నాయి. జీఐఎఫ్‌సీటీకి- అమెజాన్‌, లింక్డ్‌ఇన్‌, వాట్సాప్‌... తదితర సంస్థలు చేయూతనిస్తున్నాయి. ‘హేష్‌ట్యాగ్‌’లపై ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తున్నాయి. ఏదైనా కీలక సంఘటన జరిగితే ఆ పేరుతో హేష్‌ట్యాగ్‌లను ఏర్పాటుచేసి అందులో పౌరులు ‘పోస్ట్‌’లు చేస్తుంటారు.

సంయుక్త నూతన ఆవిష్కరణలు, సమాచారాన్ని పంచుకోవడం, పరిశోధనలు నిర్వహించడంద్వారా అంతర్జాలంలో ఉగ్రవాద వ్యాప్తిని నిరోధించేందుకు జీఐఎఫ్‌సీటీ కృషిచేస్తుంది. క్రైస్ట్‌చర్చ్‌ తరహా ఘటనలు జరిగినప్పుడు ఉగ్రవాద సంస్థలు ఆ సమాచారాన్ని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయకుండా సమాచారాన్ని బదలాయించడానికి నిరంతరం అధ్యయనం చేసే యంత్రాంగాన్ని ప్రారంభించింది. వీడియోలు, చిత్రాలు అభ్యంతకరంగా ఉంటే వెంటనే నిరోధించే సాఫ్ట్‌వేర్‌ సైతం అందుబాటులోకి వచ్చింది. ప్రత్యేకించి ఉగ్రవాద అనుకూల ప్రచారానికి సంబంధించిన అంశాలు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ కాకముందే నిరోధించేందుకు వీలుగా ఒక డేటాబేస్‌నూ రూపొందించింది. భారత్‌లోనూ సామాజిక మాధ్యమాలను ఉగ్రవాదులు తమ ప్రచారానికి వినియోగించారు. హిజ్బుల్‌ ముజాహిదీన్‌కు చెందిన కశ్మీర్‌ ఉగ్రవాది బుర్హన్‌వాని సామాజిక మాధ్యమాల ద్వారా యువతను పెద్దయెత్తున ఉగ్రవాదం వైపు మళ్ళించిన సంగతి తెలిసిందే. జైష్‌, లష్కరే తొయిబాలు భారత వ్యతిరేక ప్రచారానికి అంతర్జాలాన్ని అనుకూలంగా మలచుకున్నాయి. వీటిని నియంత్రించేందుకు భారత నిఘాసంస్థలు అనేకసార్లు కశ్మీర్లో అంతర్జాల సర్వీసులను నిలిపివేసిన ఉదంతాలు ఉన్నాయి. జీఐఎఫ్‌సీటీ తయారుచేసే పలు సాఫ్ట్‌వేర్‌లు అనుచిత ఉగ్రవాద సమాచార బదిలీని ముందుగానే పసిగట్టి అడ్డుకోవడంలో రాణిస్తున్నాయి. వీటివల్ల రానున్న రోజుల్లో అంతర్జాల సేవలను నిలిపివేయాల్సిన అవసరం రాకపోవచ్చు. ప్రభుత్వ నిఘాసంస్థలతో పాటు పౌర సమాజమూ ఉగ్రవాద, తీవ్రవాద ప్రచారాన్ని నియంత్రించడంలో ముందుకురావాల్సిన అవసరం ఉంది. నేటి సమకాలీన ప్రపంచంలో ఈ-కామర్స్‌, రవాణా, ఈ-మెయిల్స్‌, సామాజిక మాధ్యమాలు... తదితర సేవలకు అంతర్జాలమే కీలకం. ఈ సేవలకు విఘాతం కలగకుండా ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించాలి. ఇందులో పౌరసమాజంతో సహా అందరూ భాగస్వాములైతేనే మంచి ఫలితాలు లభిస్తాయి!

- కొలకలూరి శ్రీధర్‌

Posted Date: 23-04-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

సైన్స్ & టెక్నాలజీ

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం