• facebook
  • whatsapp
  • telegram

చైనా కంట్లో తైవాన్‌ నలుసు!

చైనా, జపాన్‌, దక్షిణ కొరియా, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియాలతోపాటు పది ‘ఆసియాన్‌’ దేశాలతో కలిసి ప్రపంచంలోనే అతి పెద్దదైన స్వేచ్ఛా వాణిజ్య మండలం (రీజినల్‌ కాంప్రహెన్సివ్‌ ఎకనామిక్‌ పార్టనర్‌షిప్‌ (ఆర్‌సీఈపీ-ఆర్‌సెప్‌) ఏర్పాటు అయ్యింది. ఆర్‌సెప్‌లో సభ్యదేశం కాని తైవాన్‌- అమెరికాతో ద్వైపాక్షిక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం ప్రయత్నిస్తోంది. దీనికి ఇప్పటికే అమెరికా కాంగ్రెస్‌ సభ్యులు, అధికారులు, నాయకులు మద్దతు ఇస్తున్నారు. తైవాన్‌ ప్రభుత్వం వివిధ వాణిజ్య అంశాలపై ట్రంప్‌ జమానాలో అమెరికాతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకొంది. బైడెన్‌ సారథ్యంలోనూ తైవాన్‌తో మునుపటి మాదిరిగానే ఉన్నత స్థాయి సాంకేతిక, వాణిజ్య సంబంధాలు కొనసాగుతాయనడంలో సందేహం లేదు. సమగ్ర ప్రగతిశీల ట్రాన్స్‌-పసిఫిక్‌ భాగస్వామ్య (సీపీటీపీపీ) ఒప్పందాన్ని బైడెన్‌ సమర్థించినట్లయితే, అందులో తైవాన్‌ చేరికకూ ఆయన మద్దతు ఇచ్చే అవకాశాలు పుష్కలం.
 

‘ఉన్నది ఒకటే చైనా. ఒకే చైనా విధానానికి మేం కట్టుబడి ఉన్నాం. తైవాన్‌ ఎప్పటికీ మాలో అంతర్భాగమే. దాని స్వతంత్ర ప్రతిపత్తిని గుర్తించే ప్రసక్తే లేదు. సంపూర్ణ విలీనానికి తైవాన్‌ అంగీకరించని పక్షంలో దానిపై సైనికదాడికీ వెనకాడం’- చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ కిందటి నెల చేసిన ప్రకటన ఇది. తైవాన్‌తో ద్వైపాక్షిక సంబంధాలు నెలకొల్పుకోకుండా బీజింగ్‌ నాయకత్వం అన్ని దేశాలపైనా ఒత్తిడి తెస్తోంది. తమ మాటను గౌరవించని పక్షంలో చైనాలో వ్యాపారం చేయకుండా ఆయా దేశాలకు చెందిన సంస్థలను  అడ్డుకుంటామనీ తీవ్రంగా హెచ్చరిస్తోంది. ఈ పరిస్థితుల్లో తైవాన్‌తో అమెరికా సన్నిహితంగా మెలగడం చర్చనీయాంశంగా మారింది. కొంతకాలంగా తైవాన్‌కు అమెరికానుంచి ఆయుధ సరఫరాలూ ఊపందుకున్నాయి. అమెరికా తైవాన్‌ల సాన్నిహిత్యం కొత్త పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో చైనా స్పందన ఎలా ఉండబోతోందన్న దానిపట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది.
 

తైవాన్‌ అమెరికాకు సెమీకండక్టర్లు, ఎలెక్ట్రానిక్‌ ఉత్పత్తులు, వాహన విడిభాగాలు, ఇతర వినియోగ వస్తువులు ఎగుమతి చేస్తోంది. అదే సమయంలో అమెరికానుంచి వాహనాలు, సెమీకండక్టర్‌ యంత్రసామగ్రి, విలువ జోడించిన ప్రిసిషన్‌ యంత్రాలను దిగుమతి చేసుకుంటోంది. ‘ఆర్‌సెప్‌’ నుంచే కాకుండా కొవిడ్‌ వివాదం నేపథ్యంలో అమెరికా మాదిరిగానే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) నుంచీ తైవాన్‌ వైదొలగింది. ఒక్కరోజూ లాక్‌డౌన్‌ పెట్టని ఏకైక దేశం తైవానే. కేవలం 500 కేసులే అక్కడ నమోదయ్యాయి. అమెరికాతో సంబంధాల విషయంలో తైవాన్‌ ఎంతో చురుగ్గా ఉంది. అమెరికాతో ఎంతోకాలం నుంచి చర్చిస్తున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి భూమికను సిద్ధం చేసుకునేందుకు పలు అంశాలపై సంప్రదింపులు జరుపుతోంది. తైవాన్‌ ఏ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నా అది ద్వైపాక్షికమే అవుతుంది. ఎందుకంటే, బహుళ పక్ష ఒప్పందాల్లో తైవాన్‌ భాగస్వామి అయ్యేందుకు చైనా ఎప్పటికీ సమ్మతించదు. సురక్షిత 5-జీ అంతర్జాల వ్యవస్థ రూపకల్పన కోసం అమెరికా ఇప్పటికే తైవాన్‌తో చేతులు కలిపింది. చైనాసహా పశ్చిమ పసిఫిక్‌ ప్రాంతాలతోపాటు, తైవాన్‌ అమెరికా ప్రజల నడుమ విస్తృత, సన్నిహిత, స్నేహపూర్వక వాణిజ్య, సాంస్కృతిక సంబంధాల పరిరక్షణ, ప్రోత్సాహమే అమెరికా ధ్యేయమని తైవాన్‌ సంబంధాల చట్టం 1979లోనే  ప్రకటించింది. తైవాన్‌ భవిష్యత్తును శాంతియుత పద్ధతుల ద్వారా నిర్ణయించాలని అమెరికా రూపొందించిన ఆ చట్టం చెబుతోంది. ఆ ప్రాతిపదికగానే పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనాతో దౌత్యసంబంధాలు ఆధారపడి ఉంటాయనీ అది స్పష్టం చేస్తోంది. బహిష్కరణలు, ఆంక్షలు సహా శాంతికి భంగం కలిగించే మార్గాల ద్వారా తైవాన్‌ భవిష్యత్తును నిర్దేశించాలని ప్రయత్నిస్తే, దాన్ని పశ్చిమ పసిఫిక్‌ ప్రాంత శాంతిభద్రతలకు ముప్పుగా భావించాల్సి ఉంటుందనీ ఆ చట్టం తేల్చిచెబుతోంది.మౌలిక సౌకర్యాల రంగంలో విదేశీ పెట్టుబడులపై తైవాన్‌, అమెరికా గతవారం జరిపిన చర్చలు ఆర్థిక అంశాలపై మరెన్నో సమావేశాలకు నాంది పలికాయి. ఇలా ఉండగా టీపీపీ (ప్రస్తుతం రద్దయ్యింది) ప్రతిపాదిత ఒప్పందమైన సీపీటీపీపీలో చేరేందుకు తమ దేశం ప్రయత్నిస్తూనే ఉంటుందని తైవాన్‌ విదేశాంగ శాఖ ప్రకటించింది.
 

అమెరికా-చైనా వాణిజ్య విభేదాలు తైవాన్‌ పాలిట వరమయ్యాయి. చైనాలోని తైవాన్‌ వ్యాపారసంస్థలు తిరిగి స్వదేశానికి తమ ఉత్పత్తి కార్యకలాపాలు తరలిస్తున్నాయి. ‘సొంత గడ్డకు తైవాన్‌ కంపెనీలు’ అనే పేరిట ప్రాచుర్యంలోకి వచ్చిన ఈ పరిణామం తైవాన్‌ అమెరికా బంధాన్ని సుదృఢం చేసింది. 2019లోనూ, ఇప్పుడూ తైవాన్‌కు రెండో అతిపెద్ద ఎగుమతి విపణిగా అమెరికా ఆవిర్భవించింది. చైనా ప్రథమ స్థానంలో ఉంటోంది. తైవాన్‌ కంపెనీలు అమెరికాలో పెట్టుబడులు పెట్టడానికి మరింత ఉత్సుకత ప్రదర్శిస్తున్నాయి. ప్రపంచ అగ్రగామి సెమీకండక్టర్‌ తయరీ సంస్థ టీఎస్‌ఎమ్‌సీ వీటిలో ఒకటి. అమెరికాలోని ఆరిజోనాలో కార్యకలాపాలు ప్రారంభించబోతున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఈ రెండు దేశాలమధ్య వాణిజ్య బంధం బలపడే కొద్దీ- చైనా అసహనం పెచ్చుమీరుతుంది. తైవాన్‌ను విలీనం చేసుకొని, సువిశాల చైనా స్వప్నం సిద్ధింపజేసుకునేందుకు కృషి చేస్తున్న బీజింగ్‌ నాయకత్వానికి- అమెరికాతో దాని అనుబంధం కంట్లో నలుసులా మారుతుందనడంలో సందేహం లేదు.
 

- చంద్రకళ చౌధురి
 

Posted Date: 28-11-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం